ఆమ్రేడితం ద్విస్త్రరుక్తం – కుత్సానిదేచ గర్హణే |
స్యాదాభాషణ మాలాపః ప్రలాపో೭నర్థకంవచః ||
మన వ్యాకరణములో “ఆమ్రేడితము” ఒక సమాసము. ఆమ్రేడితం అంటే రెండు మూడుసార్లు చెప్పినది అని అర్థం.
కుత్సా=నిందా; గర్హణ=నింద; ఆలాపః = మాటలాడుట; ప్రలాపములు = ప్రేలాపనలు – మొదలైనవి అనర్ధకము”లని – సాధు, స్వాదు సంభాషణముల ఆవశ్యకతను ఉగ్గడిస్తూ ఆర్యులు అన్నారు.
కవిరాజు బిరుదాంకితులైన త్రిపురనేని రామస్వామి చౌదరి కుమారులైన గోపీచందు విలక్షణ నవలా రచయితగా ప్రసిద్ధి
కెక్కాడు. హేతువాదులైన వారి నివాసము నామము “సూతాశ్రమము”.
“ఇక్కడ గరిక పోచ, గాలి కూడా ఎందుకు? ఎలా? ఏమిటి? అని ప్రశ్నిస్తాయి.” అన్నారు గోపీచంద్.
అతని ప్రప్రధమ రచన “పట్టాభిగారి సోషలిజం”. తొలి రచనలో పట్టాభి గారి దుందుడుకు వాక్కులను విమర్శిస్తూ గోపీచంద్ ఈ పుస్తకాన్ని వెలువరించారు.
అతడు రచించిన తతిమ్మా తెలుగు గ్రంథాలు అన్నీ మళ్ళీ మళ్ళీ పునర్ముద్రితాలు ఐనవి, కానీ
తమాషా ఏమిటంటే ఈ తొలి పొత్తము మాత్రమే కేవలము ఒకేసారి అచ్చు వేయబడినది.
సన్నిహిత స్నేహితులు “పట్టాభి గారి సోషలిజమ్”ను రెండో సారి మరల ఎందుకని ప్రింటు వేయించ లేదు?” అని అడిగారు. దానికి జవాబుగా గోపీచందు అన్నారు “నిష్ఠుర ప్రసంగాలతో కూడినది కాబట్టి దీనికి ఆమ్రేడితము అక్కర్లేదని నాకు అనిపించింది.”