శ్రీ మళయాళ స్వామి సర్వ సమ భావ సంపన్నమైన బ్రహ్మ విద్యా ప్రచారము చేసారు. సంఘ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ఆయన స్థాపించి, నడిపిన పారమార్థిక సమాజములు అన్నీ సర్వ జనామోదము పొందాయి.అనతి కాలంలోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది.
దీనిని సహించ లేని అసూయా పరులూ, సనాతనులూ ఉన్నారు.ఆయనను కించ పఱచడమే వారి ప్రథాన కర్తవ్యంగా ఎంచుకున్నారు. శ్రీ మళయాళ స్వామి వద్దకు వచ్చిన విద్వాంసుడు ఒకడు ఇలాగ అడిగాడు “స్వామీ! రామకృష్ణ పరమహంస ఒక భక్తునికి హస్త మస్తక యోగము తో వివేకానందునికి బ్రహ్మ జ్ఞానము కలిగించారట కదా! మరి, మీరు కూడా మాకు అట్లాగ చేయ గలరా?”
తనను ఇరకాటములో పెట్టే ఇలాటి ప్రశ్నలు – ఆయనకు అలవాటే! కనుకనే స్మిత వదనుడై, ముకోకుండా తాపీగా సమాధానం ఇచ్చారు.“ఆహా! చేయకేమి? మీరు వివేకానందుని వలె తయారై (సిద్ధపడి) వచ్చినచో – మేమును తప్పక అట్లే చేయ గలము.”
ఆ ప్రతి వాది ప్రతి ధ్వని సేయ లేక, నిరుత్తరుడై, అక్కడి నుండి నిష్క్రమించాడు.