Like-o-Meter
[Total: 0 Average: 0]
గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన కుందనపు బొమ్మ.
గొల్లపూడి మారుతీరావు వర్ణనలో- “మందాకినిది పాలరాయిలాంతి శరీరం. పిల్లికళ్ళు. మైకెలాంజిలో చేతుల్లో మలిచినట్టుండే అవయవసౌష్ఠవం, వెన్నెలలాంటి నవ్వు. మా దర్శకుడు కూడా ఆ రోజంతా మైకంలోనే దర్శకత్వం వహించారు. ”. ఆ చిత్రం పేరు “సార్వభౌముడు”.
సాధారణంగా తెలుగు రాని నటీమణులకి మెల్లగా – హిందీలోనే తెలుగు సంభాషణలు మప్పుతారు.
గొల్లపూడి మారుతీరావు ఇలాగ రాసారు – “వారు వచ్చీ రాని తెలుగులో మాట్లాడితే – మేం నికార్సయిన తెలుగులో స్పందించాలి. మందాకిని విలన్ కి (అంటే నాకు) ఉంపుడుకత్తె అనుకుంటాను.
ఆమెకి హిందీలోనే మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు దర్శకులు. ఇక సంభాషణల మీదనే బతికే నాలాంటి నటుడి పరిస్థితి ఎంత దుర్భరమో చెప్పడానికి ఓ నమూనా షాట్– ”
“నా కన్ను కప్పి ఆ కిరణ్ గాడితో నువ్వు ఏం మాట్లాడుతున్నావే?” అని ఆవేశంగా నేనంటాను.
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“సాకులు చెప్పకు. ఈ వ్యవహారం ఎన్నాళ్ళుగా సాగుతోందో, ఎంతవరకూ వెళ్ళిందో నాకంతా తెలుసు”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“ఏమిటే – ఏమిటలా కళ్ళు ఎగరేసి మింగేసేలా చూస్తావు? బెదిరిపోతాననా?”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
“పళ్ళు రాలగొడతాను – ఏమనుకుంటున్నావో?”
“జిస్ దేశ్ మే గంగా బహతీ హై”
ఇలా సాగింది. నా బాధ వర్ణనాతీతం. పగవాడికైనా రాకూడని హింస. ఇది కేవలం నా పీడకలలో ఒక భాగం!”