“త్రిలింగ విద్యా పీఠము” విజయవాడలో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించే సంస్థ. ఆ సంస్థ ప్రోగ్రాములకై ఆర్ధిక సహకారమును అందించే వదాన్యులు చుండూరు వెంకట రెడ్డిగారు. అలాగే పాలనాది నిర్వహణలను ఎప్పటికప్పుడు పరిశీలించే కార్యదర్శి – కాంచనపల్లి కనకాంబ గారు. దండు సుబ్బావధానిగారు విద్యా బోధన చేసే ప్రధాన ఆచార్యులు. అక్కడ విద్యా విషయిక అంశాల ప్రధానాచార్య ఉపాధ్యాయులు. కార్యక్రమాలకు, పాల్గొన వలసిన వారికి, అతిధులకు త్రిలింగ సమాజ సభ్యులు ఇన్విటేషన్సును పంపించే వారు. ఒకసారి- త్రిలింగ విద్యా పీఠము సంస్థ తరఫున కవిసమ్మేళనమునకు దండు సుబ్బావధానిగారు కూడా ఆహ్వాన పత్రికలను పోస్టు చేసారు. ఐతే చిన్న పొరపాటు, ఎక్కడో ఏదో పొరపాటు వలన జరిగింది. అదేమిటంటే – ఒక ఉద్ధండ పండితునికి అసలు లేఖ వేయడమే మరిచారు ఆయనే కవి సామ్రాట్ బిరుదాంకితులు జగమెరిగిన పుంభావసరస్వతి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ.
ఐనా సరే! సాహిత్య మమకారముతోటి పిలువని పేరంటానికి వెళ్ళారు విశ్వనాధ సత్యనారాయణ. అక్కడికి వచ్చిన విశ్వనాధ సత్యనారాయణగారిని చూసి, స్వాగతం పలికారు త్రిలింగ విద్యా పీఠము సభ్యులు.అసలే ముక్కు మీద కోపం విశ్వనాధ వారికి. సభ్యులకు ఇప్పటికీ జరిగిన పొరపాటును గురించిన గమనిక కలగలేదు. అందరూ ముందస్తుగా “శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ! మీరు ప్రసంగించండి.” అంటూ అడిగారు.
కనీసం సభా కార్యక్రమాలలో ఐనా తన నామాక్షరములు కలికానికైనా కనిపించ లేదు కదా! అవమానము వలన విశ్వనాధ ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్నారు. కవిసామ్రాట్ లేచి నిలబడ్డారు. మైకు దగ్గర నిలబడ్డారు, అటూ ఇటూ చూసారు. అంత రౌద్రంలోనూ పాండితీ ప్రకర్ష బాణసంచాలా రవ్వలను విరజిమ్మింది. “ఇది త్రిలింగ విద్యా పీఠం….”అన్నారు. ఆనక తారాజువ్వల్లా రెండే వాక్యాలను తన వాక్కులలో వేసారు ముక్తసరిగా. ఈ చుండూరు వెంకట రెడ్డి పుంలింగం, కాంచనపల్లి కనకాంబ స్త్రీ లింగం, దండు సుబ్బావధాని నపుంసక లింగం.”అని క్లుప్తంగా అనేసి గబ గబా వెళ్ళి రుసరుసలతో వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు.
శ్రోతలు అవాక్కయ్యారు. కొన్ని సెకండ్లు సభలో నిర్ఘాంత పడిన ప్రేక్షకుల మౌనంతో వాతావరణం కొన్ని లిప్తలసేపు నిండిపోయింది. ఆ తర్వాత సభాసదులందరికీ కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ వాక్కుల శ్లేషలోని హాస్యం సుబోధకం ఐంది. “అసలేమి జరిగిందో!” – అనుకుంటూ ఆహూతులు యావన్మంది నవ్వులతో పరిసరములు ప్రతిధ్వనించినవి. తర్వాత వాకబు చేసుకుని జరిగిన మిస్టేకుకు నాలిక కరుచుకున్నారు నిర్వాహక వర్గం వారు.
ఈ పట్టున కవి సామ్రాట్ వారి కోపాన్ని పూర్తిగా సమర్ధించలేము. ఎందుకంటే వ్యక్తిత్వములో అంతర్లీనంగా ఉండవలసిన అంశము ధృతి, ఆత్మ సంయమనం, ఆత్మ నిగ్రహము. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఆర్ష ధర్మాన్ని అమితంగా ఆరాధించిన మహా మనీషి. ప్రాచీన సంస్కృతిని చాటే భావజాలము ఆయన రచనలకు పునాదులుగా నిలిచిన దోహదములు. మరి చిన్న విషయాలకు ఆగ్రహముతో ప్రతిబింబించే ప్రవర్తన ఏమంత సంభావ్యం కాదు. ఆ సభను ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు ఎంత కష్టపడి ఉంటారు?- అనే కోణంలో ఆలోచించవలసిన వ్యక్తి ఆయన.
ఏదెలాగున్నా అనన్య ప్రజ్ఞా ధురీణులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ. పాండితీ ప్రకర్షకు మారుపేరు ఆయన. ప్రతి సందర్భములోనూ కవి సామ్రాట్ ఈ రీతిగా రియాక్టు అవడము వలన – సాహితీ బృందావనాన అగణిత చమత్కార పారిజాతాలు విరబూసినవి.
@@@@@