ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే కలిగే ఉత్సాహం వేరు. మిగతా పండుగలకు ఒకటో రెండో సెలవు రోజులు కలిసివస్తే, దసరాకు మాత్రం దసరా సెలవల పేరిట ఓ వారం రోజులు సెలవలుండేవి మా చిన్నతనంలో. అప్పట్లో వేసవి సెలవల తర్వాత మేమంతా వేచి చూసే సెలవలు దసరా సెలవలే. అప్పటికే, గుంటూరులాంటి పట్టణాలలో కూడా దసరా కేవలం సెలవల పండగైపోయింది కాబట్టి అక్కడక్కడ తప్పించి దసరా సంబరాలు కనిపించేవి కాదు. అందుకే, సెలవలు మొదలవ్వగానే అమ్మమ్మా, నాయనమ్మల ఊళ్ళకి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రానికి సంబరాలు మిన్నంటేవి.
ఇప్పటి తరానికి దసరా సందడే తెలియదు, ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు, పాటలు తెలిసుంటాయనుకోను. నాకు గుర్తు ఉన్న కొన్ని దసరా పాటలు, పద్యాలు :
అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
* * *
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా