ఢిల్లీ అంటే ఎంతో ఇష్టం నాకు.
ఇక్కడి మనుషులు, మమతలు, ఋతువులు, నెమళ్ళు, ఉద్యానవనాలు, ఉద్యోగ భవనాలు, హరసింగార్ గుల్మొహార్ పూలచెట్లు, వింతవింత పక్షులు, విశాలమైన రహదారులు, విశ్వమానవ ప్రపంచం ఒక్కచోట కొలువుతీరిన కార్యాలయాలు, కళా నిలయాలు, విద్యాద్వారాలు, పఠన మందిరాలు, పురావస్తు కేంద్రాలు, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ, ఎర్ర కోట, ఇండియా గేటు, నేషనల్ మ్యూజియం, సాహిత్య అకాదెమీ, ఖుతుబ్ మీనార్, గాలిబ్ సమాధి, పురానా కిలా, కాశ్మీరీ గేట్, ఖైబర్ పాస్, లోధీ గార్డెన్, చాందినీ చౌక్, చావడీ బజార్, ఘంటే వాలా – ప్రాచీనాధునికతల సంగమ స్థలాలు, ఎక్కడ చూసినా కళ్ళల్లో కలలు నింపుకొని కనిపించే ప్రచుర జనసందోహాలను చూస్తుంటే పోయిన ప్రాణం లేచొస్తుంది నాకు.
“కళ్ళకద్దుకోనీ ఓ భూమీ, ఈ నీ పవిత్ర పద రాజీవాలను” అనాలనిపిస్తుంది.
ఆంధ్ర దేశానికి సుదూరమైన ఈ ఎడారిలో ఏ ఎండమావినో వెతుక్కొంటూ ఆశల సంచీని బుజాన వేసుకొని, పల్లెనుంచి ఢిల్లీకి వచ్చి చేరిన ఏ పురాణ పథికుడికి ఎంత ఋణపడి ఉన్నామో నాకు తెలియదు కాని, నలభైయేళ్ళ ఉనికి తర్వాత ఒకటి మాత్రం తెలిసింది: ఈ ఇంద్రప్రస్థ క్షేత్రమహిమ ఏమిటంటే – ఇక్కడికి చేరుకొన్నవారెవరూ ఆర్యులు కానివ్వండి, అయోనియన్లు కానివ్వండి, అల్లా ఉద్దీను, మొగలాయీలు, ఇంగిలీజుల లాగానే ఎప్పటికప్పుడు తల్లినేలకు వెళ్ళా లనుకొంటూనే ఒకసారి వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళరని!
ఏమిటి ఢిల్లీ జీవితంలో ఉన్న ఆకర్షణ? ఎందుకు ఈ అనుబంధం?
ఇక్కడి జీవితంలో ఒక రాజసం ఉన్నది.
వివేకానందస్వామి అమెరికా గురించి చెప్పినట్లు – ఈ నేలమీద కాలూనేసరికి ఎక్కడ లేని ఆత్మవిశ్వాసమూ వరిస్తుంది. దేశమంతటా రోజూ వర్తిల్లే వార్తలన్నీ మన కనుసన్నల్లో జరుగుతున్నట్లే ఉంటాయిక్కడ. ఇక్కడి నవాబు కట్టడాల రాయి రాయీ గతించిన కాలపు తెర మరుగున దాగిన చరిత్ర రహస్యాలను విప్పిచెబుతుంది.
పుణ్యధనుల కథాకథనాలు, ధర్మాధర్మ జయాపజయాలు, సార్వభౌముల కీర్తికాంక్ష, అలెగ్జాండరు ఆక్రమణశీలం, మొగలాయీల భోగలాలసత, ఆస్థానాలలో మనీషితల్లజుల భావశబలత, స్వాతంత్ర్యయోగుల త్యాగశీలం, సూఫీల ఆధ్యాత్మికత, మహమ్మదీయుల జంత్రగాత్రనైపుణ్యం, గాంధార శిల్పకళ, ఆంగ్లేయుల చాణక్యం, సంస్థాగతుల అవినీతి, సింధీ పంజాబీల కష్టించే తత్త్వం, నవ్యసంప్రదాయ నిర్లక్ష్యం, పెద్దలంటే భక్తి, మితిలేని స్వపక్షాభినివేశం, మతిలేని పరమతవిరోధం, పాశ్చాత్యుల క్రమశిక్షణ, రాజకీయుల వంశరక్షణ, ధనస్వాముల గర్వం, పేదరికపు నిస్సహాయత, బలహీనుల కంఠవిరావం, ఆసేతుశీతనగపర్యాప్తజనానీకం ఒక్క భారతీయ భావసముల్లాసంతో కలిసి ఉంటున్నప్పటి ఆత్మీయత, విదేశీయ పౌరానీకపు నిత్యనివాసం, విశ్వజనీనత నీడలోనే ప్రజాస్వామ్యంలో పల్లవించే నియంతృత్వ ధోరణులు, ఏదో తెలియరాని అహమహమిక, తహతహపాటు, అవకాశాలు, ఆరోగ్యం, అనురక్తి – అన్నీ ఒక్కచోటే పెనవేసుకొని ఉన్నాయిక్కడ.
తామరాకుపై నీటిబొట్టులా ఇక్కడున్నవాళ్ళకు ఈ ప్రాంతంతో ఒక అంటీఅంటనితనమూ ఉన్నది. ఈ నిమ్నోన్నతాల సంధియుగంలో మానవత్వపు విలువలు నశించి, సమాజం ఇంద్రియసుఖాలకోసం ఉవ్విళ్ళూరుతున్న దుఃస్థితిని గుర్తించిన మహాకవి అబ్బూరి రామకృష్ణారావు గారి లాగా –
“ఏనాడో రావలసిందీ వారణపురికి మనం
ఆ విశాలవటవృక్షం నిశ్చలనిభృతాగారం
ఇంకా నిలిచే ఉన్నది. నాడు మనకు చిన్నతనం
అల్లదుగో! స్వర్ణశిఖరదేవమందిరద్వారం
నిన్నూ నన్నూ ఎరుగరు నేటి కొత్తపూజారులు
పరిచితకంఠస్వరాలు చెవులకు పండుగచేయవు
అటూ ఇటూ నిర్మించిన కొత్త కొత్త రహదారులు
ఆ వెనకటి సుధాస్మృతులు వేరొక రుతి విననీయవు
అసంబద్ధయశోవాంఛ పరచింతాపరాఙ్ముఖత
ప్రబలే ఈ నగరంలో ఏమున్నది మనకు ఫలం?
అంతులేని ధనపిపాస అనాగరక నాగరకత
ఈ రొదలో ఎలా మనం మనుగడ సాగించగలం?
గతం గడిచిపోయిందని ఏలా ఈ అనుతాపం
కాలం నర్తకి బహుశా మారుస్తున్నది రూపం!
అని అప్పుడప్పుడు నిర్వేదమూ కలుగుతుంది.”
ఢిల్లీ అంటే ఒక సర్వవేణీసమాగమస్థలం. సర్వవాణీవిద్యాధ్యయనకేంద్రం.
ఈ రాజధానిలో తెలుగువారిదొక అపురూపమైన సజీవ సంజీవ స్థానం.
తెలుగు భాషాకుటుంబానికి చెందిన బ్రాహుయీ మాట్లాడుతూ బెలూచిస్థాన్‌కు తరతరాల క్రితం తరలివెళ్ళి, క్వెట్టాలో ఉద్యోగాలు చేసి ఇక్కడికి మరలివచ్చినవారి సంతతి సనాతన పదసంపదను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందిక్కడ. ఉడిషా నుంచి ఇక్కడికి వచ్చిన రెల్లి కుటుంబాల వారి ప్రసంగాలలో ఒక సరికొత్త తెలుగు పలుకుబడి వినిపిస్తుంది. అలహాబాదీయుల భోజపురీ వింత తెలుగు మాట్లాడే ఉపాధ్యాయ కుటుంబా లున్నాయిక్కడ. ఇక్కడి పిల్లలు మాట్లాడుకునే తెలుగు విరజాజులూ, హిందీ ఇందీవరాల విచిత్ర మణిప్రవాళం ఉండనే ఉన్నది. తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన సంస్కృత ప్రాకృత గ్రంథసంచయం ఇక్కడున్నట్లు మరెక్కడా లేదు. ప్రాచ్య పాశ్చాత్య సంగీత నృత్యాలకు, సాహిత్య చిత్ర శిల్పకళాకిర్మీరాలకు తుంగశృంగాటకం ఇదే. ఆధునిక నాటకం ఇక్కడే రూపాన్ని చక్కదిద్దుకొన్నది. కన్యాశుల్కంలో కొత్త కోణాలు ఆవిష్కరింపబడి మన ఆబోరు దక్కిందిక్కడే కదూ.
ఇటీవల ఇక్కడి రాజకీయాల నివురు నిప్పై మరెక్కడో పొగ రాజుకోవటమూ చూస్తున్నాము.ఆ విశేషాలెన్నో.
ఇక్కడి తెలుగు భాష చారిత్రికవిలాసం, కవులూ రచయితలూ, పత్రికలూ, పాత్రికేయులూ, కళాకోవిదులూ క్రీడాకారులూ, మనస్వులూ, మహిళామణులూ, సంస్కార పరిమాణాలూ, మరెన్నో పరిణామాలూ …
ఢిల్లీలో తెలుగువారి స్థానం ఒకప్పుడెలా ఉండేది? ఇప్పటి స్థితిగతులేమిటి? అని – స్మృతిరంగస్థలిపైని అతీత కాలయవనికను ఒక్కింత తొలగించి, దృశ్యాదృశ్యగతంలోకి తొంగిచూసినప్పుడు పరంపరీణన్యాయంగా స్ఫురించే దృశ్యచిత్రాలలో
- ఉద్యుక్తాన్నీ విధ్యుక్తాన్నీ మేళవించి ప్రత్యేకరాష్ట్రాన్ని తెచ్చుకొన్న ఆవేశ శీలం;
- విశ్వవిఖ్యాత బోధకులు జిడ్డు కృష్ణమూర్తిగారు పార్లమెంటులో ఉభయ శాసన సభలను ఉద్దేశించి చేసిన చరిత్రాత్మక ప్రసంగం;
- దుర్గాబాయి దేశ్ ముఖ్ గారి నిర్వ్యాజ కృషిఫలితంగా ఆంధ్ర పాఠశాలలు,
- శ్రీ వేంకటేశ్వర కళాశాల,
- ఆంధ్ర మహిళా మండలి సంస్థల సంస్థాపన మహాగరిమ,
- విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు దామోదరం సంజీవయ్య గారింట్లో జరిగిన అపూర్వమైన సత్కార సభ, అప్పుడు ద్వాదశ భాషా కోవిదులు ఆచార్య కోట సుందరరామశర్మ గారు చెప్పిన అవిస్మరణీయ రసధ్వనిపూర్ణపద్యావళి – అంతకంటే మరీ విశేషం – రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారింట పురాణవైర గ్రంథమాలలో వారి ‘నాగసేనుడు’ నవల గురించి విశ్వనాథ సత్యనారాయణగారితో జరిగిన మరపురాని సంభాషణ;
- ఉపరాష్ట్రపతిగా ఉండగానే బంగళాను ఖాళీచేసి చిన్న అద్దెయింట్లో ఉంటూ రాష్ట్రపతి పదవికి పోటీచేసిన వి.వి. గిరిగారి నిష్కళంక వర్తన;
- సుప్రీంకోర్టు న్యాయవాదిగా వచ్చిన బసవరాజు అప్పారావు గారి కవితాగానం, గ్రంథ రచన;
- మహావైయాకరణి వేదుల సూర్యనారాయణశర్మ గారు ఢిల్లీ మిత్రుల ఇంటింట కొలువుతీరి అంతరార్థ మహాభారతాన్ని గురించి నెలరోజులపాటు ఉపన్యాసాలిస్తూ ప్రపంచింపజేసిన సంప్రదాయ రక్తి;
- మాన్య మంత్రివర్యులు పెండేకంటి వెంకటసుబ్బయ్య గారింట్లో గాయనీగాయనుల సవ్యాఖ్యాన రామాయణ కల్పవృక్ష పద్యగానం;
- అశోకా హోటల్లో పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టతేనె తెనుగు పలుకుల ఆధ్యాత్మికామృతతుందిల సందేశం;
- రామకృష్ణాపురం ఆంధ్రా స్కూల్లో గద్దర్ ఉత్తేజపూర్ణ విప్లవ గీతాలాపన;
- ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు గారి నివాసంలో కోరాడ రామకృష్ణయ్య గారి శతజయంతి సంచిక ఆవిష్కరణోత్సవం;
- జె.ఎన్.యూలో అబ్బూరి రామకృష్ణరావు గారు అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఛాయాదేవి దంపతుల వద్ద ఉన్నప్పటి రోజులలో సాహిత్యతైర్థికుల రాకపోకలు;
- విదిత విజ్ఞానవేత్త డా. నైషధం ప్రభాకరరావు గారు ఉపనిషత్ శ్లోకముఖంగా పరిశోధించి న్యూక్లియర్ సైన్సు, అద్వైతశాస్త్రాలను సమన్వయించిన విజ్ఞానసంపద;
- రెడ్డెప్ప నాయుడు గారు చిత్రంగా నూనెరంగులను కలిపి కుంచె పైకి గాలిని ఊది ఆరబెడుతూ చిత్రంగా రూపొందించిన మహాభారత చిత్రశిల్పాల ప్రదర్శనను చూసి తన్మయురాలైన ఎస్త్రెలా స్త్రిజక్ ప్రశంస మూలాన ఢిల్లీలో ఆంధ్రుల ఆధునిక చిత్రకళకు వచ్చిన గుర్తింపు;
- డా. రమేష్ బాబు గారు శ్రమించి రూపొందించిన అపురూపమైన గురజాడ శతజయంతి సంచిక;
- విశ్వవిఖ్యాత నాట్యకళా గురువులు యామినీ కృష్ణమూర్తి గారు, రాధా రాజారెడ్డి దంపతులు, వనజశ్రీ జయరామారావు దంపతులు, విలాసినీ నాట్యరూపానికి ప్రాణంపోసిన స్వప్నసుందరి గారు వివిధేతివృత్తాలతో ప్రదర్శించిన నాట్యోత్సవాలు;
- ఈమని శంకరశాస్త్రిగారి వాద్యబృందం;
- సితార్ వాద్యనిపుణులు పండిత రవిశంకర్ గారి సమర్థ నిర్వహణలో ఆలిండియా రేడియోలో పద్మశ్రీ గానకళాపూర్ణ ఏల్చూరి విజయరాఘవరావు వేణుగాన గాంధర్వం; వారి ఆధ్వర్యవంలోనే మండీ హౌస్ వద్ద త్రివేణీ కళా సంగమ్ రూపకల్పన;
- టాల్కటోరా స్టేడియంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానమహేంద్రజాలం, ఆ కర్ణాటక హిందూస్తానీ జుగల్బందీలు;
- కుప్పిలి వెంకటేశ్వరరావు, తలశిల రామచంద్రరావు, పొట్టి ప్రసాద్, పమిడిముక్కల రామారావు, రామవరపు గణేశ్వరరావు, ఏడిద గోపాలరావు, గౌరీదేవి, కామేశ్వరరావు,దేవరకొండ సుబ్రహ్మణ్యం గారల ఔత్సాహిక నాటకోత్సవాలు;
- చైనా యుద్ధసమయంలో ఆకాశవాణి వార్తలు చదువుతూ శతఘ్నులను కురిపించిన కొంగర జగ్గయ్య గళగంభీరిమ; కపిల కాశీపతి, పన్యాల రంగనాథరావు, అద్దంకి మన్నారు, జోళదరాశి మంగమ్మల నాటకీయ వార్తాకథన కళ, “వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ” అన్న లలిత మనోహర కంఠస్వరం;
- “జీవితంలో ఒడిదుడుకులను, ఆశా వైఫల్యాలను చవిచూసి, ప్రేమ విలువ తెలిసినవారే నాకు రేడియోలో ఉద్యోగులుగా కావాలి” అంటూ ఆచంట జానకీరాం గారిని ఆకాశవాణిలో తొలి తెలుగు అనౌన్సరుగా నియమించిన లయొనెల్ ఫీల్డెన్ దూరదర్శిత్వం;
- ఢిల్లీలో దూరదర్శన్ ప్రారంభిస్తున్న తొలి రోజులలో ప్రసారాలు ప్రారంభింపక మునుపే వాణిజ్య విలువలతో రామాయణాన్ని సీరియల్‌గా ఎలా తీయవచ్చునో తీసి చూపిన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు గిడుతూరి సూర్యం గారి కళానైపుణి;
- కరోల్బాగ్‌లో గుడారం వేసి, చుట్టూ వర్తులాకారంలో ఉన్న తెరపై చలనచిత్రాన్ని ప్రదర్శిస్తుండగా – ప్రేక్షకులందరూ నిలబడి, బొమ్మ వెంటే గిరగిర తిరుగుతూ ‘సర్కారామా’చిత్రాన్ని చూస్తూ – “మన తెలుగువాడు విదేశాలనుంచి తెచ్చిన వింతసృష్టి ఇది” అని సగర్వంగా చెప్పుకోవడం;
- తెలుగు భారతాన్ని సాంతం చదివిన పాండిత్యవైభవం కొద్దీ – పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయిగా బోనులో నిలబడి కొల్లా వెంకయ్య గారు స్వయంగా చేసిన డిఫెన్సు వాదనను శాంతిపర్వంలో భీష్ముడు నకులుడికి ఖడ్గప్రభావాన్ని బోధించిన ఘట్టంతో పోల్చి చూడగలిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.వి. చౌదరి గారి వివేకవైయాత్యం;
- గాంధీ గారికి నాస్తికధర్మాన్ని నచ్చజెప్పాలని ప్రయత్నించిన గోరానూ, ఎం.ఎన్. రాయికి ఆశ్రయదాతగా అబ్బూరినీ పదే పదే ప్రశంసిస్తుండిన జస్టిస్ తార్కుండే గారి ఆంధ్రాభిమానం;
- నార్ల వెంకటేశ్వరరావు గారు సీత జోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాదెమీ ప్రకటించిన బహుమతిని తిరస్కరించినప్పుడు ఇక్కడ జరిగిన సంచలన సదస్సులు;
- రామవరపు గణేశ్వరరావు గారి నేతృత్వంలో తెలుగు సాహితి నిర్వహించిన అభినందన సదస్సులో ఆరుద్రగారిని చూడటానికి ఎ.పి భవన్లో క్రిక్కిరిసిన జనసందోహం, అప్పటి ఆయన ఉద్విగ్న మహోపన్యాసం;
- గణేశ్వరరావు గారు నిర్వహించిన వివిధ సాహిత్య కార్యక్రమాలు, ఇక్కడి కవితా సభలు;
- అవధానోత్సవాలు; పుస్తకావిష్కరణలు; సాహిత్య సాంస్కృతిక మత రాజకీయ సామాజిక పత్రికావిర్భావాలు;
- పోతన పంచశత జయంత్యుత్సవాలలో విద్వన్మణి డా. ఇలపావులూరి పాండురంగారావు గారు భారతీయ భాషల్లో వైష్ణవాన్ని గురించి చేసిన మౌలికమైన ప్రతిపాదనలతోడి భాషణకు రోమాంచ కంచుకితులైన సదస్యుల ఆనందోల్లాసం;
- వేలమంది అభిమానుల సమక్షంలో మహాకవి ఆచార్య సి. నారాయణరెడ్డి గారికి ఫిక్కీ ఆడిటోరియంలో పి.వి. నరసింహారావు గారి చేతుల మీదుగా “కవితావిశ్వంభర” బిరుద ప్రదానోత్సవం;
- దేశ స్వాతంత్ర్యోద్యమం నాటి అనుక్షణిక విశేషాలను, ఎర్రకోటమీద త్రివర్ణపతాక ఎగిరినప్పటి ప్రజానీకం భావావేశాన్ని, మహాత్ముని క్రూర హత్యావార్తను, అంతరిక్ష యానం తర్వాత యూరీ గగారిన్ విచ్చేసినపుడు జవహర్ లాల్ నెహ్రూ గారు చేసిన అణ్వస్త్ర శాస్త్రసంగీత శాంతిసందేశ మహోద్ఘాటనను, యన్.టి. రామారావు గారి ఆంధ్రుల ఆత్మగౌరవ నినాద విజయాన్ని, వ్యక్తిగత క్లిష్టసమయాలు ఎదురైనప్పటి రాజకీయుల ఢిల్లీ “నైవేద్య వితరణ” గాథలను నయవంచన లేక వినిపించిన ప్రాజ్ఞ పాత్రికేయుల దిశానిర్దేశ దీక్ష;
- సి.వై. చింతామణి, నేషనల్ హెరాల్డు చలపతిరావు, గంటిజోగి సోమయాజులు, కొత్తపల్లి వీరభద్రరావు, పండితారాధ్యుల చినవీరేశలింగం, కుందూరి ఈశ్వరదత్తు, జి.యస్. భార్గవ, జి.కె. రెడ్డి, డి. రామలింగం, సెట్టి ఈశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, సూరంపూడి సీతారాం, గోళ్ళమూడి రామచంద్రరావు, వేమరాజు భానుమూర్తి, వాడ్రేవు పతంజలి, బలివాడ కాంతారావు, కాసుఖేల హనుమంతరావు, శ్రీపతి, వాకాటి పాండురంగరావు, మానేపల్లి తాతాచారి, మండలీక సుబ్బారావు, చల్లా రాధాకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఉప్పాడ రాజారావు, ద్వివేదుల విశాలాక్షి, దాసు కృష్ణమూర్తి, వేములపల్లి కృష్ణమూర్తి, దుగ్గిరాల సుబ్బారావు, మహీధర నళినీమోహనరావు, టంకశాల అశోక్, శిష్ట్లా లక్ష్మీపతిశాస్త్రి, ఆర్. విద్యాసాగరరావు, సి.వి. సుబ్బారావు; డి. కృష్ణారావు, డా. జె. భాగ్యలక్ష్మి, నల్లాన్ చక్రవర్తుల జగదాచారి, డా. ఇందిరా జగదాచారి దంపతులను ప్రభావితంచేసిన విశేష ఘటనలు;
- తెలుగువారి ఉనికికి, ఉన్నతికి హేతువులైన ప్రసార మాధ్యమాలు, పార్లమెంటు, శాసన సభ్యులు, వివిధ మంత్రిత్వ శాఖలు, విద్యాలయాలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, తదితర విశ్వవిద్యాలయాలు, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వారి తెలుగు పాఠశాలలు, శ్రీ వేంకటేశ్వర కళాశాల, ఇక్కడి గ్రంథాలయాలు, సంస్థలు, ఆంధ్ర అసోసియేషన్, దక్షిణ భారత నటీనట సమాఖ్య, తెలుగు సాహితి, తెలుగు సారస్వత సమాఖ్య, ఆంధ్రా కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఎసోసియేషన్ వంటి ప్రముఖ సాంస్కృతిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, న్యాయస్థానాలు, లిఖిత పత్రికలు, ముద్రిత పత్రికలు, కళాకేంద్రాలలో మన మేధావితకు వెలుగుదిద్దిన దీప్తమతులెందరో ఒక్కుమ్మడిని సాక్షాత్కరించి – ఢిల్లికి ఢిల్లే, పల్లెకు పల్లే అన్న సామ్యత జ్ఞాపకం వచ్చి,
అని ఈ యమునాతీరంలో వీచిన సుకవితా సంగీత నాట్య కళాసమీరాలను, ఇక్కడి చరిత్ర విధాతలైన మహనీయ వ్యక్తులను, అసామాన్య సామాన్యులను, స్మరణీయ సంఘటనలను, తెలుగువారు ఉనికికోసం, మనికికోసం ముచ్చటపడి నిర్మించుకొన్న సంస్థలూ సమాఖ్యల చరిత్రలను, ఆ ఆత్మీయతలను, ఆ జ్ఞాపకాల ఛాయాచిత్రాలను, ఉక్తిప్రత్యుక్తులను, సూక్తిరత్నాలను, చిత్రోక్తులను, ఛలోక్తులను, ఆశలను, ఆశయాలను, ఆదర్శాలను మరీ మరీ నెమరువేసుకోవా లనిపించి, స్మృతిసరస్సులో వికసించిన అనుభవ లీలాకమలాల సుగంధాన్ని నాకు పరిచితమైనంతలో శ్రుతపాండిత్య వాక్స్రవంతిగా మిత్రులందరికీ ఒక్కొక్కటిగా పంచిపెట్టా లనిపించి మనస్సంతా మాధుర్యభావంతో నిండిపోతుంది నాకు.
అన్నట్లు శ్రీ శ్రీ అన్నట్లు – ఇది నా గళగళన్మంగళకళాకాహళి! ఆత్మీయ భావగేహళి !! నిస్సీమ చైతన్యదేహళి !!!
K V R Moorthy
ఏల్చూరి మురళీధరరావుగారు ఢిల్లీ లో తెలుగువెలుగుల గురించి రాయడం చాలా ఆనందదాయకం. ఇలాంటి సందర్భాలలో ఎంత కూలంకషంగా పరిశోధించి రాసినా మిగిలిపోయిన విషయాలు ఇంకా ఉండనే ఉంటాయి. నాకు తెలిసి, గర్తున్నంతవరకూ ఏల్చూరివారి రచనకు అనుబంధంగా ఈ క్రింది సంగతులు ప్రస్తావిస్తున్నాను. ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ తొలి దశల్లో అనవరతం శ్రమించినవారిలో గంటి శ్రీనివాసరావు, గోవాడ సత్యారావులు ముఖ్యులు. అలాగే కరోల్ బాగు లో తెలుగు పాఠశాల స్థాపించడంలో బి.వి.నాథ్ గారు. కె. ఈశ్వరరావు మొదలైనవారితోబాటు గంటి శ్రీనివాసరావుతో బాటు చుట్టల రామారావు, లంక సత్యం వంటివారు ప్రముఖస్థానం వహించారు. ‘నటరాజు’ కుప్పిలి వేంకటేశ్వరరావుగారి ప్రోత్సాహంతో ప్రావిర్భవించిన దక్షిణ భారత నటీనట సమాఖ్య సంస్థాపక సభ్యులలో తలశిల రామచంద్రరావు, గంటి శ్రీనివాసరావు, అనసూయాశర్మ, కె.వి.ఆర్. మూర్తి ముఖ్యులు. ఆ సంస్థ శైశవదశలో కె.యల్.రావు-దంపతులు,. అయ్యగారి వీరభద్రరావు, మోతే వేదకుమారి, ఎం.రామస్వామి-వరలక్ష్మి దంపతులు, గోవాడ సత్యారావు, తరువాతికాలంలో బ్రిగడీర్ యం.కె.రావు, క్రొవ్విడి లక్ష్షన్న, కపిల కాశీపతి, ముప్పాళ జయలక్ష్మి, యస్.వి.యల్. నరసింహం, యం.యస్. ప్రసాదరావు, పార్వతీ శివాజీ, ఏడిద గోపాలరావు, వంటివారెందరో మహానుభావులు ఊపిరిపోశారు.
చాలా బాగా మీదయిన పద్దతి లో చక్కగా రూపొందించారు “ఢిల్లీ – తెలుగువారి చైతన్యదేహళి”.
Good article
Worth reading repeatedly.
I spent 6 years, Not in Delhi, within 6 hours from Delhi, and used to spend few hours in Delhi (Due to link train timings).
Had sample flavor of some of the above descriptions.
In AP Bhavan Auditorium I came to know that by 2001, there were 3.5 Lakh Telugu people in Delhi.
చాల బాగా చెప్పారు, మాకు తెలియనివి ఎన్నో ఉన్నాయ్. ధన్యవాదములు.