చివరి దాకా వచ్చే నేస్తం – ఆవకాయ తెలుగు కథలు
ఆక్సిజెన్ మాస్క్ యూరిన్ బాగ్ తీసేసింది. చేతులు మొహం కళ్ళు అన్ని సర్ది నైటీ సరి చేసి జుట్టు ని వెనక్కి చేతులతో తోసింది. పక్కని కూడా సరి చేసింది.
అప్పుడు మొహం వైపు చూసింది. ప్రశాంతంగా ఉంది.
ఉండబట్టలేక “బామ్మా…” అంటూ చేతులు పట్టుకొని ఏడ్చింది.
పక్కనే ఉన్న ముసలావిడ కూతురు కళ్ళు తుడుచుకుంటూ అన్నగారి తో “కడుపున పుట్టిన మనకన్నా తనే బాగా చూసుకుంది” అని అంది.
అది నిష్టూరమా, నిజంగా అన్నదేనా అన్నది అక్కడున్న కోడలికి అర్ధంకాలేదు.
సమయం తెల్లవారుజాము మూడు గంటలయింది.
ముసలామె బంధువులకి ఫోన్లు వెళుతున్నాయి. అక్కడ ఆవిడ పోయిన దుఃఖం కన్నా ఎవరికి వాళ్ళే తమ సెల్ ఫోన్ల లో మెసేజ్ పెట్టడంలో బిజీగా ఉన్నారు.
ఒక్కక్కళ్ళే వస్తున్నారు. “వెళ్ళిపోయావా!” అంటూ పక్కవాళ్ళకి భంగం కలక్కుండా ఏడుస్తున్నారు.
పెద్దావిడ దగ్గర దగ్గర తొంభయి ఏళ్ళు పండు పండిపోయింది.
ఎవరో వేదాంతం ఒలకబోస్తున్నారు – “అబ్బ! ఏం కష్టపడిందో బాబు! మూడు నెలలు బెడ్ సోర్స్ వచ్చాయి. చీమలు పట్టేసేవి. శరీరం పొడిపొడిగా రాలిపోతుండేది.”
“నిజంగా ఈ అమ్మాయి దగ్గరే ఉండి కనిపెట్టుకొని చూసేది. యెంత డబ్బులు కోసం చేసినా సర్వీస్ చేయాలి కదా!“
“అవును ఇలాంటి వాళ్లనే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనాలేమో!”
“అయినా సొంతవాళ్ళే అసహ్యించుకునే పరిస్థితులలో ఈ పిల్ల చేయడం గ్రేట్!“
“అమ్మకి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి పాటలు పెడుతూ తినిపించేది.” అని కూతురు ఎవరితోనో చెబుతోంది.
“ఆవిడకి తన ఆకలి కన్నా స్వరూప తిందా లేదా అన్న ఆరాటమే ఎక్కువ.” పెద్దకోడలు అత్తగారి మొహం చూస్తూ జనాంతికంగా అంది.
ఇలా స్వరూప గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
కేర్‍టేకర్ సర్వీసెస్ ఓనర్ అయిన బాబు కి ఫోన్ చేసింది. తన గురించి ఎదురుగానే మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె దృష్టంతా ఇంట్లో ఉన్న పిల్లలు మీద ఉంది.
భర్త మొదట్లో బానే ఉండేవాడు. కష్టపడి పని చేసేవాడు. ఇప్పుడు దిక్కుమాలిన తాగుడికి అలవాటు పడ్డాడు. పని పోయింది. పొద్దస్తమానం తాగుతూ ఉండటం, డబ్బులు కోసం వేధించడం అలవాటయింది. ఇవ్వకపోతే తను ఎక్కడ పని చేస్తే అక్కడకు వచ్చి గొడవ చేస్తాడు.
ఆలోచనలో ఉన్న స్వరూప, బాబు మాటలతో ఈ లోకంలోకి వచ్చింది.
ఆ రోజుతో అక్కడ డ్యూటీ అయిపొయింది. నిజానికి ఎవరన్న చనిపోతే బాధగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు బెడ్ మీద ఎన్ని రోజులుంటే తనకి అంత పని. అందుకే ఎప్పుడు ఎవరు చనిపోవాలని అనుకోదు.
కానీ ఒక్కోసారి తప్పదు.
ఆ రోజు వరకు అయిన డబ్బు లెక్క చూసి ఇచ్చేసాడు ముసలామె కొడుకు.
ఆమె కోసం కొన్న వాటర్ బెడ్, మంచం, అడల్ట్ డైపెర్ పాకెట్స్ లాంటి వస్తువులన్నీ తీసేసుకోమన్నాడు. వాడనవి మాత్రమే వేరే వాళ్ళకు ఇచ్చేయండి అని గట్టిగ చెప్పాడు. అంతే కాకుండా విడిగా స్వరూప చేతికి కొంత డబ్బు, బట్టలు కూడా ఇచ్చింది ముసలామె కూతురు.
తన బాగ్ తీసుకొని వాళ్ళకి చెప్పి ఇంటికి బయలుదేర్తున్న స్వరూపతో పాటు బయటకు వచ్చిన బాబు “ఇదో స్వరూప! నీకు రావలిసిన డబ్బు ఆ జూబ్లి హిల్స్ వాళ్ళు ఇవాళ చెబుతామన్నారు. వాళ్ళ దగ్గర్నుంచి ఫోన్ వచ్చిన వెంటనే నీకు అడ్రస్ షేర్ చేస్తాను. వెంటనే వెళ్లి డ్యూటీ లో జాయిన్ అయిపో. ఇంకో మాట! ఫోన్ ఛార్జ్ లో ఉంచుకో. ఎప్పుడూ కస్టమర్ కి అందుబాటులో ఉండు” అని జాగ్రత్తలాంటి హెచ్చరిక చేసాడు.
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
*****
అనుకున్నట్లే ఆమెకి ఫోన్ వచ్చింది.
జుబ్లీ హిల్స్ లో డ్యూటీ పడింది. ఈ రోజు నుంచే వెళ్ళాలి.
అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి బాగ్ చూసుకుంది ID కార్డు, ఆధార్ కార్డు తో పాటుగా ఎప్పుడు బాగ్ లో ఉండే ఫోటో బయటకు తీసి ముద్దు పెట్టుకొని లోపల పెట్టేసింది.
బాబు ఇచ్చిన లొకేషన్ తో ఆ ఇంటి దగ్గరకు చేరుకుంది.
అది ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉండే ఇల్లు.
నెంబర్ చూసుకుని వెళ్ళింది.
వాళ్ళు రూమ్ కి తీసుకొని వెళ్లి చూపించారు. అక్కడ బెడ్ మీద ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. అలికిడి విని కళ్ళు తెరిచాడు. ఆయన కొడుకు స్వరూపని పరిచయం చేసాడు.
“ఇక నుంచి అన్ని నేనే చూసుకుంటా, మీరు హాయిగా ఉండండి” అని ఆయన చేయి పట్టుకొని ఆత్మీయంగా చెప్పింది. ఆయన ఆ చేయి పట్టుకొనే నిద్రపోయారు.
కొడుకు చెప్పారు – ’ఆయన కి టీవీ అంటే చాల ఇష్ట” అని అందుకే కాబోలు పెద్ద టీవీ ఉంది. రిమోట్ ఆయన పక్కనే ఉంది.
ఉండటానికి ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చారు. నిజానికి అతన్ని ఇంటి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో ఉంచారు. పూర్తీ బెడ్ రిడెన్ కాదు గానీ మనిషి సాయం ఉండాలి. అతన్ని పూర్తి బాధ్యతగా చూసుకునే వాళ్ళు కావాలి. ఆ విషయం తెలిసి బాబుకి ఫోన్ చేస్తే అతను స్వరూప గురించి చెప్పాడు.
ఆరోజు బాబు కూడా రావాల్సి ఉండే కానీ అతను ఒక హాస్పిటల్ లో అనెస్తీషియా టెక్నీషియన్‍గా పని చేస్తున్నాడు. ఆరోజు యేవో ఆపరేషన్స్ ఉండటం వల్ల రావడానికి కుదర్లేదు.
“వాళ్ళకి నీ గురించి అన్నీచెప్పి ఉంచానులే! భయం లేదు.” అన్నాడు.
“అలాగే అన్నా” అంది.
బాబువాళ్ళది తనది ఒకటే ఊరు. ఆ అభిమానంతో బతకటానికి ఓ దారి చూపించాడు. అందుకే అతనిలో ఖచ్చితత్వం ఉన్నా సాయం చేస్తాడు అనే ధైర్యం ఉంది.
అతనికి హాస్పిటల్స్, డాక్టర్స్ తో పరిచయం ఉండటం వల్ల తనకి ఈ ఉద్యోగం దొరికింది. అసలు అతనే ట్రైనింగ్ ఇప్పించి ఈ ఉద్యోగం ఇప్పించాడు. కాకపోతే కమీషన్ తీసుకుంటాడు. అయినప్పటికీ తను జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచుకోగలుగుతోంది. ఇల్లు గడపగలుగుతోంది.
“ఎదిరించాలి. పోరాడాలి! తిరుగుబాటు చేసేంత శక్తి పొందాలి! అసలు జీవించాలన్న కోరిక అన్నింటికీ మూలమవ్వాలి! బాధల వల్లే మనిషి బలవంతుడవుతాడు. కష్టాల కొలిమిలో కాలితేనే బతుకు బంగారమవుతుంది. జయించాలన్న కోరిక బలంగా ఉండాలి. దానితోనే ముందుకు సాగాలి. మనిషి మొదటగా పొందాల్సింది సంకల్పసిద్ధి. గట్టిగా అనుకొంటే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. తనను తాను అధిగమించగల, తనపై తానే పోరాడగల, తన పరిస్థితులను తానే ఎదిరించగల ధైర్యం ఒక్క మనుష్యులకే ఉంది.”
పదో తరగతిలో ఉన్నప్పుడు ఉపేందర్ సర్ చెప్పిన ఈ వాక్యాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. అదే ఆమెకి స్ఫూర్తి.
ఒంట్లో బాగా లేకపోయినా స్వరూపకు అండగా ఉన్నది అత్తగారు మాత్రమే. కానీ తన వల్ల స్వరూపకు ఏవిధమైన సహాయం లేదని బాధపడుతుంది .
ఇంటికి దూరంగా ఉంచే ఈ వృత్తిని వదిలేసే ప్రసక్తి లేదు. డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకే రోజు పొద్దున్న ఒక రెండు మూడు గంటలు ఇంటికి వచ్చి రెండు పూటలకి వంట చేసేసి, పిల్లలని స్కూల్‍కు తయారు చేసి పంపి ఇంట్లో మిగతా పనులు చేసుకుని, కీళ్ళనొప్పులు, ఆస్త్మాతో మంచాన పడివున్న అత్త గారికి మందులిచ్చి, భోజనం తినిపించి వెళ్ళిపోతుంది.
ఇది ఆమె దినచర్య.
*****
కొన్ని రోజుల తరువాత …
తన డ్యూటీ ముగించుకుని వచ్చిన స్వరూప కళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతూనే అత్తగారి గది వైపు మళ్ళాయి. అక్కడ బక్కపలచగా ఉన్న ఒక యువతి ఇయర్ ఫోన్స్ లో ఒకటి మంచం మీద నున్న అత్తగారి చెవికి, ఒకటి తన చెవిలో పెట్టి పాటలు వినిపిస్తోంది.
అత్తగారు కూడా అది వింటూ ముసిముసిగా నవ్వుతోంది.
ఆ దృశ్యం చూసిన ఆమెకి కాస్త రిలీఫ్ అనిపించింది. అలికిడి విన్న శిరీష, స్వరూపను చూస్తూ “రా అక్క, కూర్చో ఇదిగో ఈ టీ తీసుకో! “అంటూ ఫ్లాస్క్ లో ఉన్న టీని కప్ లో పోసి ఇచ్చింది.
“ఎట్లుంది అత్తమ్మా?” అని అత్తగారి చేయి పట్టుకుని అడిగింది.
ఆవిడ అందుకు కదిలిపోయి – “నువ్వేమో బయటకు పోయి కష్టపడి వస్తావు. ఇదిగో ఈ పిల్ల నన్ను మంచిగానే చూస్తోంది. నేనే పనికిరానిదాన్నైపోయాను. వాడి బుద్ధి మారలేదు. ఇంకా ఈ ప్రాణం ఎన్ని రోజులుంటుందో?” అని ఏడ్చింది. అంతలోనే అలసి కళ్ళు మూసుకుంది.
ఆమె పడుకోవటం చూసి స్వరూప బయటకు వచ్చి “శిరీషా! డబ్బు నా ఎకౌంటు లోకి వచ్చిన వెంటనే నీకు పంపించేస్తాను. సరేనా! ఈ పూటకు వెళ్ళు. రేపు పొద్దున్నే వచ్చెయ్యి.” అంది.
“అలాగే అక్కా” అంటూ వెళ్ళిపోయింది శిరీష.
బయట ఆడుకుంటున్నపిల్లలు తల్లిని చూసి “ఆకలి…” అనుకుంటూ వచ్చారు.
“పదండి అన్నం పెడతాను.” అని లోపలి వెళ్ళింది.
జ్యోతి తను వెలుగుతూ మిగతావాటికి కూడా ప్రకాశం ఇస్తున్నట్లు తను ఒకచోట ఓ పెద్దాయనను చూసుకునే ఉద్యోగం చేస్తూ మంచం మీదనున్న అత్తగారిని చూసుకోవడానికి చిన్నవయసులోనే ఇంటి బాధ్యతను మోస్తున్న మరో యువతి శిరీషకు తనలాంటి ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచింది.
కష్టాలు, కన్నీళ్ళతో అధైర్య పడకుండా జీవితాన్ని గెలిచే ప్రయత్నం చేస్తోంది స్వరూప. అంతేకాదు, తనలాంటి ఎంతో మంది ఆత్మస్తైర్ధ్యంతో ఈ జీవన యుద్ధ లో గెలవాలని తన చేతనైనంత సహాయం చేయాలని భావించసాగింది. ఆ దిశగా ప్రయాణించసాగింది.
ఆత్మస్థైర్యమే చివరిదాకా వచ్చే నేస్తం.
తప్పక వినండి – పల్నాటి వీరభారతం పాడ్కాస్ట్ సీరీస్