నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

ఆవకాయ స్పెషల్ వ్యాసాలు నాలుగు దశాబ్దాల “బెబ్బే” ల చరిత్ర

ఈ వ్యాసం చదివే చాలా మందికి “బెబ్బే” అనే పిట్టకథ, తెలిసిందే ఐనా, తెలియకపోయే అవకాశం ఉన్న కొద్దిమందికోసం, క్లుప్తంగా.

ఒక అమాయకుడిమీద ఒక నేరం మోపబడుతుంది. ఇతణ్ణి అమాయకుడు అని సాక్ష్యాధారాలతో నిరూపించాలి అంటే అంటేచాలా శ్రమపడాలి. అంత ఓపిక లేని లాయరు, ఒక గోసాయి చిట్కా ప్రయోగించాడు. అదేంటంటే, కోర్టులో ఎవరు ఏమి అడిగినా ఈ అమాయకుడు “బెబ్బే” అని చెప్పటం. అలా ఇతడికి శిక్షణ ఇచ్చి కోర్టుకు తీసుకొస్తాడు.

కోర్టులో అవతలి లాయరు: “నీపేరేమిటి బాబూ?”

సమాధానం “బెబ్బే”

“బెబ్బే అనే పేరు ఎవరుపెట్టేరు?”

సమాధానం “బెబ్బే”

“తిన్నగా మాట్లాడకపోతే పెద్దశిక్ష పడుతుంది.”

మళ్ళీ “బెబ్బే”

జడ్జి గారు కలుగజేసుకొని, “నువ్వు మూగవాడివా?”

జడ్జిగారికి కూడా “బెబ్బే”

ఇలా, ఓ గంట పాటు, మనుషులు మారినా, ప్రశ్నలు మారినా “బెబ్బే” ఒక్కటే సమాధానం.

జడ్జిగారు, వీణ్ణి వెర్రిబాగులవాడీగా తేల్చేసి, ‘నేరంచేసి ఉండడు’ అని కేసు కొట్టేసారు.

సంతోషంతో లాయరు, “చూసావా కేసు ఎలా కొట్టేసారో?”

సమాధానం “బెబ్బే”

“బాబూ కోర్టు ఐపోయింది. ఇప్పుడు మామూలుగా మాట్లాడు.”

మళ్ళీ అదే “బెబ్బే”

“నాఫీజు?”

“బెబ్బే”

“ఫీజు ఎగ్గొడితే కోర్టుకి లాగుతాను.”

“బెబ్బే”

“నీకు బెబ్బే నేర్పించిన నాక్కూడా బెబ్బే చెబతావా?” లాయరుకి కోపం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి.

అమాయక ముద్దాయి మొదటిసారి, చివరిసారి పూర్తిగా నోరుతెరచి చెప్పేడు.

“నీకూ బెబ్బే, నీఅబ్బకీ బెబ్బే.”

*****

జాతీయ, అంతర్జాతీయ బెబ్బేలు

 

ఇప్పుడు గత నాలుగుదశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయల్లో “బెబ్బే”లు గురించి కొన్ని ఉదాహరణలను చూద్దాం.

ఇక్కడ లాయరూ, ముద్దాయీ కి బదులు “బెబ్బే”లు నేర్పిన ప్రభుత్వాలూ, “బెబ్బే”లు నేర్చుకున్న తీవ్రవాదులూ ఉంటారు.

ప్రభుత్వ నాయకులూ, తీవ్రవాద నాయకులూ కూడా మారిపోయి కొత్తవారు వస్తుంటారు. దేశాలూ, సంస్థలూ మాత్రమే స్థిరం.

 

ఖలిస్థాన్ బెబ్బే

ఇందిరాగాందీ 1980 కి ముందు పంజాబులో ప్రకాశ్ సింగ్ బాదల్ ని ఇరుకున పెట్టడానికి జర్నైల్ సింగ్ భింద్రన్‍వాలే అనే యువకుణ్ణి చేరదీసి, అతడికి “సిక్కు మత రాజకీయం” అనే “బెబ్బే మంత్రం” ఉపదేశించింది. ప్రతిఫలంగా భింద్రన్‍వాలే 1980 పంజాబ్ లో ఎన్నికల్లో కాంగ్రేసు తరపున ప్రచారం కూడా చేసి ఇందిరాగాంధీకి రాజకీయ ప్రయోజనాలూ సమకూర్చాడు.

ఇందిర వేసిన పథకం ప్రకారం ఈమంత్రం తో అతడు ప్రకాశ్ సింగ్ బాదల్ ని మాత్రమే ఇరుకున పెట్టాలి. ఐతే సదరు వ్యక్తి ఆ మంత్రంతో ప్రకాశ్ సింగ్ బాదల్ ని ఇరుకును పెట్టడం కన్నా పెద్ద ప్రయోజనం సాధించవచ్చు అని తెలిసేసరికి ఖలిస్థాన్ ఉద్యమం రూపంలో నేరుగా ఇందిరాగాంధీకే బెబ్బే చెప్పాడు.

ఇందిరాగనంధీ దృష్టి భింద్రన్‍వాలే పై పడక ముందు – అంటే 1977 నాటికి – గురుద్వారా కమీటీలలో అతడి పలుకుబడి కేవలం 5 శాతం. సిఖ్ఖుమతస్తుల్లో ఒక పోలీసు కూడా అతడికి వెనక నిలిచే పలుకుబడి లేదు. కానీ, ఏడేళ్ళలోనే, అంటే, అతడు ఇందిరా గాంధీని ధిక్కరించి, సాయుధ పోరాటం పరాకాష్టకి చేరేనాటికి, స్వర్ణదేవాలయం మొత్తం అతడి కనుసన్నలలోకి రావటంతో పాటు గురుద్వారా కమిటీల్లో అతడి బలం నూటికి నూరు శాతం (భయం వల్లనా లేక భక్తి వల్లనా అన్నది అనవసరం). రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం అతడీ అనధికార అదుపాజ్ఞలలోకి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత, ఆపరేషన్ బ్లూస్టార్, భింద్రన్‍వాలే కాల్చివేత, ఇందిర హత్య, డిల్లీ సిక్కుల ఊచకోత, పంజాబులో దశాబ్దానికి పైగా అశాంతి. ఇప్పటికి నలభై ఏళ్ళు కావస్తున్నా అప్పుడు నేర్పిన బెబ్బే అవశేషాలు ఇంకా పూర్తిగా పోలేదు. బూడిదలోంచి లేచే భుతాల్లా ఇంకా ఆ విత్తనాలు మొలుస్తూనే ఉన్నాయి. విదేశాల్లో భారతీయ దౌత్యకార్యాలయాల పై దాడులు చేస్తూనే ఉన్నాయి. ప్రాణనష్టం చేసే స్థాయిలో లేకపోయినా, ఆందోళన కలిగించేలా ఉన్నాయి.

ఈ రోజు సిఖ్ఖు వోట్ల కోసం కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ వాదులను వెనకేసుకు వస్తోంది. అక్కడ బలపడ్డ ఖలిస్తాన్ వాదులు, భారతదేశంలో తమ పాచికలు పారవు అని తెలుసుకున్నాకా తమ బలాన్ని కెనెడా వైపు మళ్ళించి, కెనడాలో ఒక సిఖ్ఖు దేశం కోసం డిమాండ్ చేయవచ్చేమో.

ఇదీ బెబ్బే మంత్రం బలం!

*****

LTTE బెబ్బే

తన తల్లి హత్యకి ముందు 7 ఏళ్ళపాటు జరిగిన సంఘటనలు, రాజీవ్ గాంధీకి తెలీయకపోయే ప్రశ్నే లేదు. ఐనా, మరో ఏడేళ్ళకి రాజీవ్ గాంధీ కూడా అలానే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

అదెలాగంటే, శ్రీలంక మనకన్నా చాలా చిన్నదేశం. మనకు ఏ విధంగానూ అపాయకరం కాని దేశం. ఆ దేశంలో ఉన్న అసంతృప్త తమిళులకు 1985 లో ఆయుధాలు అందించి, వారి నాయకుడిని ప్రభుత్వ అతిథిగా చూసి, వారికి కొత్త కొత్త బెబ్బేలు నేర్పారు.

తమిళ పులులు బలపడేసరికి వాళ్ళని అణచడనికి మళ్ళీ మన సైన్యాన్నే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుతో పంపారు. పోనీ ఈ సైనిక సహకారాన్ని శ్రీలంక స్వాగతించిందా? లేదు. మన సైన్యం ఉండటం ఇష్టంలేని శ్రీలంక నాయకులు, మన సైన్యాన్ని తరమడానికి మళ్ళీ అదే LTTE కి ఆయుధాలు ఇచ్చారు. అంటే ముందు భారత ప్రభుత్వం నుండి శీక్షణ ఆయుధాలు పొందిన తమిళపులులు, భారత సైన్యంతో పోరాడటానికి శ్రీలంక ప్రభుత్వంనుండీ ఆయుధాలు పొందారు. దరిమలా రెండు దేశాల్లో, టైగర్లకి ఆయుధాలు ఇచ్చిన ఇద్దరు నాయకులూ, ఇటు రాజీవ్ గాంధీ, అటు ప్రేమదాస, తాము ఇచ్చిన ఆయుధాలకే బలయ్యారు.

దాదాపు ఇర్వయ్యేళ్ళు ఆ తీవ్రవాద సంస్థ వల్ల బాధపడి చివరికి చైనా దేశం సాయంతో శ్రీలంక ఎల్టీటీయీని తుడిచేసింది. ఇప్పుడు శ్రీలంకకి చైనా, పాకిస్తానుతో ఏర్పడిన సంబంధాలు మనదేశానికి అందోళన కలిగించేస్తాయిలో ఉన్నాయి. అంతా మనవాళ్ళు నేర్పిన బెబ్బే చలవే.

*****

అమెరికాకు తాలిబాన్ బెబ్బే

 

ఇప్పుడు అంతర్జాతీయ బెబ్బేను చూద్దాం.

సోవియట్ యూనియన్ 1980 నాటికి ఆఫ్ఘనిస్తాన్ లోకి సేనలు పంపింది. అప్పుడు అఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ సేనలను తరమడానికి, అమెరికా పరోక్షంగానూ, అమెరికా ఆర్ధిక, ఆయుధ సాయంతో పాకిస్తాన్ నేరుగానూ అఫ్ఘన్ యువతకి నేర్పిన “బెబ్బే” పేరు తాలిబాన్ పోరాటం.

మరి 1987 లో సోవియట్ యూనియన్ సేనలు వెళ్ళిపోగానే, తాలిబాన్లు అఫ్ఘన్ ప్రభుత్వానికి లొంగి ఉంటారా? అమెరికాకి లొంగి ఉంటారా? అని ప్రపంచం ఆలోచిస్తూ ఉండగానే వారు నేరుగా ఆ దేశ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.

వారి అధికారాన్ని గుర్తించని అమెరికా, తాలిబన్ల నుండి ప్రాణభయం ఉన్న మాజీ అధ్యక్షుడు నజీబుల్లాకి కాబూల్ లోని ఐక్యరాజ్యసమితి (యూఎన్) రాయబార కార్యాలయంలో ఆశ్రయం ఇచ్చింది. కొన్నాళ్ళు ఓపికపట్టిన తాలిబాన్లు 1996 లో ఐక్యరాజ్యసమితి రాయబార కార్యాలయంలోకి ఆయుధాల్తో దూసుకెళ్ళి మరీ నజీబుల్లాని చంపెయ్యడమే అమెరికన్లకు తాలిబాన్లు తొలిసారి చెప్పిన బెబ్బే.

ఆ తర్వాత దశాబ్దం అంతా తాలిబన్ల బెబ్బేలతో గడిచి, తాలిబన్ సోదర సంస్థ అల్‌ఖైదా గురి వల్ల అమెరికా జంట టవర్లు కూలి, దరిమిలా అమెరికన్ సేనలు అఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళాయి.

అంతవరకూ తాలిబాన్లకి తమ హృదయంలో స్థానం ఇచ్చిన పాకిస్తాన్, తప్పనిసరి పరిస్థితుల్లో తాలిబాన్ మీదకు యుద్ధానికి వెళ్ళే అమెరికన్ సైనికులకు తమ మిలిటరీ స్థావరాల నుండి మద్దతు ఇచ్చింది.

తమ సైనిక శిక్షణా కేంద్రాల్లో తుపాకీ పట్టడం నేర్చుకున్న వారిని తామే తీవ్రవాదులు అనే ముద్ర వేయటం పాకిస్తాన్ కి అప్పట్లో వచ్చిన పెద్ద కష్టం.

 

పాకిస్తాన్ కు తాలిబాన్ బెబ్బే

 

భౌతిక మద్దతు అమెరికాకీ, నైతిక మద్దతు తాలిబన్లకీ ఇచ్చిన పాకిస్తాన్ అందుకు భారీమూల్యం చెల్లించింది. ఎందుకంటే తాలిబానులకు నైతిక మద్దతు కన్నా భౌతిక మద్దతు ముఖ్యం. పాకిస్తాన్ తీసుకున్న ఈ వైఖరిని హెచ్చరిస్తూ 2014 లో తాలిబాన్లు పెషావర్ స్కూలుమీద చేసిన దాడిలో 150 మంది చిన్నారులు చనిపోయారు. రావల్పిండి సైనిక స్థావరం మీద జరిగిన ఆత్మాహుతి దాడిలో కొంతమంది సైనికులనీ, మిలిటరీ ప్రధాన కార్యాలయం భద్రతపై భరోసానీ కోల్పోవలసి వచ్చింది.

నిజానికి తాలిబానుల దృష్టిలో ఇవి పాకిస్తాన్ కి చెప్పిన పూర్తిస్థాయి బెబ్బేలు కాదు. ఎందుకంటే రావల్పిండి ఆత్మాహుతి దాడి స్థలంలో ఆత్మాహుతి దళ డిమాండుల లేఖ దొరికింది. అంటే, పాకిస్తాన్ సైన్యం నుండే బెబ్బే పాఠాలు నేర్చుకున్న వారు, పాఠం బాగా వంటబట్టించుకున్నాక పాకిస్తాన్ తో రాజీ కోసం పంపిన రాయబారమే ఇంత శాంతియుతంగా ఉంది.

పెషావర్, రావల్పండి దాడులు పరిశీలిస్తే స్పష్టంగా తెలిసేదేమిటి?

కొన్నేళ్ళక్రితం, అమెరికానుండి డబ్బుతీసుకొని, మత ప్రాతిపదికన తీవ్రవాదులకు ఆయుధాలు, ఇతర భౌతిక సదుపాయాలూ సమకూర్చిన పాకిస్తాన్ కి, ఆమద్దతుతో బలపడిన తీవ్రవాదులు బెబ్బే చెప్పేసినట్టే. ఈ విషయంలో అన్నేళ్ళ తర్వాత అప్పుడే జ్ఞానోదయం అయినట్టుగా అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ – “తాలిబన్ కి వ్యతిరేకంగా అమెరికాకి మద్దతు ఇచ్చి తప్పు చేసాం” అని అనటమైతే అన్నాడు కానీ అమెరికాకు మద్దతు ఇవ్వకుంటే ఈ పదిహేనేళ్ళలో తమ దేశం తాలిబాను పై పోరు పేరుతో అమెరికా నుండి పొందిన మిలిటరీ, ఆర్ధిక సహాయాన్ని ఎలా భర్తీ చేసుకొనేవారో చెప్పాల్సింది.

ఐనా, పాకిస్తాన్ ను అమెరికా ఎంత నమ్మిందో, ఒసామా బిన్‌ లాడెన్ ను చంపేసినప్పుడే తెలిసింది కదా? పాకిస్తాన్ ఆర్మీకీ, ప్రభుత్వానికీ ఏ సమాచారమూ ఇవ్వకుండా, అమెరికా నేవీ సీల్స్ కమెండోలు దాడిచేసి, లాడెన్ శరీరాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేసారు. అంతే కాకుండా తాము తెచ్చిన హెలీకాప్టర్ ఈ ఆపరేషన్ లో దెబ్బతింటే దాన్ని ధ్వంసం చేసి మరీ వెళ్ళారు. అంటే, ఇక్కడ పాకిస్తాన్ ని తాలిబాన్ సానుభూతిపరులైన తీవ్రవాదులూ నమ్మట్లేదు, ఆ తీవ్రవదులతో పోరాడుతున్న అమెరికా కూడా నమ్మట్లేదు.

ఇప్పుడు అమెరికా పరోక్ష మద్దతుతో రెండోసారి అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ తదుపరి లక్ష్యం పాకిస్తాన్ అంటున్నారు. వారి దృష్టిలో ఆప్ఘన్-పాక్ మధ్యనున్న ప్రస్తుత సరిహద్దురేఖకు విలువ లేదు.

పాకిస్తాన్ కి బెబ్బే చెప్పినది తాలిబన్లు ఒక్కరేనా?

 

కాశ్మీర్ తీవ్రవాదం బెబ్బే

 

కాశ్మీర్ తీవ్రవాదులు కూడా ఒక మోస్తరు బెబ్బే చెప్పినట్టే.

2018 డిసెంబరులో మన దేశానికి చెందిన ప్రతిపక్షనేత పాకిస్తాన్ కి చెందిన గూఢచారి విభాగ అధిపతిని మూడో దేశంలో రహస్యంగా కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలని ప్రతిపక్షనేత తీవ్రంగా ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. ఆధారాలతో నిరూపించవలసిందిగా సవాలూ చెయ్యలేదు. అంటే ఎంతో కొంత వాస్తవం ఉండి ఉండాలి. అప్పుడేమి జరిగి ఉండాలి?

ఈ ప్రతిపక్షనేత, పాకిస్తాన్ గూఢచార విభాగ అధిపతితో – “మాదేశంలో ఆర్ధిక వైఫల్యాల వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వం చాలా ప్రతికూలత ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఎక్కడ తీవ్రవాద చర్యలు జరిగినా ప్రజల్లో దేశభక్తి రాజెయ్యటం ప్రభుత్వానికి సుళువు. అందుకని రాబోయే ఆరునెలల్లో మీరు మీ తీవ్రవాదులను సైలెంట్ మోడ్ లో పెట్టండి” అని చెప్పి ఉండాలి.

పాకిస్తాన్ కి కూడా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే పార్టి తీవ్రవాదుల పట్లా, ఆ తీవ్రవాదులకి బహిరంగ మద్దతు ఇచ్చే తమ దేశం పట్లా మెతక వైఖరి అవలంబించే ప్రభుత్వం ఉంటేనే సుఖం కదా? అందుకు పాకిస్తాన్ గూఢచారి విభాగ అధిపతి సరే అని ఉండాలి. తమ మాట వినే తీవ్రవదులకు అలాంటి ఆదేశాలే జారీ చేసి ఉండాలి. బహుశా అందుకే మన దేశ నిఘా వర్గాలు కూడ కొంచెం ధీమా పడ్డాయి.

ఇక్కడే బెబ్బే మంత్రం పనిచేసింది. ఎందుకంటే, క్షేత్రస్థాయి తీవ్రవాదులకు, ముఖ్యంగా ఆత్మాహుతి దళాలకు, పెద్దగా రాజకీయ సమీకరణాలు పట్టవు. వాళ్ళకి అవి ఎవ్వరూ చెప్పరు కూడా. వాళ్ళకెంతసేపూ, చిన్నప్పుడు మదర్సాల్లో చెప్పినదీ, తోటి ఆత్మాహుతిదళం సభ్యుడు చచ్చిపోతే అతడి స్వర్గం కోసం ఎన్ని లక్షలమంది ప్రార్ధించినదీ కళ్ళముందు కనపడుతూ ఉంటుంది. అందుకని, పైవాళ్ళకి ఏ సమాచారమూ లేకుండానే, రెండు దేశాల్లోనూ కుదుపు అనదగ్గ పుల్వామా ఆత్మాహుతి దాడి చేసేసారు.

ఈ దాడి మన దేశంలో ఎంత అలజడి సృష్టించిందో పాకిస్తాన్ ప్రభుత్వ, నిఘా, మిలిటరీ వర్గాల్లోనూ అంతే గందరగోళం సృష్టించి ఉండాలి. “ఇప్పుడెందుకు జరిగింది? ఎవరు చెయ్యమన్నారు? కొన్నాళ్ళు ఆగమని చెప్పేం కదా?” లాంటి ప్రశ్నలు ఆ వర్గాల్లో గట్టిగా తిరిగి ఉండాలి. లేకపోతే, పుల్వామా దాడికీ, మాదేశానికీ ఏ సంబంధమూ లేదు అని చెప్పటానికి పాకిస్తాన్ కి మూడు రోజులు ఎందుకు పట్టింది?

అంటే పుల్వామా దాడికి పాకిస్తాన్ నుండి అధికార అమోదముద్ర లేదు. కాకపోతే అలాంటి దాడులు ఎలా చేయాలో గతంలో శిక్షణ ఇచ్చింది పాకిస్తానే. తీరా అన్నీ నేర్చుకున్న దళం, తమకు నేర్పినవారికి బెబ్బే చెప్పేసి, స్వంతంగా దాడి చేసేసారు. ఇంకేముంది? బాలాకోట్, అభినందన్, మరో మూడు నెలల్లో మోదీకి అభినందనలు.

ప్రతిపక్షనేత పొరుగుదేశ గూఢచారి విభాగాధిపతిని కలవటం, వారి సంభాషణ సారాంశం మొదలైనవాటిల్లో 90% నా ఊహ మాత్రమే. కానీ ఈ ఊహ అర్ధంలేనిదంటారా?

ఇటీవల ఒక చరిత్ర మేధావి మహాభారతాన్ని బుద్ధుడు, అశోకుడు వచ్చి వెళ్ళిన తరువాత జరిగినట్టుగా ఊహించారు. నా ఊహ అంతకంటే అర్ధరహితమా?

నిజానికి మహాభారతాన్ని కట్టుకథ అని నమ్మేవారితో నాకు పేచీ లేదు. దాన్ని చరిత్రలో ఇరికిస్తూనే అందులో కూడా బుద్ధుడు, అశోకుడి తర్వాత జరిగినట్టు ఊహించడమే పెద్ద విడ్డూరం. ఈ ఊహ పదోక్లాసు వాడూ చేస్తే హిస్టరీలో ఫెయిల్ చెయ్యొచ్చు. కానీ….

ఇలా బెబ్బేల గురించి చెబుతూ పోతే, తాము నారూ, నీరూ పోసి పెంచిన ఒకప్పటి లేతమొక్కలే, దశాబ్దం తిరిగేసరికి నాటిన వారి పాలిట విష వృక్షాలై పెరగటం ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం.

*****

ముందురోజుల్లో రాబోయే ఒకానొక బెబ్బే

 

ఇప్పుడు బెలూచిస్తాన్ విమోచన గెరిల్లా దళాలకు భారత ప్రభుత్వం భౌతిక మద్దతు ఇస్తోంది అన్నది పాకిస్తాన్ ఆరోపణ. నైతిక మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని స్వయంగా చెప్పారు. రేపు, పాకిస్తాన్ తో భారత్ కు కాశ్మీరు విషయంలో శాంతి ఒప్పందం కుదిరి, అందులో భాగంగా బెలూచిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ అంతర్గత సమస్య అని భారత్ ప్రకటిస్తే, అప్పుడు బెలూచిస్తాన్ విమోచన దళాలు మన నాయకులమీద కోపం పెంచుకోవన్న భరోసా లేదు. అటువంటి పరిస్థితే గనుక వస్తే, పాతకక్షలన్నీ పక్కన పెట్టి మరీ స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఆ గెరిల్లాదళాలకు సాయం చేసి భారత్ మీదకు ఉసిగొల్పదన్న భరోసా అంతకన్నా లేదు.

లేదా

ఒకవేళ బెలూచిస్తాన్ కల సాకారమయ్యాకా, పాకిస్తాన్ నుండి విడిపోయిన స్వతంత్ర బెలూచిస్తాన్ దేశం దృష్టి ఇరాన్ లో బెలూచ్ ప్రజలున్న ప్రాంతాలమీద పడదన్న గ్యారెంటీ ఎక్కడుంది?

ఇరాన్ బెలూచ్ ప్రాంతంలోనే మనదేశం అభివృద్ధి చేస్తోన్న చాబహార్ పోర్టు ఉంది. అప్పుడు ఇరాన్ కి మనదేశం మీద ఖచ్చితంగా కోపం వస్తుంది.. కన్నుకి కన్ను, కాలుకి కాలు, కాశ్మీరుకి బెలూచిస్తాన్ అనే ధోరణి, భవిషత్తు తరాలపాలిటి టైం బాంబు గా మారుతుంది.

*****

అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అని అంటారుగా! మరి కాలం మున్ముందు ఎవరికి ఎవరి చేత ఏ ’బెబ్బే’చెప్పించనుందో!

*****

Your views are valuable to us!