రుక్మిణీ సందేశము

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

రుక్మిణీ సందేశము

ఆంధ్ర మహా భాగవతము లోని రుక్మిణీకళ్యాణ గాథ సుప్రసిద్ధం. మధురాతిమధురమైన ఆ ఘట్టం సర్వులకూ ప్రీతిపాత్రమైనదే!

ఆ కథలోని అంతర్భాగమైన “రుక్మిణీ సందేశము” గురించి నా బుద్ధికి తోచినంతమేరకు విశ్లేషణాపూర్వకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పోతనామాత్యులవారి రచనా రామణీయకతను, ముకుందుని ముందర రుక్మిణీరమణి అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించిన విధానమును తెలపడమే నా ముఖ్యోద్దేశము.

రుక్మిణీకళ్యాణ గాథను ముందుగా సంక్షిప్తంగా తెలుసుకుందాము.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు


రుక్మిణీ వృత్తాంతం


ద్వాపరయుగములో విదర్భరాజ్యాన్ని భీష్మకుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ఐదుగురు కుమారుల తర్వాత, చివరిగా కడగొట్టు సంతానంగా శ్రీమహాలక్ష్మి అంశతో రుక్మిణి జన్మించింది. తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యౌవనవతి అయినదాదిగా శ్రీకృష్ణుని గుణగణాల గురించి, బలపరాక్రమాల గురించి కర్ణాకర్ణిగా విన్న రుక్మిణి, ఆయననే వివాహం చేసుకోవాలని తన మనస్సులో నిశ్చయించుకుంటుంది. కన్నవారికి, ఇతర బంధుగణానికి ఈ సంబంధం సమ్మతమే! కాని, రుక్మిణి పెద్దన్న ఐన రుక్మి కి మాత్రం, తన సోదరిని కృష్ణునికి ఇవ్వడం ఇష్టం లేదు. మహారాజు వృద్ధుడైనందువల్ల, అన్ని వ్యవహారాల్లో రుక్మి పెత్తనమే సాగేది. చండశాసనుడైన అతని మాటకు ఎదురుచెప్పే సాహసం ఎవరికీ లేదు. రుక్మి తన ఆప్తమిత్రుడు, చేదిరాజ్యానికి అధిపతియైన శిశుపాలునితో తన చెల్లెలి వివాహం నిశ్చయించి, శిశుపాలుణ్ణి సపరివారంగా పెళ్ళికి తరలిరమ్మని ఆహ్వానం సైతం పంపిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆందోళనకు లోనైన రుక్మిణి, తనవారెవ్వరూ తనకు సహాయం చేయలేరని గ్రహించి, తీవ్రంగా ఆలోచిస్తుంది.

తమ కుటుంబానికి ఆత్మీయుడైన “అగ్నిద్యోతనుడు” అనే బ్రాహ్మణోత్తముని రావించి, తన పరిస్థితిని వివరించి, తన సందేశాన్ని ద్వారకలోని శ్రీకృష్ణునికి అందజేసి తనకు సాయపడవలసిందని ప్రార్థిస్తుంది. పరోపకారపారీణుడైన ఆ విప్రవరుడు అందుకు సమ్మతించి, ద్వారకకు వెళ్ళి, రుక్మిణీసందేశాన్ని ఆ వంశీధరునికి విన్నవిస్తాడు. ఇక, ఆ తర్వాత వాసుదేవుడు విదర్భకు వచ్చి, గౌరీపూజకై నగరం వెలుపలి ఆలయానికి వచ్చిన రుక్మిణిని తన రథంలో ఎక్కించుకుని వెళ్ళడం, అడ్డునిలిచిన శిశుపాల జరాసంధులను యుద్ధంలో పరాజితులను చేయడం, పిమ్మట రుక్మి ని సైతం ఓడించి పరాభూతుణ్ణి చేయడం జరుగుతాయి. ఆ తర్వాత ద్వారకలో రుక్మిణీకృష్ణుల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఇదీ సంగ్రహంగా రుక్మిణీకళ్యాణ కథ.

రుక్మిణీ సందేశం – సంస్కృత-తెలుగు భాషల్లో

వ్యాసభగవానులవారి “సంస్కృత భాగవతము” లో రుక్మిణీసందేశము సప్తశ్లోక సమన్వితం. అనగా, ఆమె శ్రీకృష్ణునికి పంపిన సందేశము 7 శ్లోకముల్లో అక్షరబద్ధం చేయబడింది. పోతనగారు ఈ ఘట్టాన్ని 8 పద్యరత్నాల్లో అందంగా, అద్భుతంగా తెనిగించారు. ‘వ్యాసుని కంటే పోతన ఒక ఆకు ఎక్కువే చదివాడు ‘ అనలేము కానీ, సంస్కృత భాగవతాన్ని మించి “ఆంధ్ర భాగవతము” అత్యంత ప్రజాదరణ పొందినదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోతన తన ఆంధ్రీకరణం ద్వారా ‘ గీర్వాణ భాగవత సుందరి ‘ అందచందాలకు అద్భుతమైన అలంకరణలు పొదిగి, సొబగులూ సోయగాలతో తీర్చిదిద్దాడు.

 

రుక్మిణి పాత్ర చిత్రణ

పురాణప్రసిద్ధమైన పాత్రలను తలచుకున్నప్పుడు, ఆ యా పాత్రల స్వరూప స్వభావాలకు అనుగుణమైన ఒక రూపచిత్రం మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమౌతుంది.

“రుక్మిణి” అనగానే లక్ష్మీకళ ఉట్టిపడే సుందరరూపంతో, ప్రశాంతవదనముతో అణకువగా, అమాయకంగా ఉండే ఒక సాధ్వీమణి మన ఊహల్లో సాక్షాత్కరిస్తుంది. ఇవన్నీ నిజమే కాని, రుక్మిణి అమాయకురాలు మాత్రం కాదు! పైగా ధైర్యసాహసాలు, తెలివితేటలు కలిగివున్న యువతి!

అదెలాగో, కాసింత పరిశీలిద్దాము.

రాకుమారుడు రుక్మి అంటే విదర్భరాజ్యములో అందరికీ హడల్! అతని మాటే వేదంగా చలామణీ అయ్యేది అక్కడ! కన్న తల్లిదండ్రులు సైతం అతని పలుకులకు ఎదురాడలేకపోయేవారు! అటువంటి పరిస్థితుల్లో, తన జ్యేష్ఠసోదరుని ఇష్టానికి వ్యతిరేకంగా, సుక్షత్రియ వంశ సంజాతయైన ఒక రాజకన్య, వివాహం నిశ్చయమైన యువతి, పరపురుషునికి ప్రేమసందేశం పంపించాలంటే ఎన్ని గుండెలు కావాలి?! ఎంత తెగువ ఉండాలి!

దీనిని బట్టి రుక్మిణి యొక్క సాహసగుణం మనకు తెలుస్తోంది.

పోతే, తన సందేశాన్ని తీసుకువెళ్ళడానికి ఒక భూసురుణ్ణి ఎంచుకోవడంలో రుక్మిణి బుద్ధికుశలత, వివేకం మనం గమనించవచ్చు!

ఆమె రాచకన్నె కనుక, తన అధీనంలో ఉండే వార్తాహరుణ్ణిగానీ, సైనికుణ్ణిగానీ పంపించవచ్చు. కాని, అలా చేస్తే తన సోదరునికి తెలిసే అవకాశం ఉంది; తన పథకం విఫలం కావచ్చు! బ్రాహ్మణోత్తముడిని ఎవరూ సందేహించరు.

విప్రుడే సందేశహరుడు కావడానికి మరో కారణం కూడా ఉంది. వార్తాహరుని ద్వారా పంపితే సందేశాన్ని గమ్యస్థానానికి చేర్చగలడే తప్ప, మరో ప్రయోజనమేదీ సిద్ధించదు. బ్రాహ్మణవర్యుడైతే అన్నీ తెలిసిన పండితుడు కాబట్టి, కేవలం సందేశం అందించడమే కాక, సమయానుకూలంగా మాట్లాడి కార్యాన్ని సానుకూలం చేయగలడు. తన గురించి, తన ప్రేమ గురించి గోవిందునికి తెలియజెప్పి, ఆయన డెందములో తన పట్ల అనురాగం అంకురించేలా చేయగలడు.

మరో విషయం ఏమంటే – తాను శ్రీకృష్ణుడిని వలచింది కాని, ఆ ముకుందుని మనసులో తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తనకు తెలియదు. మామూలు భటునితో సందేశం పంపితే, ఆయనకు తానంటే తేలికభావం, చులకన కలిగే అవకాశం ఉంది. ఒక గౌరవనీయుడైన వ్యక్తి సందేశహరుడైతే, ఆ పరంధామునికి తన పట్ల పవిత్రభావం ఏర్పడుతుందని రుక్మిణి ఆశించింది.

బ్రాహ్మణుడైన అగ్నిద్యోతనుడు సందేశం తీసుకెళ్ళడం వలన రుక్మిణి కోరుకున్న ప్రయోజనాలన్నీ నెరవేరాయి. “రుక్మిణీ కళ్యాణం” పఠించిన సాహితీప్రియులకు ఇవన్నీ అవగతమే!

మరి, ఇన్నివిధాలుగా ఆలోచించి తన కార్యాన్ని సఫలం చేసుకోగలిగిన రుక్మిణి తెలివితేటలు తేటతెల్లమే కదా!

ఉపోద్ఘాతం సుదీర్ఘం అయినట్టుంది……… ఇంతటితో ముగించి, రుక్మిణీసందేశ రూపంగా ఉన్న 8 పద్యాలలో మొదటిదానిని తీసుకుంటున్నాను. ముందుగా పద్యమును చిత్తగించండి.

 

stree vijayam history documentary in telugu

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

మొదటి పద్యము

 

ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక
…….దేహతాపంబులు దీఱిపోవు
ఏ నీ శుభాకార మీక్షింపఁ గన్నుల
…….కఖిలార్థలాభంబు గలుగుచుండు
ఏ నీ చరణసేవ లేప్రొద్దు చేసిన
…….భువనోన్నతత్వంబుఁ బొందగలుగు
ఏ నీ లసన్నామ మేప్రొద్దు భక్తితో
…….దడవిన బంధసంతతులు వాయు

అట్టి నీయందు నా చిత్త మనవరతము
నచ్చియున్నది, నీయాన! నాన లేదు!
కరుణ జూడుము కంసారి! ఖల విదారి!
శ్రీయుతాకార! మానినీ చిత్తచోర!

 

రుక్మిణి శ్రీకృష్ణునికి పంపిన ప్రణయసందేశములోని ప్రథమ పద్యం ఇది! మొదట పద్యభావాన్ని పరిశీలిద్దాము. ఇందులో రుక్మిణి శ్రీకృష్ణుని మహత్తును ఉగ్గడించి, తాను ఆయనను వరించాననీ, తనను కరుణించి చేపట్టవలసిందనీ విన్నవించుకుంటున్నది.

కంసాది దుష్టులను దునుమాడిన పరంధామా! ఓ శ్రీకృష్ణా! నీ శుభప్రదమైన కళ్యాణగుణములను ఆకర్ణించినంతనే దేహతాపములు, తాపత్రయాలు అన్నీ తగ్గిపోతాయి. నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించిన నయనాలకు ఈ జగత్తులోని సకల రూపాలనూ చూసినంతటి భాగ్యం అబ్బుతుంది. ఎందుకంటే, జగమంతా భగవత్ స్వరూపమే కదా! అన్ని ప్రాణుల్లోనూ భగవానుడైన ఆ సర్వాంతర్యామే కొలువై ఉన్నాడని చెప్తారు విజ్ఞులు. శ్రీకృష్ణుని దర్శనమాత్రం చేత అఖిలప్రాణులనూ దర్శించినట్లే మరి!

ఇక్కడ పోతనగారు “అఖిలార్థలాభంబు” అనే మాటను ప్రయోగించారు. ‘ అఖిలము ‘ అనగా ఖిలము కానిది; అంటే నాశనము లేనిది అని అర్థం. ‘ అఖిలార్థము ‘ అంటే ఖిలం కాని శాశ్వతమైన పురుషార్థము. ధర్మార్థకామమోక్షములు అనబడే చతుర్విధ పురుషార్థములలో, చివరిదైన మోక్షమే శాశ్వతమైనది. అందువల్ల ఆ వాసుదేవుని దర్శనం వలన మానవులు దుర్లభమైన మోక్షప్రాప్తికి చేరువ కాగలరనే అర్థం ఈ పద్యపాదములో స్ఫురిస్తున్నది. భగవత్ సాక్షాత్కారం పొందినవారికి కైవల్యం కరతలామలకమే కదా!

ప్రతిదినమూ నీ పాదపూజను చేసేవారికి లోకాధిక్యం సిద్ధిస్తుంది; జీవితంలో అట్టివారు మహోన్నతిని పొందగలుగుతారు. భక్తితో నిత్యమూ నీ నామస్మరణ చేసేవారికి ఈ సంసారబంధములు తొలగిపోతాయి; పరమపదప్రాప్తి వారికి సులభతరం అవుతుంది. అటువంటి పరాత్పరుడవైన ఓ కృష్ణా! నా మనస్సు నీయందు లగ్నమైనది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. “నీ ఆన సుమా!” అని సాక్షాత్తూ ఆ మురళీధరుని పైనే ఒట్టు పెట్టుకుని చెప్తున్నది రుక్మిణి!

పైగా “నాన లేదు” అనికూడా అన్నది. ‘ నాన ‘ అనగా సిగ్గు. సాధారణంగా తమ మనోగతమైన విషయాలను వెల్లడించడానికి స్త్రీలు, ముఖ్యంగా కన్యలు సిగ్గుపడడం లోకసహజం. కాని, ఇక్కడ రాకుమారి రుక్మిణి తాను శ్రీకృష్ణుడినే మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నానని సిగ్గును వదిలేసి, నిర్భీతిగా ప్రకటిస్తున్నది!

ఈ సందర్భములో మనం ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఆమె అన్నగారైన రుక్మి, తన సోదరి వివాహాన్ని శిశుపాలునితో జరపాలని నిర్ణయించాడు. ముహూర్తానికి ఎక్కువ వ్యవధి లేదు. అందుకే రుక్మిణి, తన సందేశములోని తొలి పద్యములోనే తన మనోభావాన్ని సూటిగా, నిస్సంకోచంగా, విస్పష్టంగా ఆ వంశీమోహనుని ముందు వ్యక్తం చేసింది. మరి, ఇలాంటి సమయములో తాత్సారం చేయడం తగదు కదా! ఈ విషయాలన్నీ వివరించి, తనను కరుణించి కాపాడమని వేడుకున్నది.

 

Your views are valuable to us!