Why Bharat Matters – విదేశాంగ మంత్రి జయశంకర్ వ్రాసిన పుస్తక సమీక్ష
ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రాసిన పుస్తకం పుస్తకం పూర్తి చేసాను. ఇది ఈ పుస్తకం గురించి నేను అర్ధం చేసుకున్న విధానం మీద ఆధారపడిన సమీక్ష.
*****
జయశంకర్ పుస్తకం “వాట్సాప్ యూనివర్సిటీ” లో వెదజల్లే సమాచారంలో ఉన్న నిజాల శాతం నిర్ణయించటానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా భారత దౌత్య విజయాలు, పరిమితులూ అనే విషయంలో వివిధ పార్టీల నాయకుల అభిమానులు పోటీలు పడి ఎవరికి నచ్చినట్టు వారు వ్రాసే రాతలకు గట్టి సమాధానం ఈ పుస్తకం.
ముందుగా, రాజకీయ అంశాలతో సంబంధంలేని సమాచారం ఈ పుస్తకంలో కొంత ఉంది. అదేమిటంటే, అసలు మన దేశపు విదేశీ విధానం గురించి సామాన్యుడు ఎందుకు తెలుసుకోవాలి? మనరోజువారీ జీవితాలను విదేశీవిధానం ఎలా ప్రభావితం చేయగలదు?
ఇలాంటి ప్రశ్నలకు జయశంకర్ ఇచ్చిన సమాధానాలు, ఉదాహరణలూ బావున్నాయి.
ఇది రాజకీయాలకు అతీతమైన సమాచారం.
ఈ సమాచారం నాకు ఎందుకు కొత్తగా ఉంది అంటే –
ఇంతకు ముందు చదివిన పుస్తకాల్లో విదేశీ వ్యవహారాలంటే సామాన్యులకు అనవసరం అనే అభిప్రాయం కలుగజేసేవే.
విదేశీ వ్యవహారాల మంత్రిగా 1970ల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకంలో 1970 ల నాటికే ఢిల్లీ ప్రభుత్వ వర్గాల అభిప్రాయం ప్రకారం – “Foreign Affairs Ministry is all about alcohol and protocol (విదేశీ వ్యవహారాలు అంటే మద్యం, హోదాలవారీ మర్యాదలూ అంతకు మించి ఇంకేమీ లేదు).”
దౌత్య అధికారిగా పనిచేసి, భారతదేశం తరపున ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీపడి, రిటైర్మెంటు తరువాత రాజకీయాల్లోకి వచ్చి విదేశాంగ మంత్రిగా పని చేసిన శశి థరూర్ ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వారిని “ఆవులమంద” తో పోల్చినప్పుడు “విదేశీ వ్యవహారాల అధికారులకు మనదేశ సామాన్యజనం మనుషుల్లా కనపడరేమో కదా!” అని నాకు అనిపించింది.
అలాగే, విదేశాంగ శాఖ అధికారిగా చేసి, తరువాత రాజకీయాల్లోకి వచ్చి అదే శాఖకు మంత్రి అయిన నట్వర్ సింగ్ రాసిన పుస్తకంలో – “తాను సోనియా గాంధీ కోసం ఎంత చేసినదీ, ఆమె తనని ఎలా వదిలించుకున్నదీ, (ఒక స్కాం బయటపడగానే, నట్వర్ సింగ్ బలిపశువు ఐన విధం)” చెప్పి వాపోయాడు.
ఇది కూడా సామాన్యులకు అవసరమైన అంశాలు కావు.
ఇవన్నీ చదివిన మీదట, జయశంకర్ రాసిన పుస్తకం ఖచ్చితంగా మంచివిషయాలున్న పుస్తకం అనిపించింది.
విదేశాంగశాఖ చొరవతో వివిధ దేశాలలో పనిచేసే భారతీయుల స్థితిగతులను ఎలా మెరుగుపరచారో, కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకోసం ఆయా దేశాలు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు వర్ణించారు.
ఉదాహరణకు
- కోవిడ్ లాక్ డౌన్ లో వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి క్షేమంగా తీసుకురావటంలో విదేశాంగ శాఖ చేసిన శ్రమ
- రష్యా ఉక్రెయిన్ యుద్ధసమయంలో భారతీయులు వెళ్ళే మార్గాల్లో (కొంత సమయం పాటు) కాల్పులవిరమణ
- ఉక్రెయిన్ దాటిన భారతీయులకు ఉక్రెయిన్ చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలు యుద్ధప్రాతిపదికన ఇచ్చిన ప్రయాణ అనుమతులు, తమ దేశాల విమానాశ్రయాలలో భారతీయ విమానాల ప్రవేశ అనుమతులు పొందిన విధం వర్ణించాడు.
ఈ విషయాలతోపాటు, జయశంకర్ వివరించిన అనేక సంఘటనలు, దేశప్రతిష్టనూ (ప్రభుత్వ ప్రతిష్టను) పెంచేలా ఉన్నాయి. ఈ విషయంలో 2014 కు ముందు పరిస్థితులను రాయవలసి వచ్చినప్పుడు, ఎవరి గౌరవమర్యాదలకూ భంగం కలిగించని పదజాలంతోనే వర్ణించాడు.
ఉదాహరణకు, “QSD or Quad (అమెరికా, ఇండియా, జపాన్ ఆస్ట్రేలియా కూటమి) ఏర్పాటుకు 2007 లోనే ప్రయత్నాలు జరిగినా అవి చైనా అభ్యంతరాల మూలంగా కార్యరూపం దాల్చలేదు.”
ఈ సమాచారం తప్పైతే జయశంకర్ ను ఏకిపారెయ్యటానికి డజన్లకొద్దీ విదేశీ వ్యవహారాల నిపుణులు ప్రతిపక్షంలోనూ, జర్నలిస్టులలోనూ, విశ్లేషకులలోనూ ఉన్నారు. వారెవరూ దీనిని తప్పు అనలేదు.
ఇలాంటి విషయాలు చదివిన సగటు కాంగ్రెస్ కార్యకర్త “అవి ఆ కాలంనాటి పరిస్థితులు” అని సరిపెట్టుకుంటే, సగటు మోదీ అభిమాని “అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చైనాకు సాగిలపడింది. అదే పని మోదీ కనుక 2019 లో ఆ పని చేయగలిగేడు” అని వాదిస్తాడు.
అలాగే, జయశంకర్ నెమ్మదిగా చెప్పిన విషయం ఏమిటంటే, అనేక దశాబ్దాల పాటు మన దౌత్య ప్రభావాన్ని (పలుకుబడిని) మన ఆర్ధిక సామర్థ్యం నిలువరించింది. దీనినే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలంటే, డబ్బు లేని దేశం తరపున పనిచేస్తే ఎంత నైపుణ్యం ఉన్న రాయబారులైనా వారి సామర్థ్యం మేరకు పనిచేయలేరు.
జయశంకర్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయానికి నిదర్శనం ఒకటుంది.
1970ల్లో అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని “large insignificant country” అనగా “ప్రాముఖ్యత లేని పెద్దదేశం” అని వర్ణించాడు. వింత ఏమిటంటే, అంతకు పదిహేనేళ్ళ ముందు చైనా కోసం భారతదేశం చేసిన త్యాగం మూలంగా చైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం దక్కింది.
దాంతో 1950ల్లో అమెరికానుండి దౌత్య గుర్తింపే లేని కమ్యూనిస్టు చైనా 1970ల నాటికి “ప్రాముఖ్యత కలిగిన” పెద్దదేశంగా ఎదిగింది. ఫలితంగా అమెరికా కూడా కమ్యూనిస్టు చైనాతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకుంది.
ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఈ రెండు దేశాలూ ఏకకాలంలో పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వగా పాకిస్తాన్ కూడా నిర్మొహమాటంగా అమెరికా సహాయాన్ని వాడుకుంది. పాకిస్తాన్ ఎందుకు మొహమాటపడాలీ అంటే, ఇజ్రయిల్ ను సమర్ధించే అమెరికా అంటే పాకిస్తాన్ కి వళ్ళు మండాలి. కానీ దేశ ప్రయోజనాల ముందు అలాంటి మొహమాటాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
సరిగ్గా ఇక్కడే భారత్ అనేక దశాబ్దాలపాటు “భావజాలాల” మాయాజాలంలో పడి దేశ ప్రయోజనాలను నష్టపోయింది. అంటే, అమెరికాతో పాటించిన కృత్రిమ దూరం. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే పాలెస్తీనాను గుర్తించి, మనదేశానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే ఇజ్రయిల్ ను “అంటరాని దేశం” గా చూడటం లాంటివి అన్నమాట.
చివరికి 1991 లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ముందుగా యాసర్ అరాఫత్ చేతే “భారత్ కనుక ఇజ్రయిల్ ను గుర్తించాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు” అని చెప్పించి అప్పుడు ఇజ్రయిల్ లో దౌత్య కార్యాలయం తెరిచారు.
జయశంకర్ రాసిన ఇంకొక విషయం – రష్యా చైనాలు (కమ్యూనిస్టు దేశాలు) నొచ్చుకుంటాయేమో అని నెహ్రూగారు అమెరికాతో దూరం పాటించారు. ఈ విషయంపై డా. అంబేడ్కర్ కూడా నెహ్రూతో “అమెరికాను దూరం పెడితే త్వరగా అభివృద్ధి చెందలేము” అని చెప్పినా నెహ్రూగారి వైఖరి మారలేదు.
ఆఖరుకి చైనా 1962 లో మన దేశంలో కొన్ని ప్రాంతాలు ఆక్రమించినప్పుడు నెహ్రూగారు అమెరికా సహాయం అడిగినప్పుడు కూడా “చైనా సేనలు వెనక్కి వెళ్ళేవరకే అమెరికా అవసరం, ఆ తరువాత యథావిధిగా అమెరికాతో దూరం పాటిద్దాం” అనే వైఖరితోనే ఉన్నారుట.
సగటు నెహ్రూ వ్యతిరేకులు నమ్మిన ఒక విషయాన్ని జయశంకర్ ఒప్పుకోలేదు.
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి లో దీపావళి ఉత్సవాలు ఎలా జరిగేవో తెలుసుకోండి
అదేమిటంటే, 1947లో కాశ్మీరు అంశాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించటం నెహ్రూ పొరపాటు అని నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. కానీ జయశంకర్ మాత్రం, “భారతదేశం కాశ్మీర్ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన గౌరవాన్ని దుర్వినియోగం చేసి, పాకిస్తాన్ ఆక్రమణను తప్పుపట్టటానికి బదులుగా మొత్తం ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించింది.” అని రాసేడు.
ఇందులో జయశంకర్ లౌక్యం ప్రదర్శించి, తాను మాట తూలకుండానే నెహ్రూ వ్యతిరేకులు ఈ పుస్తకంలో అంశాలను బట్టి “నెహ్రూ తప్పిదం వల్లే ఐక్యరాజ్యసమితి మనని మోసం చేసింది” అనే వాదనకి ఆధారాలు చూపే అవకాశం ఇచ్చాడు.
చిన్నప్పటినుండీ స్వతంత్ర భారత చరిత్ర గురించి నా (పాక్షిక) అవగాహనకి కారణం మన విద్యావ్యవస్థ, నెహ్రూవియన్ మేథావుల రచనలు, పత్రికలు ఇచ్చిన (పాక్షిక) సమాచారం ప్రకారం 1947 నుండి 1964 మధ్యలో మనదేశపు విదేశాంగవిధానం గురించి ఒక్క నెహ్రూ గారు తప్ప ఇంకెవరూ ఆలోచించగలిగే నాయకుడే లేడు అన్నట్టు ఉండేది.
ఎందుకంటే, నా హైస్కూలులో మా తెలుగుమాష్టారు (అవును తెలుగు మాష్టారే, సోషల్ మాష్టారు కాదు) పాఠం మధ్యలో “నెహ్రూ లాంటి సచ్చీల నాయకుడు పంచశీల బోధిస్తే, చైనావాడు వెనుకనుండి ద్రోహం చేసాడు” అని 1960 లనాటి ఏదో సినిమా పాట ఉటంకిస్తూ చెపారు.
అంటే 1964 తరువాత వచ్చిన తెలుగు సినిమాలు కూడా, “1947-64 మధ్య కాలం విమర్శకీ, విశ్లేషణకీ అతీతం. ఆ కాలంలో ఆలోచించగలిగే నాయకుడు ఒక్కడే. ఆ నాయకుడిముందు మిగిలినవారంతా దూదిపింజలు. అసలు అక్కడ ఇంకొకరు మాట్లాడటమే!” అనే సందేశాన్ని ప్రజల్లోకి చొప్పించాయి.
జయశంకర్ పుస్తకంలో ఈ అంశం పై ఉన్న ఇంకొన్ని విషయాలు:
తొలి కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రివర్గ సహచరులు, నెహ్రూగారితో విదేశాంగ విధానంపై మూడు అంశాలపై గట్టిగా విభేదించారు. అవేమిటంటే, చైనాతో కాస్త “జాగ్రత్తగా” వ్యవహరించాలని వల్లభాయ్ పటేల్ చెప్పగా నెహ్రూ వినలేదు. అలా చెప్పిన కొద్ది నెలలకే పటేల్ మరణించగా, నెహ్రూ చైనాపట్ల కొనసాగించిన “ఇండియా చీనీ భాయి భాయి” విధానాల ఫలితాలు మరో 10-12 ఏళ్ళలో “హిమాలయన్ బ్లండర్” రూపంలో దేశమంతా చూసాయి.
మన చరిత్రకారులంతా 1962 నాటి చైనా చర్యను వెన్నుపోటు అని వర్ణించి, ఇందులో నెహ్రూ గారి ఆలోచననలో ఎలాంటి లోపలూ లేవు అని తీర్మానించారు. కానీ, చీనాను అతిగా నమ్మవద్దని పటేల్ ముందుగా హెచ్చరించనట్టూ, ఆ హెచ్చరికను నెహ్రూగారు పట్టించుకోనట్టూ, మనలో ఎవరికీ తెలియదు.
పటేల్ ఈ విషయంలో నెహ్రూ గారికిచ్చిన హామీ ఏమిటంటే – “నేను విబేధించిన అంశాలను నాలుగు గోడల మధ్యే ఉంచుతాను తప్ప దేశ శ్రేయస్సు దృష్ట్యా రచ్చ చేయను” అని.
ఇది పటేల్ వ్యక్తిత్వం.
నిజానికి నెహ్రూ గారి హిందీ-చీనీ భాయి భాయి నినాదాన్ని చైనా కూడా తన దేశంలో వినిపిస్తోందా లేదో తెలుసుకొనే వ్యవస్థ లేదు. ఎందుకంటే శాంతి అనేది ఒక్కరు కోరుకుంటే చాలదు ఇద్దరూ గట్టిగా కోరుకోవాలి. యుద్ధం మాత్రం ఒక్కరు కోరుకుంటే రెండోవారు దిగక తప్పదు. అలా యుద్ధం కోరుకొనే దేశం తన ఏర్పాట్లు తాను చేసుకుంటూ, అవతలి దేశాన్ని ఒక పదేళ్ళపాటు “శాంతి మంత్ర జపంలో కళ్ళుమూసుకొనేళా” చేస్తే ఆ యుద్ధ ఫలితం ఎవరి పాపం.
అలాగే, కొత్త దేశంగా పుడుతూనే “భారత్ తో వెయ్యేళ్ళ యుద్ధం చేస్తాం” అని ప్రకటించిన పాకిస్తాన్ ను నమ్మటం అంటే పాముకి పాలు పోసినట్టే అని చిన్నపిల్లాడికీ తెలుస్తుంది.
ఆ రోజు కేబినెట్ లో శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ విషయంలో ఎన్ని హెచ్చరికలు చేసిన తేలికగా తీసుకున్న నెహ్రూగారి వైఖరి వలన దేశం ఎంత మూల్యం చెల్లించిందో జయశంకర్ రాయలేదు. కానీ ఈ పుస్తకం చదివాకా మన బుర్రకి తట్టేలా “కొన్ని విషయాలు రాయకుండా” వదిలేసాడు.
అలాగే అంబేడ్కర్ కూడా విదేశీ విధానంపై నెహ్రూగారితో విబేధించిన విషయం కూడా జయశంకర్ ప్రస్తావించాడు.
ఈ పుస్తకం పై ఇచ్చిన ఇంటర్యూలో ఏంకర్ ఇవి “మీ వృత్తిపరమైన జ్ఞాపకాలు” అనవచ్చా అని అడిగినప్పుడు, జయశంకర్ చాలా నిర్మొహమాటంగా “కాదు. నేనింకా ఈ రంగంలో చురుకుగా ఉన్నాను – అయాం హోల్డింగ్ ద గ్రౌండ్” అని అన్నాడు.
అంటే దాని అర్ధం ఈ పుస్తకం ద్వారా తెలియజేసిన విషయాలు ఒక “రాజకీయ ఉద్దేశ్యం” తో కూడినవి, ఈ అంశాలు వెల్లడించాక కూడా ఈ రంగంలో చురుకైన పాత్ర పోషించబోతున్నాను అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే.
ఐతే అనేకమంది విశ్రాంత నాయకులు రాసే పుస్తకాల్లో, తమ ప్రత్యర్ధులపట్ల అక్కసు, కడుపుమంట తీర్చుకొనేలా వెల్లడించే అంశాలతో పోలిస్తే, జయశంకర్ రాసిన పేరాలు చాలా హుందాగా ఉన్నాయి.
ఉదాహరణ కు చైనా విధానం పై రాసేటప్పుడు నేను ఎదురు చూసిన విషయం ఒకటి రాయలేదు. అదేమిటంటే, 2008 లో చైనా కమ్యూనిస్టు పార్టీతో మనదేశ కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం మీద అనేక టీవీ చర్చల్లో ఆరోపణలు వచ్చాయి. ఆ డిబేట్లలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రతినిధులు కూడా “అలాంటి ఒప్పందం ఏమీ లేదు” అని చెప్పలేదు. కానీ జైశంకర్ ఈ ఒప్పందం మీద తన పుస్తకంలో మౌనం పాటించాడు.
ఈ పుస్తకంలోని ఇంకొక్క విశేషం ఉంది.
మనం యుద్ధనీతి, దౌత్యనీతి, రాజకీయ వ్యూహాలు అనగానే ప్రాచీన భారత ఇతిహాసాల్లో ఠక్కున గుర్తు వచ్చేది మహాభారతం. ఇందులో రాజు యొక్క విధి విధానాలు, ధర్మరాజుకి వివిధ సందర్భాలలో భీష్ముడు, శ్రీకృష్ణుడు, నారదుడు చెప్తారు. అలాగే చాణక్య అర్థశాస్త్రం కూడా. అందుకని ఇలాంటి పుస్తకాల్లో ఈ రెండూ పుస్తకాల ప్రస్తావనే ఊహిస్తాం.
ఇందుకు భిన్నంగా, జయశంకర్ తాని విదేశాంగ అంశాలపై రాసిన విషయాలకు స్పూర్తినివ్వగల సంఘటనలను రామాయణం నుండి తీసుకున్నాడు. అందులో కొన్ని దృష్టాంతాలు్ నాకు అంతగా అతికినట్టు అనిపించలేదు. బహుశా నేను, దౌత్యనీతికి సంబంధించిన పోలికలను, రామాయణంలో చూడటానికి సిద్ధంగా సిద్ధంగా లేనేమో! కొన్ని సందర్భాలు సరిపోయినప్పుడు మాత్రం, “రామాయణంలో ఈ పాత్ర వ్యక్తిత్వంలో ఈ కోణం ఉంది ఇంతవరకూ స్ఫురించలేదే” అని అనిపించింది.
వెరసి, జయశంకర్ పుస్తకం, ఇంతవరకూ “వాట్సాప్ యూనివర్సిటీ” లో వచ్చే సమాచారంలో ఉన్న నిజాలశాతం నిర్ణయించటానికి ఉపయోగపడుతుంది.
*****