ఇదివరకు తాటక విషయంలోనూ ఇలాగే జరిగింది కదా!
స్త్రీ ఐన కారణంగా ముందు ఆమెను వధించాలన్న ఆలోచనే లేదు రామునికి. కానీ ఆమె దుష్ట చర్యలతో విసుగొందిన ముని బృందాలకు సాంత్వన కలిగించాలి. జ్ఞానేంద్రియాలలో చర్మం, కళ్ళూ, నాలుకా – ఆమె స్వాధీనంలో లేవని గ్రహించాడు శ్రీరాముడు.
ఇప్పుడు కేవలం ముక్కూ, చెవులతోనే ఆమె దానవ చర్యలకు పాల్పడుతోంది. వాటినీ ఛేదించి వేస్తే ఆమె ప్రవర్తన మారుతుందేమోనని ఆశించాడు. అందుకే లక్ష్మణున్ని ఆమె ముక్కూ, చెవులను కోసేయమన్నాడు.
కానీ ఆ తరువాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవటం వల్ల ఆమెను వధించవలసే వచ్చింది వారికి.
అందుకే రాముని ఆదేశం కోసమే చూస్తున్నట్టు చూపు మరల్చకుండా, అన్నయ్య వైపే చూస్తున్నాడు ఆ ఆజ్ఞానువర్తి తమ్ముడు.
ఆశ్చర్యం! మీనాక్షి కామరూపం మాయమై వాస్తవ రూపం వచ్చేసింది.
వికృతాకారంతో చేటల వంటి తన గోళ్ళను కత్తులవలె సంధిస్తూ, మరో రెండు అంగలలో రాముని ప్రక్కనే దాదాపు దాక్కుని ఉన్నట్టే ఉన్న సీత పైకి లంఘించేదే.
EXPLORE UNTOLD HISTORY
ఔను మరి! మీనాక్షిని మొట్టమొదట చూసినప్పుడే ఆమె నిజ స్వరూపాన్ని పసిగట్టిన శ్రీరాముడు, సామ దానం చ భేదశ్చ సండశ్చేతి చతుష్టయం అన్నట్టు ముందు సామ దానాది ఉపాయాలతో ఆమెకు సరైన మార్గంలోకి మళ్ళించాలని చూశాడు. ఆమెలో మార్పు రాలేదు కనుకే చివరి అస్త్రాన్ని ప్రయోగించక తప్పలేదు.
అన్నయ్య మాటలంత వేగంగా రాముని సమీపించిన లక్ష్మణుడు రాముని నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని ఛర్రున తీసి మీనాక్షిని అడ్డుకుని మెరుపు వేగంతో ఆమె ముక్కూ, చెవులూ ఛేదించివేశాడు.
ఊహించని యీ పరిణామానికి బిత్తర పోయింది మీనాక్షి. కుప్పకూలిపోయింది.
ముక్కూ చెవులూ కోసివేసిన బాధొకవైపూ, తన ప్రయత్నమంతా వ్యర్థమైపోయిందన్న రోషం మరో వైపూ ముప్పిరిగొనగా కర్ణకఠోరమైన కంఠస్వరం తో దిక్కులు ప్రతిధ్వనించేలా గుండెలు బాదుకుంటూ ఆకాశానికి చేతులెత్తి మొర పెట్టుకుంటున్నట్టు గట్టిగా ఏడ్చటం మొదలెట్టింది.
ఆమె ఏడుపులో ఎన్నెన్నో ప్రతిధ్వనులు!
తిరిగి నిజ రూపానికి వచ్చినప్పుడైనా “ఇదంతా రాముని లీలానాటక”మన్న అనుమానం కూడా తనకెందుకు కలుగ లేదో అర్థం కాలేదన్న బాధ ఒక వైపు. లీలా మనుష వేషధారి ఆ శ్రీమన్నారాయణుడే ఇలా శ్రీరాముడిగా వచ్చాడన్న సంతోషం మరోవైపు.
మనసులో ఏదో మూల, చిన్నప్పుడు తాను అమ్మమ్మ తాటక ద్వారా పూర్వ దానవ ప్రముఖులైన హిరణ్యాక్ష, హిరణ్య కశిపుల కథల ముగింపు కూడా గుర్తొచ్చి, ఓ వైపు ప్రాణం ఉసూరుమన్నా మరో వైపు అటువంటి ముగింపు కూడా పాలకడలి లో పరుండి వున్న ఫణిశయనుని పాచికల్లో భాగమే కావటం, అతడే తన మనసు దోచినవాడు కావటం వల్ల బాధంతా తుడిచి పెట్టుకుపోయేది కూడా అప్పుడే, ఆ వయసులోనే!
ఇదిగో, యీ రాముడు కూడా ఆ మాయావి అంశమేనని మనసు బల్ల గుద్ది చెబుతున్నది. అందుకే ఇతని పట్ల కోపం కలగటమే లేదు. కాకపోతే, అప్పుడూ, ఇప్పుడూ కూడా తనకీతడు దక్కకుండా చేస్తున్న అవనిజ వంటి వారి పట్లే తన కోపమంతా.
అంతలోనే మరో మాయ.
సిగ్గు విడచి, తనంత తానే వెంటపడటమే తనని తేలిక చేసిందేమోనన్న న్యూనతా భావం మరో వైపు. వీళ్ళను ఇంత కాలమూ అనుసరించి పెద్ద కలల సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నందుకు తనకు దక్కిన ఫలితమా యీ వికృత రూపం? అన్న కసి ఇంకొక వైపు.
ఇన్నిటి మధ్యా, చివరగా తాను తన భర్త గురించిన నిజం చెప్పలేదే అన్న అపరాధం గుర్తుకు రాలేదు కానీ తన ప్రస్తావన విఫలమైతే భర్త హత్యకు ప్రతీకారంగానైనా యీ ముగ్గురితో కూడిన ఉదంతాన్ని రావణుని వద్ద వాడుకొన వచ్చునని అంతరాంతరాలలో తాను కోరుకున్న సంగతి గుర్తుకొచ్చి, ఇప్పుడేమి చేయాలన్న శోధన తోడైంది.
ఇటువంటి భావాలన్నీ ముప్పిరిగొనగా మీనాక్షి తీవ్రమైన శారీరిక, మానసిక వేదనతో తనకక్కడ అండగా ఉన్న పినతల్లి కుమారుడు ఖరుని దగ్గరికి వెళ్ళిపోయింది – బొబ్బలు పెడుతూ. రాముని మాయ ప్రభావంలో పూర్తిగా కూరుకుపోయిన మీనాక్షి రక్తం కారుతున్న ముక్కూ, చెవులతో ఖరుని ముందు నిలిచింది.
ఖరుడికి చాలా కోపం వచ్చింది.
“అమిత బలశాలివైన నీకీ దుర్దశ కల్పించిందెవరు? నీ అవమానాన్ని నేను సహించను. నా పరాక్రమానికి అడ్డు నిలచే నాధుడే లేడు ఇలలో. నీకీ దురవస్థ కల్పించిన దుర్మార్గుణి గురించి చెప్పు!” అంటూ పలికాడు.
అంతటి దు:ఖం లోనూ మీనాక్షికి ఆ అన్నదమ్ముల సుందర మనోహర రూపాలే కనిపించాయి. పైగా వారి నారచీరెలూ, ఫల మూల భక్షణమే కాక, ధర్మాచరణ కోసమే జీవిస్తున్న వైనమూ గుర్తొచ్చాయి.
అద్భుతంగా వర్ణించింది వారిద్దరినీ.
కానీ, నాటి గంధర్వ కన్య లక్షణాలు మళ్ళీ ఆవేశించగా వారిరువురి మధ్యా, సర్వాభరణ భూషితురాలై, రూప లావణ్యంతో అలరారుతున్న ఒక యువతి వల్లే నాకీ దుస్థితి ఏర్పడిందనీ, రక్షకులెవరూ లేని నన్నిలా అవమానించారని కసిగా చెప్పింది ఏడుపును జోడించి. పైగా దానవ లక్షణాలు ప్రకోపించగా, ఆ ముగ్గురి రక్తమును తాను త్రాగి తీరాలని కూడా చెప్పింది.
శ్రీరామావతరణ కారణ సిద్ధికి బాటలు వేసే ప్రయత్నమే కదా ఇది!
క్షణాలలో ఖరుడు మహాబలవంతులూ, యమునితో సమానులైన పదు నాల్గుమంది రాక్షసులను మీనాక్షి వెంట పంపించాడు.
వారికి పర్ణశాల చూపించింది మీనాక్షి.
వాళ్ళందరినీ చూసిన శ్రీరాముడు సీతను రక్షించమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించి, తానొక్కడే ముహూర్త కాలంలో అలవోకగా మట్టుపెట్టేశాడు.
మీనాక్షికి మళ్ళీ ఏడుపే శరణ్యమైంది.
ఖరుని వద్దకు రోదిస్తూ, చేరుకుంది. ఖరుని ఆవేశానికి అడ్డుకట్టే లేదు – “మళ్ళీ వచ్చావెందుకు? ఇప్పుడే కదా పదునాల్గుమంది యమ సమానులైన రాక్షసులను నీవెంట పంపినది? మళ్ళీ నా దగ్గరికే వచ్చావు?” అని కాస్త చిరాకుగానే అన్నాడు.
మీనాక్షి అతన్ని అడ్డుకుంది – “నీవు పంపిన రక్కసులనందరినీ ఒంటి చేత్తో రాముడే సంహరించి వేశాడు. వారివెంట ఉన్న నన్నూ చూశాడు. నాకు ఏవైపు నుంచైనా ప్రమాదం వాటిల్లనున్నదని అనుమానంగా ఉంది. అందుకే మళ్ళీ నీవద్దకే వచ్చాను. నా శత్రువు ఆ రాముడు. అతన్ని నీవు చంపకపోయినట్టైతే నీ కళ్ళముందే ప్రాణ త్యాగం చేస్తాను.” అని తన పెద్ద పొట్టపై కొట్టుకుంటూ బెదిరించింది.
ఇంకేముంది! మరో పదునాల్గువేల రాక్షసులతో కలిసి ఖరుడూ, అతని సేనాని దూషణుడూ – ఇద్దరూ కలిసి రామ లక్ష్మణులను వధించేందుకు అట్టహాసంగా బయలుదేరి వెళ్ళారు.
కానీ, అదేమిటో అన్నీ దుశ్శాకునాలే!
అరణ్యంలోని జంతువులన్నీ భయంకరంగా అరుస్తున్నాయి. ఉన్నట్టుండి భయంకరమైన కారు చీకట్లు క్రమ్ముకున్నాయి. ఉల్కాపాతాలూ, భూకంపనములూ…ఒకటేమిటి! ఎన్నెన్నో!
ఐనా ఖరుని అహంకారం అతని కన్నులు కప్పివేసింది. కాలోహి దురతిక్రమ: అన్నారు పెద్దలు.
భీకరంగా బీరాలు పలుకుతూ, సైన్యంలో ధైర్యాన్ని నూరిపోస్తూ, ముందడుగే వేశాడు ఖరుడు – చావుకు మరింత దగ్గరౌతూ.
(ఇంకా ఉంది…)