చుప్పనాతి – భాగం 10

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.8]

“తాపస వేషం ధరించావు. కానీ దీనికి విరుద్ధంగా ధనుర్బాణాలెందుకు? పైగా వెంట ఒక బంటు , ఒక స్త్రీ కూడా! అబ్బో! నిజం చెప్పు.”

తానిప్పుడే వాళ్ళను చూసినట్టే మాటలలో ఎక్కడా బైట పడకుండా జాగ్రత్తగా నటించింది మీనాక్షి.

ఎగతాళిగా నవ్వుతూ ప్రశ్నించింది వాళ్ళను. ఆ నవ్వు కూడా కర్కశ స్వరాన్ని మించిన కరకుదనంతో వెలువడిందని కనిపెట్టలేకపోయింది కళ్ళు మూసుకుపోయిన మీనాక్షి.

తాను రాక్షసిననీ, కామరూపిననీ మీనాక్షి చెబుతుంటే సీత కాస్త భయపడ్డట్టుగా, రాముని వెనుకకు వెళ్ళి నిలబడింది.

అందమైన రూపం. కఠోరమైన స్వరం. రెండింటికీ పోలికే లేదు. రామ లక్ష్మణులిద్దరికీ సందేహం వచ్చింది. ఈ కీకారణ్యం దానవ క్రీడలకు పేరుగాంచినదని అనుభవ పూర్వకంగా తెలిసిన ఇద్దరూ యే మాత్రమూ బయట పడలేదు. ఏమీ తెలియనట్టే ఉన్నారు.

అపరిచితులనైనా తానే ముందుగా మందస్మితంతో ఆత్మీయతతో పలుకరించే గుణం శ్రీరాముడిది. పైగా, అడిగింది తనను కాబట్టి అనృతం మాట్లాడని వాడిగా ‘ద్విర్నాభిభాషతే’ అన్న పేరుగలిగిన వాడిగా సమాధానమిచ్చాడు శ్రీరాముడు  – “దేవతల వంటి పరాక్రమవంతుడు దశరధుడనే రాజు ఉండేవాడు. నేను ఆతని పెద్ద కుమారుడను. ఇదిగో ఇతడు నన్ను అనుసరించే నా తమ్ముడు లక్ష్మణుడు. విదేహ రాజ పుత్రి సీత నా యీ భార్య. నేను నా తండ్రి, నా తల్లి ఇచ్చిన ఆజ్ఞను అనుసరిస్తూ ధర్మము కోసమే ఇక్కడికి వచ్చాను. ఇది నా పరిచయం. నీవెంతో అందమైన అవయవాలు కలిగినదానివి. నీవు రాక్షసివై ఉండవనే నా భావన. నేను నిజం చెప్పినట్టు నీవు కూడ నిజమే చెప్పాలి. మరి నీవెవ్వతెవు? ఎవరి భార్యవు?”

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

రాముని మాటల్లో ఎటువంటి శక్తి ఉందో కానీ మీనాక్షి కామరూపైనా అప్పటికి రాముని ముందు నిజాలను దాచలేకపోయింది. ఒక మంత్ర ముగ్ధ వలె, తన గురించిన విషయాలన్నీ చెప్పటం మొదలెట్టింది.

“నేను మీనాక్షి అనే రాక్షసిని. కానీ నా చేటల వంటి గోళ్ళవల్ల అందరూ ‘శూర్పణఖ’ అనే పిలుస్తుంటారు. కోరిన రూపం ధరించగలను. విశ్రవసుని కుమారుడు, అధికాధిక బలశాలి, వీరుడు ఐన రావణుడు నా అన్న. మహాబలవంతుడైనా ఎప్పుడూ నిద్రనే ఇష్టపడే కుంభకర్ణుడు మరో అన్న. రాక్షస ప్రవృత్తి లేని ధర్మాత్ముడు విభీషణుడు మూడో అన్న. వారి తరువాత నేను. యుద్ధంలో అతి పరాక్రమవంతులు ఖరదూషణులు కూడా నా సోదరులే” అంటున్నప్పుడు సరిగ్గా సీత ఓ అడుగు ముందుకు వేసి, రాముని వద్దకొచ్చి నిలబడింది.

ఆమెను చూడగానే తాను వచ్చిన పని గుర్తుకు వచ్చింది మీనాక్షికి. విద్యుజ్జిహ్వుడి గురించి చెప్పబోతున్నదల్లా ఆగిపోయింది.

మాటలకోసం తడుముకున్నట్టుగా ఆగి – “నేను తొలిసారిగా నిన్నే ఇష్టపడ్డాను. మానసికంగా నీకు నేను భార్యనైపోయాను కూడా! నా సోదరుల గురించి చెప్పాను. నేనూ అంతటి బలవంతురాలనే సుమా! ఈవిడేనా నీవన్న సీత? నాకన్నా అందంగా ఉందా యీవిడ? నా అతిలోక సౌందర్యం ముందు యీవిడ సౌందర్యం వెలవెలబోవటం లేదూ! నా చూపుల్లోని ఆకర్షణ చూడు. నిస్తేజంగా ఉన్న యీవిడ చూపులు చూడు! కొండంత భేదం లేదూ? నా శరీరమంతా మన్మధ సామ్రాజ్యమే! ఇక యీవిడ..హు..నా నోటితో చెప్పలేను. నన్ను పెళ్ళాడితే మనమిరువురమూ స్వేచ్ఛగా యీ అందమైన ప్రదేశంలో ఎన్ని సంవత్సరాలైనా విహరించవచ్చు. మా సోదరులూ, వాళ్ళ అనుయాయులెవరూ మన ఛాయలకు రారుగాక రారు. వీళ్ళిద్దరూ మనకు అడ్డమనుకుంటే వీళ్ళిద్దరినీ నేనే తినివేయగలను. ఇప్పుడే చెప్పు మరి!” కర్కశంగా ఉన్న మీనాక్షి కంఠస్వరం మరింత కర్కశంగా మారిపోయింది.

ఈ మాటలను వింటున్న లక్ష్మణునికి సహజంగానే చాలా కోపం వచ్చింది. దవడ కండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంగా మీనాక్షివైపు చూస్తూ నోరు విప్పబోయాడు. కానీ తమ్ముని ఆవేశాన్ని గమనించిన శ్రీరాముడు, కళ్ళతోనే వారించి, దూరంగా వెళ్ళమన్నట్టు సైగ చేశాడు.

నిప్పులు కురిపించే చూపులతో లక్ష్మణుడు, కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు.

అప్పుడు వాక్య విశారదుడైన శ్రీరాముడు మందస్మితంతో శూర్పణఖతో సుతిమెత్తని గొంతుతో ఇలా అన్నాడు –

“ఓ మనోజ్ఞాంగీ, ఇంతటి అందగత్తెవైన నీకు ఇంతవరకూ తగిన వరుడు దొరకక పోవటం ఆశ్చర్యకరం. విచారకరం కూడా! కానీ మరో విచారకరమైన విషయమేమిటంటే, నీవు కోరుకుంటున్న నాకు పెళ్ళైంది. పైగా వీర్యశుల్క ఐన యీమెను శివధనువు విరచి, నా పరాక్రమాన్ని ఋజువు చేసుకుని మరీ పెండ్లాడాను. అంటే, ఆవిడ చూడటానికలా సుకుమారిగా ఉంది కానీ రాజోచితమైన సకల కళల్లోనూ విశారద అని నీకిప్పటికే అర్థమై ఉండాలి. నా అర్ధాంగి సీత పట్ల నాకు అంతులేని అనురాగమున్నది. అర్ధాంగి అందం భర్త కంటికింపుగా ఉండాలే కానీ చూచేవారికందరకూ నచ్చాలని లేదు. అలా నచ్చితే ప్రమాదకరం కూడా! సాత్విక సౌందర్యం ముందు పై పై అందాలతో ఆకర్షించే అందం వెలవెలబోతుంది. ఆ సంగతటుంచి, మా తల్లిదండ్రుల అనుమతితో, వారి సమక్షంలో వైభవోపేతంగా మా వివాహోత్సవం జరిగింది. ఈమె తండ్రి జనక మహారాజు అటు దేవలోకమూ, ఇటు మానవ లోకమే కాదు, సకల ఋషి సమూహమూ అమితంగా గౌరవించే రాజర్షి. మా తండ్రిగారి గురించి ఇంతకు ముందే చెప్పాను కదా! పైగా మేము మానవులం. నీవైపు వారందరూ దానవ ప్రముఖులు. మానుష-దానవ జాతుల మధ్య వివాహ సంబంధాలు అనుచితమని నీకూ తెలుసుననుకుంటున్నాను. కాబట్టి, ఇంత కాలం ఎటూ ఆగావు కదా!నీవు నీకు సరైన వారి కోసం కాస్త ఓపికతో అన్వేషిస్తే తప్పక దొరకగలరు. నీకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తున్నది నాకు! వెళ్ళిరా పూజ్యురాలా !”

శ్రీరాముని గొంతులో శాంత రసం తొణికిసలాడింది.

మందస్మితంతో రాముడన్న యీ మాటలతో మీనాక్షిలో కోపం కట్టలు తెంచుకుంది. తన మాటలను పూచిక పుల్లలా తీసిపారవేసినట్టు మాట్లాడిన తీరు పుండుమీర కారం చల్లినట్టుంది.

ఓరకంగా సీత సౌందర్యం గురించి అతడన్న మాటల్లో నిజం లేకపోలేదేమో! కానీ, కోరి వరించి వచ్చిన తనని, పైగా అపురూప లావణ్యవతిగా ఎంతో శ్రద్ధగా సిద్ధపడి వచ్చిన తనని ఇంతగా అవమానపరచటమేమిటి?

తానొక్కసారి తన అన్న రావణుని గుర్తు చేసుకుంటే చాలు, వీళ్ళిక్కడిలా మనగల్గటం సాధ్యమా? ఇవన్నీ ఆలోచించకుండా, తనను ఇంతగా తృణీకరించటమా?

ఆమె చూపులలో తీవ్రతను గమనించాడు శ్రీరాముడు. సీతవైపు కొరకొరా చూస్తున్న తీరునూ గమనించాడా ఏకపత్నీవ్రతుడు.

మళ్ళీ తనవైపు తిరిగిందామె.

రూపం అతిలోకమే కానీ యీ సుందరి చేతి గోళ్ళే చాలా అసహజం. చేటలవంటి గోళ్ళను పెదవుల మధ్య బిగించి కొరికేస్తున్నది. గోళ్ళనే కాదు పెదవులనూ, రక్తధారలు చిమ్ముతాయేమోనన్నట్టు కొరుకుతున్నది. ఆమె ఆవేశం చూస్తే, యీ నిముషాన్నే సీతపైకి లంఘించి తినేసేలా ఉంది.

ఇదంతా గమనిస్తున్నది సీత. కానీ తనవైపు యీవిడ కోప దృక్కులకు కారణమేమిటో తెలియక భీతిల్లినట్టే తోస్తున్నది సీత పాపం.

కిం కర్తవ్యం?

“కానీ ఒక మాట!” మంత్రం వేసినట్టు ఆగిపోయింది మీనాక్షి. రాముని మాటల్లోని మాయ అదే కదా!

“అదిగో…అక్కడున్నవాడు నా తమ్ముడు లక్ష్మణుడు. ఇందాకే చూశావు కదా! అతని భార్య లేదు. ఒంటరి. నీకు అన్నివిధాలా తగిన వాడు. సవతి బాధా ఉండదు. ఏమంటావు?”

రాముని మాయాజాలం మీనాక్షిపై బాగా పని చేసింది.

అదేమి చిత్రమో కానీ, కాస్త దూరంగా నిలుచుని, తమవంకే చూస్తున్న లక్ష్మణుని కేసి చూసింది. రూపంలో ఒక్కటిగానే ఉన్నారిద్దరూ. పైగా, సవతి పోరూ ఉండదనికదా చెప్పటం! మరోమాట ఆలోచనలోకే రాలేదు.

అంతా విష్ణుమాయ.

పరుగున ఒక్క అడుగులో లక్ష్మణుని దగ్గరకు చేరేందుకై వెనుదిరిగింది మీనాక్షి. తనవైపు దూసుకు వస్తున్న మీనాక్షిని చూసి అయోమయంగా అన్న వైపు చూశాడు లక్ష్మణుడు.

శ్రీరాముడు తీయగా నవ్వాడు. ఆ నవ్వులోనే రామ లీలా నాటక పథకం అర్థమైపోయింది తమ్ముడికి.

అదే కదా మరి అన్నదమ్ముల అనుబంధానికి అర్థం.

అన్న రాముని ఆదేశమైంది కాబట్టి లక్ష్మణుడు తప్పక తనను అంగీకరిస్తాడనే ఆనందంతో రివ్వున తమ్ముని చెంతకు చేరింది మీనాక్షి.

“రావేలా ప్రియా! నీకూ నాకూ కుదిరెను జంట యీ వేళా! నీ శరీర ఛాయా…నా వయ్యారాల హేలా…కలిస్తే సరాగాల లీలా! యీ మన వన విహారాల వెలసేనుగా స్వర్గమే ఇల!” అంటూ కవితా రూపంలో తన కామావేశాన్ని ప్రకటించింది, కన్ను గీటుతూ.

ఆమె మనసులో ఇంతటి ఆనందానికి కారణం – యీ తమ్ముడు, అన్న ఆజ్ఞను జవదాటడు. పైగా భార్య లేనివాడు. తనవంటి సుందరాంగి యీ అరణ్యంలో తనంతకు తాను వలచి వొళ్ళో వాలటమంటే ఇతని పంట పండినట్టే కదా!

ఇటు తన అందాలకూ పురుష స్పర్శ సోకి ఎన్నో సంవత్సరాలైంది. వెంటనే యీ రూపసి, అంగీకరిస్తే, ఇక శృంగార పాఠాల వల్లెవేత ప్రతి నిముషమూ!

వాక్య కోవిదుడైన లక్ష్మణునికి మీనాక్షి మాటలు విని నవ్వు వచ్చింది.

“ఆహా! కమలవర్ణా! చూస్తున్నావు కదా! నేనిక్కడ నా అన్నగారికి దాసుడను. అధీనుడను.మరి నన్ను కోరుకుంటే నీవూ నా అన్నకూ, వదిన సీతమ్మకూ దాసిగానే ఉండవలసి వస్తుంది. నీవు విశాలాక్షివి. నిర్మలమైన శరీర ఛాయతో గంధర్వ కాంతలా మెరిసిపోతున్నావు. అన్ని రీతులా నీవు మా అన్నగారికే తగిన భార్యవు. రెండవ భార్యగానైనా స్వీకరించమను. ఎటువంటి సందేహమూ వద్దు. నీ కోరికను మనసుదీరా అనుభవించు. నీ శరీర కాంతి, నీ కటి ప్రదేశ సౌందర్యం అతిలోకమైనవి. నీ అందం ముందు మా అన్న మొదటి భార్య అందం దిగదుడుపే! మనుష్య స్త్రీలలో నీవంటి అందముంటుందా? మా అన్న తప్పక నిన్ను చేపడతాడు. వెళ్ళు.” అనేశాడు.

రామ గారడిలో నిండా కూరుకుపోయిన మీనాక్షి ఇదంతా నిజమేనని పూర్తిగా నమ్మేసింది. అటు రాముడూ, ఇటు లక్ష్మణుడూ కూడా తనతో పరియాచకాలాడుతున్నారన్న అనుమానమైనా కలుగలేదు. 

మళ్ళీ రామునికేసి నడిచింది.

అప్పటికి, సీత, శ్రీరాముని చెంతకు చేరుకుని ఉంది.

మీనాక్షికి ఇది అస్సలు నచ్చలేదు.

“రామా! నీవు యీ భార్యను చూసే కదా నన్ను తృణీకరిస్తున్నావు? వికృత రూప యీమె. అణగిపోయిన పొట్టా, అణగారిన బుగ్గలతో భయంకరంగా ఉంది సుమా! వీర్యశుల్కగా గెలిచి పెళ్ళాడానని కదా నీ అనుమానం? ఈమె తండ్రికి సమాధానం చెప్పవలసి వస్తుందని కదా నీ భయం? ఇప్పుడే యీమెను నేను తినేస్తాను. నీవెవరికీ సమాధానం ఇచ్చుకోవలసిన పనేలేదు.” అని మితిమీరిన కోపంతో సీత మీదికి లంఘించబోయింది.

తన మీదికి దూసుకు వస్తున్న మీనాక్షిని చూస్తూ బేలగా శ్రీరాముని వైపు చూసింది జానకి.

ఆమెను దగ్గరికి తీసుకుంటూ శ్రీరాముడన్నాడు – “యీమె ప్రవర్తనంతా పూర్వ కర్మానురూపమే. భయపడకు.”

అటు లక్ష్మణుడు మీనాక్షి ఆవేశం చూస్తూ ఆగ్రహం పట్టలేకున్నాడు. అన్నయ్య ఆజ్ఞకోసం ఎదురు చూస్తున్నాడు.

(ఇంకా ఉంది…)

Your views are valuable to us!