చుప్పనాతి – భాగం 12

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

 

అటు రామునికి అపాయము దగ్గరలో ఉన్నట్టే అనిపించినా మంచి శకునములవల్ల విజయము తమదేనని దృఢంగా అనిపించింది.

కానీ, రాబోయే ఆపదను ఎదుర్కొనేందుకు శుభాన్ని కోరే బుద్ధిమంతుడైన పురుషుడు కొన్ని ప్రతిక్రియలు చేసుకోవాలని లక్ష్మణునికి సూచిస్తూ, తన పాదాలపై ఒట్టు పెడుతూ ఆజ్ఞాపించాడు – “నీవు సీతతో ఎవరూ ప్రవేశించటానికి అశక్యమైన గుహలో ఉండు. నేనొక్కడినే యీ రాక్షసులనందరినీ మట్టుపెడతాను.”

ఇంకేముంది…

ఆకాశంలో రాజర్షులు, సిద్ధులూ, ద్విజ శ్రేష్టులూ, విమానాలలో దేవతలూ, అందరూ సాక్షీభూతులై చూస్తుండగా వందల కొద్దీ వేల కొద్దీ బాణాలను విశ్రాంతన్నదే లేక ఆ రాక్షసులపై సంధించి, అనాయాసంగా వారందరినీ ఎదుర్కొని, గాంధర్వాస్త్రం వంటి అస్త్రములతోనూ, నారాచ బాణముల వంటి తీక్ష్ణ బాణములతోనూ వారందరినీ తానొక్కడే ఒకటిన్నర ముహూర్త కాలము అంటే ఒక గంట పన్నెండు నిముషాల కాలంలోనే మట్టికరిపించాడు రాముడు.

దేవతాదులు పుష్ప వృష్టి కురిపించారు.

సీతాతో గుహ నుండీ బైటికి వచ్చిన లక్ష్మణుడు అన్నయ్యను అభినందించటం, సీత దేవతాదులతో గౌరవింపబడుతున్న తన భర్త శ్రీరాముని ఆర్తిగా కౌగిలించుకోవటం కళ్ళారా చూసిన మీనాక్షికి గుండెలో గునపాలు దించినట్టయింది.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

అసలే అవమాన భారం. ఇప్పుడు అపజయ ఖేదం కూడా తోడై ఇక తనకు దిక్కేది అనుకుంటూ కుప్ప కూలిపోయింది.

యుద్ధ భూమిలోని దృశ్యాలు ఒక్కొక్కటీ మీనాక్షి కళ్ళముందు ఇప్పుడే యుద్ధం జరుగుతున్నదా అన్న రీతిలో ఒక్కొక్కటిగా మళ్ళీ ప్రత్యక్షమౌతున్నాయి.

ఖర దూషణులతో పాటూ పదునాల్గువేలమందితో కూడిన అరిభయంకరమైన సైన్యాన్ని ఒంటిచేత్తో మట్టుపెట్టిన శ్రీరాముని ఆకారం గుర్తుకు వచ్చి, ఒళ్ళంతా చచ్చు పడిపోయింది మీనాక్షికి.

అసలు ఆయుధాలను కురిపించేటప్పుడు వాటినెంతో శాంతంగా స్వీకరించటమేమిటి? మళ్ళీ అదేదో కోపాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే అంతలోనే వారిపై బాణాల వర్షం కురిపించి, నేలకరిపించటమేమిటి?

మహా కపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాథి, శ్యేనగామి, ప్రుథుగ్రీవుడు, యజ్ఞ శత్రువు, కాలకార్ముకుడు, మేఘమాలి, త్రిశిరస్సు – ఇలా ఎంతమంది వీరాధివీరులను క్షణాల్లో కడతేర్చిన రాముని బలానికి సాటి ఎవరున్నారు?

వాహనమూ లేదు. అనుచరులూ లేరు. ఆశ్చర్యం కదా!

యుద్ధ విద్యలో చాలా నేర్పరి ఖరుడు.

నాళీక వికర్ణి బాణములు, అంకుశములతో రాముణ్ణి చాలా గాయపరచాడు. అన్ని అవయవాల్లోనూ బాణాలచేత కొట్టబడిన రాముడు పొగలేకుండా ప్రజ్వరిల్లుతున్న అగ్నివలెనే ప్రకాశించాడు ఆ నిముషంలో.

ఐనా అంతలోనే తేరుకుని వైష్ణవ ధనుస్సుతో ఖరుని ఎదుర్కున్నాడు. అతని ధ్వజాన్ని ఛేదించాడు. ఖరునికి విపరీతమైన కోపమే వచ్చింది. మరుక్షణం రాముని శరీరమంతా బాణాల మయం. రామునికీ కోపం మిన్నంటినట్టే ఉంది.

సూర్యుని వలెనే కాంతి గోళాల వంటి పదమూడు నారాచ బాణాలతో ఖరుణ్ణి పడగొట్టాడు. పైగా, మృదువుగా అన్నాడు – “నీవిన్ని రోజులూ పాపకర్మలనే ఆచరించావు. తమ దారిన తాము ధర్మాన్ని ఆచరిస్తున్న మునులనందరినీ పొట్టన పెట్టుకున్నావు. అందుకే నేను నిన్ను చంపుతున్నాను.”

ఈ మాటలతో ఖరునికీ కోపం వచ్చింది – “ఓ రామా! నీ గొప్పలు చాలించు. నా పదునాల్గువేల సైన్యాన్ని చంపిన నిన్నిప్పుడు చంపి, వాళ్ళ బంధువుల కన్నీళ్ళు తుడుస్తాను నేనిప్పుడు…” అంటూ గొప్ప గదనూ, బ్రహ్మాండమైన మద్ది చెట్టునూ రామునిపైకి విసిరి వికటాట్ట హాసం చేశాడు.

క్షణాల్లో రాముడు దాన్ని ఛేదించి వేశాడు. పైగా, ఖరుని దుశ్చర్యలను తూలనాడుతూ, నిప్పులు కురిపిస్తూ, బ్రహ్మదండం తో సమానమైన బాణాన్ని ఖరునిపై సంధించగనే, ఖరుని ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిపిపోయాయి.

రాజర్షులు, మహర్షులు అందరూ రాముని కీర్తించేవారే.

దేవతలూ, చారణుల దుందుభులొక వైపు.

పైనుండీ కురుస్తున్న పుష్ప వర్షమోవైపు.

ఇంత కోలాహలాన్ని గమనించిన లక్ష్మణుడు, తన వదినతో పరుగున అక్కడికి చేరుకుని, ఆనంద బాష్పాలతో సోదరుని అభినందిస్తున్నాడు.

సీత కూడా వచ్చి, ఆనందోత్సాహాలతో భర్తను కౌగిలించుకున్న ఆ దృశ్యం మీనాక్షి గుండెల్లో మళ్ళీ గునపాలు దించింది.

ఇప్పుడేమిటి చేయటం?

ఇంతటి భీకరాకారులైన రాక్షసులను తనవారిని సునాయాసంగా ఒక్కడే మట్టుపెట్టగలిగిన రామునికి, రావణుని సైన్యమూ, ఆతని ప్రతాపం ఒక లెఖ్ఖా? ఇంతమంది మృతికి తానే కారణమయింది. ఇంకా సోదరుడు రావణుని వినాశనానికీ తానే కారణం కానుందా? అది అవసరమా?

ఇన్ని సంకల్ప వికల్పాలతో కొట్టుమిట్టాడిన మీనాక్షికి ఎప్పుడు రాత్రయిందో తెలియలేదు.

ఆ మగతలో ఏదో కళ్ళముందో కాంతి నిలిచి, దిశా నిర్దేశం చేసినట్టే తోచి, అప్పటికప్పుడే లేచి – “అంతేనా…అంతేనా….ఐతే..ఇప్పుడే బయలుదేరుతాను…’ అంటూ ముక్కూ, చెవులూ తడుముకుంటూ పెద్దపెట్టున రాగమందుకుంది మీనాక్షి.

“ఐతే నేనిప్పుడే వెళ్ళాలి…మా అన్న రావణున్ని ఆ సీతను చెర పట్టమని చెబుతాను…అన్నదమ్ములిద్దరినీ వధించమని చెబుతాను…’అంటూ ఉన్నఫళాన లేచి పయనమవబోతూంది.

ఆమెకు అటూ ఇటూ పడుకుని, తమ బంధువుల మరణానికి వెక్కిళ్ళు పెడుతూ ఉన్న ఒకరిద్దరు స్త్రీల కు అప్పుడే మాగన్నుగా నిద్ర పడుతున్నట్టుంది. మీనాక్షి మాటలతో వాళ్ళకు ఛర్రున కోపమొచ్చింది.

“అర్ధరాత్రి మద్దెలదరువని ఇదేమిటీ హడావిడి? యుద్ధ రంగం నుంచీ వచ్చి, నిస్సత్తువగా పరుండిపోయావ్. అప్పుడేమో ఖరుణ్ణి నిముషం నిలబడనీయలేదు. ఇక ఇప్పుడు రాముడి చేతిలో వాళ్ళంతా నుగ్గు నుగ్గైపోగానే ఎక్కడలేని నీరసమూ వచ్చేసింది పాపం నీకు? మళ్ళీ ఇదిగో ఇప్పుడీ నాటకాలు, బుడి బుడి ఏడుపులూ! ఐనా అర్ధ రాత్రి లేచి ఎక్కడికీ పయనం? చాల్చాల్లే పడుకో!” అని కసురుకున్నారు.

ఆశ్చర్యపోయింది మీనాక్షి.

“ఔనా! చాలాసేపే పడుకున్నానా? క్షమించండి…నేనిప్పుడే మా అన్న రావణుని దగ్గరికి వెళ్ళి, రాముడికి తగిన శిక్ష వేయించాలి. లంకకు వెళ్తున్నా!” అంటున్నంతలో అక్కడున్న మరొకావిడ అంత అర్ధరాత్రి పెద్ద పెట్టున భయంకరంగా నవ్వింది.

అంత నిశ్శబ్ద వాతావరణంలో ఆమె నవ్వుకు జడుసుకున్నాయేమో అక్కడున్న చెట్లమీద కునుకు తీస్తున్న పక్షులు భయపడి, ఒక్కసారి గందరగోళంగా అరవటం మొదలెట్టాయి.

మీనాక్షికి ఆమె వెటకారం చూసి, పుండుమీద కారం చల్లినట్టైంది.

“హుష్…” అంది ఆమెను హెచ్చరిస్తున్నట్టు. ఆ దెబ్బ్బకు పిట్టలన్నీ కూడా సద్దుమణిగాయి.

“ఇప్పుడేమైందని ఇంత వెటకారం నా మీద?” గద్దించిందామెను.

“ఏమైందా? అకంపనుడనే రాక్షసుడొకడికి మరీ తొందరైందేమో యుద్ధభూమి నుంచే నేరుగా లంకకెళ్ళి, మీ అన్న రావణునికి ఇక్కడ జరిగినదంతా కళ్ళకు కట్టినట్టు చెప్పి, రాముని ప్రతాపమంతా కూడా వివరించి చెప్పేశాడట! మీ అన్న తొందరపడ్డాడట రాముణ్ణి చంపేందుకు! అప్పుడిక, ఆ అకంపనుడు – నీవు గానీ, రాక్షసులందరుగానీ కలిసి కూడా ఆ రాముణ్ణి చంపలేరు. కానీ…కానీ, లోకోత్తమురాలైన రాముని భార్య సీతను నీవు అపహరిస్తే, రాముడు ఆమె విరహం భరించలేక ప్రాణ త్యాగం చేస్తాడు అని ఉపాయం చెప్పాడట! కానీ, మీ అన్న రావణుడు మేనమామ మారీచుని సహాయమూ, సలహా కోసం ఆతని ఆశ్రమానికి వెళ్ళాడట! మారీచుడు – రావణా! నిన్నీ విధంగా పురికొల్పినవాడు నిశ్చయంగా నీకు శత్రువే! రాముడు నిద్రిస్తున్న సింహం లాంటి వాడు. అతన్ని లేపితే, ఇక ప్రళయమే! చావును కొనితెచ్చుకోవటమే! నీ భార్యలతో క్రీడిస్తూ సంతోషంగా ఉండు. అతన్నీ వనాలలో భార్యతో సుఖంగా ఉండనివ్వు. ఎందుకొచ్చిన గొడవ? అనగానే నీ పది తలల అన్న ఆ పదితలలతోనూ ఆలోచించి, తన ప్రస్తావన మానుకొని, మళ్ళీ తన భవనానికి వెళ్ళిపోయాడట! ఇంక నువ్వేమి చేయగలవు? నా తలకాయ!” అని మళ్ళీ వికృతంగా నవ్వింది.

ఇక మీనాక్షికి అగ్ని మీద ఆజ్యం పోసినట్టే ఐంది.

“ఆరు నూరైనా ఇక ఆగే ప్రసక్తే లేదు. చూస్తూ ఉండండి. నా మాటంటే మాటే. ఆ సీతను మా అన్న చెర పట్టాలి. ఆ రాముడి బాధను, నన్ను అవమాన పరచిన ఆ లక్ష్మణుని పొగరు రావణుని ప్రచండ శక్తి ధాటికి శలభంలా మాడి మసైపోవడం నేను నా చేపల్లాంటి కళ్ళతో మనసారా చూసి తీరాలి! అలా చూసే రోజు ఎంతో దూరం లేదు. చనిపోయిన మనవాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేలా నేనే కాదు మీరూ కళ్ళారా చూస్తారు. ఆడదాన్ని అవమానపరిస్తే అది ప్రళయానికి కారణమౌతుందని తరతరాలకూ చాటే గాధగా నిలిచిపోతుందీ కథ!” అంటూ బుస కొడుతున్న నాగినిలా లంకకు పయనమైంది…సీతాహరణానికి బాటలు వేస్తూ!!

(ఇంకా ఉంది…)

Your views are valuable to us!