చుప్పనాతి – భాగం 16

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4]

 

శార్వరి అందించిన ‘చుప్పనాతి ‘ నవలనంతా చదివిన కనకమ్మ గారు కళ్ళు మూసుకుని, కొంత సేపు మౌనంగా ఉండి పోయారు.

“శిరీషా! నాకు వాల్మీకి తప్ప మరో ప్రపంచం లేదు. కానీ మావారికిటువంటి అడ్డంకులు లేవు. వారు బహుభాషా పండితులు, బహు గ్రంధ రచయిత కూడా. నీ నవలను వారూ చదివారు. వారే చెబుతారు ఎలా ఉందో!”అన్నారు.

 శార్వరిలో గొప్ప సంభ్రమం.

నారాయణాచార్యులవారు అందుకున్నారు.

అర్ధ నిమీలిత నేత్రాలతో ఇలా అన్నారు – “తల్లీ, వాల్మీకి అచ్చమైన ఋషి! ఆయన వాడిన ప్రతి పదమూ, ప్రతి వాక్యమూ, ఆచి తూచి ప్రయోగించినవే. ‘సుముఖం దుర్ముఖీం’ అన్న పదాలతో శూర్పణఖను పరిచయం చేసే చోట వాడారు. శ్రీరాముడు, శూర్పణఖ – ఇరువురి మధ్య వైవిధ్యాన్ని ఇక్కడే చెప్పేశారు వారు. అలాగే సీతనూ, శూర్పణఖనూ కూడా ప్రతీకాత్మకంగానే చూపిస్తూ వెళ్ళారు ఆ మహానుభావుడు. భౌతికమైన విలువలకూ, ఆధ్యాత్మిక విలువలకూ ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. మొదటివి అశాశ్వతాలు. రెండవ విలువలు సార్వకాలికమైనవి. శూర్పణఖను భౌతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే పాత్రగానూ, సీతను ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత నిచ్చే పాత్రగానూ వాల్మీకి చూపించారు. రాక్షసరాజ్యంలో భయంకర రాక్షస స్త్రీల మధ్య కూడా సీత తాను నమ్మిన విలువలనే నమ్ముతూ, ధైర్యంగా ఉందంటే దానికి కారణం ఆమెలో ఉన్న తొణకని విశ్వాసమే.

ఇక శూర్పణఖ. రాముని వద్ద కూడా అసత్యమే పలకటం గమనిస్తే ఆమె పునాదులెంత బలహీనమో తెలియటం లేదూ! వాల్మీకి తాను సృష్టించిన పాత్రలనన్నింటినీ ఎంతో సంయమనంతో చిత్రీకరించారమ్మా. అందుకే రామాయణం ఇన్ని వేల సంవత్సరాలైనా ప్రతి గుండెలోనూ కొలువై ఉంది. కానీ వాల్మీకి అనంతర రచనల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులన్నీ, మూల రచనకు మెరుగులు దిద్దేలా ఉన్నాయే కానీ అసలు రచనను విమర్శించేలా లేవు. అదే మార్గంలో, రావణుడు అసలు సీతమ్మను స్పృశించనేలేదనీ, ఆమె నిలుచున్న భూమిని అలాగే పెకలించుకుని తీసుకుని వెళ్ళాడన్నది – ఎంత హృద్యంగా ఉంది!

కొన్ని ఆధునిక రచనల్లో కైకేయే శ్రీరామునికి కౌసల్యకంటే ప్రీతిపాత్రమైనదంటూ వ్రాశారు. సీతమ్మ అరణ్య భూముల్లో అక్కడున్న వారికి నేత వాడుక ప్రాశస్త్యం గురించి చెప్పిందంటూ ఆమెను గాంధేయ వాదిగా చూపారు. ఇలా, మనం చూపించే కొత్తదనాలు, మూలానికి మరింత అందాన్ని చేకూర్చేలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా! ఇక , నీవనుకున్న పద్ధతి బాగుంది. ఆ రీతిలో శూర్పణఖను చిత్రీకరించావనే తృప్తి నీకళ్ళలో కనిపిస్తున్నదమ్మా. అది చాలు. విజయోస్తు!”

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

*****

శార్వరిని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తూ “హార్టీ కంగ్రాట్స్ హనీ!” అంటూ ప్రేమగా హత్తుకున్నాడు వంశీ.

“నవల ఐపోయినట్టే కదా?” అని హఠాత్తుగా అడిగాడు.

“అంటే…ఏంటి నీ ఉద్దేశం? రాత్రీ పగలూ ఆలోచించి, ఆలోచించి నవల పూర్తిచేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయంలో అడగవలసిన మాటేనా ఇది?” చిరుకోపం శార్వరి మాటల్లో.

“అదే…అదే…నీవు నవలా లోకంలో సతమతమౌతుంటే ఇన్ని రోజులూ నేనే కదా చేయి కాల్చుకున్నది? మరి నాకా కిచెన్ బంధం నుంచీ విముక్తి ఇక ఇప్పటినుంచేనా లేక శూర్పణఖలా మరో పదివేల…ఛ..ఛ..సారీ…” నాలుక కరచుకుంటూ కన్ను గీటాడు వంశీ

అసలు సంగతి అర్థమై శార్వరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

తాను నవలా రచనలో తలమునకలై వంట సంగతి ఏమాత్రం పట్టించుకోనేలేదసలు. వంశీ ఎలా మానేజ్ చేశాడో మాట వరసకు అడిగిన లేక సహకరించిన జ్ఞాపకమే లేదు. చటుక్కున శార్వరి వంశీ కాళ్ళమీద పడబోతుంటే ఆపేశాడు వంశీ.

“ఇదేంటి? మరీ చిన్న పిల్లలా? నవలా రచన చేయలేదు కానీ అదెంత కష్టమైన పనో నాకామాత్రం తెలియదా హనీ? భార్యకు భర్త కాక మరెవరు హెల్ప్ చేస్తారు? ఓకే…ఈ హాప్పీ మొమెంట్ లో ఎక్కడైనా డిన్నర్ కి…” ఆగిపోయాడు కరోనా సంగతి గుర్తొచ్చి.

కడుపు పట్టుకుని నవ్వేసింది శార్వరి.

“అదేం కుదరదులే కానీ నీకిష్టమైన ఊతప్పం వేస్తా…వేడి వేడిగా…తియ్యతియ్యగా కబుర్లు చెప్పుకుంటూ తిందువుగానీ…”

“ఓకే హనీ. నేనీలోగా మన బెడ్ రూం సర్దనా? ఇన్ని రోజుల బ్రహ్మచర్యానికిక లాలలా!”

హుషారుగా లోపలికెళ్ళాడు వంశీ.

శార్వరి మనసు దూదిపింజలా ఆకాశంలో ఎగురుతోంది.

*****

ఇది జరిగిన పది రోజులకు శార్వరికిచ్చిన మాట ప్రకారం ఇద్దరూ సాయంత్రం నల్లకుంట రామాలయానికి వెళ్ళేందుకు తయారై కార్లో బయలుదేరారిద్దరూ.

“ఏది ఏమైనా కరోనా మనిషికి మంచి పాఠాలే చెప్పింది హనీ! లాక్ డౌన్ సమయంలో గంగ, యమున నదులలో కాలుష్యం మాయమై, స్వచ్ఛ సుందరంగా పారుతున్నాయట! మరో వార్త – జాలంధర్, చండీఘర్ నుండీ కూడ హిమాలయాలు కనిపిస్తున్నాయట! ఇంకా…ఏర్,వాటర్ పొల్ల్యూషన్ తగ్గినట్టే రికార్డ్స్ చూపిస్తున్నాయట! అంటే, ప్రకృతితో సహజీవనం చేయాల్సిన మనిషి, ప్రకృతినే నాశనం చేసేయాలి, నేనే అన్నిటికన్నా గ్రేట్ అనుకుంటే ప్రకృతి కూడా తన ప్రతాపాన్నిలాగే చూపించి అతన్ని తన దారిలోకి తెచ్చుకుంటుందనే కదా అర్థం?”

“నిజమే వంశీ! కానీ యీ క్రీడలో కొంతమంది అమాయక ప్రాణులు బలైపోతారు కదా మరి?”

“అదంతే హనీ! భారతంలో పాచికల ఆట పరిణామాల వల్ల అటూ ఇటూ లక్షల ప్రాణులు బలైపోలేదా? ఇదీ అంతే.”

“ఏది ఏమైనా బలవంతంగానైనా ఈ కరోనా నాకు బోలెడు హాలీడేస్ ఇచ్చింది. నన్ను ఓ నవలా రచయిత్రిని చేసింది.”

శార్వరి కళ్ళల్లో మెరుపులు. 

“నన్నూ ఓ వంటవాడినీ…ఆన్ ది హోల్…ఓ మంచి భర్తను కూడా చేసింది చూశావా!”

“అది కాదు వంశీ, పనిలో ఆడా మగా తేడాలు లేవనీ, అందరూ పనినీ దానికి తోడు ప్రకృతినీ, సమాజ శ్రేయస్సునూ ఆకాంక్షించాలని హితవు చెప్పింది.”

“ఆ…ఆ…ఇవన్నీ చెబుతూ కరోనాను రాక్షసుడనాలా? రాక్షసి అనలా? అన్న వాదనలు కూడా రేపింది హనీ.”

”అదేంటి వంశీ?”

“మరంతే! మన పురాణాల్లో లోకానికి కీడు చేసిన వారిలో రాక్షస స్త్రీలూ, పురుషులూ కూడా ఉన్నారు కదా! కరోనా క్రిమిని స్త్రీగా సంబోధించి కవితలు రాస్తున్న వాళ్ళందరిమీదా ధ్వజమెత్తుతున్నారట ఫెమినిస్ట్లు! నీవీ లోకంలోనే లేవుగా ఇన్నాళ్ళూ! నీ చుప్పనాతి ముచ్చట్లలో నీకీ సంగతి తెలియనేలేదు.”

“ఔను కదా! కరోనాసురుడు అంటే ఎలా ఉంది?”

“అమ్మబాబోయ్! నీవీపేరు మీద మరో నవలకు ప్లాన్ చేసేలా ఉన్నావ్? హతోస్మి!”

దాదాపు ఏడుపు మొహం పెట్టేసిన వంశీని చూసి భళ్ళున నవ్వేసింది శార్వరి.

“లేదు భక్తా! ఇప్పట్లో నీకీ విపత్తు లేదు. అసలు రూపమే లేని ఆ విషక్రిమిని ఎలా తరిమికొట్టాలో శోధించాలి కానీ అది ఆడా, మగా అన్న చర్చలెందుకిప్పుడు?”

“అద్దీ ఖద. ఐనా కానున్నది కాక మానదు అని ఇలా ఆలోచిస్తూ ఉంటే యీ సమస్య ఎంతకీ తెగదు. పదపద…గుడికెళ్ళాలన్నావుగా?”

మాటల్లోనే గుడికొచ్చేశారిద్దరూ.

అంతలో సెల్ మోగింది.

“శార్వరి గారి నంబర్ కదండీ?”

‘ఔనండీ. మీరెవరు?”

“నేను మీ అభిమాన పాఠకుణ్ణండీ. మీ నవల చుప్పనాతి చాలా బాగుందండీ. చివరి భాగం ఇప్పుడే చదివాను. మీ మొదటి నవలట కదా? ఐనా ఎంత బాగా వ్రాశారో! కంగ్రాట్స్!”

“చాలా థాంక్స్ సర్.”

ఎగిరి గంతేసింది శార్వరి.

వంశీకిదేమీ అర్థం కాలేదు. ప్రశ్నార్థకంతో చూశాడు.

“అదే వంశీ! ప్రియతో చర్చిస్తున్నాను నవల చివరిదాకా. వ్రాసిందంతా పంపిస్తున్నా కూడా. కనకమ్మ గారి అభిప్రాయం అందిన వెంటనే అనందంతో చెప్పా ఆమె మెచ్చుకున్నారని. వెంటనే నాకు తెలిసిన ఒక తెలుగు సైట్ లో ఆన్లైన్ నవలగా పెట్టేయనా? మంచి పాఠకులున్నారక్కడ! అని అడిగింది. ఓకే అన్నాను. దాని ఫలితమే ఇది.” – శార్వరి కళ్ళల్లో మెరుపులు.

“హుర్రే…ఏమానందము భూమీతలమున!’ ఇలా వ్రాయటమూ అలా పబ్లిసిటీ కూడా వచ్చేయటం…ఏమి భాగ్యం తల్లీ నీది? డబుల్ కంగ్రాట్స్!”

“సరే సరే..పద గుడిలోకి వెళ్దాం. కాసేపైతే రానివ్వరు.” శార్వరి తొందరపెట్టింది.

ఈ రోజు సీతానవమి అట. శ్రీరామ నవమి చైత్ర శుద్ధ నవమి కాగా సీతా నవమి వైశాఖ శుద్ధ నవమి రోజు. ఉత్తర భారత దేశంలో ఈ రోజును సీతమ్మవారి జన్మదినంగా జరుపుకునే ఆచారం ఉందట. వ్రతాలూ అవీ కూడా చేసుకుంటారట. పూజారి చెప్పాడీ రోజు ప్రాశస్త్యాన్ని.

ఆశ్చర్యంగా సీతమ్మ వారి ఆశీస్సులు కూడా తమకు లభించినట్టే ఆనందిస్తున్న తరుణంలో సెల్ మోగింది. స్పీకర్ ఆన్ చేసింది శార్వరి.

“హల్లో శార్వరి గారి నంబరేనాండీ ఇది?”

“ఔనండీ నేనే మాట్లాడుతున్నాను. మీరెవరండీ?”

“నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ జంపన్న గారి ఆఫీస్ నుంచీ మాట్లాడుతున్నానండీ. ‘చుప్పనాతి ‘ అన్న నవల రాసింది మీరే కదండీ?”

“ఔనండీ!”

“మీ నవల మా జంపన్న సారుకు చాలా నచ్చిందండీ. ఇటువంటి కథ కోసమే ఆయన ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు ‘వీరబలి ‘ తరువాత! అన్నట్టు, హీరోయిన్ సుమంత కూడా మీ చుప్పనాతి పాత్ర వేసేందుకు ఫోన్ లోనే ఒప్పేసుకున్నారండీ. రేపు దశమి. పొద్దున్నే వచ్చి మీతో అగ్రీమెంట్ చేయించుకుంటాము. మీ అడ్రస్ చెబుతారా?”

మాటల కోసం తడుముకుంటూంది శార్వరి. వంశీ ఫోన్ అందుకుని అడ్రస్ చెప్పాడు. అటూ ఇటూ థాంక్స్ లు ఇచ్చి పుచ్చుకోవటమయ్యాక ఫోన్ కట్ చేశాడు వంశీ.

శార్వరి కళ్ళలో ఆనంద బాష్పాలు. వంశీ కళ్ళల్లో ఉద్విగ్న కాంతులు.

గుడిలో ఉన్నప్పుడే యీ వార్త కూడా రావటం కాకతాళీయమైనా అది కూడా సీతమ్మ వారి ఆశీస్సులలో భాగంగానే భావిస్తూ సీతారాములకు ప్రణమిల్లారిద్దరూ.

అంతవరకూ, వారిద్దరినే గమనిస్తూ రావి చెట్టు దగ్గర కూర్చుని వున్న ఒక పండు ముసలావిడ కళ్ళు కూడా వారిద్దరినీ ఆశీర్వదించిన సంగతి వాళ్ళు గమనించారో లేదో మరి.

ooOOOసమాప్తంOOOoo

నా యీ నవలను ఎప్పటికప్పుడు చదివి, తమ అమూల్య స్పందనలు తెలియజేసి నన్ను ప్రోత్సహించిన సహృదయ పాఠక రచయితలకు పేరుపేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేనీ నవల వ్రాసేందుకు సంకల్పించినప్పటినుంచీ పూర్తి చేసేవరకూ నాకు తమ సలహలూ, సూచనలూ అందించిన మా శ్రీవారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల హర్షవర్ధన్ గారికి సేవింపులు. కుమార్తె చి.సౌ.వంశీప్రియ, అల్లుడు గారు శ్రీమాన్ ధర్మరాజు కార్తిక్ (న్యూ జెర్సీ) గారలకు మనఃపూర్వక ఆశీస్సులు.

–రచయిత్రి

Your views are valuable to us!