చుప్పనాతి – భాగం 8

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.8]

ఒక రోజు రాత్రి, అత్తమామల సేవలు చేసి, అప్పుడు ఆవేళప్పుడు, మల్లెలు, మొల్లలు, విరజాజులూ కొప్పున ముడిచి, రాముని మందిరం చేరుకుని, తలుపు తీయమందిట యీ కొత్త పెళ్ళి కూతురు.

కానీ ఇంతసేపూ సీత కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసిన పతిదేవునికి పట్టరాని కోపం వచ్చిందట!

గడియ వేసి, లోపల నిదురపోతున్నట్టే, ఆమె పిలుపును పట్టించుకోకుండా పరుండి ఉన్నాడట. సీత ఎంతగా బ్రతిమాలినా గడియ తీయనేలేదట.

కోపమొచ్చిన సీత, అత్త కౌసల్య దగ్గరికి వెళ్ళీ భర్తపై ఫిర్యాదు చేసిందట. అప్పుడిక కౌసల్య స్వయంగా వచ్చి, సీత తరఫున సంజాయిషీ ఇస్తే  రాముడు తలుపు తీశాడట.

భర్త తలుపు తీయగానే – “అత్తయ్యా, మీరు వెళ్ళిరండిక…మామగారు, అటు ఒంటరిగా ఉన్నారు!” అంటూ ఆవిడను బయలుదేర దీసిందట గడుసుగా యీ సీత.

దీనికి ప్రతిగా సీతారాముల దాగుడుమూతల ఆటలో, వామనగుంటలాటల్లో సీతే గెలవటం గుర్తు చేసుకుని ఆ ముచ్చటైన జంట ముద్దుముద్దుగా నవ్వుకోవటం చూసిన మీనాక్షికి తానెంత కోల్పోతున్నదో గుర్తొచ్చి, గుండె చెరువై పోయిందోసారి.

అంతేనా!

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

వనవాసానికి కారణమైన పరిస్థితులూ, ఇరువురూ వనవాసానికి జంటగా రావటానికి దోహదపడిన సంఘటనలూ, వివిధ ఆశ్రమ సందర్శనలూ, ఆయుధ ధారణ గురించి సీత వాగ్వాదం – ఇవన్నీ ఆ అన్నదమ్ముల సంభాషణల్లో తెలుసుకుంది.

అప్పుడే అనుకుంది – సీత అంటే, ఒక సంపూర్ణ స్త్రీత్వానికే కాదు, మానవాళికి సంబంధించిన అనేకానేక విషయాలగురించి తనవైన స్వతంత్రాభిప్రాయాలున్న ధీర వనిత అని.

ఓరోజు, సీతా రామ లక్ష్మణులు ముగ్గురూ కూర్చుని ముచ్చటలాడుకుంటున్న సమయంలో, సీత అంది –

“ఈ ప్రకృతి అంటే నాకు ప్రాణం. ఎన్నెన్ని ప్రాణులు! ఎన్నెన్ని వృక్షాలు! ఈ చిన్నా పెద్దా ప్రాణులంతా ఒకే అరణ్యంలో మనుగడ సాగిస్తున్నాయి. ఏ ప్రాణి ఐనా తాను ఆకలిగొన్నప్పుడే వేరే ప్రాణిని ఆహారంగా తీసుకుంటుంది తప్ప ఆడుకోవటానికో, ఆటపట్టించటానికో వేరే ప్రాణిని చంపదు కదా! ఓరకంగా పడగ నీడలో మనుగడే ఐనా వాటి పరిధిలో అవి సహజంగా సుందరంగా జీవిస్తుంటాయి. ఇంత వైవిధ్యమూ సహజంగా ఒకదాన్ని మరొకటి విశ్వసిస్తూ ఒక గొడుగు కింద బ్రదకటంలోనే ఉంది సృష్టి అందమంతా!”

వెంటనే రాముడు “భూపుత్రివనిపించుకున్నావు అయోనిజా!” అనేశాడు నవ్వుతూ.

అప్పటినుంచీ మీనాక్షికి కూడా హృదయంలో ఎక్కడో ఓ మూల ప్రకృతి అంటే ఆకర్షణ ఏర్పడింది.

నిజమే కదా! అటు జంతువులూ, ఇటు పక్షులూ, మరో వైపు వృక్షాలూ – ప్రకృతికి పెట్టని అందాలే కదా!

ఇంతటి వైవిధ్యం ప్రకృతిలో ఉండబట్టే మనిషి ఓ రకంగా ధ్వన్యనుకరణ విద్యను నేర్వగలిగాడు. పైపెచ్చు, ఇన్ని వృక్షాలలో తనకు ఔషధులవలె, వంట చెరుకు కోసం లేదా ఇంటి నిర్మాణం లో పనికి వచ్చే చెట్లను గుర్తించి ఉపయోగించ గలుగుతున్నాడు.

సీత వల్ల తనలోనూ ప్రకృతి పట్ల అనురాగమేర్పడటం బాగానే ఉంది కానీ, రామునికామె అర్ధాంగి కావటంలోనే ఉంది తనకు అభ్యంతరమంతా. నిజానికా స్థానం తనది కదా!

మీనాక్షి హృదయం బాధగా మూల్గింది.

పెళ్ళైన కొన్ని రోజులు అత్తగారింట రాజ్యమేలిన యీ సీతా నామధేయ ఇక్కడ వన సీమల్లోనూ, తన భర్త యీ జగదభిరామునితో దాంపత్య సుఖాన్ని ఎంత చక్కగా అనుభ విస్తూందో!

పంచవటిలోని ముచ్చటైన పర్ణశాల ముందు మరిదితోనూ, భర్తతోనూ, ముచ్చట్లు చెప్పుతూ గలగల నవ్వుతున్న యీ పవిత్ర సౌందర్యం చూపు మరల్చ నీయటమే లేదసలు. చూచేకొద్దీ సుందరంగా, రసబంధురంగా కనిపిస్తున్న యీ జంట తనలో ఏవేవో జ్ఞపకాలను తోడి పోస్తున్నది!

ఎందుకిలా?

సీతారాముల దాంపత్య జీవన యాత్ర ఇలా నదిలో పూల నావలా ఆనందంగా సాగిపోతూనే ఉంది.

తాను మాత్రం ఇలా యే చెట్టుచాటునుంచో ఆ ముచ్చటలు చూస్తూనే ఉండిపోతూనే ఉంది.

మరి పదే పదే తనకు ఆ కల చెబుతున్న సందేశమేమిటి? ఒకప్పుడు గంధర్వ కన్యనైన తన కోరిక యీ జన్మలోనూ ఇలా అసంపూర్తిగా మిగిలిపోవలసిందేనా?

పోనీ, తాను గంధర్వ కాంతను కాదు అనే అనుకున్నా కనీసం యీ జన్మలోనైనా భర్తతో ఇలా దాంపత్య జీవన మాధుర్యాన్ని తనివితీరా అనుభవించే అదృష్టం లేకుండా చేశాడు తన తోడ బుట్టినవాడే.

చెల్లినైన తన ఇష్టాన్ని ఒప్పుకున్నట్టే చేసి చివరికి తన భర్తను పొట్టన పెట్టుకున్న వాడిని అలాగే వదిలేయాలా? ప్రతీకారం తీర్చుకోమ్మని మనసప్పుడప్పుడూ పురికొల్పుతూనే ఉంటుంది కానీ “కావాలని చేసినది కాదు కదా!” అని మనసులో నెలకొన్న అన్న- చెల్లి బంధ మేదో సర్ది చెబుతుంది.

“ఖర దూషణులను తోడిచ్చి నీ ఇష్టారాజ్యంగా యీ అరణ్యంలో యథేచ్ఛగా బ్రదకమని నీ పై ఎవరి పెత్తనమూ లేకుండా చేశాడు కదా మీ సోదరుడు! ఇప్పుడు నీకేమి తక్కువైంది?” అని పాఠాలు చెబుతుంది కూడా.

కానీ ఇదిగో యీ జంటలా, ఒకరికొకరుగా శృంగార జీవిత సౌఖ్యాలను కాకుండా తనకు చేసిన పాపమో? దానికి ప్రతీకారం తీర్చుకోవలసిందే! అంటుంది జన్మ సహజమైన దానవాంశ.

తన భర్తను చంపటమే కాదు తన కారణంగానే భర్తను పోగొట్టుకున్న చెల్లి తన ఇంటనే ఉంటే తన శృంగార జీవనానికి అడ్డొస్తుందేమోననే అనుమానంతోనే తనను యీ విధంగా లంకకు దూరంగా, ఖర దూషణులతో ఉండమని పంపించేశాడని చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కోవటమూ విన్నది తాను.

కానీ యేమీ చేయలేక వదినె మండోదరి ముఖం చూసి విధిలేక యీ దండకారణ్యంలో ఉండవలసి వచ్చింది. లేకపోతే తాను పుట్టి పెరిగిన లంకలోనే తన బంధు మిత్రులతో ఉంటూ కనీసం కుటుంబ సుఖాన్నైనా అనుభవించగలిగేది కదా?

ఏ విధంగా చూసినా తన జీవితం శాపగ్రస్తంగానే ఉంది.

ఇప్పుడైనా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయటంలో తప్పేమిటి?

ఒక వేళ తన ప్రేమను యీ అన్నదమ్ములు తిరస్కరించినా తన అన్న రావణునిపై ప్రతీకారం తీర్చుకునేందుకు పావులుగా వీళ్ళను వాడుకోవచ్చేమో!

ఇటువంటి ఆలోచనలతో సతమతమై పోతున్నది మీనాక్షి.

(ఇంకా ఉంది…)

2 thoughts on “చుప్పనాతి – భాగం 8

  1. చాలా ధన్యవాదాలు శ్రీమాన్ రాజు గారూ!! నా నవల గురించి మీ స్పందన..నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.. పౌరాణిక కథాంశాన్ని..ఈ నాటి కి అనుగుణంగా నడపటం…ఎంత కష్టమో మీకు తెలుసును.. రాబోయే భాగాలనూ చదివి, మీ స్పందన, సూచనలు తెలియజేయగలరు..వినయాంజలులతో… పుట్టపర్తి నాగ పద్మిని 🙏 🙏🙏🙏

  2. అలనాటి రామాయణ కావ్యంలోని పాత్రలను అలవోకగా ఈనాటి వారికి అర్ధమయ్యేలా అర్వాచీన ధోరణిలో ఆవిష్కరిస్తున్న రచయిత్రి కౌశలం అత్యంత శ్లాఘ్యనీయం.

Your views are valuable to us!

%d bloggers like this: