చుప్పనాతి – భాగం 9

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 3.5]

ఈ ఆలోచన రాగానే మీనాక్షికి అనిపించింది –

“ఔను…నా ముందు రెండు మార్గాలున్నాయి. రెండింటి మధ్యా నిల్చుని ఉన్నాను ఇప్పుడు. ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేకపోతున్నానే? ఇప్పుడేమిటి చేయటం? పోనీ..ఓ పని చేస్తేనో! తన పథకాలేమిటి? రాముని ప్రేమను పొంది, సుఖ జీవనాన్ని గడపటం ఒక మార్గం. లేదా, తన భర్త హత్యకు ప్రతీకారం తీసుకోవటం. మొదటి మార్గం ఫలితం ఇప్పుడే కొంతసేపటిలో తేలిపోతుంది. మరి రెండవదానికోసం మళ్ళీ పథకం కొత్తగా వేసుకోవాలి. మరి యే దిశగా ఆలోచించాలిప్పుడు?”

అమ్మమ్మ తాటకనూ, సుబాహుణ్ణీ మట్టుపెట్టిన ది, యీ వీరాధివీరుడే!

ఇదే రాముడు తన ఒక్క బాణాఘాతంతో మేనమామ మారీచునికి చావుదెబ్బ తినిపించిన కథా విన్నది తాను.

మారీచుడిప్పుడు పూర్తిగా సాత్వికుడిగా మారిపోయి దైవ ధ్యానంలో మునిగి పోయాడనీ, ‘ర’ అన్న అక్షరం వింటేనే చాలు చావుభయంతో వణికి పోతున్నాడని కూడా ఒకరిద్దరి మాటల్లో విన్నట్టే గుర్తు.

ఇంకేం! తన అన్న రావణుని మదమణచటంలోనూ యీ రాముడే సమర్థుడనిపించింది మీనాక్షికి.

మొదటి మార్గంలో, తానిన్ని రోజులూ కోల్పోయిన స్వర్గ సుఖాలు, ఎవరికీ నష్టం కలిగించని రీతిలో తనవి కావటం జరుగుతుంది. ఈ ప్రయత్నం విఫలమైతే, యీ వైఫల్యాన్నే అస్త్రంగా ఉపయోగించి తోడబుట్టిన వాడైనా, తనను వంచించిన రావణుని పై యీ అజేయులైన అన్నదమ్ములను ఉసిగొల్పి, జరగబోయే పరిణామాలను ఆనందంగా వీక్షించవచ్చుననే వికృతానందమూ మీనాక్షి ఆలోచనలకు ఆజ్యం పోసింది.

“పరాజయాన్ని ఎల్లవేళలా ఆహ్వానిస్తూ ఉండటం కంటే ఓసారి ఎదుర్కొని, అటో ఇటో తేల్చుకోవటమే మేలేమో!” – ఈ ఆలోచన రాగానే ఇక ఆచరణలో పెట్టి తీరాలని నిర్ణయించుకుంది మీనాక్షి.

ఈరోజు ఎలాగైనా తాననుకున్న పని చేసి తీరాలనుకున్నది మీనాక్షి.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

ఉదయ వేళలో కాసేపు పర్ణశాల దగ్గరే ఉడత రూపంలో తచ్చాడింది.

పర్ణశాల ముందు సీతారాములిద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇదే సరైన సమయమని, తానూ సన్నద్ధమైపోయింది మీనాక్షి.

కామరూప విద్యతో అందమైన లతాంగిగా మారిపోయింది.

ముగ్ధమోహన రూపం. శరీరంలోని అణువణువునా తారుణ్యం తొణికిసలాడుతున్నది. పొడవాటి నల్లని రెప్పల కళ్ళలో దిద్దిన కాటుక తళుకులీనుతూ, కొత్త అందాలను ప్రతిఫలిస్తున్నది. సంపెగ నాసికకు ఎడమ వైపు కొలువైన ముద్దుల ముక్కుపుడక తళుక్కుమంటూ ఎర్రటి పెదవులపై ప్రతిఫలిస్తున్నది.

కాస్త కింద , తాంబూల శోభతో అలరారుతున్న పెదవులు, శృంగార కేళికి ఆహ్వానం పలుకుతున్నట్టున్నాయి. బుగ్గలపై తళుకులీనే మకరికా కాంతులు. తలలో దాల్చిన అడవి మల్లెల సువాసనలు మత్తెక్కిస్తున్నాయి. శంఖం వంటి మెడ, నిండు జవ్వనాన్ని ప్రతిఫలించే వక్ష ద్వయం, నాజూకైన కటి ప్రదేశం, తేలికైన చీనాంబరాల సయ్యాటలతో, మయూర గతిలో, నాట్య విన్యాసాలను గుర్తు చేస్తున్న భంగిమలు.

ఇన్ని అందాలనూ మేళవించుకుని, పర్ణశాల వైపు వయ్యారంగా అడుగులు వేసింది మీనాక్షి.

తన కోర్కె త్వరలో నెరెవేరబోతున్నదన్న సంతోషాతిరేకంతో మీనాక్షి అడుగులు తెలియకనే తడబడుతున్నాయి.

తడబడుతున్న మీనాక్షి అడుగులు పర్ణశాల వైపుకెసి పడుతున్న సమయాన సరిగ్గా…

మీనాక్షి తడబడుతున్న అడుగులతో పర్ణశాలకేసి నడుస్తున్నప్పుడే….సరిగ్గా.. ..ఉన్నట్టుండి…ఆమె కుడి కన్ను విపరీతంగా కొట్టుకోవటం మొదలు పెట్టింది. దానికి తోడు కుడి భుజమూ అదరటం.

ఎందుకిలా? ఏమి కాబోతున్నదిప్పుడు?

అసమంజసంలో పడిపోయింది మీనాక్షి.

ఏదో కీడు జరగబోతున్నదన్న సూచన. కానీ, ఇంతవరకూ వచ్చి, ఇక వెనకడుగు వేయటమా?

“ఛీ…ఇంత వరకూ ఎంతమంది పురుష పుంగవులను చూసినా చలించని మనసు యీ విశాలాక్షుణ్ణి, ప్రియదర్శనుణ్ణి చూసి చలించింది. ఇప్పుడిక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు” అనుకుంటూ కుడిభుజాన్ని గట్టిగా చరచి దానికి బుద్ధి చెప్పి, కుడి కంటిని టపటపా రెప్పలల్లార్చి బుద్ధి గరపి అడుగు ముందుకే వేసింది మీనాక్షి.

రామచంద్రుడు, సీతతో మందస్మితంతో ఏవో ముచ్చటలాడుతున్నాడు.

తటాలున వెళ్ళి ఆ శ్రీరాముని ముందు నిలబడింది మీనాక్షి.

వెళ్ళిన వెంటనే తన కోర్కెను ప్రకటించేయాలనే ఆతురత. కానీ ఇదేమిటి? గొంతు ఎంతకీ పెగలదెందుకని?

ధీరోదాత్తుడైన ఆ ఆజానుబాహువు సౌందర్యాన్ని అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు కదా మరి!

ఆ కోటి మన్మధాకారుని చిరునవ్వులో కోటి స్వర్గాల కాంతులూ వెలవెలబోతు న్నాయి.

తాపసి వేషధారణలో ఉన్నా మహారాజు లక్షణాలేమాత్రమూ కొరవడని తేజస్సు.

ఆ విగ్రహం గాంభీర్యత పోతపోసినట్టే ఉంది. ధర్మానికి మరో రూపం వలెనే ఉన్న ఇతనితో తన కామవాసనా పూరితమైన కోర్కెనెలా ప్రస్తావించటం?

తానేమో ఇప్పుడు ఆ దశాననుని చెల్లిగా, కైకసి-విశ్రవసుల కుమార్తెగా, దండకారణ్యంలో విచ్చలవిడిగా తిరుగుతూ, కోర్కెలను తీర్చుకుంటున్న దానవ స్త్రీ.

మరిప్పుడు తాను తన కోర్కెను మనసు విప్పి చెప్పుకున్నా, యీ రాకుమారుడు అంగీకరించేనా?? అన్న సందేహం బీజంలా మొలకెత్తి క్షణాల్లో వృక్షంగా మారింది. అడుగులు ముందుకు వేసి ఎదురుగా నిల్చున్నా, గొంతు సహకరించటమే లేదు.

మధుర మధురంగా తన భావాలను విప్పి చెబుదామనుకుంటూ, గొంతు విప్పింది మీనాక్షి.

******

‘ఓ జటాధారీ!”

ఇదేమిటి? ఉన్నట్టుండి తన గొంతు ఇంత కఠినంగా, కర్కశంగా మారిపోయింది ?

తన కఠోర కంఠస్వరం వినగానే, ఆ ఇరువురు వీరుల ముఖాల్లో సందేహపు ఛాయలు తారట్లాడటం గమనించి, కాస్త తడబాటేదో కలిగింది.

తన గొంతులో లాలిత్యమేదీ?

రూపాన్ని అందంగా మార్చుకోగలిగిందే కానీ తన గొంతు తనకే ఎందుకిలా కర్కశంగా వినిపిస్తున్నది? విధి వంచించటమంటే ఇదేనా? పోనీ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తేనో?

ఊహూ…ఇన్ని రోజుల తరువాత యీ రోజు కాస్త ధైర్యం చిక్కింది. అందమైన రూపమున్నవాళ్ళకు మధురమైన కంఠస్వరం లేకపోవటం కూడా ప్రకృతి వింతలలో ఒకటి కదా!

ఈ అరణ్యంలో ఉంటూ ఇటువంటి వింతలెన్ని చూడలేదు తాను? మధుర గానంతో పులకింపజేసే కోయిల వర్ణమేమిటి? నాట్య విన్యాసాలతో మైమరపింపజేసే నెమలికి కర్ణకఠోరమైన కంఠస్వరం ఎలా వచ్చింది మరి? ఇలా చూసుకుంటే చాలా ఉదాహరణలున్నాయి.

ఇవన్నీ మనసులోకి రాగానే ఇక వెనకడుగు వేయదలచుకోలేదు మీనాక్షి.ఐనా ఒక విషయంలో జాగ్రత్త పడింది – గత కొన్ని రోజులుగా వీళ్ళను పరోక్షంగా అనుసరిస్తూ, వీరి విషయాలు తానిప్పటికే సేకరించుకునే వచ్చిందన్న సంగతి మాటల్లో బైటపడకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుని, ఆచి తూచి మరీ మాటలు సంధించింది మీనాక్షి.

 

(ఇంకా ఉంది…)

Your views are valuable to us!