మహాదేవి – మొదటి భాగం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.5]

 

పవిత్ర నైమిశారణ్య ప్రాంతం.

సూత మహర్షి చుట్టూ మునులందరూ కూర్చుని జగన్మాత మహిమాన్విత గాధలు విoటూ వాళ్ళందరూ తన్మయచిత్తులవుతున్నారు.

ఒకదానికంటే మరొకటి ఎంతో వైవిధ్య భరితంగా ఉంటున్న ఆ గాధలు వింటుంటే మధ్య మధ్య తలెత్తే సందేహాలను కూడా అడగమని సూతులవారే వాళ్ళనుప్రోత్సహించటం – ఆయా సందేహ నివృత్తి కూడా చేస్తూ ఉండటంతో మరింత ప్రమాణమంతంగా అక్కడ దేవీ వైభవం ఆవిష్కృతమౌతున్నది.

ఇంతలో ఒక మునికి ఒక సందేహం వచ్చింది – “స్వామీ! సర్వోత్తములుగా పరిగణింపబడే త్రిమూర్తులే ఎన్నెన్నొ కష్టనష్టాలపాలౌతుంటే ఇక మావంటివారికి దిక్కెవ్వరు? అందరిలోకీ క్షీరసాగర పర్యంకంలో కొలువై వున్న శ్రీమహావిష్ణువే ఎప్పుడు జగత్తుకు విపత్తు వాటిల్లినా మత్స్య, కూర్మాది అవతారాలెత్తి, కాపాడాడంటే, దీనికి అర్థమేమిటి? గర్భవాస దుఃఖం అన్నిటికంటే ఘోరమైనది కదా! మేమేమో యీ కష్టాలు వద్దంటే వద్దనుకుని మోక్షం కావాలని అహోరాత్రాలూ తపస్సులో మునిగిపోతూ ఆయన్నే వేడుకుంటుంటే, ఆయనేమో ఇహలోకంలో అవతరించి, దానవ సంహారం మాట అటుంచి బాల్యక్రీడలు మొదలు శృంగార క్రీడలలోనూ మునిగి తేలుతున్నాడంటే దీనికి అర్థమేమిటి స్వామీ? అసలు, తానే సర్వోత్తముడన్న అహంకారం ఆయనకెందుకు? నా సందేహం సముచితమైతే, నివృత్తి చేయండి మహాత్మా!” అని వేడుకున్నాడు.

సూతుడు నవ్వాడు.

“భలేవాడివే నాయనా! జనమేజయుడికీ యీ అనుమానం వస్తే, వ్యాస మహర్షి ఎలా తీర్చారో చెబుతాను. నేనూ నీలా అక్కడ విన్నవి ఇక్కడ చెబుతున్నానంతే!” అని చిరునవ్వు నవ్వాడు.

సూతుడు కథ చెప్పేందుకు ఉపక్రమించబోతుంటే – “సామీ…” అన్న ఒక గొంతు వణుకుతో కూడి వినిపించింది.

అందరూ ఆ వైపుకు తిరిగి చూశారు.

సూతుని నలువైపులా మునుల వరుసల తరువాత అక్కడున్న సామాన్య జనసందోహం నుంచీ వచ్చిందా శబ్దం.

“ఎవరామాటన్నది?” అడిగాడొక ముని బాలుడు.

“సామీ!” అంటూ ఒక ముసలతను లేచి నిలబడ్డాడు.

“మిమ్మల్నే నమ్ముకోని, మీ సేవ సేసుకుంటూ యీడనే ఉంటున్నాం గందా! మీరు సెప్పేదేందో మా పిల్లా పాపలకూ గూడా అర్దమయ్యేట్టు సెప్పాలని అడుక్కుంటున్నానయ్యా! మాదేముందింక? ముందుండే కాలమంతా ఆ బుడ్డోల్లదేగందా! ఆల్లక్కూడా బాగ అర్దమైతే జాగరత్తగా బతుక్కునేది! అందుకే మా చదూకోనోల్లకూ అర్దమయ్యేటట్టు సెప్పమని మహామునులవారికి కాల్లు మొక్కి ఏడుకుంటుండా సామీ” అని అంటూ చేతులు జోడించి నిలబడ్డాడా ముసలతను.

అక్కడున్న మునులందరి మొహాల్లోనూ ప్రశ్నార్థకాలే!

సూతులవారేమంటారో అన్న భయమూ పొడసూపింది. కానీ సూతులవారి పెదవులమీద దరహాసం వెల్లి విరిసింది.

చేయెత్తి ఆ ముసలతని మాటలు అంగీకరించిన సూచన చేసి మొదలెట్టారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

 *****

“జనమేజయా! సత్వ, రజస్, తమో గుణాలు – త్రిమూర్తులలో కూడా ఉన్నాయి కాబట్టే వారు దుష్టశిక్షణా, శిష్టరక్షణా చేయగలుగుతున్నారు. కాకపోతే, సామాన్య మానవుల్లో ఉన్న అహంతకూ, ఆయా దేవతామూర్తులలో ఉన్న అహంతకూ చాలా తారతమ్యాలుంటాయి. యోగమాయావశులైన వారు ఆ శక్తి ఆదేశాలను బట్టే ప్రవర్తిస్తూ, ఆయా వేళల్లో ఆమేరకు ప్రవర్తిస్తూ ఉంటారన్నదే సత్యం. చిన్న ఉదాహరణ – శ్రీకృష్ణుడుగా విష్ణువు అవతరించబోయే ముందు యోగమాయే కదా కంసుణ్ణి హెచ్చరించింది! ఇక అవతార వేళలో ఆయన్ని సూతికాగృహం నుంచీ తప్పించి రేపల్లెకు చేర్చింది ఎవరనుకున్నారు? ఆ మహాశక్తే కదా! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రహస్యాలున్నాయి. వాటన్నింటికి యోగమాయ స్వరూపమే కారణం నాయనా!”

జనమేజయుడు వ్యాస భాషితాన్ని శ్రద్ధగా విన్నాడు.

“మీ మాటల్లో యీ యోగమాయ గురించి చాలా సార్లు విన్నాను మహాత్మా. శ్రీకృష్ణుని కూడా ఆమే నియంత్రించిందంటే ఆమె ఎంత శక్తి సంపన్నురాలో తెలుసుకోవాలని ఉంది.” అన్నాడు చేతులు జోడించి.

వ్యాస మహర్షి పెదవులపై చిరునవ్వు వెలిగింది. ఆయన తలపంకించి “అహంకారమే ఆకారం దాల్చి యెదురుగా నిలబడితే ఆ యోగమాయే స్వయంగా అవతరించి, ఆ అహంకారాన్ని దునుమాడిన కథను విను” అని మొదలుపెట్టారు.

*****

“అబ్బా…ఇంకా ఎంతసేపయ్యా? త్వరగా రా! మన చిన్నదేవరవారి ఆజ్ఞ ప్రకారం యీ సమయానికి మనం గుహలోపలుండాలి. నీవేమో ఇంకా ఆ చెట్టు యీ పుట్టా అంటూ గడుపుతున్నావ్. ప్రమాదవశాత్తూ యే రాక్షసుడో ఇటువైపు వచ్చాడంటే మనిద్దరికీ నూకలు చెల్లిపోతాయ్!”

“అదిగదిగో…ఆ చెట్టు చివరన ఎర్రటి పళ్ళు చూశావా? నాకైతే నోరూరుతున్నది. ఆ పళ్ళు ఒక్కటైనా తీసుకుని వెళ్ళిపోదాం. ఇంతవరకూ రాని రాక్షసుడిప్పుడెక్కడినుంచీ వస్తాడులే! కాస్త సాయం చేయవయ్యా!’

“చెబితే వినవు కదా! నీ బాధేదో నువ్వు పడు. నేవెళ్తున్నా.”

“అంతేలే! సమయానికి సాయం చేసే వాళ్ళనే స్నేహితులంటారు. నువ్వేమో పళ్ళు కోసివ్వమంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నావ్!”

“అబ్బా! మళ్ళీ మొదలైందా నీ సణుగుడు? సరేలే! ఇంతకూ ఎక్కడా ఆ పళ్ళు?”

ఇద్దరూ తలెత్తి ఆ పళ్ళకోసం చెట్టు పైకి చూస్తున్నారో లేదో కిందనున్న భూమి కంపించినట్టై, పైనుంచీ నాలుగైదు పళ్ళు వాటంతటవే వాళ్ళ తలల మీద రాలిపడ్డాయి. ఊహించని ఆ దెబ్బకు బెంబేలెత్తిపోతూ, ఆ అకాల భూప్రకంపనానికి కారణం ఇంతకు ముందే ఊహించినట్టుగా దానవ క్రీడేనని తెలిసి, ఆ పళ్ళమీద ఆశ వదులుకుని అక్కడి నుంచీ దగ్గరున్న గుహలోకి పరుగులు పెట్టేశారు.

వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే, గుహ ద్వారం మాయమై అదంతా కొండగానే కనబడసాగింది.

ఇంతకూ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమాచారం వెనుక కథేమిటి?

*****

దేవతలందరూ ఇలా కొండ కోనల్లో తలదాచుకోవటం ఎప్పుడూ వినలేదూ, కనలేదూ కదా! ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలివే.

భూమ్మీద మహిషాసురుడనే రాక్షసరాజు మహిషము అంటే దున్నపోతు రూపంలో ఉన్నవాడు పాలిస్తున్నాడు.

అతగాడు జగత్తునంతటినీ ఎప్పుడో వశపరచుకున్నాడు.

ఎదురు చెప్పేవాళ్ళేలేని అతని రాక్షస పాలన యధేచ్చగా సాగుతున్నది.

దైవమెక్కడో లేడంటాడు. తననే కొలవమంటాడు. యజ్ఞ యాగాదుల్లో భాగం కావాలంటాడు. కాదు కూడదన్నవాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు.

భూమ్మీద రాజుల మీద అధికారం తరువాత, అతగాని దృష్టి దేవలోకం మీదకు మళ్ళింది. అది కూడా జయించేస్తే, ఇక యజ్ఞ యాగాదుల పనేముందన్న తలంపే మరింతగా అతన్ని ముందుకు నడిపింది.

ఇంతకూ, ఇతనికి యింతటి తెగింపు ఎక్కడినుంచీ వచ్చింది? ఇతగాని యీ దున్నపోతు రూపమేమిటి? ఒక దున్నపోతు రూపంలో ఉన్న అసురునికింతటి శక్తి ఎక్కడినుంచీ వచ్చింది? ఇతగాని పుట్టుపూర్వోత్తరాలేమిటి?

*****

దానవ వంశానికి చెందిన దనువుకు, ఇద్దరు కుమారులు.

ఒకడు రంభుడు, మరొకడు, కరంభుడు.

తిరుగులేని వీరులుగా పేరు ప్రతిష్టలు సంపాదించినా, కారణమేమిటోగానీ, వాళ్ళిద్దరికీ సంతానం లేదు. కోరికేదైనా, ఫలితమిచ్చేది తపస్సే కాబట్టి కఠినంగా తపస్సు మొదలు పెట్టారిద్దరూ.

కరంభుడు పంచనదంలో మునిగి, ఊపిరి బిగబట్టి చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు.

రంభుడు, మద్దిచెట్టు (సాల వృక్షం) మీదెక్కి అగ్నిదేవునిగురించి తపస్సు చేస్తున్నాడు.

ఇద్దరి తపస్సూ చూసి, ఇంద్రుని గుండె జారిపోయింది. తనకేదో ముప్పు వాటిల్లబోతున్నదనే అనుకున్నాడు.

నీళ్ళలో మునిగి తపస్సు చేస్తున్న కరంభుణ్ణి మొసలి రూపంలో వచ్చి మట్టుపెట్టాడు.

రంభుడికి యీ సంగతి తెలిసింది.

తన సోదరుణ్ణి ఇంద్రుడు అకారణంగా చంపటంతో కోపంపట్టలేక తాను అగ్ని దేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడు కాబట్టి తన తల తానే తెగ్గోసుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ దెబ్బకు దేవతలు దిగిరాక తప్పదని వాడి ధీమా!

అతగాడు తల తెగ్గోసుకుని, అగ్ని దేవునికి అర్పించటమే జరిగి అతనికి సంతాన భాగ్యం కలిగితే ఇక ముందు కథేముంటుంది?

సరిగ్గా అప్పుడే, అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసురుడి చేయి పట్టుకుని, ఆపేశాడు.

“రంభాసురా! ఆగు ఆగు! ఎంత పని చేస్తున్నావయ్యా? చచ్చి సాధించేదేమైనా ఉంటుందా? పోనీ ఆత్మహత్య చేసుకున్న పాపం తక్కువైనది కాదు. ఇదిగో, నేనొచ్చేశాను. వరమిస్తాను. అడుగు…” అన్నాడు.

రంభుడు చేతులు జోడించి అన్నాడు – “అగ్నిదేవా! నా తపస్సును మెచ్చే వచ్చావు కదా! నా కోరికా నీకు తెలుసు కదా! నాకు మూడు లోకాలనూ జయించే కొడుకునివ్వు. దేవతలూ, దానవులూ, మానవులూ – ఎవ్వరినైనా ఓడించగల శక్తి సంపన్నుడు కావాలి. ఎప్పుడే రూపం కావాలంటే దాన్ని ధరించగలగాలి. అన్ని లోకాలూ నా కొడుకును వేయినోళ్ళ పొగడాలి. అటువంటి వంశోద్ధారకుడు కావాలి.” అన్నాడు.

అగ్నిదేవుడు, ఆలోచనలో పడ్డాడు.

జరగబోయేదంతా కళ్ళముందు కదలాడింది.

సమాధానంగా అన్నాడు “సరే! నీ మనస్సు యే కామిని మీద నిలుస్తుందో, ఆమె వల్ల నీవు కోరుకున్న కొడుకు పుడతాడు.” అని దీవించి మాయమైపోయాడు.

రంభాసురుడికి పట్టరాని ఆనందం వేసింది. తన రాజ్యానికి పయనమైనాడు.

అగ్నిదేవుడి వరం ఫలించి తనకూ, తన పట్టమహిషికీ మగ సంతానం తప్పక కలగబోతుందన్న ఊహే అందంగా ఉంది వాడికి.

ఊహల్లో తేలుతూ వస్తున్న అతగాడికి దారిలో ఒక అందమైన ప్రదేశం, అక్కడ కేరింతలూ, తుళ్ళింతలతో ఒకటే కోలాహలంగా కనబడింది.

అటువైపు అడుగులు అనాలోచితంగానే పడ్డాయి.

ఇంతలో, అతని దారికడ్డు వచ్చిందో మహిషం.

మంచి వయసులో ఉన్న ఆ ఆడ గేదె ఎంతో తుళ్ళితుళ్ళి పడుతూ, తోకెత్తి విహరిస్తున్నది. దాని ధాటికి అక్కడున్నవాళ్ళంతా ఎక్కడివాళ్ళక్కడ పరుగులు పెడుతున్నారు.

ఓ మూల నిలబడి దానికేసే చూస్తున్న రంభుడికి దాని వాలకమేమిటో తెలియటం లేదు.

ఇంతలో, ఆ గోలల మధ్యే ఫెళ్ళున ఓ మగ గొంతులో నవ్వులూ వినిపించాయి.

దీని హడావిడి సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తుంటే, విచిత్రంగా నవ్వేదెవరా? అని అటుకేసి చూశాడు రంభుడు.

అక్కడో చోట, కాస్త దూరంగా ఆగి దానికేసే చూస్తున్నారు నడివయసు దంపతులు.

భర్త కాబోలు మరింత మోజుగా చూస్తున్నాడు ఆ గేదెకేసి, ఆమె సిగ్గు సిగ్గుగా చూస్తుంటే.

“అదేనే! దానికిప్పుడు మగతోడు గావాలెహె! అందుకే అట్టా ఈరంగం సేత్తా ఉండాది. మగైనా, ఆడైనా…జీవాల్లో అంతే మల్ల. ఎదకొచ్చేసిన ఆ ఉడుకూ, ఇదుగో…ఇట్టా సలి, నులి బెట్టే కాలమూ దాటిపోనాయనుకో…మల్లీ మామూలే! అబ్బ…ఎంత ముద్దొచ్చేత్తాందే నాయాల్ది!” అని అంటున్నాడు.

”ఏంది మావా! నాకు తెల్దా ఏంది! వచ్చిన పనేంది? నువ్ సేసేదేంది? బేగి పోవాలె. నువ్ రా మావా…నువ్ రాకపోతే నేనెల్లిపోతా!”

అతగాడు పాటందుకున్నాడు – “నిన్నెట్టా ఇడిసేదె సిలకా…నీ ఎనకే నేనుంట సిలకా…”

మళ్ళీ ఇద్దరి నవ్వులు…ఈసారి రాను రాను దూరమౌతూ!

ఓవైపు వాళ్ళిద్దరి మాటలూ, మరో వైపు వేడి మీదున్న యీ ఆడ గేదె చిందులూ.

దాని ఉత్సాహమూ, దాని పొంకమూ చూస్తుంటే రంభుడి శరీరంలో అగ్గి రాజుకుంది.

మనసు శృతి తప్పింది. కామోద్రేకం పరవళ్ళు తొక్కింది.

అంతా విధి నాటకం!

పర్యవసానాల్ని ఆలోచించకుండానే, అప్పటికప్పుడు తానూ మహిష రూపం దాల్చి, ఆ ఆడ గేదెతో క్రీడించాడు.

అది గర్భవతీ అయ్యింది.

దాన్ని తీసుకుని, పాతాళ నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను దానికి కాపలా పెట్టాడు.

కానీ, ఒకరోజు…

మరో దున్నపోతు, గర్భంతో ఉన్న యీ గేదె మీద పడింది. ఇది చూసిన రంభుడికి, కోపం ఆగలేదు. తానే స్వయంగా దానితో తలపడ్డాడు. కానీ ఆ ఎనుబోతు రంభుడి గుండెల్లో బలమైన కొమ్ములతో పొడిచిన తాకిడికి అతగాడు నేలకు ఒరిగిపోయి, గిలగిల కొట్టుకుంటూ, మరణించాడు.

దున్నపోతుకు ఇప్పుడు మరింత ధైర్యం వచ్చింది. రంభుడి ప్రేయసి మీద మీదకు వచ్చింది.

తన ప్రియుడు రంభుడు మరణించిన బాధ ఒక వైపు, ఆ దున్నపోతు కళ్ళు కామంతో మూసుకుపోయి తన మీదకు రావటం మరో వైపు.

కడుపుతో ఉన్న ఆ గేదె భయంతో పరుగులు పెట్టింది. భూలోకంలో కాపాడేవారే లేకపోయారు. అందుకని యక్షులను శరణ వేడిందా గేదె.

పాపం, దాని బాధ చూసిన యక్షులు కాపాడాలనుకున్నారు. ఆ దున్నపోతుతో తలపడ్డారు. చివరికి ఆ దున్నపోతు ప్రాణాలు వదిలింది.

గర్భంతో ఉన్న రంభుడి ప్రేయసిని సమాధాన పరచి, రంభుడి కోసం చితి పేర్చి, అగ్ని సంస్కారాలు చేస్తున్నారు. కానీ గర్భవతైన రంభుడి ప్రేయసికి దుఃఖం ఆగలేదు. పరుగు పరుగున వచ్చి చితిలోకి దూకింది. యక్షులకు నోట మాటలేదు. రంభుడి పట్ల ఆ గేదె ప్రేమను చూసి, తట్టుకోలేక పోయారు.

*****

కథ వింటున్న ఆ పామర జనాల్లోనుంచీ బాధతో ఒకరన్నారు –

“అయ్యో! సామీ! దానికి మొగుడంటే ఎంత పేముండాదో! ఆణ్ణీ ఇడిసి పెట్టడమే లేదు. దాన్నా మంటల్లోంచీ బైటికి దీలేదా సామీ ఎవ్రూ?”

అక్కడున్న మునుల్లో ఒకాయన – “హుష్…హుష్! మాటిమాటికీ అడ్డు తగలకండి. సూతులవారు చెప్పేది వింటుంటేనే మన సందేహాలు పటాపంచలై పోతుంటాయి” అన్నాడు నెమ్మదిగా.

సూతులవారికీమాటలు చెవిన పడనే పడ్డాయి.

వారు దరహాసంతో కథను కొనసాగించారు.

*****

అందరి మనసుల్లోనూ ఏదో బాధ!

అసలే ఆ గేదె కడుపుతో ఉంది. దాని బిడ్డ కూడా అగ్గిలో బుగ్గైపోతే ఎంత అన్యాయం?

దాన్ని ఆ చితినుంచీ కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ అది మళ్ళీ మళ్ళీ, మంటల్లోకి దూకేస్తూనే ఉంది. యక్షుల జాలిని చూసిన అగ్నిదేవునికి ఆ నిండు చూలాలి బాధ అర్థమైంది. పైగా ఆ జీవి యీ లోకంలోకి వచ్చేందుకు తాను కూడా ఒక రకంగా కారణమే కదా!

రంభుడి పట్ల దానికున్న ప్రేమను చూసి మనసు ద్రవించింది. ఒక ఉపాయం తట్టింది – “దాని కడుపులో ఉన్న జీవిని కాపాడేస్తే?”

అంతే…

ఆ చితి మంటలనుండీ, చిన్న మహిషుడు, బైటికి వచ్చాడు – రంభుడు కోరుకున్న అన్ని లక్షణాలతో.

ఈ బాలుడు – రాక్షస, మహిష రూపాల కలయిక.

వీడే పెరిగి పెద్దై, మహిషాసురుడయ్యాడు.

రంభుడు కలలు కన్నదే ఇటువంటి కొడుకు కావాలని. తానూ మహిషుడిపై ప్రేమతో, మరో దేహాన్ని పొందాడు – రక్త బీజుడిగా.

మహిషాసురుడికి అనుచరుడిగా ఉంటూ ఆంతరంగికుడయ్యాడు.

(సశేషం)

Your views are valuable to us!