మహాదేవి – రెండవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 5]

 

“సామీ! మంటల్లోనుంచీ మనిషి బైటికి రావడం బాగానే ఉంది గానీ మరి తనొక రాజు కొడుకుననీ, తనకో రాజ్జముండాదనీ వాడికెట్టదెలిసింది? ఆణ్ణి ఎవురు పెంచి పెద్దజేసినారు?” అని దూసుకొచ్చింది పామరుని ప్రశ్న.

మునుల్లో ఎవరో అతన్ని అడ్డుకున్నారు.

“ఇదిగో నాయనలారా! పెరిగి పెద్దయ్యే కథలూ, వాడేమి తిన్నాడు, ఎట్టా అల్లరి చేసేవాడు? ఏమేమి విద్యలు నేర్చుకున్నాడు? వీటిలో ఏదైనా విశేషముంటే సూతులవారే చెబుతారు కదా! మాటిమాటికీ అడ్డు తగలకుండా ఊకొడుతూ ఉండండి.”

గుసగుసలు సద్దు మణిగాయి.

సూతులవారు చెప్పుకుపోతూనే ఉన్నారు – “ఇప్పుడిక అసలు కథలోకి వద్దాం…”

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

*****

మహిషుడి శక్తి రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.

తన సామ్రాజ్య విస్తరణ జరిగేకొద్దీ, శత్రువులు పెరిగేకొద్దీ, ఏదో ఒక మూల ప్రాణ భయం కూడా పొడసూపుతూనే ఉంటుంది కదా! అందుకే కాబోలు మహిషుడు జీవులకు మరణాన్ని నిర్దేశించే సృష్టికర్తనుద్దేశించి వేలవేల సంవత్సరాలు మేరు పర్వత శిఖరం మీద తపస్సు చేశాడు.

బ్రహ్మ సాక్షాత్కరించాడు.

“వత్సా! ఏమిటి నీ కోరిక?” అన్నాడు.

“స్వామీ, నన్ను మన్నించు, అమరత్వమే నా కోరిక.” అన్నాడు.

సృష్టికర్త ఉలిక్కి పడ్డాడు.

“దానవ వీరా అదేమిటి? మరణమే లేకుండా చేయమని నన్నే అడుగుతున్నావా? అదెలా సాధ్యం? నా బాధ్యతనే ప్రశ్నించే వరమిది. ఐనా పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. జనన మరణాలు సకల ప్రాణికోటికీ అనివార్యాలు. అచలాలనుకునే మహా మహా పర్వతాలే ఎప్పటికో ఒకప్పటికి రూపం కోల్పోతుంటాయి. అలాంటిది నువ్వు యీవిధంగా వరమిమ్మని కోరడం ప్రకృతి విరుద్ధం నాయనా.”

మహిషుడి ముఖం రంగులు మరింది.

ఇంతా చేసి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైనా, ఫలితం లేకపోతే ఎలా?

బ్రహ్మ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. వెంటనే గొంతు సవరించుకుని – “నీ కోరిక తీరటానికి ఒక మార్గం ఉంది…” అని ఆగాడు.

మహిషుడి ముఖంలో మళ్ళీ కాంతి నిండింది. “ఎలా స్వామీ?” అన్నాడు.

“మరణానికి ఒకే ఒక్క అవకాశమైనా ఇచ్చేందుకు అంగీకరించు. అది కూడా నీ ఇష్టాఇష్టాలను బట్టే!” అన్నాడు బ్రహ్మ.

మహిషుడి గుండె ఉప్పొంగింది. ఆలోచిస్తున్నట్టు కాసేపు మౌనం వహించాడు.

బ్రహ్మకు కూడా మనసులో కలకలంగా ఉంది. ఈ రాక్షసుడు ఎటువంటి నియమం పెడతాడో, తానేవిధంగా స్పందించాలో అని.

దీర్ఘాలోచన చేసిన తరువాత మహిషుడన్నాడు – “విధాతా! పురుషుడి చేతిలో మరణం లేకుండా వరమివ్వు. ఆడది, అబల, సుకుమార శరీరీ ఐన కోమలి వల్ల నాకెటువంటి భయమూ ఉండదు. ఉండబోదు కూడా అందుకే నా మరణానికి ఒక స్త్రీనే కారణంగా ఎంచుకుంటున్నాను. ఇప్పుడిక నాకు వరమివ్వటం తప్పదు!” అని బిగ్గరగా నవ్వాడు మహిషుడు.

నలు మొగాలలోనూ నవ్వులు చిందుతుండగా “తధాస్తు” అంటూ అంతర్ధానమైపోయాడు ఆ మొదటివేలుపు.

చిక్షురుడు మహిషుని సేనాధిపతి. తామ్రుడు కోశాధికారి. అసిలోమ, బిడాల, బాష్కల, త్రినేత్ర, కాలబంధకాదులు దండనాయకులు. అందరూ పరాక్రమంలో ఒకరిని మించిన వారొకరు. వీరందరూ తనవెంట నడవగా భూలోకం పై పట్టు సాధించిన వరగర్వుడైన మహిషుడికి ఇప్పుడు స్వర్గలోకం మీద కన్ను పడింది.

పైగా ఇంద్ర సింహాసనం తనది కావాలనీ, ఋతువులన్నీ తన ఆదేశం ప్రకారమే నడవాలనీ, గ్రహాలు కూడా తననే అనుసరించాలనీ వాడి కోరిక. బహుశా పెదనాన్నను అకారణంగా చంపిన దేవేంద్రుని మీద కసి తీర్చుకోవాలన్న ఆవేశం కారణమై వుండవచ్చు.

ఇంకేముంది? తన ప్రతినిధి నొకణ్ణి ఎంచుకుని, ఇంద్రుడికి సందేశం పంపాడు. ఆ దూత సరాసరి ఇంద్రుడు సభలో కొలువుతీరి ఉండగా, మహిషుడి సందేశం వినిపించాడు.

“ఓ అహల్యాజారుడా! ఇంకెంత కాలం నీకీ ఇంద్ర పదవి? నాకు అప్పగించేసి స్వర్గం వదిలి ఎక్కడికన్నా వెళ్ళిపో. లేదా నీ మొక్కవోయిన వజ్రాయుధం పట్టుకుని నాతో యుద్ధం చెయ్యి. నీకంతటి ధైర్యసాహసాలెక్కడివిలే? ఎంతసేపూ నీ చుట్టూ ఉన్నవారి అండదండలతో సింహాసనాన్ని అధిష్టించటమే గానీ నీ సొంత పరాక్రమమేదీ? పోనీ ఇవన్నీ అక్కరలేదు. నా శరణు వేడు. అది చాలు!”

మహిషుడి సందేశం విని ఇంద్రుడు కోపంతో ఊగిపోయాడు. కానీ దూత ముందు ఎందుకు బైటపడటమనుకున్నాడు.

“మీ రాజుగారి మాటలు అహంకారపూరితంగా ఉన్నాయి. దాన్ని యేవిధంగా అణచాలో నాకు తెలుసు. మీ మహిషోత్తముని మాటలెలా నా ముందు నిర్భయంగా చెప్పావో అదే విధంగా నా మాటలూ అంతే నిర్భయంగా ఆతనికి తెలియజెయ్యి. ఆకులూ అలములూ మేసే గేదెకే ఇంత కండ కావరముంటే, అమృతమే ఆహారంగా బ్రదికే నాకెంత గర్వముండాలి? ఆ కొమ్ములు రెండూ విరిచి, ధనుస్సు చేసుకోవాలనుంది. ఇది తప్పక చెప్పు! అక్కడే కూర్చుని మాట్లాడటమెందుకు? ఇక్కడికి వచ్చి నాతో యుద్ధమే చేయమని చెప్పు. వెళ్ళు.” అనేశాడు.

దూత యీ మాటలన్నీ తు.చ. తప్పక మహిషుడి ముందూ వల్లెవేయలేక రెండే రెండు మాటల్లో చెప్పేశాడు – “ప్రభూ! దాసుడు తన ప్రభువు ముందు అతనికి కోపం తెప్పించే మాటలు చెప్పకూడదంటారు కదా! ఇంద్రుడన్న మాటలు నేను మీముందు మళ్ళీ చెప్పలేను. మొత్తానికి మిమ్మల్ని అవమానపరచాడు.” అని మాత్రమే చెప్పాడు.

దూత మాటలు విన్న మహిషుడి కోపం కట్టలు తెంచుకుంది.

“అసలు నా వరమేమిటో కూడా మరచిపోయాడా ఇంద్రుడు? నేనీనాడు ఒక్కసారి తలచుకుంటే స్వర్గమూ మనదే, సురాపానమూ మనదే. మనల్ని మోసం చేసి, అమృతాన్ని పొంది, స్వర్లోక సుఖాలనుభవిస్తున్న యీ మోసగాళ్ళనందరినీ, అడవుల పాలు చేయకపోతే నా పేరు మహిషాసురుడే కాదు!” అని హుంకరించాడు.

ఒక్కసారి తన సింహాసనం నుండీ లేచి, గేదె రూపం ధరించాడు. కొమ్ములు విసరి, ముక్కు రంధ్రాల గుండా బుసబుసలతో ధరణి కంపించేలా హుంకరిస్తూ, వాలము పైకెత్తి గిరగిరా తిప్పుతూ, మూత్ర విసర్జన కూడా చేశాడు.

*****

ఈ మాటలు వినగానే, వెనుకనున్న పామర బృందంలోంచీ ఎవరో గట్టిగా నవ్వేశారు.

నిజానికి సూతుడు యీ మాటలంటుంటే, అక్కడ ముని బాలురకు కూడా పట్టరానంత నవ్వొచ్చింది. కానీ, పెద్దవాళ్ళేమంటారో అని నోళ్ళు ఘట్టిగా మూసేసుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడూ పశు పాలనలో గడిపే పామర జనానికిటువంటి దృశ్యాలు తరచూ కనిపించేవీ, పైగా నవ్వు తెప్పించేవి కూడా కావటం వల్ల ఎటువంటి అడ్డంకీ లేకుండా నవ్వు వచ్చేసింది.

సూతుడన్నాడు – “ఇక్కడ మహిషుని జన్మ సహజమైన లక్షణాన్ని దృశ్యమానం చేయటం, వ్యాసులవారి చాతుర్యం. వారి వర్ణనా చాతురికి మ్రొక్కులిడుతూ ముందుకు సాగుదాం” అని అన్నారు.

*****

ఇలా చేసిన మహిషుడు మళ్ళీ అందుకున్నాడు – “మనవాళ్ళందరినీ పిలిపించండి. సరదాగా స్వర్గ విహారం చేసి వద్దాం. పనిలో పనిగా, ఆ శచీపతి పని కూడా పట్టి, స్వర్లోక భామినుల నృత్య విలాసాలలో మనమూ మైమరచిపోదాం. ఇంకమీద, అదే మన శాశ్వతవాసం.” అని భయద భీకరంగా నవ్వాడు మహిషుడు.

*****

అటు దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులతో మంతనాలు జరుపుతున్నాడు. దూత వచ్చి వెళ్ళటం నుంచీ, మహిషుడి సందేశం వరకూ అన్నీ పూస గుచ్చినట్టే చెప్పాడు.

అందరి సలహాల మేరకు ఆలోచించి అడుగు వేయటమే అభిలషణీయమనిపించి, మాహిష్మతీ నగరానికి తన చారులను పంపాడు. వారి వల్ల అక్కడి పరిస్థితి స్పష్టంగా తెలిసింది. ఈ సమాచారం తో బృహస్పతి వద్దకు వెళ్ళాడు, సురపతి.

బృహస్పతి అంతా విని అన్నాడు.

“ఇంద్రా! కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు దైవాధీనాలనుకుని ఏమీ చేయకుండా భగవంతునిదే భారమంటూ కూర్చోకూడదు. మన వంతు కృషీ ఉండాలి. దీనినే పురుషకారము అంటారు పెద్దలు నీ ప్రయత్నం నీవు చెయ్యి. ఆ తరువాత దైవేచ్ఛ!”

దేవేంద్రుడికి ఆ దూత అన్న మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి.

మహిషుడికి బుద్ధి చెప్పితీరాలన్న పట్టుదల పెరిగింది. బృహస్పతికి సవినయంగా నమస్కరించి, మహిషుడికి వరమిచ్చిన బ్రహ్మ దగ్గరికే వెళ్ళాడు.

జనన మరణ వ్రాతలలో నిపుణుడైన విధాత ఆలోచించి, ఇంద్రుడిని, కైలాసనాధుని కూడా వెంటబెట్టుకుని సరాసరి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు.

శ్రీమహా విష్ణువు కూడా యుద్ధమే శరణమన్నట్టే మాట్లాడి, ఇంద్రుణ్ణి అష్టదిక్పాలకులతో సహా వారి వారి వాహనాల్లో మాహిష్మతీ పురికి బయలుదేరుదామని ఆజ్ఞాపించాడు.

*****

కథ వింటున్న వారందరిలో ఒకటే ఉత్కంఠ.

శ్రీమహావిష్ణువే వారి వెంట ఉంటే ఇక విజయం విషయంలో సందేహం ఉంటుందా?

ఇంతలో – “ఐతే…సామీ!” అన్న మాట వినిపించింది. ఆ గొంతు ఒక స్త్రీది.

అందరి కళ్ళలో చికాకు.

ఎంతో పట్టుగా నడుస్తున్న కథలో మధ్య మధ్య యీ పామర పాండిత్యంతో పెద్ద చిక్కే వచ్చి పడిందని కొంత మంది శిష్యుల కంగారు. కానీ, సూతులవారిలో ఏ భావమూ లేదు.

“ఎవరు తల్లీ అది?” అన్నారు వారు.

వెనుకనుంచీ ఒక నడి వయసు స్త్రీ లేచి నిలబడ్డది.

ఆమెను చూడగానే సూతులవారికి ఆమెకు వచ్చిన సందేహం అర్థమైపోయింది.

పెదవులమీద చిరునవ్వు విచ్చుకుంది – “తల్లీ! నీ సందేహం అర్థమైంది. నీ ప్రశ్నకు సమాధానం కాసేపట్లో అర్థమౌతుంది. కాస్త ఆగు!” అంటూ కథ మళ్ళీ కొనసాగించారు.

వింటున్నవారి ముఖాలింకా ప్రశ్నార్థకాలుగానే ఉన్నాయి.

ఆవిడ ఏమి అడగబోయిందో తెలియలేదు కానీ సూతులవారికి ఎలా అర్థమైపోయిందో ఎవ్వరికీ తోచనే లేదు.

సూతులవారు మళ్ళీ కథను కొనసాగించడంతో కథా శ్రవణం వైపు దృష్టి పెట్టారంతా.

*****

దేవ దానవులకు భీకరంగా యుద్ధం జరుగుతున్నది.

దేవతల ధాటికి మహిషుని సైన్యాధ్యక్షుడు చిక్షురుడు మూర్చపోయాడు.

బిడాలుడు, తామ్రుడూ యమపురికి వెళ్ళిపోయారు.

కోపం పట్టలేక మహిషుడే రణరంగంలోకి వచ్చి ఇంద్రుణ్ణీ, దేవ సేనలనూ ఆశ్చర్యచకితులను చేస్తూ, శాంబరీ విద్యతో విజృభిస్తున్న వైఖరి చూసిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ మాయాశక్తిని నిర్వీర్యం చేశాడు.

మహిషుడు, అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధక మొదలైన దండనాయకులు తోడు రాగా రణరంగంలో రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా తనకు వరమిచ్చిన బ్రహ్మ కూడా వారిలో ఉండటం వానికి చాలా కోపం తెప్పించింది. ఐనా వాని మోములో ఒక చిరునవ్వు విచ్చుకునే ఉంది.

కాసేపు మహిష రూపంలో చిందులు తొక్కాడు. మరి కాసేపు, మానవ రూపం దాల్చి వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టాడు. అంతలోనే సింహ రూపం దాల్చి దేవసైన్యం పై మెరుపు దాడి చేశాడు. మళ్ళీ మహిష రూపమే తనకు అనుకూలంగా ఉంటుందనుకున్నాడో ఏమో కొమ్ములు విసరుతూ విష్ణువును ఢీకొన్నాడు.

చిత్రంగా విష్ణువు విలవిలలాడుతుండగా, స్వామి భక్త పరాయణుడైన గరుత్మంతుడు తన స్వామిని తీసుకుని రివ్వురివ్వున విష్ణులోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు.

విష్ణువే వెనుదిరిగేసరికి శంకరుడూ డీలా పడిపోయి కైలాస మార్గం పట్టాడు.

బ్రహ్మకు తల దిమ్మెక్కి హంస వాహనం మీద తుర్రుమన్నాడు.

దేవ సేన బిక్క చచ్చిపోయింది.

ఇంద్రుడూ, వరుణుడూ, యముడూ, సూర్య చంద్రాదులతో కలిసి ఎంత పోరాడినా మహిషుడి యుద్ధవిద్య ముందు వెలాతెలా పోతున్నారు.

దేవేంద్రుడు కూడా బలుసాకు తిని బతుకుదామనుకుంటూ పారిపోవటం చూసిన వరుణాదులంతా వచ్చిన దారినే వెళ్ళబోయారు.

కానీ ఇంతలో మహిషుడు విజయ గర్వంతో – “దానవ వీరులారా! శభాష్! మన దెబ్బకు త్రిమూర్తులు మొదలు దేవతా వర్గమంతా పారిపోయారు. వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళకూడదింక. అది మనది. నేను ముందే మీతో అన్నాను. ఇకపై అమృతమూ మనదే, అప్సరలూ మనవారేనని. నేను వెళ్తున్నాను! నా వెనుకే మీరంతా! ఇకపై మన సభలన్నీ స్వర్గ వేదికల మీదే.” అని దిక్కులదిరేలా ఫెళ్ళున నవ్వుతుంటే రాక్షససైన్యాలు దానికి తమ వంతు అట్టాహాసాలు కూడా కలిపి కేరింతలు కొడుతున్నారు.

దేవతలకందరికీ గొంతులో వెలక్కాయ పడ్డట్టైంది.

అంటే తమకిక స్వర్గ లోక ప్రవేశo లేదన్నమాట! భూమి మీదే కొండల్లో, పర్వత పంక్తుల్లో తలదాల్చుకోవలసిందేనన్న మాట!

వేరే మార్గం తోచక అందరూ తలో దారిన అడవుల అన్వేషణలో పడ్డారు.

*****

సూతుడు యీ మాటలంటూ – “ఏమమ్మా! నీ సందేహానికి సమాధానం దొరికిందా?” అని ఇంతకు ముందు ప్రశ్నించిన స్త్రీ వైపు దృష్టి సారించాడు.

ఇలా సూతులవారు కథ మధ్యలో ఆపి, ఇంతకుముందు ప్రశ్నించిన స్త్రీ గురించి చూడటమేమిటి? అని అనుకుంటూ శిష్యులందరూ వెనుదిరిగి చూశారు.

విచిత్రం…ఆవిడ అక్కడ కనిపించలేదు!

ఆమె ఎవరై ఉంటుంది?

(సశేషం)

Your views are valuable to us!