చుప్పనాతి – ధారావాహిక – త్వరలో

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 3.8]

 

 

నాగపద్మిని గారి గురించి:

సరస్వతీపుత్ర బిరుదాంకితులు ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారల ముద్దు బిడ్డ డా.పుట్టపర్తి నాగపద్మిని గారు. తల్లిదండ్రులిరువురూ, సంగీత సాహిత్యాలలో సుప్రసిద్ధులు.

నాగపద్మిని గారు తల్లిదండ్రులా బాటలో నడుస్తూ, 1978 నుండీ ఆకాశవాణిలో పనిచేస్తూనే, హిందీ లో పీహెచ్ డీ, జర్నలిజం, అనువాద కళ, టీవీ ప్రొడక్షన్లలో పీజీ డిప్లొమాలను సాధించటమే కాదు. తెలుగు, హిందీ లలో కథా, గీత, కవిత, అనువాద, సాహితీ వ్యాస ప్రక్రియల్లో ఇప్పటిదాకా 45 గ్రంధాలదాకా వ్రాశారు. దేశవ్యాప్తంగానే కాదు, అమెరికాలోనూ, లెక్కకు మిక్కిలిగా సాహిత్య ప్రసంగాలు చేశారు.

యెస్.వీ.బీ.సీ, జయజయశంకర, హిందూ ధర్మం చానళ్ళలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గత 20 సంవత్సరాలుగా హిందీ, తెలుగులలో ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానాలనిస్తూ తరిస్తున్నారు. ఎందరో ప్రముఖుల ద్వారా సత్కారాలనూ,ఇటీవల జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

మరపురాని సత్కారాలు

2008 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డిగారు.

2012 లో అప్పటి తమిళనాడు గవర్నర్ డా.రోశయ్యగారి ద్వారా – తమిళనాడు హిందీ అకాడమీ అవార్డ్

2012 లో తెలుగు విశ్వవిద్యలయం ఉత్తమ అనువాద పురస్కారాన్ని డా. సీ.నారాయణరెడ్డి గారి

2019లో ప్రతిష్టాత్మక జాతీయ గోయెంకా అనువాద పురస్కారం.

బిహార్ సాహిత్య సమ్మేళన్ వారు దేశవ్యాప్తంగా 100 మంది కవయిత్రులకు ఇవ్వ తలపెట్టిన సత్కారానికి ఎంపికై, గోవా గవర్నర్ డా,మృదులా సిన్ హా గారి ద్వారా 2019 మార్చి నెలలో పాట్నాలో అందుకున్నారు.

2020లో వారు సాధించిన మరో జాతీయ పురస్కృతి – దక్షిణ రైల్వే, రాజభాషా సంఘఠన్ చెన్నై వారు 2020 సంవత్సరానికై వెలువరించిన టేబుల్ కాలెండర్ లో జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న కవయిత్రులలో ఒకరిగా, డా.పుట్టపర్తి నాగపద్మిని గారి కవిత, వారి ఫోటో తో సహా ప్రచురితమవటం.

తన ప్రతి గుర్తింపునూ, తమ తల్లిదండ్రుల ఆశీర్వాద ఫలమేనని ఆర్ద్ర నేత్రాలతో వినమ్రంగా చెబుతారు నాగపద్మిని గారు.

ఇక యీ నవల విషయానికి వస్తే, 1990-96 ప్రాంతాల్లో తెలుగు హిందీ రామకావ్యాలలో సీత అన్న విషయం పై పీ.హెచ్.డీ చేస్తున్నప్పుడే,శూర్పణఖ పాత్ర పట్ల ఆకర్షితురాలయ్యారట. అప్పటినుంచే, రామాయణంలో శూర్పణఖ పాత్ర, వివిధ రామ కావ్యాలలో ఆమె గురించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలన చేసి “చుప్పనాతి” అన్న శీర్షికతో నవలను వ్రాసారు.

ఆ నవలను ఆగస్ట్ 28 నుండిధారావాహికగా అందించబోతోంది ఆవకాయ.ఇన్.

ప్రతి శని, ఆదివారాలలో రాబోయే ఈ వినూత్న రచనను ఆవకాయ పాఠకులు ఆదరిస్తారని, చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాం.

 

ధన్యవాదాలు

ఆవకాయ బృందం

 

Your views are valuable to us!