1950 లో కన్నడ భాషలో ’మహాబ్రాహ్మణ’ అనే పేరుతో శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు వ్రాసారు. వారి పేరును బట్టి వారు తెలుగువారని వేరే చెప్పనక్కరలేదు. అయితే వారు కర్నాటక (అప్పటి మైసూరు) రాజ్యంలో పుట్టి పెరిగి అనేక ప్రసిద్ధ నవలలు కన్నడ భాషలో వ్రాసారు.
ఈ కథ గురించి వారి మాటలలోనే….
ముందుమాట
“మహాబ్రాహ్మణ కథ ప్రసిద్ధులైన వశిష్ఠ-విశ్వామిత్రులది. బహు పురాతనమైనది. ఋగ్వేద, యజుర్వేద, ఐతరేయ, కౌషీతకీ, గోపథ, శాంఖాయన, షడ్వింశ బ్రాహ్మణములు, రామాయణము, మహాభారతము, హరివంశము, విష్ణు పురాణము, వాయుపురాణము, యోగ వాశిష్ఠము – వీటియందు ఉన్నది.
వీటన్నింటి కంటే రామాయణ కథను ప్రధానమైనదిగా తీసుకొని, ఇతరచోట్ల దొరకిన అంశాలను దానిలో సందర్భోచితముగా చేర్చి అల్లిన కథే ఈ ” మహాబ్రాహ్మణ.”
ఈ కథలో అక్కడక్కడ ఉపనిషత్తుల రహస్య విద్యలు కూడా కనిపిస్తాయి. ఈ విద్యా ప్రతీకలో కొన్ని స్వానుభవాలు, కొన్ని పరానుభవాలు. ఇంకొన్ని వ్రాస్తున్నప్పుడు తమకు తాముగా తోచినవి.
రుద్రుడు ప్రత్యక్షమవడం , దేవతలు వచ్చి మాట్లాడం – ఇవన్నీ స్వానుభవాలు.
ప్రాణాగ్ని హోత్రము, పంచాగ్ని విద్య – ఇవి వాటిని ఆచరించి చూచినవారు చెప్పగా వచ్చినవి.
మదనుడు చెప్పిన అహంకార విమర్దనము, జగన్నాథుని తేరు, గాయత్రీ సాక్షాత్కారానికి ముందు వచ్చు బ్రహ్మణస్పతి, పూషా దేవుని అనుగ్రహము మొదలయినవి తాముగా వచ్చి తోచినవి.
అట్లే, దివ్య స్త్రీలు మానవునితో సంసారం చేసిన సన్నివేశాలు, కవషుడు-ఐలూషుడు అనే శూద్రలు విశ్వామిత్రుని అనుగ్రహం వల్ల ఋషులవడం, ఋగ్వేదపు నాలుగవ మండలానికి తన పేరు పెట్టిన వామదేవుడు ఏడవ మండలపు ద్రష్ట అయిన వశిష్ఠుల శిష్యుడవడం, మూడవ మండలపు విశ్వామిత్రుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కారణమవడం – ఇవన్నీ రచయిత సృష్ఠి.
లోకంలోని జీవులలో వ్యాపించివున్న ప్రాణం మౌలికంగా ఒక్కటే!
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
కాలం వేరు వేరు పేర్లతో ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ ఉన్నదంతా ఒకటే కాలం.
ధర్మ పరిషత్తు, బ్రహ్మ పరిషత్తు చూస్తుండగనే లోపలి అంతస్థమును తెలుసుకోవడం – ఇవన్నీ శాస్త్ర విషయాలు.
ఇట్లే ఏదేదో, ఎంతెంతో చదివి, అంతంత విని, ఇంకొంత స్వానుభవం వలన సంపాదించుకొని, గురుకృప వలన అంతటినీ కరగించి అచ్చుపోసిన బొమ్మ ఈ రచన.
దీనిని వ్రాయాలన్న కోరిక మొదటగా పుట్టింది 1926లో. అప్పటికి గాయత్రి మహిమ తెలిసి, గాయత్రిని తెలిసినవాడు చతుర్వింశతి (24) తత్త్వాలను తిరగవెయ్యగలడు అన్న నమ్మకం కుదిరి, ఆ గాయత్రిని చూసి లోకమునకు పంచి పరమోపకారము చేసిన మహానుభావుని కథ వ్రాయాలని అనిపించింది. అయితే, శాస్త్రాన్ని ఒక్కటాఇన సంప్రదాయబద్ధంగా చదివి, ఋషి ఋణంను తీర్చేవరకూ ఆ మహామహుని కథను వ్రాయుడం ఉచితం కాదని సుమారు ఇరవై సంవత్సరాలు అట్లే ఉండి 1946 లో రాయలన్న కోర్కె బలంగా పెరిగి లేఖన కార్యం మొదలుపెట్టాను. అలా మొదలైన రచనా వ్యాసంగం సుమారు 1950 ఆగస్టుకు ముగిసింది.
మహాకృతులను అందించిన వారందరికీ ఒక విషయం అనుభవంలోకి వస్తుంది. “నేను ఎవరు?” అని పగలూ రాత్రీ సంఘర్షణ పొందుతారు. ఈ జీవము తన అల్పత్వాన్ని వదలి, పిచికారి చిమ్మినట్లు పైకి ఎగసి, అంతవరకూ తనకు తెలియని విషయమును సంపాదించుకుని వచ్చి హృదయాన్ని నింపుతుంది. ఆ నిండినది కృతి రూపంగా బయటికి వస్తుంది.
ఈ అజ్ఞాత విషయాలున్న అమృత భాగాన్ని పురుషసూక్తము “దశాంగుళము“ల అవతల ఉందని చెబుతోంది. గీతా సారమూ ఇదే! ఇదే మంత్రము యోగపు ఉన్మనీ భావము (ఉత్కంఠతా భావం). దీనినే గురు కృప లేదా గురు ప్రసాదము అని అంటారు.ఉపనిషత్తులు దీనినే దేవాప్యయము అని అంటాయి.
“సర్వస్య చాఽహం హృది సన్నివిష్ఠః | మత్తః స్మృతిర్‍జ్ఞానమపోహనం చ” అనే గీతోక్తి అనుభవానికి వచ్చేవరకూ ఆ మాట అర్థమవడం కష్టం. ఇవన్నీ ఎట్లున్నా ఈ కృతి చదివిన వారికందరికీ ఎన్నో కొత్త విషయాలను తెలుస్తున్నాయి అనేది అర్థమతే చాలు.
ఈనాటి సాహిత్యం సామాన్యుల్ని వర్ణించే పనిలో నిమగ్నమయింది. కొందరికి హిమాలయాలను ఎక్కాలన్న కోరిక. కొందరేమో ఇంటి పక్కనున్న అందమైన కొండను కూడా ఎక్కరు? ఎవరు సరైన వారు? సానకు పట్టేది రత్నాన్నే కానీ రాయిని కాదు కదా! అట్లే మహావిషయాలను విమర్శించాలన్నా, మహాపురుషులను వర్ణించకపోతే వేరే దారి ఏది? గుడిసెను చిత్రించేప్పుడు పెద్ద భవనం కనబడుతుందా?
జగత్తు కొత్త యుగపు దారి పట్టి నడుస్తోంది. దేశం స్వతంత్రమయింది. జగత్తుకు కొత్త వెలుగు కావాలి. పూర్వపు ధర్మాచార పరాయణుల దారిన నడిచే వివేకానంద-రామకృష్ణుల్లా అనుభవ వేదాంతాన్ని లోకానికిచ్చి, తాను ఉద్ధరింపబడి, లోకాన్ని కూడా ఉద్ధరించే కార్యమే స్వతంత్ర భారతదేశపు కర్తవ్యమన్న నమ్మకమున్నవారు ’ శూద్రుణ్ణి బ్రాహ్మణుని చేయు’ గాయత్రి కర్త యొక్క కథను గౌరవిస్తారు. సూపర్ మ్యాన్ కావలన్న కోరిక కలవారు అతని దారి పట్టి కృతార్థులవుతారు.
ఈ కథను అక్కడక్కడా పైపైన చదివిన వారు కూడా సంతోషాన్ని పొందారు. భారతీయుల మనోవృత్తి, భారతీయుల వ్యక్తిత్వం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అన్నారు. ఈ మాటని అంగీకరించేవారు ఈ కథ భారతదేశపు బయటికి కూడా వెళ్ళి వైదీక సంస్కృతి యొక్క మహత్వాన్ని వెలిగించాలని కోరుకున్నారు.
బ్రాహ్మణ ద్వేషం , వైదీక సంస్కృతి తిరస్కారం నిండిన ఈ కాలంలో ఇలాంటి కథ వ్రాయుడమా? అని కొందరు మిత్రులు అనుమానపడ్డారు.
చీకటి ఉన్నపుడే వెలుగు కావలసినది!
అనాదిగా ప్రపంచం ఈ విధంగా ఇదీ అదీ, రెండూ కలసిపోయినట్టుగా ఉంది. మిత్రులు ఉన్నపుడు శత్రువులు కూడా ఉంటారు. అయితే, సాహిత్యం ఉండేది మంచి మిత్రుల కోసమే. అరటి పండు, పనస పండు పుట్టినది కడుపునొప్పితో బాధపడే వారి కోసం కాదు. ఆకలితో అల్లల్లాడుతున్నవారి కడుపును నింపడానికి.
దేశకాల పరిస్థితులకు లోనైన వారు వేదోపనిషత్తుల, బ్రహ్మర్షుల బలగమంతా ఒకేవైపుకు చేరినది చూసి చారిత్రకంగా ఇది అబద్ధమనీ, ఊహాగానాలనీ అన్నారు. ఇలాంటి ఎన్నెన్నో సందేహాలు ఎంతోమందికి వచ్చివుంటాయి. వాటికన్నిటికీ ఈ రచనలో సమాధానాలు ఉన్నందువల్ల ఈ ముందుమాటలో వాటన్నింటినీ ప్రస్తావించడం లేదు.
మొత్తానికి ఆస్తికులకు అమృత ఖండమై, ఇతరులకు ఒక కలకండముక్కగా అయినా కావాలని పుట్టిన ఈ కథ అందరికీ అమృతఖండమే అనిపించితే అది మన భాగ్యం. ఎందుకంటే, ఈ కథలో చిత్రితమైనది భరత ఖండం యొక్క ఆత్మ. పరదేశపు, పరమతపు వారి దాడికి వేలకొలదీ సంవత్సరాలు గురియైనా ఇంకా పాతాళానికి పడిపోకుండా ఉండడానికి ఈ జనతకు సామర్థ్యాన్నిచ్చే అంతఃశ్శక్తి – శ్రీ రామకృష్ణ, దయానంద, తిలక్, టాగోర్, గాంధీ వంటి సత్పుత్రులను పొందిన ఈ దేశం యొక్క సౌభాగ్యమే.
ఈ కథలో విశ్వామిత్రుడు పొందిన సిద్ధులనన్నింటినీ పొందిన, పొందగల ధీమంతులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అందువలన ఈ రచనను “ఓ కథ మాత్రమే!” అనేవారిమి కథలాగా, శాస్త్రమన్న వారికి శాస్త్రంగా, విద్య అనుకొన్నవారికి విద్యగా కనిపించగలదు.
ఇది ఎక్కడెక్కడినుండో , ఎవరెవరికో వచ్చినది . రచయిత ఒక ఫలభోక్త అయినందు వలన, కర్తృత్వము స్వనిష్ఠమై ఉంటుందని తలచి నాకు ఈ భాగ్యాన్ని కలిగించిన వారికి కృతజ్ఞుడనై ఉంటానని మనవి చేసుకొంటున్నాను.
–దేవుడు.
ఈ పుస్తకాన్ని తెలుగులో ఇదే పేరుతో “విభాతవీచికలు” అనే బ్లాగులో ఆ రచయిత “జనార్దన శర్మ* గారు దాదాపు 80కి పైగా ధారావాహికలుగా వ్రాశారు. ఇప్పటికీ ఆ బ్లాగులో చదవవచ్చు.
Where can we get this book? Is Telugu version available?
చాలా గొప్పగా ఉంది. ఒక 13,14 సంవత్సరాల క్రితం బ్లాగ్ పేరు గుర్తుకు రావడం లేదు , కానీ శాస్త్రి గారిదే ‘ నచికేతాగ్ని ‘ గురించి చదివాను. అద్భుతంగా వుంది. మరలా ఆ వైభవాన్ని గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు. -9441481014 sri