పుల్లయ్య గుప్తనిధి
కోపం చెట్టు
పుల్లయ్య కొమ్మెక్కి కూర్చున్నాడు.
వాడితో బాటూ వాడి ’బుర్ర’ కూడా ఉంది. అదెప్పుడూ వాడితోనే, వాడిలోనే ఉంటూంటుంది.
దూరంగా ఆవులు మేస్తున్నాయి. మధ్యమధ్య అరుస్తున్నాయి. మళ్ళీ మేస్తున్నాయి. లేగదూడలు కొత్తగా కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ గెంతులేస్తున్నాయి.
రెండు కుక్కలు సరిహద్దుల కోసం కొట్లాడుకొంటున్నాయి. కొన్ని కోతులు బిరబిరా బయలును దాటి తోపు కేసి పరుగెడుతున్నాయి.
పుల్లయ్య చూపులు మాత్రం ఎదురుగా, దూరంలో నిలబడివున్న కొండల కేసి చూస్తున్నాయి. వాడి కంటికి, కొండలకీ మధ్య గీత గీస్తున్నట్టుగా మేఘాలు సాగుతున్నాయి.
అతని చూపుల్ని మరల్చడానికేమో అన్నట్టు నాలుగు కొంగలు ఇటునుండి అటుకు ఎగిరితే, ఒంటరి కాకి ఒకటి అరుస్తూ గద్దలా రెక్కల్ని నిలిపి గిరికీలు కొట్టడానికి ప్రయత్నిస్తోంది.
చుట్టూ వున్న వాతావరణం చల్లగా ఉంది. వెల్ల వేసినట్లుగా సూర్యుడి బంగారు వెలుగులో చుట్టు పట్టులన్నీ మెరిసిపోతున్నాయి.
ఎవ్వరి కోసమని ఈ ప్రకృతి ఇన్ని వగలుపోతుందో!
పుల్లయ్య కదల్లేదు.
వాడంతే!
కదలడు – వదలడు.
పుల్లయ్యకు కోపమొస్తే అలా కొమ్మెక్కి కొండలకేసి చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కూడా వాడికి కోపమొచ్చింది. కనుకనే కొమ్మెక్కేసాడు.
పుల్లయ్య కోపానికి సవాలక్ష కారణాలు ఉండవు. ఎప్పుడూ వచ్చే ఆ కోపానికి ఎప్పుడూ ఒకే కారణం. “పుల్లయ్య’ అనే మూడక్షరాలు.
– – – –
“నాన్నా! నువ్వు ఈ పేరెందుకు పెట్టావ్?”
“అది మీ ముత్తాత పేర్రా! ఆయన మనూర్లో, మన జాతిలో చానా గొప్పోడు.”
“నాకీ పేరొద్దు! నాకు కొండయ్య అనే పేరు కావాలి.”
“ఒకసారి నామకరణం చేసినాక మళ్ళీ మార్చుకోకూడదురా. ఆచారం ఒప్పుకోదు.”
“ఆచారమా? ఇదెవరు! నీ ముత్తాతా?”
“హాహాహా…వెర్రినాగన్నా! ఆచారం అంటే నా ముత్తాత కన్నా వెనకాతలిది. ఈ ప్రపంచకంలోని అందరి కన్నా పాతది. అది చెప్పినట్లే మనం నడుచుకోవాల.” అన్నాడు శరభయ్య.
ఈ మాటకు లోపలినుండి ’బుస్’మన్నది పుల్లయ్య బుర్ర.
“నువ్వు నడుచుకో. నాకు మాత్రం కొండయ్య అనే పేరే కావాలి.”
శరభయ్యకు తన కొడుకు చేసే మారాము అన్నా, వాగ్యుద్ధమన్నా ఎంతో ఇష్టం. వాడెంత వితండవాదం చేసినా వింటాడు. అందుకని తమాయించుకొని – “ఇప్పుడేమైందిరా?” అన్నాడు.
“నన్నెప్పుడైనా నువ్వు సరిగ్గా చూసావా?”
“ఓరినీ! నువ్వు పుట్టినప్పట్నుంచీ చూస్తూనేవున్నాగదా?”
“మరి నీ కంటికి నేనెట్లా కనబడ్తున్నా?”
“నీకేంరా! మారాజులాగున్నావు. నా దిష్టే తగిలేను.”
“ఇదిగో నాన్నా! ఇలా అబద్ధాలు చెప్పడానికి ఆచారం ఒప్పుకొంటుందా? చూడు…ఎలా సన్నగా, పీలగా, బక్కగా, కర్రపేడులాగున్నానో. ఎందుకంటావ్? పుల్లయ్య అని పేరు వల్లేగదా.”
“అని ఎవర్రా చెప్పారు?”
“నా బుర్ర చెప్పిం”దని అంటే నాన్న ఏమంటాడోనని “ఒకరు చెప్పేదేంది! నాకే తెలుసు. అందుకే నాకా పేరు వద్దు. ఇప్పుడే మార్చేసుకొంటా. ఇప్పట్నుంచి నేను పుల్లయ్యని కాను కొండయ్యని.”
ఎంతో ఇష్టపడి తన తాత పేరును కొడుక్కి పెట్టుకున్నాడు. ఆయన కాలంలో ఆ ఊర్లో ఆయనే చానా గొప్పోడు. అంతటి వాడి పేరును వీడిలా కొట్టిపారేస్తుంటే అంతవరకూ ఉండిన ముద్దు ముచ్చటా తొలిగిపోయింది.
“నోరు ముయ్యరా! వెధవ సోది నువ్వూనూ. నీ పేరు మార్చడానికి కుదర్దు. మా తాత పేరే ఉండాల. ఫో…పోయి తోటలో బెండకాయలు కొసుకురా. సంతకు తీసుకెళ్ళాల.” అని హుంకరించాడు శరభయ్య.
పుల్లయ్య ఎదిరించినట్టుగా కదలకుండా నిలబడ్డాడు.
భుజం మీది తుండును తీసి గట్టిగా విదిలించాడు శరభయ్య.
ధభీమని నులక మంచం మీదకు కావాలనే పడిపోయాడు పుల్లయ్య.
“ఏందిరా నీ యవ్వారం?” అని విసుగ్గా అరిచాడు శరభయ్య.
“చూసినావా? నీ తుండుగుడ్డ గాలికే పడిపోయాను.” అన్నాడు పుల్లయ్య వెక్కిరింపుగా.
అంత కోపంలోనూ పకపకా నవ్వాడు శరభయ్య. వెనకటి ప్రేమ, ప్రీతి మళ్ళీ వచ్చి కూర్చున్నాయి. కొడుకు గుండుమీద ప్రేమగా మొట్టి – “పోరా…వెర్రోడా. బెండకాయలు తీసుకురా ఫో” అని అన్నాడు.
అంతే పుల్లయ్యకు మళ్ళీ కోపమొచ్చేసింది.
వాడి కోపానికి మసాలా కూరుస్తున్నట్టుగా లోపల్నుండి ’బుస్’మని బుసగొట్టింది వాడి బుర్ర.
అదెప్పుడూ అంతే! పుల్లయ్యకి కోపమొచ్చినప్పుడల్లా బుసకొట్టి రెచ్చగొడ్తుంది. ఏవేవో నూరిపోస్తుంది.
ఇప్పుడు కూడా “రేయ్! నాన్న మాట వినకురా! నువ్వు కుర్రోడివని ఆయన అట్లా తీసిపారేస్తున్నాడు. నీకు తెలీకుండా పేరు పెట్టేసాడు. ఇప్పుడు నువ్వడిగినా పేరు మార్చనంటున్నాడు. ఏమిటిదంతా? తలబిరుసు కాదా? నీ మీద, నీ పేరు మీద వీళ్ళదేంట్రా పెత్తనం? ఆయ్…”
ఆ లోపలి తోపుడుకు గట్టిగా ఊపిరి తీసి వదిలాడు పుల్లయ్య.
“ఏంట్రోయ్! బుసకొడ్తున్నావ్? వెధవా…పో…తోటకుపోయి బెండకాయలు కోసుకురా!” అన్నాడు శరభయ్య.
ఆయనకు కొడుకు ధోరణి నచ్చడం లేదు. కుర్రాడు కాస్త పెరిగి పెద్దయ్యాడు, ఎందుకులే తిట్టడమని తమాయించుకొన్నాడు. కానీ వాడలా బుస కొడ్తూ నిలబడ్డం నచ్చడంలేదు.
తండ్రి ’వెధవా’ అని తిట్టడంతో పుల్లయ్యకు, వాడి బుర్రకు ఒకేసారి కోపం వచ్చేసింది.
వాడు తోటకు బదులు తన కోపావృక్షం వైపుకు పరుగుతీసాడు.
దారి పొడుక్కీ వాడి బుర్ర ఏదేదో చెప్తూనేవుండింది.
నాన్న చెప్పిన మాటల్ని వినకూడదని, పాటించకూడదని నూరిపోస్తోంది. పెద్దోళ్ళందరికీ బుర్రలుండవని, ఉన్నా అవి తనలా చురుగ్గా, చలాకీగా ఉండవని చెప్తోంది. ముసలి బుర్రలకి పనీపాటా ఉండవని, ఎప్పుడూ ఉసూరుమని మూలుగుతుంటాయని, చలాకీగా వుండే కుర్రబుర్రల్ని చూస్తే వాటికి కన్ను కుడుతుందని, అందుకనే అవెప్పుడూ కుర్ర బుర్రల్ని అవమానించడానికే ఆరాట పడుతుంటాయని చెప్పింది.
ఆ మాటల్ని వింటున్న కొద్దీ పుల్లయ్య కాళ్ళకి వేగం, మనసులో క్రోధం పెరగసాగాయి.
– – – –
తరువాయి భాగం రేపు