పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారడానికి ముందు…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పుల్లయ్య గుప్తనిధి

 

తెల్లవారడానికి ముందు…

 

ఎంతసేపలా గడిచిందో గానీ పుల్లయ్యకి మనసులో మనసు లేదు. ఇప్పటిదాకా తను ఎన్నిసార్లు ఈసడించుకొన్నా విసుక్కోని సన్యాసి బంగారం విషయంలో అంత కోపాన్ని చూపించడం వాడికి భయాన్ని పుట్టిస్తోంది.

పక్కకు తిరిగి పడుకొనే మిషతో సన్యాసి వైపుకు చూసాడు. అతను అక్కడే, అలానే, కళ్ళు తెరుచుకొనే జారిగిలబడివున్నాడు.

టక్కున లేచి, బల్ల దిగి, సన్యాసి కాళ్ళు పట్టుకొన్నాడు.

అనుకోని ఈ ఘటనకు ఉలిక్కిపడ్డ సన్యాసి – “లే లే” అని పుల్లయ్య భుజాల్ని పట్టుకొన్నాడు.

“నేను తప్పుచేసుంటే క్షమించు స్వామీ!” అన్నాడు.

నవ్వాడు సన్యాసి. ఆ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు తోచింది పుల్లయ్యకి.

అతని పక్కనే కూర్చొన్నాడు.

“నాకు బంగారం చేయడం తెలుసు.” అన్నాడు సన్యాసి ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా.

పుల్లయ్యకి ఆశ్చర్యం వెయ్యలేదు. పక్కింటి అవ్వ చెప్పిన కథల వల్ల వాడికి చాలా విషయాలు ముందుగానే తెలిసిపోతున్నాయి గదా!

“నువ్వూ నేర్చుకొంటావా?”

ఏం చెప్పాలో తోచలేదు వాడికి. ఒక నిముషం తర్వాత “నేర్పితే నేర్చుకొంటాను స్వామీ!” అన్నాడు చాలా వినయంగా.

బంగారం చేయడం నేర్చేసుకొంటే ఎలావుంటుందని ఒక్క నిముషం ఊహించుకొన్నాడు –

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
ఊళ్ళో తన ఇంటిముందు పొడుగాటి వరసలో జనాలు. ఇత్తడి చెంబులు, రాగి బిందెలు, కంచు తప్పేళాలు…ఇంకా అలాంటివే ఎన్నో పాత్రలు పట్టుకొని నిలబడివున్నారు. ఇంట్లో తను హాం ఫట్ అంటున్నాడు. అనడమే ఆలస్యం ఎదురుగా ఉన్న వస్తువు బంగారంగా మారిపోతోంది. ఆ పాత్ర యజమాని సాగిలబడి కానుక చెల్లించుకొని పోతున్నాడు. ఇంతలో రాజుగారు వచ్చారని వార్త. తనే లేచి ఎదురువెళ్ళాడు. రాజుగారి వెంట వంద బళ్ళ నిండుగా సామాన్లు. దివాణంలోని ఒక్క గరిటె కూడా వదలకుండా తీసుకొచ్చారని మంత్రిగారు వినయంగా విన్నపం చేసుకొన్నారు. తను హాం ఫట్ అన్నాడు. రాజుగారి సంబరపడిపోయి ఒక బిందె, ఒక గరిటె, ఒక తట్టను కానుకగా సమర్పించుకొని వందబళ్ళనీ తోలుకుపోయారు. తన పక్కనే వున్న నాన్న మీసం దువ్వుకొంటూ ’మా కొండయ్యంటే ఏమనుకొన్నారు…ఆయ్” అని ఊరివాళ్ళతో అంటున్నాడు.

“పుల్లయ్యా! పుల్లయ్యా!” అని సన్యాసి కుదిపితే గానీ మెలకువ కాలేదు.

తన కలకు తానే సిగ్గుపడ్డాడు. “చెప్పు స్వామీ” అని అన్నాడు.

“బంగారం చేయడం చాలా కష్టం సుమా! కొండనెక్కడానికి ఎంత కష్టపడ్డావో దానికి పదింతలు పడాలి.”

“ఓ పడ్తాను స్వామీ.”

“అంత ధైర్యంగా ఎలా చెప్పగల్గుతున్నావ్?”

“నువ్వున్నావుగా స్వామీ!”

నవ్వాడు సన్యాసి. పుల్లయ్యను చూస్తూ “సరే. నువ్వు మొదటగా ముఖ్యమైనది, చాలా కష్టమైన పని ఒకటి చెయ్యాలి. అది చేసేసావంటే బంగారం విద్య నేర్చుకోవచ్చు!” అన్నాడు.

“చెప్పు స్వామీ, చేసేస్తా” అని ముచ్చటపడ్డాడు పుల్లయ్య. వాడికి బంగారం విద్య, దాని వల్ల వచ్చే పేరు తెగ ఊదరపెట్టేస్తున్నాయి. మాటలన్నీ అనాలోచితంగా వచ్చేస్తున్నాయి. ఆ పనేదో సన్యాసి చెప్పడమే తరువాయి చేసేయ్యాలని ఉవ్విళ్ళూరిపోతున్నాడు.

“ఆ(…ఏం లేదు….నువ్వు మీ అమ్మనీ నాన్ననీ మర్చిపోవాలి!” అన్నాడు.

మతిపోయింది పుల్లయ్యకి.

“ఎలా స్వామీ! బంగారం చెయ్యాలంటే వాళ్ళనెందుకు మర్చిపోవాలి?” చాలా అమాయకంగా అడిగాడు.

అప్పటిదాకా వాడిలో కొలువుదీరి రాజ్యం చేసిన వాడి ’బుర్ర’ పలాయనం చిత్తగించేసినట్టుంది. బాల్య సహజమైన భయం వాడిలో స్పష్టంగా కనబడుతోంది.

“పుల్లయ్యా! బంగారం చేసేవాడు బైరాగిలానే బ్రతకాలని బ్రహ్మయ్య శాపం. మరి వాళ్ళని వదిలెయ్యాలి. తప్పదు.” అన్నాడు సన్యాసి.

బిక్కమొహం వేసాడు పుల్లయ్య. “నీకంటే అమ్మా నాన్న చిన్నప్పుడే తప్పిపోయారు. మరి నాకేమో….” మిగతా మాటల్ని గుటకలు వేస్తూ మింగేసాడు.

“ఐతే ఒక్కమాటలో చెప్పు. వాళ్ళని వదిలివుండగలవా? లేదా!” అని నిష్టూరంగా అడిగాడు సన్యాసి, పుల్లయ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“లేదు స్వామి. నా చేత కాదు. నాకు అమ్మా నాన్నా కావాలి.” గొంతు పూడుకుపోతుంటే బేలగా పలికాడు పుల్లయ్య.

వాడి తలను నిమిరాడు సన్యాసి.

“అసలు బంగారం ఏమిటో తెలుసుకొన్నావు.” అని నవ్వాడు.

పూర్తిగా అర్థం కాకపోయినా పుల్లయ్యా నవ్వాడు.

ఆపై వాడు సుఖంగా నిద్రపోయాడు.

– – – –


Your views are valuable to us!