పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏదో ఉంది!

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

పుల్లయ్య గుప్తనిధి

 

కొండ మీద ఏదో ఉంది!

 

కొండనెక్కడం చెట్టెక్కినంత సులభం కాదు.

మొదటిసారిగా ఎక్కుతున్నాడు కదా, చాలా కష్టపడుతున్నాడు.

గస పోసినప్పుడల్లా ఏదైనా బండరాయి పైన కూర్చొని ఎంత ఎత్తు ఎక్కాడో చూసుకొంటున్నాడు. చాలా కొంచమే ఎక్కినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే బయల్దేరేముందు తనకు అపశకునం పలికిన తెల్లావు స్పష్టంగా కనబడ్తోంది. కొండ చిటారున వున్న చెట్టు ఇంకా చిన్నదిగా కనబడ్తోంది.

కొన్ని రాళ్ళు, కొన్ని చెట్లు, ఎన్నో పొదలు, వింత వింత పూలు, వాటి చుట్టూ తిరిగే రంగురంగుల పురుగులు. నెత్తి మీద మెరుస్తున్న సూర్యుడు. ఒకదాన్నొకటి తరుముకుంటూ పారిపోతున్న మబ్బులు. ఆకాశంలో ఉంటూనే కొండకు ప్రదక్షిణలు చేస్తున్న గద్దలు.

“కొండ ప్రపంచం కొత్త ప్రపంచం” అనుకొన్నాడు పుల్లయ్య.

రెండు నిముషాలు కూర్చొని, గుండెల నిండుగా గాలి పీల్చుకొని మళ్ళీ కాళ్ళకు పని చెప్పాడు.

ఎంతసేపు అలా ఎండలో నడిచాడో తెలీదు. బాగా దప్పికేస్తోంది. చెట్లూ, పూలు, గాలీ, రాళ్ళూ – అన్నీ ఉన్నా కొండపై నీళ్ళు లేవన్న విషయాన్ని గుర్తించాడు పుల్లయ్య. ఆ ఆలోచనతో దప్పిక ఎక్కువైంది. అప్రయత్నంగా నాలుకతో పెదాల్ని తడుపుకొన్నాడు. బలవంతంగా గుటక వేసి నోట్లోని ఎంగిలిని మింగాడు.

ఇంత జరుగుతున్నా అడుగులు వేయడం మాత్రం ఆపలేదు.

ఇంకాస్త సమయం గడిచింది. అప్పటిదాకా తుప్పల మధ్యనే నడిచివస్తున్న వాడికి ఎడంవైపున, కొద్ది దూరంలో ఒక చెట్టు కనబడింది. వాడి కంటే కాస్తంత పొడవుగా ఉంది. దాని క్రింద చల్లటి నీడవుంది. అక్కడ కొద్దిసేపు కూర్చొంటే దప్పిక తగ్గుతుందేమోనని అనుకొన్నాడు. జాగ్రత్తగా ముళ్ళపొదల్ని దాటుకొని చెట్టు నీడకు చేరుకొన్నాడు. చెట్టు మొదలుకి జారిగిల బడి కళ్ళు మూసుకొన్నాడు.

మామూలుగా కళ్ళు మూసుకొంటే చీకటి కమ్మినట్టవ్వాలి. కానీ ఇప్పుడు మూసిన కళ్ళ వెనక వెలుగు పరుచుకొనేవుంది. ఆశ్చర్యపోయి కళ్ళు విప్పి చూసాడు.

ఎదురుగా ధగధగా మెరుస్తూ సూర్యుడు కనబడ్డాడు.

“ఓహో! సూర్యుడికి ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకుంటే చీకటి కమ్మదా?” అని అనుకొంటూ మళ్ళీ కళ్ళు మూసుకొన్నాడు.

ఆ కళ్ళ వెనుక ఉండే వెలుగు భలేగా ఉంది వాడికి. కళ్ళను ఇంకా గట్టిగా, బాగా బిగించి మూసాడు.

అంతే…..

KRISHNARAYA’S TIRUMALA INSCRIPTIONS
AVAILABLE ONLY ON ANVESHI CHANNEL
ఏదో ఒక ఆకారం దగ్గరగా కనబడినట్టైంది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. దాంతో కంగారు పడి కళ్ళు తెరిచాడు.

తెరిస్తే ఏముంది! ఏ ఆకారమూ లేదు. ఆకాశమూ, సూర్యుడూ తప్ప.

వాటిల్ని చూసాక గుండె దడ తగ్గినట్టు అనిపించింది. ఇక అక్కడే కూర్చోవడానికి మనసు రాక లేచాడు. చకచకా ముందుకెళ్ళి నడవాల్సిన దారిలో నడవసాగాడు.

“ఏమిటది? అసలేమిటో కూడా అర్థం కాలేదు.” అని అనుకొన్నాడు. ఇంకొద్దిసేపు కళ్ళు మూసుకొనివుంటే అర్థమయ్యేదేమోనని ఊహించుకొన్నాడు. అనవసరంగా భయపడి కళ్ళు తెరచినందుకు తనని తాను తిట్టుకొన్నాడు.

అలా కొద్దిగా పైకి ఎక్కాడో లేదో సన్నగా ఓ శబ్దం వినవచ్చింది.

పుల్లయ్య చెవులు తమంత తాముగా నిక్కబొడుచుకొన్నాయి. ఆ వినబడ్తున్న శబ్దాల్ని శ్రద్ధగా విన్నాడు.

“అయ్….నీళ్ళు!”

అప్పుడు గుర్తుకొచ్చింది దాహం.

చకచకా కదిలాడు. కుడివైపుకు నాలుగడుగులు వేసేసరికి కనబడిందా చిన్న జలధార.

అడ్డంగా ఒకటి, చేరో వైపు వాలుగా ఇంకో రెండు రాళ్ళు ఉండి, వాటి మధ్యనున్న కంతలోనుంచి పారుతూ బైటికొస్తోంది నీరు. బైటికి రావడమే ఆలస్యం క్రిందకు జారి అక్కడున్న కుంటలోకి నిండుతోంది.

నీళ్ళు తాగాలంటే నిలువునా క్రిందకు దిగాలి.

క్రిందకు వెళ్ళాలంటే, చెట్లనీ, బైటకు కనబడుతున్న చెట్ల వేళ్ళనీ పట్టుకొని కనీసం ఆరేడు అడుగులు దిగాలి. ఆలోచనలో పడ్డాడు పుల్లయ్య. ధైర్యం చేసి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని కాలు క్రిందకు జార్చాడు. పట్టు దొరక్క సర్రుమని జారింది కాలు. కొమ్మను గట్టిగా పట్టుకొని ఒక నిముషం వేళ్ళాడి, ఆపై కాలును జాగ్రత్తగా పైకి లాక్కున్నాడు. మొదటి అనుభవమే ఒళ్ళు గగుర్పొడిచేట్టు చేయడంతో క్రిందకు దిగే ఆలోచన మానుకొన్నాడు.

మర్చిపోయిన దప్పిక నీళ్ళు కనబడ్డంతో గుర్తుకొచ్చి వాణ్ణి నెమ్మదిగా ఉండనీయడం లేదు. ఎలాగైనా సరే నీళ్ళు తాగాలని దేహం తహతహలాడుతోంది.

ఒక నిముషం చుట్టుప్రక్కల్ని పరీక్షగా చూసాడు. ఊహూ…నీళ్ళు తాగాలంటే దిగనైనా దిగాలి లేదా దాహాన్ని మర్చిపోవాలి. పుల్లయ్యకి చాలా నిరాశ కలిగింది. కంటికెదురుగా నీళ్ళున్నా తాగలేకపోతున్నాడు కదా! అంతకంటే వ్యథ ఏముంటుంది? అదే ఇంట్లోనైతే దాహమని అడగ్గానే అమ్మో, నాన్నో చెంబు నిండా నీళ్ళిచ్చేవాళ్ళు.

బాధగా నిట్టూర్చి దిక్కులు చూసాడు పుల్లయ్య. ఉన్నట్టుండి వాడి కళ్ళకు ఏదో కనబడింది.

వాడు నిలబడివున్న చోటు నుండి ఎడమవైపుగా తుప్పలు, పొదల్ని దాటుకొని చుట్టుకొంటూ వెళ్తే జలధార మూలానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి కాస్త జాగ్రత్తగా వంగితే చేత్తో పట్టుకొని నీళ్ళు తాగొచ్చు. మర్చిపోయిన ఉత్సాహం మళ్ళీ పలకరించింది. చకచకా ఆ దారిలోకి మళ్ళాడు పుల్లయ్య.

అనుకొన్నదానికంటే ఎక్కువే ఉన్నట్టుంది దూరం. అప్పటి దాకా కుడివైపున కనబడుతూవుండిన జలధార ఇప్పుడు మాయమైపోయింది. నీళ్ళు పడుతున్న శబ్దం కూడా వినబడ్డంలేదు. పుల్లయ్యకు కంగారు పట్టుకొంది. ఆగిపోయాడు.

“ముందుకెళ్లాలా? వెనక్కు తిరగడం మేలా?” అన్న తర్కంలో పడిపోయాడు.

ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతుంది. వెనక్కు మళ్ళితే దప్పిక మిగులుతుంది.

ముందుకెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. దారి తప్పినా తప్పొచ్చు. అదే వెనక్కు తిరిగితే కొండ దిగి ఇంటికెళ్ళి బిందెడు నీళ్ళు తాగొచ్చు. ఏది మేలు? వెంటనే నిర్ణయించుకోవాలి.

పుల్లయ్య ఆలోచించసాగాడు.

ఇప్పటి వరకూ వాడికి సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకొనే అవసరమే రాలేదు. అన్నీ అమ్మా నాన్నలే చూసుకొనేవారు. వాడికి ఆజ్ఞలు వేసే అలవాటు మాత్రమే వుంది. మిరపకాయ బజ్జీ తినాలని అనిపిస్తే అమ్మకు చెప్పేవాడు. తట్టలో వేడి బజ్జీలు వచ్చేసేవి. పండగరోజుకి ఎరుపు రంగు చొక్కా కావాలని నాన్నను అడిగేవాడు. వచ్చేసేది. అవి ఎలా వస్తాయన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. అడిగితే చాలు వచ్చేస్తాయని మాత్రమే వాడికి తెలుసు.

ఒకసారి నాన్న వాడికిచ్చిన పదిపైసల్తో అంగడికి వెళ్లి బజ్జీలు కొనాలనుకొన్నాడు. వెళ్ళి కొంటే ఒకటే బజ్జీ వచ్చింది. ఇంకో బజ్జీని ఇవ్వమని అడిగాడు. “ఏరా! ఒక్క బజ్జీ చెయ్యాలంటే ఎంత ఖర్చో, కష్టమో తెలుసునా?” అని అడిగిన అంగడివాణ్ణి తిట్టుకుంటూ ఇంటికొచ్చాడే గానీ పోయిన వారం ఇంట్లో తను తిన్న ఇరవై బజ్జీలకు నాన్న ఎన్ని పదిపైసల్ని ఖర్చు చేసాడన్న ఆలోచన రాలేదు. అమ్మ ఎంతసేపు కష్టపడిందోనన్న ఆలోచనా రాలేదు.

అసలు వాడికి నిర్ణయం అంటే ఏమిటో, ఆలోచన అంటే ఏమిటో తెలీదు. పాపం అది వాడి తప్పు కాదు.

పుల్లయ్యకి ఆలోచన దృష్టీ, నిర్ణయశక్తీ ఇప్పుడు కూడా కలగడం లేదు. వాడి సమస్యల్లా నీళ్ళు తాగడమే.

ఆలోచిస్తున్న వాడికి కాస్త దూరం నుంచి కోకిల గొంతు వినబడింది.

“మంచి శకునం…ముందుకే వెళ్తా” అనుకొంటూ ముందుకు నడిచాడు.

ఇరవై అడుగులు వేసాడో లేదో ఎదురుగా కనబడ్డదాన్ని చూసి చిన్నగా కేక పెట్టాడు.

ఎదురుగా నీళ్ళు.

అది ఇంతకు ముందు వాడు చూసిన జలధార కాదు. చిన్న నది. గలగలా పారుతోంది. అలా పారి, పారి ఆ రాళ్ల గుండా ప్రవహించి జలధారలాగా మారుతోంది. చచ్చేంత సాహసం చేసి నీళ్ళు తాగాలేమోనని సతమతమౌతున్న వాడికి అనుకోకుండా ఎదురుపడి స్వాగతం పలుకుతున్న సెలయేరును చూసి ప్రాణాలు లేచి వచ్చాయి.

ఎలాంటి తుప్పలూ, మొక్కలూ లేని నేల మీద పరుగెడుతూ నీళ్ళ దాకా వెళ్ళాడు. తొంగి చూస్తే సెలయేరు అడుగునవున్న గులకరాళ్ళు కనబడ్డాయి. మోకాలి కంటే కొద్దిగా తక్కువ ఎత్తులో ఉన్నాయి నీళ్ళు. ధైర్యంగా దిగి, దోసిళ్లతో పట్టి కడుపు నిండా తాగాడు.

ఒడ్డున కూర్చొని నవ్వుకోసాగాడు. చేతిలోకి రాళ్లు తీసుకొని నీటిలోకి విసిరాడు. కొన్ని గడ్డిపోచల్ని పీకి గాల్లోకి ఎగరేసాడు. అంతలో గుర్తుకొచ్చింది…తాను నడిచి వచ్చింది సగం దారి మాత్రమేనని.

మరోసారి నీళ్ళు తాగి వచ్చిన దారిలోనే హుషారుగా నడుస్తూ ప్రధానమార్గానికి వచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చకచకా పైకి ఎక్కసాగాడు.

మధ్యాహ్నం వేళకి ముప్పాతిక దూరం నడిచేసాడు. ఇక నడవాల్సిన దారి….ఎక్కాల్సిన ఎత్తు కొద్దిగానే ఉంది. ఆ కొండ చిటారున కనబడే ఒంటరి బండరాయిని, ఒంటి చెట్టునూ చూసేసి త్వరగా దిగెయ్యాలి. చీకటి పడేలోగా బయలును దాటి, తనకిష్టమైన కోపం చెట్టును దాటి ఇంటికెళ్ళిపోవాలి.

ఆపై ఆ రాత్రి కథలు చెప్పే ముసలమ్మకు తన సాహసాల్ని బాగా భయం పుట్టేట్టుగా చెప్పాలి. దాంతో అవ్వ ఆ రాత్రంతా నిద్రపోకుండా మేలుకొనేవుండాలి. ఇలా ఊహించుకొంటూ, ఉత్సాహంతో గబగబా రాళ్ళను ఎక్కేస్తున్నాడు.

ఒకేవొక్క క్షణంలో….

ఏం జరిగిందో తెలుసుకొనేలోగా పట్టుదప్పి జారిపోయాడు పుల్లయ్య.

ఏవేవో వొంటికి కొట్టుకొంటున్నాయి. కొన్ని పొడిచినట్టుగా, కొన్ని చీల్చినట్టుగా, కొన్ని మోదినట్టుగా….నొప్పి, మంట, బాధ…భయం!

దొర్లుతూనే ఉన్నాడు. చాలాసేపే దొర్లినట్టు అనిపిస్తోంది. దొర్లడం ఆగేసరికి ఎక్కడున్నదీ వాడికి అర్థం కాలేదు.

లేవడానికి ప్రయత్నించాడు. ఒళ్ళు సహకరించలేదు. పక్కనేవున్న ఒక పెద్దరాయిని పట్టుకొని నెమ్మదిగా లేచాడు. ఇంకా కళ్ళు బైర్లు కమ్మినట్టుగానే ఉంది. వెలుతురు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు.

ఒళ్ళు బాగా నొప్పేస్తోంది. నిల్చోలేక క్రింద కూర్చున్నాడు. అప్పుడు కనబడింది….కుడి మోకాలి పైన ఎర్రగా, జిగటగా, సలుపుతూన్న గాయం. వణుకుతున్న చేత్తో దాన్ని తాకాడు. చర్రున మంటపుట్టింది. “స్..స్..స్..” అంటూ చెయ్యిని తీసేసాడు.

చేతుల్ని చూసుకొన్నాడు. అక్కడక్కడా గీరుకుపోయిన గుర్తులు…రక్తపు మరకలు.

గాయాల వల్ల పుట్టుకొచ్చిన నొప్పు సుడులు తిరుగుతూ శరీరాన్నంతా వణికిస్తోంది. దానితో బాటూ భయం కూడా మెలికలు తిరిగే సుడిగాలిలా గుండె నిండుగా తిరుగుతోంది.

దృష్టి ఇంకా సర్దుకోలేదు. చుట్టుపక్కలున్నవన్నీ అస్పష్టంగానే కనబడుతున్నాయి.

ఎంతో హుషారుగా ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడంతా నొప్పులు, గాయాలు, భయాల మయమైపోయింది.

పుల్లయ్యకు ఏడుపొచ్చింది.

రాదు మరి!

ఇంట్లో పంటి క్రిందకు రాయొచ్చినా, కాలిలోకి ముల్లు దిగినా అమ్మో నాన్నో పరుగెత్తుకొస్తారుగా!

ఒకసారి ఏమైందంటే – పుల్లయ్యా, వాడి నేస్తులూ కలిసి గోలీలు ఆడుతున్నారు. ఆటలో ఒకడు మోసం చేస్తే ఇంకొకడు గొడవ పడ్డాడు. ఆ ఇద్దరితో పాటు మిగతావాళ్ళందరూ చేరారు. వాళ్లలో వాళ్ళు తన్నుకొంటూ, కొట్టుకొంటూ వచ్చి పుల్లయ్య మీద పడ్డారు. పాపం వాడి పెదవి చిట్లిపోయింది. ఒక చెంప మీద రాళ్ళు గుచ్చుకొని రక్తం కారింది. ఏడుస్తూ ఇంటికొచ్చాడు. నాన్నకు కోపమొచ్చి పిల్లలందరినీ తిట్టి తరిమేసాడు. అమ్మైతే కళ్ళల్లో నీళ్ళు దూకుతుంటే పెదవికి, బుగ్గలకీ వెన్న రాసింది. ఇంకేదో మందు తెచ్చి పూసింది. ఒళ్ళు తడిమి చూస్తూ జ్వరమేమైనా వచ్చిందేమోనని రాత్రంతా మేలుకొనేవుంది.

పుల్లయ్యకు అమ్మ గుర్తుకొచ్చి బావురుమన్నాడు. కానీ ఎవరూ వాడి ఏడ్పు వినలేదు. కొండ అలాగే వుంది. సూర్యుడు మెరుస్తూనేవున్నాడు. మబ్బులు ఏమీ పట్టనట్టు పోతునే వున్నాయి. ఆ నిర్లక్ష్యం చూసిన వాడికి నిజంగానే, గట్టిగానే ఏడుపొచ్చింది. పాపం నిజంగానే, గట్టిగానే ఏడ్చాడు కూడా.

“కొండ ప్రపంచం చాలా దయలేని ప్రపంచం” అని తిట్టుకొన్నాడు.

– – – –

తరువాయి భాగం రేపు

Your views are valuable to us!