పుల్లయ్య గుప్తనిధి
ఎవరో వచ్చారు!
ఏడుపు చాలా మంచిది.
లోపలేవున్న దిగుళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అదిమిపట్టిన గుబుళ్ళన్నీ తేలిపోతాయి. బరువుతో అణచివేసే బాధలన్నీ అడుగంటా మునిగిపోతాయి.
పుల్లయ్య ఏడుస్తున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకొన్నాడు. అప్రయత్నంగానే కళ్ళను గట్టిగా బిగించాడు.
అదే అంతకు మునుపు కనబడ్డ ఆకారమే మళ్లీ కనబడింది. మీదకు వచ్చేస్తోంది. చాలా దగ్గరకొచ్చేస్తోంది.
చటక్కున కళ్ళు తెరచాడు. నిజంగానే ఎదురుగా ఒక ఆకారం వుంది.
కళ్ళు మూస్తే మాత్రం కనబడి, తెరవగానే మాయమయ్యే ఆకారం ఇప్పుడు కళ్ళు తెరచినా పోకుండా నిలబడేవుంది.
మనుషులే ఉండరని అనుకొన్న స్థలంలో తన దగ్గరకు వస్తున్న ఆ వ్యక్తిని చూసి భయంతో బిగుసుకుపోయాడు వాడు.
అంతే….పుల్లయ్యకు స్పృహ తప్పింది.
పుల్లయ్య ఏడుపులో నిజాయితీ ఉంది కాబోలు అతను ఎక్కడినుండో వచ్చి ప్రత్యక్షమయ్యాడు. పలకరించేలోపు మెలకువ తప్పిన పుల్లయ్యను భుజాన వేసుకొని చకచకా వెళ్ళిపోయాడు.
EXPLORE UNTOLD HISTORY
– – – –
“భయపడకు!” అన్నాడు అతను.
పుల్లయ్యకు మరింత భయం పట్టుకొంది.
“నువ్వెవరు?” అని అడిగాడు.
నవ్వాడు అతను. “నీ పేరు చెప్పు!” అన్నాడు.
“పుల్లయ్య…..”
“ఆహా…బావుంది.” అన్నాడు. ఆ అన్నవాడు అక్కడ వుండకుండా గుడిసె బైటకు వెళ్ళాడు.
ఇంతసేపూ ఎక్కడుందో, ఏమైపోయిందో తెలీదు గానీ టకటకా వచ్చేసింది పుల్లయ్య ’బుర్ర’
“చూసావా రా! ఈ పరిచయంలేని కొత్త ముసలి బుర్ర కూడా నిన్ను ఏడిపిస్తోంది. పుల్లయ్య అన్న పేరు బాగుందంట…బాగుందంట…హూ” అంది.
పుల్లయ్యకు తన ’బుర్ర’ మీద కోపమొచ్చింది.
“ఇంతసేపూ ఎక్కడికెళ్ళావ్?” అన్నాడు.
“అదేమిరోయ్! నీతో పాటే కొండనెక్కాను కదా?” అంది ’బుర్ర.’
“మరైతే కొండనెక్కే ముంది పిలుస్తే పలకలేదే? నీళ్ళు తాగడానికి నేను అవస్థలు పడుతున్నా నువ్వు మాట్లాడలేదే?” అని నిలదీసాడు.
“ఓహో! అదా! అవన్నీ చిన్న చిన్న విషయాలు. అట్లాంటివాటిల్లోకి దూరితే నా పరువు పోతుంది. అందుకనే పలకలేదు.”
పుల్లయ్యకు మొదటిసారిగా తన ’బుర్ర’ పైన నమ్మకం తగ్గింది. కొండ ఎక్కడం చిన్న విషయమా? నీళ్ళు లేకుండా దప్పికతో అల్లాడ్డం చిన్న విషయమా? – ఇవి చిన్న విషయాలు కావని అనిపించింది వాడికి.
“ఇదో! నిన్నే! ఆ ముసలి బుర్ర లోపలికి రాగానే దులిపెయ్. ఏరా ముసలివాడా, పుల్లయ్య అన్న పేరు నీకు నచ్చిందా? ఏం మీ నాన్న అంతకంటే దరిద్రమైన పేరు పెట్టాడా నీకు? అని నిలదీయ్. అసలు ఈ వెధవ పేరులో వాడికంత నచ్చిన సంగతేంటో కనుక్కో. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తా. అదిగో వాడొస్తున్నాడు…అడిగెయ్ అడిగెయ్!” అంది ’బుర్ర.’
పుల్లయ్య మాట్లాడలేదు.
లోపలికొచ్చిన ఆ వ్యక్తిని చూసాడు. పెద్దవాడే…నాన్న కంటే పెద్దవాడే. తెల్లటి మీసాలు, తెల్లటి చిన్న గడ్డం కలిసిపోయున్నాయి. నెత్తి మీద సగం దాకా జుత్తు లేదు. మిగతా జుట్టును వెనక్కి దువ్వి ముడివేసుకొన్నాడు. నడుం నుండి మోకాలి దాకా గోచీ వేసి పంచె కట్టుకొన్నాడు. భుజం మీద కండువా ఉంది.
“ఏం భయపడకు. దెబ్బలు చిన్నవే. తొందరగా తగ్గిపోతాయ్.” అంటూ వచ్చి ఏదో మందు పూయడం మొదలెట్టాడు. ఆ మందు తగిలిన చోటంతా చల్లగా, హాయిగా ఉన్నట్టు అనిపిస్తోంది వాడికి. దాంతో కొద్దిగా భయం తగ్గింది. కానీ దాని స్థానంలో అనుమానం వచ్చి కూర్చుంది.
“ఈ కొండపైన ఈ ముసలివాడు గుడిసె వేసుకొని ఎందుకుంటున్నాడు? నేను పడిపోయినప్పుడు కచ్చితంగా అక్కడే ఎలా ఉన్నాడు? ఒకవేళ ఈ మనిషి దెయ్యమా? పిశాచమా?”
చివరి ఆలోచనతో మళ్ళీ భయం వచ్చి కూర్చుంది. దాంతో బాటు విసుగు కూడా వచ్చింది పుల్లయ్యకి. అందుకే నేరుగా అడిగేసాడు.
“నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు?”
“నేనా….నేను వో సన్యాసిని. నాకెవ్వరూ లేరు. ఒంటరివాణ్ణి. నాకు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టం. అందుకనే ఈ కొండ పైనే ఉంటాను.”
పుల్లయ్య మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా అన్నీ చెప్పేసాడు ఆ సన్యాసి. ఎదురుగా ఉన్నది మాంత్రికుడు కాడని సన్యాసని తెలుసుకొన్న పుల్లయ్య భయం కొంచెం తగ్గింది.
“నేను వెళ్తా” అన్నాడు.
“ఎక్కడికి? నువ్విప్పుడు కదిలావంటే దెబ్బలకు చీము పడుతుంది. దాంతో నొప్పి బాగా పెరిగి నువ్వు తట్టుకోలేవు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. ఈ పసరు రాత్రి పూటే బాగా పని చేస్తుంది. పొద్దునకల్లా దెబ్బలు దాదాపు మానిపోతాయ్. అప్పుడు కొండ దిగు.” అన్నాడు సన్యాసి.
పుల్లయ్యకు మళ్ళీ దిగులు పట్టుకొంది. “వీడు మాంత్రికుడే. రాత్రి అమ్మోరుకి నన్ను బలిస్తాడు.” అని అనుకొన్నాడు.
అంతలో ఆ సన్యాసి గుడిసెలోని ఓ మూలకు వెళ్ళాడు. అదే అవకాశంగా లేచి పారిపోబోయాడు పుల్లయ్య. కానీ ఒళ్ళు, కాళ్ళు సహకరించలేదు. బోర్లా పడ్డాడు. ఆ చప్పుడుకు తిరిగి చూసిన సన్యాసి పరుగున వచ్చి చాలా జాగ్రత్తగా వాణ్ణి లేపాడు.
“భయపడొద్దు. నేను సన్యాసిని…మాంత్రికుణ్ణి కాను. నిన్నేమీ చెయ్యను. గంజి కాచి ఇస్తాను. తాగేసి హాయిగా పడుకో.” అన్నాడు.
గుడిసె వాకిలి దగ్గరనే ఉన్న తొండ తలను కిందికీ పైకీ ఆడించింది. పుల్లయ్య దాన్ని చూసాడు. సన్యాసి సహాయంతో కుంటుకుంటూ వచ్చి మంచం అనబడే చెక్క బల్ల మీద కూర్చున్నాడు.
సన్యాసి అంతకు ముందువెళ్ళిన మూలకే వెళ్ళి పొయ్యి వెలిగించే పనిలో పడ్డాడు. అతను పొయ్యి వెలిగించడాన్ని చూడసాగాడు పుల్లయ్య. వాడికి అమ్మ గుర్తుకొచ్చింది.
“అయ్యో! మధ్యాన్నం భోంచేసే వేళ దాటిపోయింది. అమ్మ కంగారుపడ్తోంటుంది. నేను వెళ్లలేదు కదా పాపం. ఎక్కడని వెతుకుతుంది? నాన్న కూడా పాపం. అయ్యో…నాన్నకి నా చెట్టు తెలీదే. అసలు ఎవ్వరికీ ఆ చెట్టు గురించి తెలీదు. మరి అమ్మా నాన్న ఇప్పుడేం చేస్తారు. నేను ఈ కొండ మీద సన్యాసి గుడిసెలో ఉన్నట్టు వాళ్ళ కెట్లా తెలుస్తుంది? నేను ఇక్కడికి రావడం చూసింది పిచ్చుక, ఆవు మాత్రమే. పాపం అవెట్లా చెప్తాయి? వాటికి మన భాష రాదు, నా ఇల్లు తెలీదు. పాపం అమ్మ…నాన్న”
తెలీకుండానే పుల్లయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. గొంతులో వెక్కిళ్ళొచ్చాయి. గట్టిగా చప్పుడు చేసాయ్. అవి సన్యాసికి వినబడ్డాయ్.
పొయ్యి ముట్టించే పనిని ఆపి “ఏడవద్దు పుల్లయ్యా! అమ్మా నాన్నాలు కంగారుపడ్తారని కదా నీ బాధ. నువ్వు ఇప్పుడిట్లా ఒళ్లంతా దెబ్బల్తో వెళ్ళావనుకో నీకూ బాధ, వాళ్ళకూ బాధ. కాబట్టి నువ్వు బాగా నిద్రపో. పొద్దున్నే నిన్ను కొండ కిందిదాకా నేను తీసుకెళ్తా.” అన్నాడు సన్యాసి.
ఇక చెయ్యడానికి ఏమీ లేక, ఆలోచించే శక్తి లేక కళ్ళు మూసుకొన్నాడు పుల్లయ్య.
అప్పటి దాకా ఓపికతో చూస్తున్న వాడి ’బుర్ర’ చర్రున లేచింది. ’ఒరేయ్! నేను చెప్పిందేంటి నువు చేస్తున్నదేంటి? ఆ ముసలి బుర్రను కడగమంటే ఏడుస్తావా? ఛీ” అంది.
ఆశ్చర్యంగా దాని గొంతు పుల్లయ్యకు వినబడలేదు. ఎందుకంటే వాడికి అప్పటికే బాగా నిద్రపట్టేసింది. వాడు మొట్టమొదటి సారిగా ’బుర్ర’ను పట్టించుకోలేదు.
– – – –