పుల్లయ్య గుప్తనిధి – భయాలు, నిజాలు, కోపాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పుల్లయ్య గుప్తనిధి

 

భయాలు, నిజాలు, కోపాలు

 

నిద్ర చాలా అవసరం.

నిద్రకు, భయానికీ ఎప్పుడూ చుక్కెదురే. అది వుంటే ఇది వుండదు. ఇది వుంటే అదీ వుండదు. మేలుకున్నంతసేపూ కంగారు పెట్టే ’బుర్ర’ కూడా నిద్రలో గమ్మత్తుగా నిద్రపోతుంది.

నిద్రను దులిపేస్తూ మెలకువ వచ్చేస్తుంది.

మెలకువ కూడా చాలా ముఖ్యం. అది లేకపొతే జీవితంలో మత్తు తప్ప గమ్మత్తు ఉండదు. మెలకువకి, నిద్రకీ మళ్ళీ చుక్కెదురు. ఒకదాన్నొక్కటి తరుముకుంటాయి. మెలకువలో ఉన్న చిక్కల్లా ’బుర్ర’తోనే.

ఇప్పుడు పుల్లయ్యకి నిద్ర ముగిసి మెలకువొచ్చింది…’బుర్ర’తో సహా.

“అబ్బాయ్! నీళ్ళతో నోరు పుక్కిలించి రా. జావ తాగుదువుగానీ!” అన్నాడు సన్యాసి, వాడి మెలకువ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా.

సన్యాసి సాయం పట్టగా నోరు పుక్కిలించడానికి గానూ గుడిసె బైటకు వచ్చాడు పుల్లయ్య. చుట్టూ ఉన్న చిమ్మచీకటిని చూసి విస్తుపోయాడు. గాలి అంతా కీచురాళ్ళ శబ్దాలతో నిండిపోయింది. ఆగి ఆగి “గూ గూ” అనే అరుపులు వినబడుతున్నాయి.

“ఆ గూ గూ చప్పుడేమిటి?” అన్నాడు. వాడికింకా సన్యాసిని ఏమని పిలవాలో అర్థం కావడంలేదు. అందుకనే ఏమీ పిలవలేదు.

“అదా! గుడ్లగూబ” అన్నాడు.

ఒళ్ళు ఝల్లుమంది పుల్లయ్యకి. “నీకు భయం లేదా?” అన్నాడు లోపలికి వస్తూ.

ఒక చేత్తో పుల్లయ్యనికి పొదివిపట్టుకొని మరో చేత్తో తలుపు మూస్తూ నవ్వాడు సన్యాసి.

“ముందు జావ తాగు. ధైర్యమొస్తుంది.” అన్నాడు.

“నువ్వు జావను మంత్రించి ఇస్తావా?” ఆశ్చర్యంగా అడిగాడు పుల్లయ్య.

“లేదు. అది వుట్టి జావనే. అందులో ఏ మంత్రమూ లేదు.” అన్నాడు సన్యాసి.

“మరి ఇంట్లో నేను కూడా చాలా చాలా అంబలి, జావ…ఇంకా…పాయసం కూడా తాగుతాను. కానీ భయం పోదు.”

“ఎందుకలా?” అన్నాడు సన్యాసి వాణ్ణి చెక్క మంచం మీద కూర్చోబెడుతూ.

“మా వీధిలో కుక్క మొరిగితే నేను అమ్మను కరుచుకొని పడుకొంటాను. నాకు రాత్రి పూట వచ్చే చప్పుళ్లంటే చాలా భయం. మా ఇంట్లో ఒక ఎలుకవుంది. అది రాత్రంతా చెక్క పెట్టెల్ని గీకుతూ ఉంటుంది. అదన్నా భయమే.” అన్నాడు వాడు.

“హాహాహా…ఇంకా…” అన్నాడు సన్యాసి.

“ఇంకా అంటే చాలా భయాలున్నాయి. గోడ మీద బల్లి నా పైన పడిపోతుందేమోనని ఒక భయం. ఉయ్యాల ఊగుతుంటే తాడు తెగిపోతుందేమోనని భయం. ఇట్లా చాలా ఉన్నాయ్. ఈ కొండ పైన ఒక్కడే ఉంటావే. చుట్టూ గుడ్లగూబలు, పాములూ ఉన్నాయే. మరి నీకే భయమూ లేదా?” అన్నాడు పుల్లయ్య. వెచ్చగా ఉన్న జావ మెల్లగా గొంతులోకి దిగుతుంటే భలే ఆనందంగా వుంది వాడికి. పొద్దుననగా ఇంత తిని ఇంట్లోనుంచి బయటకు పరుగెట్టి వచ్చినవాడు ఇప్పుడే తిండి మొహం చూస్తున్నది.

సన్యాసి మాట్లాడలేదు. వాడి మొహాన్నే చూస్తూ కూర్చొన్నాడు.

“చెప్పు. నీకు భయం లేదా?” అన్నాడు పుల్లయ్య.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

“ఎందుకు లేదూ. నాకూ చాలా భయాలున్నాయి.” అన్నాడు అతను.

పుల్లయ్య మొహంలో నిరాశ కొట్టుకొచ్చినట్టు కనబడింది. ఈ సన్యాసి చాలా ధైర్యస్థుడని, అవ్వ చెప్పిన ఓ కథలోలా మహిమగల తాయెత్తో, ఉంగరమో ఇస్తే తీసుకెళ్ళాలని వాడు ఆశ పడ్డాడు పాపం.

“నిజంగా! నీకూ భయాలున్నాయా?” అని గుచ్చి అడిగాడు పుల్లయ్య.

“అవును. ఉన్నాయి. కానీ అవి నీకు అర్థం కాదు.” అన్నాడు సన్యాసి పుల్లయ్య చేతిలోని ఖాళీ గిన్నెలోకి జావను నింపుతూ.

“ఒక్క భయం చెప్పు. అర్థం కాకపోతే మళ్ళీ అడగను.” అన్నాడు వాడు. జావ మాంచి రుచిగా ఉంది. ఇంకా తాగాలని అనిపిస్తోంది కూడా.

“సంసారమంటే నాకు చాలా భయం.” అన్నాడు సన్యాసి.

నిజంగానే అర్థం కాలేదు పుల్లయ్యకి. ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ అడగలేదు.

“అది సరే…నువ్వెందుకు కొండెక్కి వచ్చావు?” అన్నాడు సన్యాసి. మళ్ళీ జావను పోస్తూ.

ఆలోచనలో పడ్డాడు కుర్రవాడు. “ఏం చెప్పాలి? నిజం చెబితే ఏమౌతుంది? ఏమంటాడు? అబద్ధం చెబితే కనిపెట్టేస్తాడా?”

చివరకు నిజాన్ని చెప్పడానికే నిశ్చయించాడు.

“నాన్న పైన కోపంతో వచ్చేసా.” అన్నాడు.

అప్పటిదాకా నిద్ర మత్తునూ, జావ రుచినీ అనుభవిస్తున్న పుల్లయ్య ’బుర్ర’ బుస్ మంది. “అడుగు…ఈ ముసలి బుర్రని అడుగు. వీడు కూడా మీ నాన్ననే మెచ్చుకొంటాడు చూడు…చూడు.” అంది.

అలవాటు కొద్దీ దాని మాటల్ని విన్నాడు పుల్లయ్య.

వాడి కేసి చూస్తూ – “అవునా! ఏమైంది?” అన్నాడు సన్యాసి.

ఒక గుక్క జావ తాగి “నాకు మా నాన్న పుల్లయ్య అన్న పేరు పెట్టాడు. నాకది ఇష్టం లేదు. మార్చమంటే తిట్టాడు. అదేదో ఆచారం అనేది ఉందంట. అది మా ముత్తాత కన్నా చాలా ముసలిదంట. అది చెప్పినట్టే మనం వినాలంట. అది పేరు మార్చడానికి ఒప్పుకోదంట. కుదర్దన్నాడు. అందుకే వచ్చేసా.” గబగబా చెప్పేసి పాత్రలో మిగిలివున్న జావను మొత్తం తాగేసి మూతి తుడుచుకొన్నాడు.

వాడి చేతిలోని గిన్నెను అందుకొని – “తప్పు కదా!” అన్నాడు సన్యాసి.

“ఒరేయ్! చూసావా! ఏం చెప్పాన్నీకు? ఈ ముసలి బుర్రలన్నీ ఒకేలా ఆలోచిస్తాయని చెప్పానా. చూడు…చూడరా…ఈ సన్నాసి బుర్ర కూడా నీ నాన్న బుర్రలాగే మనల్ని తీసిపారేస్తోంది.” అంటూ అరిచింది పుల్లయ్య ’బుర్ర.’

“నిజమే”నని అనుకొన్నాడు పుల్లయ్య. మళ్ళీ వాడికి తన ’బుర్ర’ మీద దృష్టి మరలింది. అంతే చాలుననుకొని “అడిగెయ్…నువ్వు చేసింది తప్పెలా అయ్యిందని అడిగెయ్…ఊ…ఊ…” అని పురమాయించింది బుర్ర.

“ఎందుకు? ఎలా తప్పు? మా నాన్నకి కాకర కాయంటే ఇష్టం లేదు. అందుకని అమ్మ ఆ కూరను వండదు. అది నాకిష్టమైనా కూడా అమ్మ వండదు. అక్కడా నాన్న ఇష్టమే నడుస్తుంది. నా పేరంటే నాకిష్టం లేదుగా మరి నా ఇష్టమెందుకు నడవదు. నాకిష్టం లేని పేరును ఎందుకుంచాలి?” ఆవేశపడుతూ అడిగాడు పుల్లయ్య.

సన్యాసి వేసిన పసరు మందు బాగా పనిచేసినట్టుంది. ఒంటి నొప్పులు బాగా తగ్గాయి. దాంతో మాటల్లో జోరు కూడా పెరిగింది. తన ’బుర్ర’ చెప్పినట్టుగా ఈ సన్యాసిని కడిగెయ్యాలనే అనుకొన్నాడు. అలానే అడిగేసాడు కూడా. కానీ ఇప్పుడు సన్యాసికి కొపమొస్తుందేమోనన్న అనుమానం వచ్చేస్తోంది.

పుల్లయ్య కోపానికి సమాధానంగా నవ్వాడు సన్యాసి.

“నీ పేరుకు, కాకరకాయ కూరకూ సంబంధమా…హాహాహా…భలే చెప్పావు. అది సరేగానీ పుల్లయ్య అన్న పేరు పై నీకెందుకంత కోపం?” అని అడిగాడు సన్యాసి.

“చెప్పు…చెప్పు…గట్టిగా చెప్పు” అని ఎగదోసింది వాడి ’బుర్ర.’

“నాకు తెలుసులే…కాస్త ఆగు” అని లోపలే విసుక్కొంటూ “ఆ పేరులో ఉన్న గొప్పదనమేందో నువ్వు చెప్పు.” అన్నాడు పుల్లయ్య.

బుస్ మంది ’బుర్ర.’ “పేర్ల గురించి పాత బుర్రల్ని అడుగుతావేంట్రా శుంఠా? కడిగెయ్యకుండా!” అని కేకలేసింది. ఐనా పట్టించుకోలేదు పుల్లయ్య.

నాలుగైదుసార్లు బుస్ బుస్ మని అరిచి ఆపై ఆగిపోయింది ’బుర్ర.’

“పేరులో గొప్పదనం ఉండదు.” అన్నాడు సన్యాసి.

ఆ సమాధానానికి ’బుర్ర’ బుస్సుమని అనకముందే బుసగొట్టాడు పుల్లయ్య – “ఆ(… అందుకే అనేది. పెద్దోళ్ళందరూ ఒకటేనని. మా నాన్న కూడా ఇదే చెప్తాడు. నువ్వూ అదే చెప్తావు. మరి మా కుర్రవాళ్ళ మాట వినేదెవరు. ఏం మీరంతా మా మాటెందుకు వినకూడదు. అదే…అదే…” అని అవేశపడిపోసాగాడు పుల్లయ్య.

వాడి ఉద్ధృతిని చూసి వాడి ’బుర్రే’ డంగైపోయింది.

“అరే…ఏం చెప్పావురా! భలే. చూడు ఆ ముసలి సన్నాసి మొహం చూడు ఏట్లా ఐపోయింది. కడిగెయ్. ఇంకో నాలుగు తిట్లు తిట్టేయ్. ఊ….పదా…” అని వాణ్ణి ఉత్సాహపరచింది.

రెచ్చిపోసాగాడు పుల్లయ్య – “ఏం మీకు మాత్రమే బుర్రలుంటాయా? మాకుండవా?”

“ఆహా…భలే…” అని మెచ్చుకొంది పుల్లయ్య ’బుర్ర.’

నవ్వాడు సన్యాసి. పుల్లయ్య కేకలు పెట్టినంతసేపూ నవ్వుతూనే ఉన్నాడు.

“ఊ…చెప్పు…పుల్లయ్య పేరులో గొప్పదనమేముంది?” అని హుంకరించి ఆగాడు పుల్లయ్య.

“చెప్పానుగా! గొప్పదనం పేరులో ఉండదు. ఆ గొప్పదనం మనిషిలో ఉండాలి.”

నోరు తెరవబోయిన పుల్లయ్య ఆగిపోయాడు. ఎందుకంటే సన్యాసి ఆలోపే మళ్ళీ మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

“నీ పేరు పుల్లయ్య గానే ఉండనీ. నువ్వు గొప్ప పనులు చేసి మీ అమ్మా నాన్నకి గుర్తింపు తెస్తే అది నీ గొప్పదనమౌతుంది. ఆ గొప్పదనం ముందు నీ పేరు గొప్పదనమెంత?” అని నింపాదిగా అన్నాడు సన్యాసి.

నోరు పెగల్లేదు పుల్లయ్యకి.

వాడికి లోలోపలే ఉక్రోషం పొడుచుకొస్తోంది కానీ అనుభవలేమి వాడి నోటిని కట్టేస్తోంది.

“పేరెందుకూ పనికి రాకపోతే పెట్టుకోవడమెందుకు? అని అడగరా. ఈ ముసలి బుర్ర ఏం చెప్తుందో చూద్దాం!” అంటూ ఉప్పందించింది పుల్లయ్య ’బుర్ర.’

అదే అడిగాడు వాడు. “అంత పనికిమాలిందైతే పేరెందుకు పెట్టుకోవడం?”

నవ్వాడు సన్యాసి.

పుల్లయ్యకి ఆ నవ్వును చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తోంది.

వాడి ముఖ కవళికల్లో వాడి భావాలు తెలిసిపోతున్నా అవేవీ పట్టనట్టుగా మాట్లాడాడు సన్యాసి.

“చూడు! నీ పేరు పుల్లయ్య. నీ మిత్రుడి పేరు వెంకప్ప అనుకో. ఇంకో మిత్రుడు పేరు తిమ్మప్ప అనుకో. పేర్లన్నవి ఒకరినొకరు గుర్తు పట్టాడానికి, గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి.”

“అబద్ధం! ఒట్టినే గుర్తుపెట్టుకోవడానికైతే ఇన్ని పేర్లెందుకు? అందరూ ఒకే పేరే పట్టుకోవచ్చుగా.” అని మొండిగా అన్నాడు పుల్లయ్య.

“ఒరేయ్! ఏ ఆవునైనా ఆవే అంటారుగా. పుల్లావు, తిమ్మావు అని పిలుస్తారా! ఇలా అడుగు. ముసలి వెధవ ఏం చెప్తాడో చూద్దాం.” అని లోనుండి బుసగొట్టింది ’బుర్ర.’

పుల్లయ్యకు చాలా అద్భుతంగా అనిపించిందీ తర్కం. నోరు తెరవబోతున్న సన్యాసిని కౄరంగా చూస్తూ “ఇది చెప్పు. ఆవులకు, పక్షులకు పేర్లున్నాయా? అవెట్లా ఒకదాన్నొకటి గుర్తుపెట్టుకొంటాయ్. మా ఇంట్లో నాలుగావులున్నాయ్. దేని దూడ దాని దగ్గరకే పోవాలి. లేదంటే కుమ్మేస్తాయి. అవి తమ పిల్లల్ని పేర్లు పెట్టి పిలవ్వే. అంబా అని మాత్రమే పిలుస్తాయే. మన పేర్లకి గొప్పదనం లేకపోతే మనం కూడా అంబా అంబా అని అరుస్తూ తిరగొచ్చుగా!” దబదబా అరిచాడు పుల్లయ్య.

మౌనం వహించాడు సన్యాసి. అతని పెదవులపై అప్పటిదాకా ఉన్న నవ్వు ఇప్పుడు లేదు.

అది చూసిన పుల్లయ్య ’బుర్ర’ విజయగర్వంతో అనేకమార్లు బుస కొట్టింది. దాని ప్రతి బుసతోనూ పుల్లయ్య మనసులో విషయానికి బదులు విషం నిండుకోసాగింది. జవాబునివ్వకుండా ఊరకే కూర్చున్న సన్యాసిని చూస్తూ వెర్రి ఆనందంతో నవ్వసాగాడు.

ఆ నవ్వు పాము బుసలాగే వస్తోంది.

కాసేపటి నిశ్శబ్దం తర్వాత….

“నీ బుర్ర బాగా చెడిపోయింది అబ్బాయీ…” అన్నాడు సన్యాసి.

మొదట పుల్లయ్య ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత వాడి ’బుర్ర’ తుళ్ళిపడింది.

తను చెడినదాన్నని సన్యాసి తిట్టినట్టుగా గ్రహించిన పుల్లయ్య ’బుర్ర’ కోపంలో గింగిర్లు తిరిగింది. ఎర్రటి ఎండలో కాలిన నేల మీద రాలిపడ్డ చీమలా కొంకర్లు పోయింది.

“రేయ్…విన్నావురా! ఆ ముసలి బుర్ర నిన్ను, నన్నూ ఏమందో విన్నావా? ఆయ్….” అంటూ విపరీతమైన విద్వేష విషాన్ని కక్కింది.

కానీ పుల్లయ్య తొందరపడలేదు. “నువ్వోడిపోయావ్. అందుకనే నన్ను, నా బుర్రనూ తిడ్తున్నావ్!”

“ఆహా! రేయ్! నాకేడుపొస్తోంది. నాపై నీకెంత మమకారంరా!” అని వొంకర్లు పోయింది వాడి ’బుర్ర.’ కానీ పుల్లయ్య చూపంతా సన్యాసి మొహం మీదనే ఉంది.

ఒకసారి తలవిదిలించి – “నీకు కథలంటే ఇష్టమేనా?” అన్నాడు సన్యాసి.

ఒక్కపెట్టున నవ్వడం మొదలెట్టాడు పుల్లయ్య.

“హాహాహా…హాహా..హాహా…నువ్వోడిపోయవ్. అందుకనే కథలు చెప్పి తప్పించుకోవాలనుకొంటున్నావ్. హాహాహా”

వాడి నవ్వు చూసి సన్యాసి ముఖం పైన నవ్వులు వెలిసాయి.

పుల్లయ్య గంభీరంగా మారాడు. సన్యాసి మొహంలోని నవ్వు అతనికి హేళనతో కూడిన నవ్వుగా అనిపించింది.

“సరే, కథ చెబుతాను. విను…” అంటూ మొదలుపెట్టాడు సన్యాసి.

– – – –

తరువాయి భాగం రేపు

Your views are valuable to us!