పుల్లయ్య గుప్తనిధి – ఒక పేరు కథ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

పుల్లయ్య గుప్తనిధి

 

ఒక పేరు కథ

“పూర్వం చిత్రాంగదుడనే ఒక రాజు ఉండేవాడు. అతనొకసారి తన రాజ్యంలో ఉండే ఒక దట్టమైన మహారణ్యంలో వేటకు వెళ్ళాడు. ఆ అడవిలోకి మనుషులే కాకుండా దేవతలు కూడా వచ్చేవారు. ఈ రాజు వెళ్లిన వేళకి ఒక గంధర్వరాజు కూడా వేటకు వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. అప్పుడు

చిత్రాంగదుడు “నీపేరేమని?” ఆ గంధర్వుణ్ణి అడిగాడు. వాడు ’చిత్రాంగదుడు’ అని చెప్పాడు. దాంతో మొదటి చిత్రాంగదుడికి చిర్రెత్తుకొచ్చింది.

“నా పేరుతో నువ్వు చెలామణీ కావడానికి వీల్లేదు. వెంటనే పేరు మార్చుకో!” అని హుంకరించాడు.

ఆ మాటలకు గట్టిగా నవ్విన గంధర్వుడు – “మానవా! నేను గంధర్వుణ్ణి. నీకంటే వయసులోను, జ్ఞానంలోనూ, బలంలోనూ పెద్దవాణ్ణి. నువ్వో చిన్న పిల్లవాడివి. కనుక నా పేరే నువ్వు పెట్టుకొన్నావని నేను అనుకోవాలి. న్యాయంగా నువ్వే పేరు మార్చుకోవాలి!” అని హాస్యోక్తిగా మాట్లాడాడు.

ఆ గంధర్వుడి చతురతను గుర్తించలేని చిత్రాంగదుడు – “ఓరీ గంధర్వా! ఇది నా రాజ్యం. ఈ అడవి నాకు చెందింది. ఇక్కడ నా ఆజ్ఞలే చెల్లుబాటు అవుతాయి. నువ్వు అతిథివి మాత్రమే. కనుక నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. మర్యాదగా చెబుతున్నాను పేరు మార్చుకో.” అన్నాడు.

“మానవా! నన్ను అతిథిగా భావించిన నీకు అతిథి దేవోభవ అన్న సూక్తి గుర్తురావడం లేదా? నన్ను గౌరవించడం పోయి అవమానిస్తున్నావే. ఇది సరైన పని కాదు. నీలాంటి రాజుకు శోభనిచ్చే వ్యవహారం కాదు. కనుక మనం ఎవరి దారిన వారు పోదాం.” అని హితవు చెప్పాడు గంధర్వ చిత్రాంగదుడు.

యువకుడు, ఆవేశపరుడైన మానవ చిత్రాంగదుడు సర్రున కత్తి దూసి గంధర్వుణ్ణి గాయ పరిచాడు.

కోపగించిన గంధర్వ రాజు కత్తి తీసాడు.

వీరుడైన మానవ రాజు కూడా కత్తిని దూసి కలయబడ్డాడు.

రెండు కత్తులూ కలిసి ఖణేల్మన్నాయి. గొప్ప కత్తియుద్ధం జరిగింది. వారి విసుర్లకు కత్తులు ముక్కలైపోయాయి.

గదలు తీసుకొని గదాయుద్ధం చేసారు. గదలు విరిగాయే గానీ ఫలితం తేలలేదు.

ఈటెలు తీసుకొని విసురుకొన్నారు. అవి గురి తప్పాయి.

ఇక లాభం లేదని తమ కిరీటాల్ని, కవచాల్నీ, ఆభరణాల్ని, ఖరీదైన దుస్తుల్ని తీసివేసి లంగోటీల మీద మల్లయుద్ధానికై కలబడ్డారు.

పోరు ఘోరంగా సాగింది.

ఆ పోరులో బలవంతుడైన గంధర్వడు మానవుడి మెడను విరిచేసాడు.

ఆవిధంగా మానవ చిత్రాంగదుడు చనిపోయాడు. అతని భార్య, ఆ రాజ్యం, ప్రజలూ దిక్కులేనివారైపోయారు.

చనిపోయేనాటికి ఆ మానవుడి వయసు ఇరవై సంవత్సరాలు మాత్రమే!

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

తను చేసిన ఘోరకృత్యానికి ఎంతో కుమిలిపోయాడు గంధర్వుడు. కేవలం ఒకే పేరు ఉన్నందువల్ల పంతానికి పోయిన ఆ కుర్రవాడిని చూసి కన్నీరు పెట్టుకొన్నాడు. తన మంత్రశక్తితో వాణ్ణి బ్రతికించాలని భావించాడు. కానీ దైవనిర్ణయాన్ని మీరలేకపోయాడు. గంధర్వుడు ఎంత ప్రయత్నించినా మానవుణ్ణి బ్రతికించలేకపోయాడు.

దుఃఖం, విరక్తి నిండిపోయిన హృదయంతో తన లోకానికి వెళ్లిపోయాడు.

“ఈ కథపై నీ అభిప్రాయం చెప్పు!” అన్నాడు సన్యాసి.

ఆసాంతం కథను శ్రద్ధగా విన్న పుల్లయ్యకు వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. మానవ చిత్రాంగదుడు తొందరపడినట్టుగా అనిపించింది. అలా చెబితే సన్యాసి నెగ్గుతాడు. గంధర్వరాజు పొరబాటు చేసినట్టుగా అనిపించడంలేదు. ఎందుకంటే పాపం ఆయన మంచి మాటలు చెప్పి గొడవ పడకుండా వెళ్ళిపోదామని అన్నాడు. అంతేకాదు, చనిపోయిన చిత్రాంగదుణ్ణి బ్రతికించేందుకు కూడా ప్రయత్నం చేసాడు. కనుక గంధర్వుడు చెడ్డవాడు కాడు. ఉత్తినే గొడవపెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొన్న మనిషిదే తప్పు.

“తప్పుని ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి.” అన్నాడు సన్యాసి.

చప్పున తలెత్తి చూసాడు పుల్లయ్య.

“అవును! చాలా చాలా ధైర్యం కావలి.” అని లోపలే అనుకొన్నాడు పుల్లయ్య.

“నీ మొహం మండినట్టే ఉంది. యుద్ధం చేసాడే అనుకో…మానవుడి మెడను విరిచెయ్యాలా ఆ గంధర్వుడు? బలంలో నీకంటే గొప్పవాణ్ణని చెప్పుకొన్నాడే. బలహీనుల్ని చంపడం గొప్పనా? వయసులో పెద్దోణ్ణని కూడా కూసాడే. నీకంటే పెద్దోడైన మీ నాన్నకు కోపమొచ్చిందనుకో నీ మెడను విరిచేసి చంపేస్తాడా? చిన్నపిల్లల్ని చంపడమేనా ముసలి బుర్రల గొప్పదనం?” అని గుసగుసలాడింది పుల్లయ్య ’బుర్ర.’

పుల్లయ్య మొహం వికసించింది. వాడి పెదాలపై కసితో కూడిన నవ్వొకటి పాములా జరజరా పాకింది.

వంకర్లు పోతున్న కనుబొమల్తో కళ్ళెగరేస్తూ అవే ప్రశ్నల్ని సంధించాడు వాడు.

ఆ ప్రశ్నలకు ఏమాత్రం తొట్రుపడని సన్యాసి – “ఈ ప్రశ్నల్ని వెయ్యకపోతే నువ్వు కుర్రోడివి కాలేవు. నీ బుర్ర బాగా చెడిపోయిందని అనుకోవడానికీ లేదు.” అన్నాడు.

కుతకుతా ఉడికిపోయాడు పుల్లయ్య.

ఇంకేమీ చెప్పకుండా లేచి జావ మూకుడు ఉంచిన మూలకు వెళ్ళాడు సన్యాసి. ఒక లోటాలో ఏదో మందుని తీసుకొచ్చి – “ఇది తాగు. ఇదే చివరి మందు. దీంతో నీ దెబ్బలు పొద్దున కల్లా మానిపోవాలి.” అని ఇచ్చాడు.

తీసుకోవడానికి సందేహించాడు పుల్లయ్య.

“నేను గంధర్వుణ్ణి కాను…నిన్ను చంపను. తీసుకో.” అని లోటాను ముందుకు చాచాడు.

మరో మాట లేకుండా మందును తాగేసి “నువ్వింకా జవాబు చెప్పలేదు. గంధర్వుడే తప్పు చేసాడు.” అని బెట్టుగా అన్నాడు పుల్లయ్య.

“నిజమే! కుర్రవాడి మెడను విరిచి చంపడం ఘోరమైనదే. కానీ అసలు గొడవకి మూలమెవరు? మానవుడా, గంధర్వుడా?”

“మానవుడే!”

“తప్పెవరిదో అక్కడే తీర్మానమైపోయింది. గంధర్వుడు ఆ మానవుణ్ణి కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చెయ్యలేదు. కేవలం పేర్లు ఒక్కటే ఐనాయని మూర్ఖత్వానికి పోయిన మొదటి చిత్రాంగదుడే తప్పు చేసాడు. పేరు కోసం ప్రాణాలు పోగొట్టుకొన్నాడు.” అని చాలా నెమ్మదిగా, శాంతంగా పలికాడు సన్యాసి.

సన్యాసి చివరి పలుకులు విని ఉలిక్కిపడ్డాడు పుల్లయ్య. అవి తన గురించే చెప్పినట్టుగా వాడికి అర్థమైపోయింది. వాడు కూడా ఆ మధ్యాహ్నం దాదాపూ ప్రాణాలు పొగొట్టుకోబోయాడు. ఎందుకు? పేరు నచ్చలేదన్న కోపంతోనే కదా!

ఎదురు పలకడానికి వాడికి ధైర్యం చాల్లేదు. బుద్ధి సహకరించలేదు. ఎప్పుడూ బుసలు కొట్టే ’బుర్ర’ కూడా మౌనం పూనింది.

వాడే కాదు ఆ గుడిసెలోని ప్రతి అణువూ చాలాసేపు మౌనం వహించాయి.

ఆ మౌనంలోనే సన్యాసి గుడిసె మధ్యలో జింక చర్మం వేసుకొని, పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసుకోసాగాడు. మూసిన కళ్ళని చాలాసేపు తెరవలేదు.

– – –


Your views are valuable to us!