హ్యుయన్ త్సాంగ్ కు మన చరిత్రకారులు అన్యాయం చేసారా?
ముందు మాట
ప్రాచీన చైనా మేధావి హ్యుయాన్ త్సాంగ్ కి అన్యాయం చేసిన భారత చరిత్రకారులు.
(నా ఈ వ్యాసానికి ఆధారం విలియం డల్రింపుల్ (William Dalrymple) అనే బ్రిటిష్ మేథావి రాసిన పుస్తకం. ఆయన చరిత్ర, పురావస్తు శాస్త్రాలలో నిపుణుడు. గత 30 ఏళ్ళుగా భారతదేశంలో ఉండి అనేక ప్రాంతాలు తిరిగి అనేక మూల గ్రంధాలు చదివి ఒక పరిశోధనా గ్రంధం లా రాసిన పుస్తకం ఇది. వీలు, ఆసక్తి ని బట్టి ఈ పుస్తకం చదవమని నా సూచన)
ఏమిటి ఈ అన్యాయం అంటే – హ్యుయాన్‌త్సాంగ్ గురించి పాఠశాల చరిత్ర పుస్తకాల్లో ఒకటి, రెండు వాక్యాల్లో తెగ్గొట్టేస్తారు.
*****
నిజానికి హ్యుయాన్ త్సాంగ్ ఎవరు?
మన పాఠ్యపుస్తకాలు చదివినవారు “హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రీకుడు” అని తేల్చేస్తారు.
ఆ మహానుభావుడు తన జీవితకాలంలో, అసలు భారతదేశానికి వచ్చిన కారణానికి, రావటానికి పడిన శ్రమకి, చూపించిన ఓర్పుకు, మనదేశంలో తిరిగిన ప్రాంతాలకు, ఆ తర్వాత చైనా వెళ్ళాక అక్కడ ఆయనకు దక్కిన గౌరవానికీ, ప్రస్తుత చైనా చరిత్రలో ఆయన స్థానానికీ, న్యాయం చేయాలంటే, మన దేశ చరిత్ర పుస్తకాల్లో అక్బర్ కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
ఇవ్వాలో వద్దో నిర్ణయించే ముందు ఆయన గురించిన ఈ వివరాలు చదవండి.
SUBSCRIBE TO ANVESHI CHANNEL – FACTUAL HISTORY DOCUMENTARIES & PODCASTS
చైనా లో పుట్టి పెరిగిన హ్యుయాన్ త్సాంగ్ కి బౌద్ధం అంటే విపరీతమైన ఆరాధన. యువకుడిగా ఉన్నప్పుడే బౌద్ధ భిక్షువుగా మారి, అప్పటికే చైనా భాషలో ఉన్న బౌద్ధ గ్రంథాలు చదివాడు. ఐతే చైనాలో ఉన్న బౌద్ధం అంతా గందరగోళంగా అనిపించి, అసలు బౌద్ధ మూల గ్రంథాలు దొరికే భారతదేశం వెళ్ళాలి అనుకున్నాడు. ఆ కాలంలో చైనా చక్రవర్తులు తమ సాధారణ ప్రజలను పశ్చిమదేశాల వైపు వెళ్ళటాన్ని నిషేధించారు. చైనాకు పశ్చిమం అంటే భారతదేశమే.
ఐతే హ్యుయాన్ త్సాంగ్ ఆ ఆజ్ఞని ధిక్కరించి, అంటే ప్రాణాలను పణంగా పెట్టి, నాలుగేళ్ళు కాలినడకన (అవును నాలుగేళ్ళు కాలినడకే) భారతదేశంలో ప్రవేశించాడు.
ఈ నాలుగేళ్ళలో ఆయన చైనా చక్రవర్తి కింద ఉండే ఎందరో స్థానిక పాలకులకు దొరికిపోయాడు. కానీ వారు ఇతనిపై జాలిపడి “వెనక్కి వెళ్ళిపోతే క్షమాభిక్షపెడతాం” అని నచ్చచెబితే ఈయన మాత్రం భారతదేశం వెళ్ళకుండా బ్రతికే బదులు చనిపోవటమే శ్రేయస్కరం అని చెప్పి ఆ రాజప్రతినిధులను ఒప్పించి ముందుకు వెళ్ళాడు.
మంచు తుఫానులు, కౄరమృగాలూ, ఎడారులూ దాటుకొని చివరగా నలందా వస్తాడు.
నలందాలో హ్యుయాన్ త్సాంగ్:
అక్కడ ఐదేళ్ళు శీలభద్రుడు అనే బౌద్ధగురువు వద్ద బౌద్ధాన్ని అధ్యయనం చేసి, తన ప్రజ్ఞాపాటవాలతో హర్ష చక్రవర్తిని మెప్పించాడు. ఆ తరువాత రాజ్య పాలకుల గౌరవమర్యాదలతో, వారు ఏర్పరచిన సహాయకులూ, ఇతర ఏర్పాట్లతో దేశమంతా (వివిధ రాజ్యాల గుండా) పర్యటిస్తాడు.
ఇదే క్రమంలో కాంచీపురం, అజంతా కూడా వచ్చాడు.
హుయాన్ త్సాంగ్ భారతదేశంలో ఉన్న 17 ఏళ్ళలో, తొలి ఐదేళ్ళూ నలందాలో అధ్యయనం చేయడం, తనకు కావలసిన సంస్కృత మూలగ్రంధాలకు తన చేతిరాతతో నకళ్ళు చేసుకోవటం వంటి పనులతో గడిచింది. తరువాత పది సంవత్సరాలు దేశమంతా తిరిగాడు. చివరి రెండేళ్ళూ మళ్ళీ నలందాలో కొన్ని సంస్కృత గ్రంథాల ప్రతులు తయారు చేసుకొని ఆపై తన స్వదేశానికి తిరుగు ప్రయాణం కట్టాడు.
భారతదేశానికి వస్తూ ఒంటరిగా వచ్చిన హ్యుఅన్ త్సాంగ్ తిరుగు ప్రయాణంలో ఒంటరివాడు కాడు. హర్షవర్ధన చక్రవర్తి పంపిన గుర్రాలూ, ఏనుగులూ, సహాయకులూ, సామాగ్రి మోసే పనివారు, ఇలా తన విద్వత్తుకి తగ్గ పూర్తి గౌరవ మర్యాదలతో వెళ్ళాడు. భారతదేశంలో సేకరించిన గ్రంధాలూ, బుద్ధప్రతిమలూ అన్నీ తీసుకొని పరివారం తో చైనాను చేరుకున్నాడు.
హ్యుయాన త్సాంగ్ తిరిగి రావటాన్ని చైనా ఎలా తీసుకుంది?
మామూలుగా ఐతే ఆ కాలపు చైనా రాజ చట్టాల ప్రకారం సరిహద్దుల్లోనే ఆయన తల నరికెయ్యాలి. ఎందుకంటే ఆయన అంతకు 21 సంవత్సరాలక్రితం చైనా చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించిన ఒక సామాన్య పౌరుడు. కానీ అప్పటికే వివిధ వర్గాల ద్వారా చైనా జనసామాన్యంలో హ్యుయాన్ త్సాంగ్ పేరు మార్మోగిపోతోంది. అందువలన చైనా చక్రవర్తి నియమించిన ప్రతినిధి ఆయనకు తమ దేశ సరిహద్దుల్లో సగౌరవ స్వాగత సత్కారాలతో ఆహ్వానం పలికాడు.
ఆ తరువాత (ఇప్పటివరకూ కూడా) చైనా బౌద్ధంలో అతిపెద్ద గురువు, మేధావి ఒక్క హ్యుయాన్ త్సాంగ్ మాత్రమే!
హుయాన్ త్సాంగ్ కు కనీసం 500 ఏళ్ళ ముందే చైనాలోకి బౌద్ధం ప్రవేశించినా, రాజదర్బార్ లో అది ద్వితీయశ్రేణి మతం. అప్పటికి తొలి గౌరవం టావోయిజందే. టావోయిజం అనేది ప్రాచీన చైనా మతం. చైనా లిపి లాగానే ఈ టావోయిజం కూడా చైనా బయటవారికి పెద్దగా అర్ధం అయ్యేది కాదు. హుయాన్ త్సాంగ్ ఇటునుంచి వెళ్ళగానే చక్రవర్తులు ఈయనకు ప్రత్యేక ఆరామం కట్టించి, సకల సౌకర్యాలూ ఏర్పరచి, ఈయన సంస్కృతం నుండీ చైనీస్ లోకి అనువదించే బౌద్ధ గ్రంధాల ప్రతులు రాయటానికి వ్రాయసకాండ్రను నియమించారు. మరో 50 ఏళ్ళలో బౌద్ధం చీనా రాజదర్బారులో టావోయిజం ఆధిపత్యాన్ని దాటి అగ్రతాంబూలం అందుకుంది.
హుయాన్ త్సాంగ్ తరువాత కూడా చైనాలో అనేకమంది బౌద్ధ సన్యాసులు భారతదేశం వచ్చారు. కానీ వారెవ్వరూ కూడా హుయాన్ త్సాంగ్ చూపిన ప్రభావంలో ఒక శాతం కూడా చూపలేదు. నిజానికి వారంతా హుయాన్ త్సాంగ్ కి నీడలుగానే గుర్తించబడ్డారు.
హుయాన్ త్సాంగ్ చూసిన ’అఖండ భారతం’ :
హుయాన్ త్సాంగ్ గొప్పతనాన్ని అర్దం చేసుకోవలంటే, ఒక్కసారి ఆసియా మేప్ తీసుకొని, చాంగ్ఆన్ (Chang’ An) అనే చైనీస్ నగరం నుండి ఉజ్బెకిస్తాన్ దేశపు సమర్‌ఖండ్ వరకూ గీత గీసి, అక్కడినుండి కాందహార్, ఆపై నలందా, అక్కడినుండి కాంచీపురం, అజంతా, మళ్ళి నలందా వరకూ గీత గీసి, గూగుల్ మేపులో దూరాలూ, ఈ మధ్యలో ఉండే పర్వతాలూ, నదులూ వగైరా వివరాలు చూడండి.
భారతదేశం రావటానికి ఇంత తపన కష్టం పడ్డ మహా వ్యక్తిని, ఇంతటి శ్రద్ధ, మేధ ఉన్న వ్యక్తిని, భారతదేశపు ప్రతి ప్రాంతాన్నీ తిరిగిన మహనీయుడినీ, భారతదేశంలో ఆర్జించిన జ్ఞానం మూలంగా చైనాలో ఈ గత 1700 ఏళ్ళుగా గౌరవ మర్యాదలు పొందుతున్న మహనీయుడిని మన భారత చరిత్రకారులు ఒక్క వాక్యంలొ తేల్చేయటం అనేది ఆ మహనీయుడికి చేసిన అన్యాయం కాక మరేమిటి?
ఈ అన్యాయం యాదృచ్ఛికం కాదు. హుయాన్ త్సాంగ్ ప్రాధాన్యత తగ్గించటం పూర్తి ఉద్దేశ్యకపూర్వకంగా జరిగింది అన్నది నా నమ్మకం.
నా నమ్మకానికి కారణం ఏమిటంటే –
స్వతంత్ర భారతదేశ చరిత్ర రాసిన మేధావులంతా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు. చైనా అధ్యక్షుడికి జలుబు చేస్తే సంఘీభావంతో తుమ్ములు తుమ్మేవారు. వీరు రాసే చరిత్రలో “చైనా లో 1700 ఏళ్ళుగా గౌరవించబడే మహనీయుడికి దక్కుతున్న గౌరవానికి అసలు కారణం ఆయన భారతదేశంలో 17 ఏళ్ళు సంపాదించిన జ్ఞానం” అన్న విషయాన్ని ఒప్పుకోలేరు.
ఈ విషయం భారతీయులకు తెలియడం ఇష్టం లేదు. తెలియకుండా ఉండాలంటే పాఠశాల స్థాయిలో హుయాన్ త్సాంగ్ ను ఒక్క వాక్యంలొ తేల్చేస్తే, ఆ పేరు గుర్తుండకుండా పోతుంది. ఒకవేళ గుర్తు ఉన్నవాళ్ళకి కూడా పేరు తప్ప ఇంకేమీ తెలియదు.
ఇంకొక్క కారణం ఏమిటంటే, మన చరిత్రకారులు ఏమి చెప్పాలి అనుకున్నారు అంటే, “బ్రిటిష్ వారు రాకముందూ భారతదేశం అనేక చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. మొఘలులు రాకముదు ఇంకా చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉండేది” అని.
ఈ వాదనలో కొంతే నిజం.
ఢిల్లీ సుల్తానులు వచ్చిన 11-12 శతాబ్దాలకు వెళితే, 1947 జనవరి నాటికి బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న భారత భూభాగం, అంటే ప్రస్తుత పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలుపుకొని ఉన్న భూభాగం, లో కనీసం 6-7 పెద్ద రాజ్యాలూ, డజనుల కొద్దీ సామంత రాజ్యాలూ, కొన్ని చిన్న చిన్న సార్వభౌమ రాజ్యాలూ ఉండేవి.
ఐతే, ఆయా రాజ్యాలు కేవలం పరిపాలనాపరమైన హద్దులు మాత్రమే కలిగి ఉండి, సాంస్కృతికంగా బయటివారికి ఇది ఒకటే దేశం అనిపించే స్థాయిలో హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాకా, వ్యాపారుల, తీర్థయాత్రీకుల రాకపోకలు ఉండేవి. ఆ రాకపోకలు ఎంత స్వేచ్ఛగా జరిగేవి అంటే, ఇదంతా ఒకే పరిపాలనా రాజ్యమా అన్నంత స్వేచ్ఛగా జరిగేవి. ఇందుకు ఆధారాలు మనకు హుయాన్ త్సాంగ్ యాత్ర చేసిన మార్గం పరిశీలిస్తే తెలుస్తుంది.
ఈ వాదనకు ఆధారం ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్న నలందాకి చేరుదామని చైనాలో బయలుదేరిన హ్యుయాన్‌త్సాంగ్, కాందహార్ (ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్) దాటగానే, అంటే నలందా కి 3000 కిలోమీటర్ల ముందుగానే తాను భారతదేశంలో అడుగిడినట్లు భావించాడు.
అలాగే నలందా విద్యాభ్యాసం పూర్తికాగానే ఆయన తిరిగిన ప్రాంతాల్లో దక్షిణభారతంలోని కాంచీపురం ప్రాంతం. అంటే, 7 వశతాబ్దం నాటికే వాయువ్య పాకిస్తాన్ నుండి, నలందా మీదుగా కాంచీపురం వరకూ (దాదాపు ఐదువేల కిలోమీటర్ల మార్గం) అంతా హ్యుయాన్‌త్సాంగ్ దృష్టిలో ఒకే “దేశం”.
కాకపొతే ఈ మార్గంలో హర్షవర్ధనుడి సామ్రాజ్యం నుండి కళింగ సామ్రాజ్యం మీదుగా పల్లవ సామ్రాజ్యం లోకి ప్రవేశించిన ఈయనకు ఇవి సాంస్కృతికంగా ఒక్కలాగే కనిపించాయి.
అదే సమయంలో, ఇంత సువిశాల ప్రాంతంలో ఒక్కలాగే కనిపించిన ప్రాంతంలో కూడా ఒకే రాజు/ చక్రవర్తి ఏలుబడి కింద ఉండే రాజ్యంలో కూడా అత్యంత సమీప ప్రాంత ప్రజల మధ్య కూడా అనేక సాంస్కృతిక పరమైన బేధాలుండేవి. ఆ బేధాలు, ఆ ప్రజల మధ్య ఉన్న సంబంధాలను ఏమాత్రం తగ్గించలేనివిగా ఉండేవి. ఇదెలా అంటే, రెండు ప్రక్క ప్రక్క గ్రామాలలో ఒక ఊరికి పోచమ్మ, ఇంకో ఊరికి ఎల్లమ్మ అనే వేరువేరు గ్రామదేవతలు ఉన్నా, ఆ రెండు ఊర్ల ప్రజల మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నట్టు. ఇప్పటికీ పల్లెల్లో, అనేకమంది కొత్త కోడళ్లకి పుట్టింటి గ్రామదేవత వేరు, అత్తింటి గ్రామదేవత వేరు.
ఫేక్ ప్రచారాల పట్ల జాగ్రత్త!
హుయాన్ త్సాంగ్ చైనా తిరిగి వెళ్ళి రాసిన పుస్తకంలో కూడా తాను ఒకే దేశంలో తిరిగినట్టు ఉంటుంది. ఈ భావన మనదేశ విద్యార్థులలో కలగటం మన వామపక్ష చరిత్రకారులకు ఆమోదయోగ్యం కాదు. వాళ్ళెంతసేపూ, “అక్బరు చక్రవర్తి భారతదేశాన్ని ఏకము చేసెను, ఆంగ్లేయులు ఏకము చేసెను” అనే రాయాలి అనుకుంటారు. కానీ, అంతకు ముందే రాజ్య సరిహద్దులతో సంబంధం లేకుండా ఈ దేశం సాంస్కృతికంగా ఒకే దేశం అన్న విషయం మనవారి బుర్రల్లోకి వెళ్ళకుండా చూసారు.
అలాగే, ఈ మధ్య సోషియల్ మీడియాలో బౌద్ధం మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటించే మేధావులు ఎక్కువయ్యారు. వారంతా, “బౌద్ధులను బ్రాహ్మణులు హింసించారు, అణచారు, బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు” అని అరచి గోల పెడుతున్నారు.
వీరంతా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ప్రచారం చేసినట్లైతే వారికి ఏమీ చెప్పినా ప్రయోజనం లేదు. కానీ అజ్ఞానం తో ఇవి నమ్ముతున్నవారు, ఒక్కసారి ఈ హుయాన్ త్సాంగ్ చరిత్రను సమగ్రంగా చదివితే వారికి కొన్ని కీలకమైన విషయాలు అర్ధం అవుతాయి. అవి:
1. హర్షవర్ధనుడు హిందూ రాజు. కానీ కుంభమేళా సందర్భంగా నిర్వహించిన పండిత గోష్టికి నలందా నుండి ప్రతినిధులను ఆహ్వానించటమే కాక వారికి రాచ మర్యాదలు చేసాడు. అందులో భాగంగా నలందా ప్రతినిధి అయిన హుయాన్ త్సాంగ్ కు ఒక ఏనుగు, మావటి కూడా ఏర్పాటు చేసాడు. ఆ కుంభమేళాలో హర్షవర్ధనుడి కొలువులో బౌద్ధ పండితులు, వైదీక పండితు్లు ఏకకాలంలో మర్యాదలు అందుకున్నారు.
2. గౌతమ బుద్ధుడు మరణించిన రెండు వందల ఏళ్లకు అశోకుడు రాజ్యానికి వచ్చి బౌద్ధాన్ని ఆదరించి ప్రోత్సహించాడు. కానీ అశోకుడి తరువాత బౌద్ధం కొంత నిరాదరణకు గురి అయింది. దీని అర్ధం ఏమిటి? పాలకులు ఎలా ఉన్నా సాధారణ ప్రజలలోకి బౌద్ధం పూర్తిగా చొచ్చుకుపోలేదు.
3. బుద్దుడికి వెయ్యి సంవత్సరాల తరువాత హుయాన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చాడు. అప్పటికే వాయువ్య భారతదేశంలో నిర్మానుష్యంగా ఉన్న బౌద్ధ ఆరామాలు చూసి హుయాన్ త్సాంగ్ నిరుత్సాహపడ్డాడు.
4. ఆయన భారతదేశంలో ఉన్న 17 ఏళ్ళలో ఎప్పుడూ బౌద్ధులపై బ్రాహ్మణుల దమనకాండ గమనించలేదు. పోనీ ఆ 17 ఏళ్ళలో గమనించకపోయినా, అంతకుముందు జరిగినవి ఆయన దృష్టికి రాక మానవు కదా? బౌద్ధాన్ని అంత ఆరాధించిన మహనీయుడి దృష్టికి బౌద్ధులపై దమనకాండ జరిగినట్టు తెలిస్తే దానిని రాయకుండా ఉంటాడా?
5. ఫేక్ బౌద్ధ మేధావులు చెప్పే పుష్యమిత్ర శృంగుడు హుయాన్ త్సాంగ్ కి కనీసం 700-800 ఏళ్ళ క్రితం వాడు కదా? ఒకవేళ అంతటి ఘోరాలు జరిగివుంటే అవి హుయాన్ త్సాంగ్ కాలం నాటికి ప్రసిద్ధమైవుండాలి కదా? పోనీ, హుయాన్ త్సాంగ్ నాటికే ఆ దమనకాండని బౌద్ధులు మరిచిపోయారు అని అనుకుంటే, ఈ మేధావులకు ఇప్పుడు కొత్తగా దొరికిన ఆధారాలు ఏమిటి?
6. రెండో ప్రపంచయుద్ధంలో పరస్పరం నరమేధం సృష్టించుకున్న అనేక జాతులు ఇప్పుడు అన్నీ మరచిపోయి కలిసి ఉండాలి అనుకొనే ఆధునిక యుగంలో, ఏ ఆధారాలూ లేని, రెండువేల ఏళ్ళక్రితం జరిగింది అంటున్న “నరమేధం” మూలంగా ఎవరు ఎవరిని ద్వేషించాలి?
7. నలందా నూటికి నూరుపాళ్ళూ బౌద్ధుల కేంద్రమే. కానీ అక్కడ, బౌద్ధంతో పాటు వేదాలనూ, గణితాన్నీ, తర్కశాస్త్రాన్నీ, ఖగోళపరిజ్ఞానాన్నీ అధ్యయనం చేసేవారు. అందులో ఆచార్యులలోనూ , విద్యార్ధులలోనూ కూడా సమస్త విశ్వాసాల వారూ ఉండేవారు. తమపై నరమేధం సాగించిన బ్రాహ్మణులను బౌద్ధులు ఎందుకు అక్కడ చేర్చుకుంటారు? లేదా 7వ శతాబ్దం నాటికే బౌద్ధులకూ, బ్రాహ్మణులకూ కేవలం “మేధోపరమైన ప్రత్యర్ధులు” అన్న భావం తప్ప, భౌతిక వైరం సమసిపోయి ఉండాలి. ఈ ప్రజాస్వామ్య యుగంలో కత్తులు దూసుకున్నవారికి నచ్చజెప్పాలి అనాలి కదా? మరి గత 1500 ఏళ్ళుగా భౌతిక వైరం మరచి కేవలం తార్కిక వైరుధ్యాలు మాత్రమే ఉన్న హైందవాన్నీ, బౌద్ధాన్నీ ఇప్పుడు “వీధి పోరాటాల దిశగా” మార్చాలి అన్నట్టూ రాస్తున్న రాతలు ఏ ప్రయోజనం కోసం.
*****
ముగింపు:
భారత పాఠ్యపుస్తకాలలో ప్రాచీన చైనా ఆధ్యాత్మిక మేథావి “కన్‌ఫ్యూషియస్” గురించి మాత్రమే ఉంటుంది. నిజానికి చైనాలో ఇప్పుడు కన్‌ఫ్యూషియస్ తో సమానంగా హుయాన్ త్సాంగ్ కూడా గౌరవించబడతాడు. కానీ చైనా చరిత్ర చదివే భారతీయులు మాత్రం, అసలు వారిద్దరీకీ పోలిక అనవసరం – ఎవరైనా ఆ రెండూ పేర్లూ ఒకేసారి ప్రస్తావించినా – అలా పోల్చటం పంచాయితీ వార్డూ మెంబరునీ, ప్రధానమంత్రినీ పోల్చటం లాంటింది అనుకునేలా పాఠశాల చరిత్ర పుస్తకాలు రాసారు.
భారత చరిత్ర కారుల దృష్టీలో హుయాన్ త్సాంగ్ చేసిన “తప్పు” ఏమిటంటే, భారతదేశ ఆరాధకుడిగా జీవితం మొదలుబెట్టి, భారత దేశంలో సముపార్జించిన జ్ఞానం మూలంగా, చైనాలో ఆరాధించబడటం.
ఉదయం నిద్ర లేవగానే “చైనా గొప్ప, ఇండియా తక్కువ” అని 108 సార్లు జపించుకొని రోజు మొదలుబెట్టేవారు హుయాన్ త్సాంగ్ ని ఎలా క్షమించగలరు? ఆయనకి తమ పాఠ్య పుస్తకాలలో ఆయనకి సముచిత స్థానం ఎలా కల్పిచగలరు?
*****