తిరుమల ఆలయంలోని అపుర్వమైన శాసనం
ఈనాడు నాశనమవుతున్న ప్రకృతిని, చారిత్రిక సంపదలను చూసి మనం ఆందోళన చెందుతున్నాం.
వాటిని కాపాడుకోవాలన్న ప్రయత్నాలను చేస్తున్నాం. ఇందుకోసం ఎన్నో సంఘాలు, సంస్థలు పుట్టుకొచ్చాయి. పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పరిరక్షణా కార్యక్రమాల్లో తలమునకలైవున్నాయి.
కానీ సుమారు ఎనిమిదివందల సంవత్సరాల క్రితమే ఒక గొప్ప సాంస్కృతిక పరిరక్షణా చర్య ఒకటి తీసుకోబడిందని మీకు తెలుసా? ఇందుకు వేదికగా నిలిచింది తిరుమల శ్రీవారి ఆలయమేనని మీకు తెలుసా?
అంత ఉదాత్తమైన సంరక్షణా చర్యను తీసుకున్నది ఎవరు? ఏ కారణం వల్ల ఆ చర్యను తీసుకోవలసివచ్చింది? ఆ చర్య వల్ల కాపాడబడిన సాంస్కృతిక వారసత్వ సంపద ఏది? రండి, తెలుసుకుందాం.
ఈ వ్యాసాన్ని వీడియో రూపంలో అన్వేషి ఛానెల్లో చూడవచ్చు లేదా ధ్వని పాడ్కాస్ట్ యాప్ లో ఉచితంగా వినవచ్చు.
*****
చంద్రగిరి పాలకుడు వీరనరసింహ యాదవరాయలు
అది 13వ శతాబ్దం. చోళసామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉన్నకాలం. చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న వీరనరసింహ యాదవరాయలు వారి సామంతుల్లో ఒకడు.
ఇతనే చారిత్రిక సంపదను కాపాడుకోవలసిన అవసరంపై చర్యలు తీసుకున్నవాడు. తన ఆజ్ఞలను ఒక శాసన రూపంలో వ్రాయించి తిరుమల ఆలయంలో వేయించినవాడు. ఈ శాసనం ఇప్పటికీ తిరుమల ఆలయం మొదటి ప్రాకారపు ఉత్తరదిశలో ఉంది.
నరసింహయాదవరాయల ఈ శాసనం గురించి వ్రాస్తూ ప్రసిద్ధ శాసన పరిశోధకులు సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి ఇలా అంటారు –
“విజయనగర సామ్రాజ్యపు పూర్వకాలానికి చెందిన ఎన్నో శాసనాలు అరిగిపోయి, విరిగిపోయి ఉన్నాయి. కనుక వీటిలోని సమాచారం మనకు పూర్తిగా తెలియడం లేదు. ఇవి ఇలా కావడానికి ప్రధాన కారణం ఒకటి వుంది. అదే తిరుమల ఆలయ పునర్నిర్మాణం. నరసింహయాదవ రాయల కాలానికే ఈ ఆలయం ఎన్నోసార్లు మార్పులకు లోనయింది. ఆలయ ప్రాకారాలు, గుడిలోని ఇతర మందిరాలు, మండపాలు మొదలైనవి ఎన్నోసార్లు కూల్చబడి మళ్ళీ కట్టబడ్డాయి.
అయితే దురదృష్టవశాత్తు, ఈ పునర్నిర్మాణాలు చేయించినవారి అజ్ఞానం వల్ల గత ఐదు, ఆరు వందల సంవత్సరాలలో వేయించిన ఎన్నో శాసనాలు ధ్వంసమయ్యాయి. 13వ శతాబ్దంలో వీరనరసింహ యాదవరాయలు ఎంతో ముందుదృష్టితో వ్యవహరించపోయివుంటే ఒక్క పాత శాసనం కూడా మిగిలివుండేది కాదు. గుడి గోడలపై ఉన్న పాత శాసనాలను మళ్ళీ వ్రాయించాలని అతను తిరుమల ఆలయ నిర్వాహకుల్ని ఆదేశించాడు.”
ఈ విధంగా చంద్రగిరి వీరనరసింహ యాదవరాయల పుణ్యమా అని తిరుమల ఆలయంలోని అత్యంత పురాతన శాసనల్లో కొన్నైనా ఈనాడు మనం చూడ్డానికి మిగిలివున్నాయి.
*****
పాత శాసనాలను వీరనరసింహ యాదవరాలు సంరక్షించిన విధానం
వీరనరసింహ యాదవరాయలు తన ఆజ్ఞాపత్రంలో పాత శాసనాలను మళ్ళీ వ్రాయించండి అని మాత్రమే చెప్పలేదు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గోడలపై ఉన్న పాత శాసనాలను తొలగిస్తున్నప్పుడు వాటి తాలూకు వివరాలను నమోదు చేయాలని చెప్పాడు.
కొత్తగా కట్టిన గోడలో ఆ పాత శాసనాలను ఉంచి కట్టాలని చెప్పాడు. నిర్మాణం కోసం తొలగించబడ్డ పాత శాసనాలు తిరుమల ఆలయంలో ఏదిక్కున, ఏ గోడపై, ఎక్కడ ఉండేవో అక్కడే ఉంచాలని కూడా నిర్దేశించాడు.
ఒకవేళ శాసనం వ్రాసివున్న రాయి కొత్త గోడలఓ పట్టకపోతే ఆ శాసనంలోని వివరాలను కొత్త రాతిపై చెక్కించి, ఆ రాయిని పాత శాసనం ఉన్న స్థానంలోనే ఉంచాలని ఆజ్ఞాపించాడు వీరనరసింహ యాదవరాయలు.
అయితే, ఏ కారణం వల్ల వీరనరసింహ యాదవరాయలు ఇలాంటి ఆజ్ఞను జారీ చేసాడు? ఆ వివరాలను తెలుసుకుందాం!
****
వీరనరసింహ యాదవరాయలు ఎందుకు ఇలా చేయాల్సివచ్చింది?
తిరుమల ఆలయంలోని శాసనంలో వీరనరసింహరాయలు ఎందుకు, ఎలా ఈ ఆజ్ఞను జారీచేసాడన్న పూర్తి వివరాలు లేవు. కానీ ఆ శాసనంలోని కొన్ని వాక్యాలు అసలు విషయాన్ని మనకు చెబుతాయి.
ఈ శాసనం ప్రకారం తిరుప్పుల్లని దాసర్ అనే ఒక దేశాంతరి తిరుమల ఆలయంలో ఉన్న పాత కోవిల్ ఆళ్వార్ గుడిని విప్పదీసి కొత్తగా కట్టిస్తానని యాదవరాయలకు విన్నపాన్ని సమర్పించాడు. అందుకు రాయలు సరేనన్నాడు. కోవిల్ ఆళ్వార్ అంటే సాక్షాత్తు శ్రీనివాసుడు నెలకొనివున్న గర్భగృహం.
ఈ గర్భగృహ పునర్నిర్మాణం సాగుతున్న సమయంలో దాని గోడలపై ఉన్న పాత శాసనాలను తీసి పారేసారన్న విషయం నరసింహయాదవరాయలకు తెలిసివచ్చింది. దాంతో నరసింహరాయలు వెంటనే రంగంలోకి దిగి తిరుమల ఆలయ నిర్వాహకులైన స్థానత్తార్లకు తన ఆజ్ఞను జారీ చేసాడు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తొలగిస్తున్న ప్రతి శాసనాన్ని నమోదు చేయాలని, పాత శాసనంను వాడడానికి వీలు లేకపోతే అందులోని అంశాలను యథాతథంగా వ్రాసి నకలు శాసనాన్ని తయారుచేయాలని అతను ఆజ్ఞాపించాడు. అంతేకాదు పాత శాసనాలు ఎక్కడ ఉండేవో అక్కడే ఆ శాసనాలను మళ్ళీ స్థాపించాలని కూడా ఆదేశించాడు.
****
వీరనరసింహ యాదవరాయలు మనకు నేర్పే పాఠం
ఈవిధంగా ఒక రాజు తన కంటే పూర్వీకులు వేయించిన శాసనాల పట్ల ఎంతో శ్రద్ధను చూపించాడు. ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందించి, తిరుమల ఆలయ అధికారులచేత సంరక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిపించాడు.
ఎనిమిది వందల ఏళ్ళ క్రితం జీవించిన వీరనరసింహ యాదవరాయలు ఈనాటి మనకు కూడా ఆదర్శవంతుడు. మన చరిత్రను, వారసత్వ సంపదను, సాంస్కృతిక చిహ్నాలను ఎలా కాపాడుకోవాలో చేసి చూపించిన మహానుభావుడు.
ఆ వీరనరసింహ యాదవరాయలు లానే మనం కూడా మన పూర్వీకుల గుర్తులను గౌరవిద్దాం. వాటిల్ని కాపాడుకుందాం. భావి తరాలకు మన కానుకగా అందిద్దాం.
*****