భారతీయ కావ్యాలు – పరోక్షత (Objectivity)

Spread the love
Like-o-Meter
[Total: 5 Average: 5]

భారతీయ కావ్యాలు – పరోక్షత (Objectivity) గురించి ఇ.ఎన్.వి. రవి విశ్లేషణను చదవండి.

కావ్యాల్లో పరోక్షత (Objectivity)

భారతీయ కావ్యాలు, కావ్యసాంప్రదాయాలు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనిపించే వాస్తవాలను మాట్లాడవు. ఆ వాస్తవాలను సత్యాలుగా అంగీకరించేసి, ఆ కంటికి కనిపించే ప్రత్యక్షవాస్తవాలను సత్యాలుగా మన్నిస్తూ రచన చెయ్యాలనే తీర్మానానికి కట్టుబడలేదు.

చిత్రగ్రీవుడు – ఇదొక పావురం. లఘుపతనకుడు ఒక కాకి, దీర్ఘకర్ణుడు – పిల్లి. సంజీవకుడు, పింగళకుడు, కరటకదమనకులు వగైరా వగైరా.

మనకు కనిపించే ప్రపంచంలో కాకులు, పిల్లులు, ఆవులు గట్రా మాట్లాడవు. మాట్లాడలేవు. వాటికి పేర్లుండవు. అవి మనుషుల్లా ప్రవర్తించవు. పక్షులు, జంతువులు మాట్లాడలేవనేది వాస్తవం. కానీ కావ్యప్రపంచంలో అవన్నీ మనుషుల్లా మాట్లాడతాయి. వాటికి సంస్కారం ఉంటుంది. పేర్లుంటాయి.

ఎందుకిలా?

పక్షులు, జంతువులు మాట్లాడలేవనే వాస్తవం ప్రపంచంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. అదేదో ప్రత్యేకంగా బోధించాల్సిన అధ్యయనం చేయాల్సిన వ్యవహారం కాదు. అలా మాట్లాడలేని పాత్రలతో మాట్లాడించి, ఒక ఆభాస ప్రపంచాన్ని సృజించి ఆ ప్రపంచం ద్వారా లోకజ్ఞానాన్ని, మిత్రత్వం, శత్రుత్వం మధ్య వ్యత్యాసాన్ని, లాభనష్టాలను, ఇంకెన్నో ఉత్తమజీవన విషయాలను చెప్పడానికి ఈ పద్ధతి.

భారతీయ కావ్యాలకు ఆదికావ్యం అయిన రామాయణంలో వానరులు రాజ్యం చేస్తారు, వారధి కడతారు, యుద్ధం చేస్తారు, ఇంకెన్నో చేస్తారు. ఇవన్నీ రంగనాయకమ్మ చెప్పినట్టు – కావ్యపు ఫ్యూడల్, ఆటవిక లక్షణాలు కావు. వానరులు మాట్లాడలేవన్న వాస్తవం అంత జ్యాగ్రఫీ, అంత లోకజ్ఞానం, లేదూ కనీసం అంత అందమైన భాష అలవోకగా అబ్బిన కవి వాల్మీకికి తెలియక కాదు.

వానరులతో మనుషులు చేయించే పనులు చేయించి, పాఠకులను అజ్ఞానాంధకారంలో నెట్టాలనే ఉద్దేశ్యం వాల్మీకికి ఉండదు, ఉండరాదు.

కొన్ని వాస్తవిక విషయాలను అప్రధానం చేసి, శాస్త్ర విషయాలను, ఉత్తమ విలువలను ఎన్యూమరేట్ చెయ్యడం భారతీయ వాఙ్మయ దృష్టి.

ఓ కవి ఎన్నో వాస్తవాలను అప్రధానం చేసి చరిత్ర ను (ఇతిహాసాన్ని) బోధిస్తాడు. మరొక కవి ఖగోళరాశులను మానవ సమాజ ప్రతిరూపాలుగా చేసి ఖగోళ విజ్ఞానాన్ని చెపుతాడు. ఉదాహరణకు – చంద్రునికి 27 మంది భార్యలు. అందులో రోహిణి అంటే అతనికి ప్రేమ. వశిష్ఠుని భార్య అరుంధతి. వారిద్దరు ఆదర్శదంపతులు. ధ్రువుడు నిశ్చలమైన విష్ణుపదాన్ని పొందాడు మొదలైనవి.

ఇవన్నీ వాస్తవాలా? చంద్రుడు 27 మంది భార్యలను పెట్టుకుని ఒక్కొక్క భార్యతో ఒక్కో రోజు కులికాడు – అని చెప్పడానికా ఇదంతా?

విలియం జోన్స్ అంటాడు – “భారతదేశ చరిత్ర అంతా అంధకారబంధురం. అదంతా కవుల, రచయితల అవాస్తవిక ఊహల్లో మరుగుపడి పోయింది” అని. ఇది తెలివు ఉండే చెబుతున్న మాటా?

ఆధునిక కాలంలో చెత్త మేధావులు చాలామంది బయలు దేరారు. చంద్రుడికి 27 మంది భార్యలు – ఇదుగో ఇలా వ్రాశారు కనుక పురాణాలు పుక్కిట పురాణాలు అయిపోయాయట! ఆ చదివే వాడి దృక్పథం ఏమంటే చంద్రుడికి 27 మంది భార్యలు అనగానే, ఆ భార్యలు, వారితో చంద్రుడు (అనే ఉపగ్రహం) బెడ్రూం లో చేసే నిర్వాకాలు, వగైరా – ఇదంతా “వాస్తవికంగా” లేదు కనుక మొత్తం చెత్తట. వారికి ఉన్నది ఉన్నట్టు చెప్తే అది “విజ్ఞానం”.

విజ్ఞానం సబ్జెక్టివిటీ.

ఆబ్జెక్టివిటీ అంతా వ్యర్థం.

ఇదీ ఈ కాలపు తొక్క మేధావుల తీరు. ఈ మేధావుల్లో ఎన్నో అంశలు.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

******

పైన వ్రాసింది నేను చర్వితచర్వణంగా, రకరకాలుగా అక్కడక్కడా వ్రాసిందే. ఇదలా ఉంచుదాం.

విమర్శ/వ్యాఖ్య అంటే ఏమిటి?

కవిత్వానికి/వచనానికి సంబంధించిన ఆబ్జెక్టివిటీని సూచనాప్రాయంగా తెలియజేస్తూ ఒక సామాన్యపాఠకుణ్ణి గొప్ప ఊహాప్రపంచంలో తీసుకుపోయి వదిలేది విమర్శ. ఇప్పుడో రఘువంశ శ్లోకం మాట్లాడుకుందాం.

సరాజ్యం గురుణా దత్తం ప్రతిపద్యాధికం బభౌ|
దినాంతే విహితం తేజః సవిత్రేవ హుతాశనః||

రఘు మహారాజు తండ్రి దిలీపుని నుండి రాజ్యాన్ని స్వీకరించాడు. అది ఎలా – రోజంతా ఎండవేడిమిని ప్రసరింపజేసి పటిమను కోల్పోయిన సూర్యుని నుండి తేజస్సును అగ్ని స్వీకరించినట్టు ఉన్నది.

అగ్ని – సూర్యుని నుండి తేజస్సును స్వీకరించటం అన్నది ఋగ్వేదపు ప్రస్తావన అని మల్లినాథసూరి వ్యాఖ్య. (ఆదిత్యో వా అస్తమయన్ అగ్నిమనుప్రవిశతి. అగ్నిం వావాదిత్యస్సాయం ప్రవిశతీతి శ్రుతి ప్రమాణం.)

సూర్యుని నుండి అగ్ని తేజస్సును స్వీకరించటం అన్న భావనకు నిజమైన అర్థం నాకు తెలియదు. నేను పండితుడిని కాను. అయితే ఆ భావన ఎంతో హృద్యమైనది.

మనం చూచే కర్మసాక్షి సూరీడు పొద్దున ఉదయించింది మొదలు సాయంకాలం వరకున్నూ తన బాధ్యతను నిర్వికారంగా అమలు పరుస్తూ లోకానికి వెలుగు నిచ్చాడు. సాయంకాలాన నీట మునుగుతూ, అగ్నికి తన వెలుగును ఇచ్చేశాడు. ఆ భావాన్ని ఒక మహారాజు యువరాజుకు పట్టం కట్టడానికి అన్వయిస్తూ కవి చెప్పాడు. వ్యాఖ్యాత ఆ భావాన్ని పాఠకునికి చూచాయగా తెలియజేస్తూ వ్యాఖ్య చేశాడు. విపరీత వ్యాఖ్యానం చేసి ఆబ్జెక్టివిటీ స్పర్శను చెడగొట్టలేదు.

ఆధునిక విమర్శకుల్లో వ్యాఖ్యాన ఉద్దేశ్యాన్ని, విమర్శ దృక్పథాన్ని స్పష్టంగా అర్థం చేసికొన్నది పుట్టపర్తి నారాయణాచార్యులు.

నారాయణాచార్యులు ఒక విమర్శలో చెప్తారు – “ధారాశుద్ధి” కవిత్వానికి ముఖ్యలక్షణం. అందులో అల్లసాని పెద్దన కవిత్వ ధార, తెనాలి రామకృష్ణుని ధార, భట్టుమూర్తి ధార, రాయని ధార వేర్వేరు. ఒకరిది జలపాతం, మరొకరిది సెలయేరు, మరొకరిది గట్టులు చక్కగా తీర్చిన కాలువ, ఇంకొకదిది సముద్రపు గాంభీర్యపు అంశ నిలుపుకున్న ధార. ఆ వ్యాఖ్య సాయంతో ఆయా కవుల కావ్యాలను అనుశీలిస్తే ఎంతో అందమైన ప్రపంచం కనిపిస్తుంది.

అల్లసాని వాని ధార జలపాతపు హోరు – అని విమర్శకుడు చెప్పాడనుకోండి. ఆ వ్యాఖ్య సాయంతో ” అటజని కాంచె భూమిసురుడంబరచుంబి..” పద్యం చదువుకుంటే పాఠకునికి ప్రతీయమానం అయ్యే జలపాతపు హోరు అనుభవైకవేద్యం.

వ్యాఖ్యాత/విమర్శకుడు ఇక్కడ చేస్తున్నది ఏమిటి? వివరించటం కాదు, సూచించటం. ఆబ్జెక్టివిటీ (పరోక్షత) ను ప్రత్యక్షం (సబ్జెక్టివ్) చెయ్యకుండా ఆ ఆబ్జెక్టివిటీని పాఠకుడికి చేరువ చేయటం.

రచనను పాఠకుడికి వద్దకు తీసుకు పోవటం అంటే దానిని అంటారు. (అఫ్ కోర్స్ విమర్శకుడు/వ్యాఖ్యాత దేన్నైతే విమర్శించాడో, ఆ కావ్యానికి దమ్ము ఉండాలి) చెప్పేదాంట్లో స్పష్టత, వ్యాఖ్యాన/విమర్శ ఉద్దేశ్యాలు, వాటి ఎవల్యూషన్ తెలియని వారు, ఊరికే ఎక్కువ చదివాం కనుక విమర్శకు తగినవాళ్ళం అని క్లెయిం చేసుకునే బాపతులు, వెస్టర్న్ సాహిత్యాన్ని పట్టుకొచ్చి దాన్ని చూచే పద్ధతులతో భారతీయ వాఙ్మయాన్ని చదివే మారాజులు తయారయ్యారు నేడు. షేక్ స్పియర్ గొప్పోడు, ఇండియన్ పొయెట్రీ పనికి రాదు. ఇలా ఒకాయన.

సరే! ఈ మొత్తం ఒక ఊపులో వ్రాసింది. మళ్ళీ కొనసాగింపు ఎప్పుడైనా…

Your views are valuable to us!