కాదంబరీః కాదంబరీ

Spread the love
Like-o-Meter
[Total: 7 Average: 5]

 

కాదంబరి అంటే సంస్కృతంలో ఇప్పకల్లు. భద్రాచలం వద్ద గోదావరి తీరాన పర్ణశాల అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ గ్రామీణులు సీతమ్మవారి ప్రసాదం అని ఇప్పపూలు అమ్ముతుంటారు. కాస్త వగరుగా, కాస్త తియ్యగా ఉంటాయవి. ఇప్పపూలు ఆ గ్రామీణులకు Natural sweeteners. చక్కెర బదులుగా అవి వాడతారట. అలాగే తాజాగా సేకరించిన ఇప్పపూలతో ఛత్తీస్ గఢ్, దండకారణ్యం మారుమూల ప్రాంతాలలోని గిరిజనులు కల్లు తయారు చేస్తారట. ఆ కల్లు (ఆ మాటకొస్తే ఈత లేదా తాటి కల్లు ఏదైనా) మాధుర్యం ఒక్కపెట్టున తెలియదు. మెలమెల్లగా ఆస్వాదించే కొద్దీ, క్రమక్రమంగా ఆ మాధుర్యం ఆస్వాదకుణ్ణి లోబరుచుకుంటుంది.

కాదంబరి కావ్యం కూడా అంతే. ఒక్క పెట్టున చదివే కావ్యం కాదిది. కథ, వర్ణనలు, పాత్రౌచిత్యం, కథాసంవిధానం, సంభాషణాచాతురి, సున్నితమైన ప్రేమ సన్నివేశాలు, అద్భుతమైన శైలి బిగువు – ఇలాంటి గమనిస్తూ ఎన్నో మార్లు, వీలైతే వ్యాఖ్యానసహితంగా చదువుకోవాలి. ఈ గ్రంథం – ప్రపంచంలో మొట్టమొదటి నవలగా పేర్కొంటారు. (కానీ సుబంధుని వాసవదత్త అంతకంటే ముందుది) సాధారణంగా సంస్కృతంలో ప్రేమ/స్త్రీవర్ణనలు, శృంగారం అంటే కాస్త శ్రుతిమించిన సందర్భాలు చాలా కావ్యాలలో ఉన్నాయి. కాళిదాసాదుల కావ్యాలలోనూ ఇటువంటివి కద్దు. అయితే బాణభట్టు ఎక్కడా ఆ బాట పట్టలేదు. హద్దు దాటలేదు. స్త్రీపురుషుల ప్రణయాన్ని, ప్రేమభావాన్ని ఆతడు చిత్రించిన తీరు అపూర్వం. ఇంత గొప్పగా ప్రణయాన్ని చిత్రించిన కావ్యం బహుశా ప్రపంచ కావ్యాలలో ఎక్కడా కనిపించదు.  జన్మజన్మలకు విస్తరించిన నాయికానాయకుల ప్రేమ రసప్రపూరితమై ఒక ఉదాత్తకావ్యంగా నిలుస్తుంది. కాదంబరి గురించి స్థూలంగా నాకై నేను వ్రాసుకున్న నోట్స్ ఇది.

 

కాదంబరి

ఇది మూడుజన్మల కథ. రెండు జంటల కథ. గొప్ప ప్రేమ కథ. ఈ కథను కట్టె కొట్టె తెచ్చె పద్ధతిలో చెప్పుకుందాం.

మూడవ (ప్రస్తుత) జన్మ

విదిశా నగరానికి రాజు శూద్రకుడు. ఈతడు మంచి యౌవనంలో ఉన్నప్పటికీ ఎందుచేతనో యువతులమీదకు ఆసక్తి కలుగలేదు. ఓ రోజు ఈ రాజు సభకు ’నడుస్తున్న ఇంద్రనీలమణి’ వలే ఒక చండాల కన్య వచ్చింది. ఆమె చేత పంజరం. అందులో ఓ చిలుక. ఆ మాట్లాడే చిలుకను ఆమె రాజుకు బహూకరించింది. రాజు చిలుకను తీసుకొని ఆ అమ్మాయికి విలువైన కానుకలిచ్చి పంపేశాడు. (ఆ అమ్మాయి ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి (క్రితం జన్మలో) ఆ చిలుకకు తల్లి. రాజు శూద్రకుడు ఎవరో కాదు, ఆమె సోదరుడు, చంద్రుడు. ఈ విషయాలు వెయ్యి పేజీలు అయిన తర్వాత నవల చివర్లో తెలుస్తాయి. శూద్రకుడు యువతుల పట్ల విముఖుడు అవటానికి కారణమూ తర్వాత తెలుస్తుంది. ఆతని ప్రేయసి మరెక్కడో బ్రతికి ఉంది.

రాచవ్యవహారాలు చక్కబెట్టుకుని తీరిక కుదిరిన తర్వాత రాజు ఆ చిలుకను కుశలప్రశ్నలు వేసి పలుకరించేడు. ఆ చిలుక తన కథ (ఫ్లాష్ బ్యాక్) చెప్పింది. (ఈ ఫ్లాష్ బ్యాక్ లో తిరిగి ఫ్లాష్ బ్యాక్, ఇలా వెళతాయి కాబట్టి ప్లెయిన్ గా కథ చెప్పుకుందాం)

*****

మొదటి జన్మ

శ్రీ మహాలక్ష్మి శ్రీ హరి విరహంలో ఉండగా ఓ రోజు వైకుంఠానికి శ్వేతకేతువనే మహర్షి ఏతెంచినాడు. ఆతని రూపలావణ్యాలను చూసి ఆమె మనసు కొంచెం చలించింది. ఆమెకు ఓ జృంభిక (ఆవులింత), అందునుంచి పుండరీకుడనే పుత్రుడు జన్మించాడు. ఆ శిశువును లక్ష్మీదేవి శ్వేతకేతునికి ఇవ్వగా, ఆతడు ఆ పుత్రుని పెంచిపెద్దచేశాడు.  పుండరీకుడు పెరిగి పెద్దవాడై, చిత్రరథుడనే గంధర్వరాజు కుమార్తె అయిన మహాశ్వేతను చూసి ఆమెపై మరులు గొన్నాడు. తీవ్రవిరహంతో ఉద్వేగానికి లోనైనాడు. ఆమెపై ప్రేమను వ్యక్తీకరించాలని, ఓ పౌర్ణమి రోజు సంకేత స్థలానికి కబురంపి, తన మిత్రుడైన కపింజలునితో ఎదురు చూస్తున్నాడు. మహాశ్వేత అనుకున్న సమయానికి ఆ సంకేతస్థలానికి చేరుకోలేకపోయింది. తన ప్రేమను ఆమె అంగీకరించలేదని మథనపడిన పుండరీకుడు వేదనతో ప్రాణాలు విడచినాడు. విడుస్తూ, విరహానికి కారకుడైన చంద్రుని “భూమిపై జన్మించమని” శపించినాడు. చంద్రుడు కూడా పుండరీకునికి అదే శాపాన్ని ప్రతిగా ఇచ్చినాడు.

ఇంతలో మహాశ్వేత అక్కడకు వచ్చి విగతజీవుడైన పుండరీకుని చూసి తీవ్రంగా విలపించి, ప్రాణత్యాగం చేయబోయింది. కానీ పునస్సమాగమం లభిస్తుందని చంద్రుడు ఆమెను ఊరడించాడు.  కపింజలుడు పుండరీకుడి కాయాన్ని తీసుకొని, పుండరీకుని తండ్రి శ్వేతకేతువుకు జరిగినదంతా చెప్పడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ మునిపై నుంచి ఎగిరి వెళ్ళగా, ఆముని కోపించి ’అశ్వము” గా జన్మించమని కపింజలుణ్ణి శపించాడు.  మృతదేహం మహాశ్వేత వద్దకు చేరింది.

*****

రెండవజన్మ

శాపగ్రస్తుడైన చంద్రుడు ఉజ్జయిని యువరాజు చంద్రాపీడుడిగానూ, పుండరీకుడు – మంత్రి కుమారుడు వైశంపాయనుడిగాను, కపింజలుడు – యువరాజు యొక్క అశ్వం ఇంద్రాయుధం గానూ జన్మించినారు. చంద్రుని సహచరి రోహిణి చంద్రాపీడుని తాంబూలకరండవాహిని పత్రలేఖగా జన్మించి ఆతనికి గొప్పగా సపర్యలు చేస్తూ ఉంది.

చంద్రాపీడుడు, తన మిత్రునితో కలిసి ఓ మారు వేటకు వెళ్ళి మార్గం తప్పాడు. ఆతడు అలా ఇంద్రాయుధం అనే తన గుర్రంపై హిమాలయ పర్వతసానువులకు చేరి, అక్కడ ఉన్న ఒక అద్భుతమైన “అచ్ఛోద” సరస్సును చేరాడు. ఆ పరిసరప్రాంతాలు చూచిన అతడు మైమరిచిపోయాడు. అంతలో ఆతనికి దాపున గల చతుర్ముఖ లింగ దేవాలయం నుండి ఒక వీణావాదం వినిపించింది. ఆ గానాన్ని వెతకి అతడు అక్కడకు చేరాడు. అక్కడ మహాశ్వేత (పుండరీకుని తలపులతో గడుపుతున్నది) కనిపించింది. మహాశ్వేత చంద్రాపీడునికి ఆతిథ్యమిచ్చి, ఆ రాత్రి అక్కడ విశ్రమింపజేసింది.

తర్వాతి రోజు మహాశ్వేత చంద్రాపీడునికి తన చెలికత్తె కాదంబరిని పరిచయం చేసింది. చంద్రాపీడుడూ, కాదంబరి మధ్య స్నేహం మొలకెత్తి ప్రణయంగా పరిణమింపసాగింది.

ఇంతలో యువరాజును వెతుకుతూ, సేన, వైశంపాయనుడు అచ్ఛోద సరస్సుకు చేరారు. తమ తండ్రి తారాపీడుని వద్ద నుండి వర్తమానం రావడంతో చంద్రాపీడుడు చేసేది లేక తానొక్కడే వెనుతిరిగాడు. (సైన్యాన్ని, మిత్రుడిని వెనుకల నిదానంగా రమ్మన్నాడు) రాజ్యానికి వచ్చినప్పటికీ చంద్రాపీడునికి మనసు మనసులో లేదు. అచ్ఛోద సరస్సు, కాదంబరిని మరువలేకపోతున్నాడు. ఇలా కొంతకాలం గడచింది. చంద్రాపీడుని సఖుడు వైశంపాయనుడు అచ్ఛోద సరస్సు నుంచి తిరిగి రాలేదు.

ఏమైపోయాడతను?

అతణ్ణి వెతికే మిషపై చంద్రాపీడుడు తిరిగి హిమాలయ సానువులకు వెళ్ళాడు. అక్కడ అతడు జరిగిన ఘోరం విన్నాడు. జరిగినదేమంటే – వైశంపాయనుడు మిత్రుని కోసం చేరి మహాశ్వేతను చూచాడు. చూస్తూనే ఆమెను మోహించాడు. (పూర్వజన్మలో తన ప్రియురాలే. అతనికా విషయం తెలియదు). మహాశ్వేత – ఎదురుగా ఉన్నది తన ప్రియుని మరుజన్మ అని తెలియక, ఎవడో అనుకుని వైశంపాయనుణ్ణి – చిలుకగా మారిపొమ్మని శపించింది. ఆ తర్వాత విషయం తెలిసి ఎంతగానో దుఃఖించింది.

చంద్రాపీడుడికి – ఒకపక్క కాదంబరి తన ప్రేమను అంగీకరిస్తుందా అన్న మథన, మిత్రుని యెడబాటు ఒక్కపెట్టున వచ్చి ఆ ఉద్వేగం భరించలేక ఆతడు దేహత్యాగం చేశాడు. కాదంబరి కన్నీరు మున్నీరయింది, కానీ పునస్సమాగమం ఉంటుందని తెలిసి ఆ దేహాన్ని భద్రపరచింది.

*****

తిరిగి ప్రస్తుత జన్మ

చంద్రాపీడుడు – శూద్రకుడుగా, వైశంపాయనుడు – చిలుకగా జన్మించారు. వీరిరువురూ కాదంబరిని, మహాశ్వేతనూ చేపట్టడంతో కథ సుఖాంతం.

******

కాదంబరి కావ్యం రెండుభాగాలు – (అ) పూర్వభాగం (ఆ) ఉత్తరభాగం.

కథలో ఇతివృత్తాన్ని మొత్తాన్ని తయారు చేసిన పిదప బాణభట్టు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన పుత్రుడు భూషణభట్టు ఉత్తరార్ధాన్ని పూర్తి చేశాడు. జన్మజన్మలకు సంబంధించిన కథను ఇద్దరు కవులు పూర్తి చెయ్యటం చాలా వింతయిన విషయం. (బహుశా ఇది పేరబుల్ కూడా  అయి ఉండవచ్చు).

“కాదంబరి (మధురమైన ఇప్పకల్లు) ను ఆస్వాదించి పాఠకులు రసప్రపూరితులై ఉన్నారు. ఆ మత్తులో ఉన్న పాఠకులకు అందులో మరొక ఆసవాన్ని కలిపినప్పటికీ (కల్తీ చేసినా) తెలిసికోలేరు. అందువలన నేను ఈ ఉత్తరభాగాన్ని రచిస్తున్నాను, దానిని సహృదయులు తప్పు పడతారన్న భయం లేదు” అంటాడు భూషణుడు, ఎంతో వినయంతో.

కాదంబరీరసభరేణ సమస్త ఏవ మత్తో న కించిదపి చేతయతే జనోऽయమ్ |
భీతోऽస్మి యన్న రసవర్ణవివర్జితేన తచ్చేషమాత్మవచసాప్యనుసందధానః ||

కానీ భూషణుడు తండ్రిని మించిన తనయుడే. ఈతడు కల్తీ చేయలేదు. ఇంకా పరిపుష్టం చేసాడు. బాణభట్టు రచించిన కథకు ఏ మాత్రం ప్రమాదం లేకుండా, అతుకు అనిపించకుండా ఎంతో చాకచక్యంతో భూషణభట్టు కథాభాగాన్ని పూరించాడు.

ఈ కాదంబరి కథ, నాయకుల వివిధ జన్మలు, ఆ జన్మల మధ్య సమయం, వాటి సమన్వయం, నాయికా నాయకుల మధ్య ప్రేమ మొలకెత్తి, పరిణతమైన తీరు ఇవన్నీ ఎంతో సూక్ష్మంగానూ, మహాద్భుతంగానూ నిర్వహించాడు కవి.

కవి చిన్న చిన్న సన్నివేశాలను సృష్టించి ఆ సన్నివేశాల ద్వారా పాత్రల మనోభావాలను హృద్యంగా చెబుతాడు. కాదంబరిని వీడి చంద్రాపీడుడు ఉజ్జయిని వస్తుంటాడు. ఆతనికి మధ్యలో ఓ శ్రమణుడు కనిపిస్తాడు. ఆతని ఆకారం చూసి ఎంత విరహవేదనలో ఉన్నప్పటికీ నవ్వుతాడు. ఆపై తన అనుచరులు ఆతని గేలి చేస్తుంటే – వారించి ఆ శ్రమణునితో మాటలు కలుపుతాడు. చూస్తే చొప్పించినట్లు కనబడే ఈ చిన్ని ఉదంతం ద్వారా చాలా సూక్ష్మంగా కథానాయకుని హృదయవేదనను కవి ఎలివేట్ చేస్తాడు.

ఇవన్నీ ఒక యెత్తు. కథలో వర్ణనలన్నీ మరొక యెత్తు.

ఈ కావ్యంలో అడుగడుగునా సుదీర్ఘమైన వర్ణనలు. మొదటనే శూద్రక మహారాజు వర్ణన, ఆపై ఛాండాల కన్య వర్ణన, అటుపై చిలుక భోజనం, వింధ్యాటవి,అక్కడ బూరుగు చెట్టు, కిరాతులు, కిరాత నాయకుడు ఇలా ఎడతెరిపి లేకుండా వర్ణనలు. నిజానికి ఈ వర్ణనలు కథాగమనానికి బాగా అడ్డుపడుతున్నట్టు మనకు (ఈ కాలపు వారికి) అనిపిస్తుంది.

ఆ వర్ణనలు అటు ఉంచితే బాణభట్టు రమణీయమైన వచనశైలి, అడుక్కొకమారు శ్లేష, సుదీర్ఘమైన సమాసాలు ఇవన్నీ విశేషాలు. ఓ చిన్న సమాసం ఉదాహరణకు :శూద్రకుని వర్ణిస్తూ కవి ఇలా అంటాడు “దిగ్గజ ఇవ అనవరత ప్రవృత్త దానార్ద్రీకృత కరః” అంటే రెండు అర్థాలు.

నిరంతరంగా దానాలు చేయటం వలన (మనస్సులోని సౌహార్ద్రత) హస్తానికి కూడా పాకిందా అన్నట్టుగా కరములు కలిగిన, దిగ్గజము వంటి మహారాజు. దానం అంటే – మదజలం అని మరొక అర్థం. ఈ అర్థంతో ఆ సమాసానికి మరొక భావం ఏర్పడుతుంది. నిరంతరంగా మదజలం స్రవించటం వలన తొండము పై కూడా తడి కలిగిన మదగజము వంటి మహారాజు. మదజలం మిక్కిలిగా స్రవించే ఏనుగు శ్రేష్ఠమైనది. అందుకు ఆ సమాసం.

ఇటువంటి శ్లేషలు వందల సంఖ్యలో ఈ గ్రంథంలో రాశులుగా ఉన్నాయి. ఈ శ్లేషలు సమాసాల కూర్పులోనే కాదు, సంభాషణల మధ్య కూడా దొరలుతాయి. కాదంబరి, చంద్రాపీడుల మధ్య పరిచయం ఏర్పడింది. మహాశ్వేత ఇద్దరినీ ఒండొరులకు పరిచయం చేసింది. వారిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. ప్రణయభావం సన్నగా అంకురిస్తోంది. ఆ సందర్భాన కొంత చిలిపిగానూ, మధురంగానూ సంభాషణ సాగుతుంది.

చంద్రాపీడుడు: “దేవీ! జానామి కామరతిం నిమిత్తీకృత్య ప్రవృత్తోऽయం అవిచలసంతాపతంత్రో వ్యాధిః. సుతను! సత్యం న తథా త్వామేష వ్యథయతి యథాస్మాన్. ఇచ్ఛామి దేహదానేనాపి స్వస్థామత్ర భవతీం కర్తుమ్

దేవీ! (నీ) అవ్యక్తమైన భావపు కామరతి (కాం – అరతి = ఏదీ సహించకపోవుట/ కామరతి = శృంగారేచ్ఛ అన్నది శ్లేష) అనే వ్యాధిని నేను తెలుసుకున్నాను. అందమైన తనువు గల అమ్మాయీ! సత్యంగా నేనూ నీలానే వ్యథననుభవిస్తున్నాను. నా దేహదానంతో (శృంగారం అని శ్లేష) నైనా  నిన్ను ఆరోగ్యవంతురాలిగా చేయగలను.

అమ్మాయి కాదంబరి చిరునవ్వు సమాధానం కాగా, ఆమె చెలికత్తె మదలేఖ సమాధానం చెప్పింది.

కుమార! కిం కథయామి? కుమారభావోపేతాయాః కిమవాస్యాయన్న సంతాపాయ?

“రాకుమారా! ఏం చెప్పను? కుమారభావం (రాకుమారుడైన నీపై మనస్సు/ మదనుని తాకిడి అని శ్లేష) కలిగిన ఈమెకు ఏది సంతాపం కాదు?”

ఇది ప్రేమికులైన ఇద్దరి మధ్య ఒక చిన్న ఘటన. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మనసు. బయటకు చెప్పుకోలేరు. ఈ వ్యక్తావ్యక్తమైన మధుర భావానికి అక్షరరూపం ఈ మధుర సంభాషణ.

కాదంబరి – ఈ సంస్కృతకావ్యాన్ని అనుశీలించటానికి కావలసిన భాషానేపథ్యం కానీ, కావ్య వాతావరణం కానీ, అటువంటి బహువిషయసమన్వైక రచనాపధ్ధతులు కానీ  నేడు నామమాత్రంగా కూడా లేక నశించిపోయి ఉన్నాయి. దరిమిలా అటువంటి కావ్యాలను ఆస్వాదించగల రసజ్ఞత కూడా మనకు నామమాత్రంగా లేక నశించిపోయింది. దురదృష్టకరమైన పరిణామం.

*****

మనం నేడు చదువుకుంటున్న చదువులో రెండవ తరగతి మొదలు ఆరవ తరగతి వరకు (కనీసం) ఒక్కొక్క సబ్జెక్టును విడివిడిగా చదవటం అనే పద్ధతిని తీసివేసి, సైన్సు, సాంఘికశాస్త్రం, భాష, వీలైతే గణితం – ఇవన్నీ కలగలిపి ఓ చక్కని కథగా అల్లి ఆ కథలో భాగంగా చదువు చెప్పగలిగితే?

ఎప్పుడో ఆరవ శతాబ్దంలో అలా సామాజిక, సాంస్కృతిక, కవితాత్మక, రసాత్మక, ప్రణయాత్మకమైన సంవిద్ధానాలు అన్నిటినీ కలగలిపి లోకోత్తరంగా చేసిన సృజన ఈ కాదంబరి. “బాణోచ్ఛిష్టం జగత్సర్వమ్” అని ఒక అభాణకం. అంటే “ఈ ప్రపంచమంతా బాణుడు నమిలి వేసినదే!” అని.

ఆ కాలానికి అది నిజంగా నిజం. అందుకు సందేహం లేదు.

******

ఈ రోజు రాత్రి బయటకు వెళ్ళి ఓ మారు ఆకాశం కేసి చూడండి. బాణభట్టు తన రసప్రవాహాన్ని నింపుతూ కనులపండువ చేస్తాడు. ఆ చంద్రుడే కాదంబరిలో చంద్రాపీడుడు. ఆ రసప్రవాహమే కాదంబరి. ఇప్పకల్లు!

క్రమేణ చ
సకలజీవ లోకానందకేన
కామినీజన వల్లభేన
కించిదున్ముక్త బాలభావేన
మకరధ్వజ బంధుభూతేన
సముపారూఢ రాగేణ
సురతోత్సవ ఉపభోగైక యోగ్యేన
అమృతమయేన
యౌవనేనేవ ఆరోహతా
శశినా రమణీయతాం అనీయత యామినీ.

క్రమముగా
సకలలోకానందకారకుడూ,
కామినీజనవల్లభుడూ
అప్పుడప్పుడే బాల్యాన్ని వదిలి యవ్వనాన్ని సంతరించుకున్నవాడు
మకరధ్వజుని (మన్మథుని) బంధువు
రాగమయుడూ,
శృంగారోత్సవానికి తగిన అమృతాన్ని నింపుకున్నవాడూ,
అయిన చంద్రుడు తన యవ్వనంతో ఆక్రమించుకుంటే – యామిని రమణీయత్వాన్ని సంతరించుకున్నది.

******
battle of talikota ebook
                    Available on Amazon Kindle

5 thoughts on “కాదంబరీః కాదంబరీ

  1. As general knowledge know such book . మీ వర్ణన ఈ blog లో చూసిన తరువాత GVఅయ్యర్ తీసిన TV serial చూసి అర్దం చేసుకోగల దైర్యం వచ్చింది. ఇప్పటివరకు 6 episodes చూశాను. అన్ని చూస్తాను . ధన్యవాదాలు. __( విశ్వనాథ సత్యనారాయణ గారి రచన కాదంబరి చదివి అర్దం చేసుకునే దైర్యమూ లేదు.)

  2. ఇలాంటి నవల ఉన్నట్లు తెలుసు. ఈ blog లో మీ వర్ణణ సహాయంతో, GV అయ్యర్ గారు తీసిన దూర్ దర్శన్ serial చూసి అర్దం చేసు కునేందుకు దైర్యం వచ్చింది. ఇప్పటికి 6 episodes
    You tube లో చూసా. మొత్తం అన్ని episodes చూస్తాను. మీ సంక్షిప్త కధే దానికి ప్రేరణ. ధన్యవాదాలు. 1400 సంవత్సరాల క్రితం వ్రాసిన ఒక కధను ఆదరించే మహత్తర అవకాశం

  3. కాదంబరి అనే కావ్యం బాణభట్టు చే రచించబడిందని కేవలం నాకు తెలుసు. కానీ దాన్ని చదివే అవకాశం ఇప్పటివరకు రాలేదు. కానీ మీ విహంగవీక్షణ ఆ కావ్యంపైన ఒక చక్కని అవగాహన కల్పించింది. అందుకు నా కృతఙ్ఞతలు

  4. చాలా చక్కని పరిచయం.
    నిజమే , అంత సామర్థ్యం ఉన్నవాళ్లు నేడు అరుదు.

  5. మీ అనువాదాలు అద్భుతం గా ఉన్నాయి ఎంతో బాగా రాశారు

Your views are valuable to us!

%d bloggers like this: