గత భాగం: రంజనితో గొడవపడిన అనంత్ ఇల్లు వదిలి తన స్నేహితుని ఖాళీ అపార్త్మెంట్లో ఉండసాగాడు. విశ్వజ్ఞ తన అన్నతో వచ్చి అనంత్ ను కలుస్తుంది. రంజనితో మళ్ళీ కలవాల్సిందిగా అనంత్ ను అనేక విధాల నచ్చజెపుతాడు విశ్వేశ్వర్. అతని మాటలు అనంత్ లో కొద్దిపాటి మార్పును తెస్తాయి. వెంటనే రంజనికి ఫోన్ చేస్తాడు. కానీ ఆమె తీసుకోదు.
|
పురాకృత కర్మల వల్ల పోగుపడి, పిల్లలు కలగడానికి అడ్డుపడే పాపాల్ని తొలగించుకునే నిమిత్తం ఆ మారుమూల పల్లెలో హోమకార్యక్రమాన్ని ముగించుకుని వచ్చారు సుమతి-శర్మ దంపతులు. ’మోసం ద్వేషం లేని సీమ’లాంటి ఆ పల్లెటూరి నుండి పట్నానికి రాగానే ఉక్కిరిబిక్కిరైంది సుమతి. పక్కనే ఉన్న శర్మలోని నిష్కాపట్యం మాత్రమే ఆమెకు ఇక్కడ లభించగలిగే ఊరట.
అక్కడినుండి వచ్చిన ఓ వారం రోజుల తర్వాత సుమతికి వరుసగా వింతైన కలలు వచ్చాయి. వాటిల్ని భర్తతో చెప్పుకోవాలో వద్దోనన్న గందరగోళానికి గురై అల్లల్లాడుతోంది ఆమె.
ఒకనాడు…
మరుసటిరోజు పూజలో కూర్చునివున్న శర్మను వెనుకనుండి చూసింది సుమతి.
ఆశ్చర్యపు అల ఒకటి ఆమెను ముంచెత్తింది.
పద్మాసనంలో కూర్చుని, వెన్నెముకను నిటారుగా పెట్టి, రెండు చేతుల్ని ధ్యానముద్రలో ఉంచి కూర్చున్న శర్మ శరీరభంగిమ, శృతి చేసి పట్టుకున్న తంబూరలా అనిపించింది ఆమెకు.
అప్పటిదాకా అప్రమత్తమైవున్న అలౌకిక భావన ఒకటి ప్రమత్తమై, ప్రఫుల్లమై, ఫుల్లఫేనయుత సముద్ర తరంగమై ఆమె మనోసీమల్ని ముంచెత్తసాగింది.
ఎలాగైనా సరే, భర్త తో తన కలల గురించి మాట్లాడి తీరాలని ఆ క్షణంలో నిశ్చయించుకుంది సుమతి.
– – – – – –
హాల్లో గోడకు మేకు కొట్టే పనిలో ఉన్నాడు శర్మ.
“ఏ పటం పెట్టబోతున్నారు?” అని అడిగింది సుమతి, శర్మ ఎక్కిన కుర్చీని పట్టుకుని.
“చూస్తావుగా!” అన్నాడు శర్మ.
మేకు భద్రంగా ఉందని రూఢి చేసుకుని – “ఆ సంచీలో పటం ఉంది. ఇలాగివ్వవా?” అన్నాడు శర్మ.
కాగితం చుట్టిన ఓ పటాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చింది సుమతి.
శర్మ ఆ కాగితాన్ని తీసేసి పటాన్ని మేకుకు వేళ్ళాదీసాడు. ఓసారి తృప్తిగా దాన్ని చూసి, క్రిందకు దిగాడు.
అప్పటిదాకా అడ్డువున్న భర్త దిగగానే పటం వైపుకు తేరపారి చూసింది సుమతి.
ఒక్కసారిగా ఆమె ఒళ్ళు ఝల్లుమంది.
నారాయణుడి ఒడిలో లక్ష్మీదేవి ఓ బంగారు గిన్నెను అతని నోటికి దగ్గరగా ఉంచి కూర్చునివుంది. కుడివైపు హనుమంతుడు, ఎడమవైపు గరుత్మంతుడు చేతులు జోడించి, తలలు వంచి నిలబడివున్నారు. బ్రహ్మ-సరస్వతులు, శివపార్వతులు మొదలైన దేవానుదేవతలందరూ చుట్టూ నిలబడివున్నారు. హనుమంతుడికి వెనకగా నారద-తుంబురులు వీణల్ని పట్టుకుని నిలబడివున్నారు. ఆశ్చర్యంగా, వాళ్ళు వీణల్ని తంబూరల్లా భుజాన మోస్తూ నిలబడివున్నారు.
సుమతికి పల్లెటూరి ఆలయంలో, హోమ సమయంలో జరిగిన అనుభవం గుర్తుకువచ్చింది.
“ఆ ఇద్దరు పురుషులు. ఆ తంబూరలు. అంటే? అక్కడ కనబడినవారు నారద, తుంబురులా? ఊరికి వచ్చేసాక వరుసగా వచ్చిన కలల్లో కనిపించిన పురుషుల జంట వీళ్ళేనా?” – సుమతిలో ఆలోచన, ఆశ్చర్యం కలగలసిపోయి ఉద్వేగాన్ని రేకెత్తిస్తున్నాయి.
సుమతి మౌనాన్ని ’నిశ్చేష్ట’గా అర్థం చేసుకున్న శర్మ “ఇది మా పరగణా మహారాజా గారి దివాణంలో ఉన్నదానికి నకలు. మా ముత్తత గారు ఆ రాజుగారి ఆస్థాన పురోహితులట. ఇదో అపూర్వమైన చిత్రమని ఇందులో చాలా ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని మా తాతగారు నాన్నగారికి చెబుతుంటే విన్నాను. ఆ రహస్యాలేవో నాకు తెలీవు. నాన్నగారు ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఆయనంటే నాకు చాలా భయం. పైగా అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి కూడానూ…” చెప్పుకుపోతున్నాడు శర్మ. ఆ కళాఖండం అతనిలో చిన్ననాటి జ్ఞాపకాల్ని తట్టి లేపినట్టుంది.
“శేషయ్యగారు ఈ చిత్రం నకలు గురించి చెప్పారు. ఆయన ముత్తాత గారే ఈ చిత్రాన్ని ఆరోజుల్లో వ్రాసి రాజుగారి కిచ్చారు. గవర్నమెంటు మ్యూజియంలో ఉన్నదాన్ని శేషయ్యగారు అతికష్టం మీద ఇంటికి తీసుకొచ్చి ఓ వారంరోజుల్లో నకలు తయారుచేసుకుని ఇచ్చేసారట. పోయిన నెలలో ఇక్కడకు వచ్చినపుడు వివరాలు చెప్పారు. వెంటనే నాకూ ఒక కాపీ ఇవ్వండని అడిగాను. ఈరోజు పొద్దున కట్టు వేసి మరీ తెచ్చిచ్చారు.”
సుమతికి శర్మ చెబుతున్న మాటలు వినబడుతున్నాయి గానీ ఆమె మనస్సంతా నారద-తుంబురల మీదే లగ్నమైవుంది.
“సుమతీ! భోజనం వద్దా?” అన్న శర్మ మాటలకు ఈలోకంలో వచ్చింది ఆమె.
చకచకా వడ్డన ఏర్పాట్లు చేసింది.
శర్మ భోంచేస్తుండగా నెమ్మదిగా మాటలు కలిపింది.
“ఏమండీ! హోమం ముగించుకుని వచ్చిన రోజు నుండీ మీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను…”
“అలాగా! ఏమిటది?”
“నవ్వకూడదు!”
“భరించలేనంతగా వస్తే తప్ప నవ్వను. చెప్పుమరి?” అన్నాడు శర్మ.
“ఆరోజు, హోమం దగ్గర నేను నిద్రపోయానని మీరనుకున్నారు. కానీ అది నిద్ర కాదు. ఏదో తెలియని ఏమరుపాటు. మైమరపు!”
“ఈ మాట ఆరోజే చెప్పావు…” అంటూనే ఆగిపోయాడు శర్మ. అతనికి అప్పుడు తట్టింది…సుమతిని తను విసుక్కున్నప్పుడు త్ర్యంబక ఉపాధ్యాయ కూడా సరిగ్గా ఇవే మాటల్ని అన్నారు – “మీ ఆవిడది ఏమరుపాటు! నిద్రకాదు!”
తన మొహంలోకే గుచ్చి చూస్తున్న శర్మ చూపులకు సిగ్గుపడింది సుమతి. “ఏమండి! వింటున్నారా?” అని అడిగింది.
“చాలా శ్రద్ధగా…” అన్నాడు శర్మ.
“గుడి మెట్లకి అవతల ఇవతల తంబూరల్ని పట్టుకొన్న ఇద్దరు భక్తుల విగ్రహాల్ని చూసారు కదా! మీరు హోమం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ హోమగుండంలోంచి పైకి వచ్చినట్టు అనిపించింది. ఇద్దరూ తంబూరల్ని మీటుతూ వచ్చారు. ఆ విగ్రహాలు మనుష్యుల లానే ఉన్నా నాకు కనబడిన వారిలో ఒకరిది మనిషి తల. మరొకరిది గుర్రం తల. చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వాళ్ళ సంగీతంలో ఎంత ఆకర్షణ ఉందనుకున్నారు?” అన్న సుమతి మాటలకు దిగ్భ్రాంతి చెందాడు శర్మ. “మనిషి తల, గుర్రపు తలా?” అన్నాడు.
అవునన్నట్టుగా తలూపింది సుమతి – “అంతేకాదండీ! ఓ వారం రోజులుగా విచిత్రమైన కలలు వస్తున్నాయి. ప్రతి కలలోనూ ఆ ఇద్దరే కనబడుతున్నారు. అలా కనబడిన ప్రతిసారీ వాళ్ళు వేగంగా నా ఒంట్లోకి దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. వాళ్ళలా నాలోకి దూసుకెళ్ళే క్షణంలో మీరు నన్ను గట్టిగా పట్టుకుంటారు. మీ చేతుల్లో ఉన్న నాకు భయం పోయి ఏదో శక్తి వచ్చినట్టౌతుంది. వాళ్ళు మాయమైపోయాక చూస్తే నా కొంగులో రెండు మామిడి పళ్ళుంటాయి. మీరు నవ్వుతుంటారు. ప్రతి కలా దాదాపు ఇలానే ఉంటుంది. ఏవో కొన్ని కొన్ని మార్పులు తప్ప! ఈరోజు మీరు తీసుకొచ్చిన పటంలో చూడండి…నారద-తుంబురులు వీణల్ని తమ భుజాల మీద తంబూరల్లా మోస్తున్నారు కదా! నా కలలో కనబడే వ్యక్తులు కూడా అచ్చు అలానే మోస్తుంటారు…”
స్తబ్దుగా కూర్చుండిపోయిన శర్మ “విచిత్రం…” అని మాత్రం అనగలిగాడు.
“అయ్యో రామా! మాటల్లో పడి నేను వడ్డించలేదు…మీరు తినడం లేదు. మొదట భోజనం కానివ్వండి!” అని అంది సుమతి.
ఆపై భోజనాన్ని మౌనంగా ముగించాడు శర్మ. అతని భోజనమయ్యాక తనూ హడావిడిగా ముగించింది సుమతి.
రాత్రి వరకూ వాళ్ళిద్దరూ తమతమ పనుల్లో మునిగిపోయారు.
పరుపు మీద కూర్చున్న శర్మ, సుమతి రాగానే ఎదురుగా కూర్చోమన్నాడు.
శర్మ సుమతి ముఖంలోకి చూసాడు. ఆ కళ్ళలో కొత్త వెలుగు…చాలా స్పష్టంగా కనబడుతోంది. అది ఏమాత్రం భ్రమ కాదు…భ్రాంతి అసలే కాదు. ఆమె కన్నుల్లోనిది సిసలైన అలౌకిక తేజస్సు. మెరుస్తూ…మనస్సును లాగేస్తూ. ఉపాధ్యాయ ఇంట్లో ఆ వెన్నెల రాత్రి తంబూర గురించి ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె కన్నుల్లో తాను చూసిన వెలుగే ఇది. కానీ ఆరోజు కంటే ఇప్పుడు ఆ వెలుగు మరింత తేజోవంతంగా కనబడుతోంది.
“నన్ను ఆనాడే తంబూర గురించి అడిగింది కదూ! ఆమె ఎందుకంత ప్రత్యేకంగా తంబూర గురించే అడిగిందో అప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఈరోజు అర్థమైంది. ఏమిటిదంతా? భగవంతుడు తనకు ఏదైనా చెప్పదల్చుకున్నాడా? సుమతి కలలు అతని సంకేతభాషకు నిదర్శనాలా?” – పరిపరివిధాలా పోతోంది శర్మ మనసు.
“ఏమండీ! ముందు కూర్చోబెట్టుకుని ఏమీ మాట్లాడ్డం లేదు? నేనా రోజు నిద్రపోయాననే అనుకుంటున్నారా?” అని నవ్వుతూ అడిగింది సుమతి.
లేదన్నట్టుగా తలూపాడు శర్మ.
“మరి! కల అంటే ఏమిటండి?” అంది సుమతి.
ఆమె నుండి ఆ ప్రశ్నను మధ్యాహ్నం నుండీ ఎదురుచూస్తున్నాడు శర్మ.
“కష్టమైన ప్రశ్న. జవాబునివ్వడం అంత సులభం కాదు!” అన్నాడు, ఉపోద్ఘాతంగా.
“అవునా? ఐనా మీరు చెప్పండి..నాకెంత అర్థమైతే అంతే చాలు.” అంది సుమతి.
సరేనన్నట్టు తలూపి కొనసాగించాడు శర్మ – “మానవ జీవితం భూత, వర్తమాన, భవిష్యత్తులనే కాల విభాగాలకు లోబడి నడుస్తుంది. ఈ మూడూ వేటికవి విడిగా ఉంటాయి. ఒకటి ముగిసిన తర్వాతే మరొకటి ప్రవేశిస్తుంది. కానీ ఆ మూడూ ఒకచోట కలవగలిగే స్థితినే ’స్వప్న’మని పిలిచారు.”
“ఓహో! మూడూ ఒకటిగా కలవడమా?అదెలా సాధ్యం?” అంది సుమతి.
“త్రివేణీ సంగమంలా! ఇంకా సులభంగా చెప్పాలంటే నువ్వు వేసుకునే జడను తీసుకో. అందులో మూడు పాయలూ వేటికవి విడిగా ఉన్నా, కలిపి వేసేసరికి ’జడ’ అన్న ఒక్క పేరుతోనే పిలవబడతాయి.” అన్నాడు శర్మ.
“ఓహ్! అర్థమైంది. ఇంతకు ముందు తాళింపులో తత్త్వాన్ని విడమర్చారు. ఈరోజు జడలో వున్న తత్త్వాన్ని చెప్పారు.” అంది సుమతి మెచ్చుకోలుగా.
“ఎలాగైతే జడలో రెండు పాయలు కనబడుతూ మూడోది రహస్యంగా దాగివుంటుందో, అదే విధంగా స్వప్నం కూడా ఏ రెండు కాలాలనో ప్రముఖంగా చూపిస్తుంది. గతం-వర్తమానం లేక వర్తమానం-భవిష్యత్తు లేక గతం-భవిష్యత్తు…ఇలా రెండు విభాగాల్ని స్పష్టంగా చెబుతూ, మూడోదాన్ని వాటిల్లోనే అంతర్హితం చేస్తుంది. అందువల్లనే కలలు రహస్య సంకేతాల్లా అనిపిస్తాయి. ఓ పట్టాన అర్థం కావు.” అన్నాడు శర్మ.
సుమతిలో ఆసక్తి పెరిగింది. – “కలలు మన జీవితం గురించి చెబుతాయా? మనకు రాబోయే సమస్యల్ని ముందే చెబుతాయా? అలాగే దొరకబోయే సుఖాల గురించి కూడా చెబుతాయా? కలలు నిజమౌతాయని అంటారు. అది నిజమేనా? ఇప్పుడు నాకొచ్చిన కలకు అర్థమేంటి? అది మంచిదేనా?” అన్న ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టాయి.
ఆమెలోని ఆతృతను చూసి నవ్వాడు శర్మ. సుమతి చెంపలను మెత్తగా తాకి – “ఈమధ్య కలల గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావే!” అన్నాడు. ఔనన్నట్టుగా తలాడించింది సుమతి.
“మనకు పడే అన్ని కలలూ నిజాల్ని చెప్పేవి కావు. ఒక్కోసారి అనారోగ్యం వల్ల అరకొర నిద్రలో కలల్లాంటి దృశ్యాలు వస్తాయి…” అని ఓమారు ఆగి “పైత్యం ఎక్కువైనా పిచ్చి కలలు వస్తాయి…” అన్నాడు శర్మ.
ఫక్కున నవ్వింది సుమతి.
నవ్వుతూ కొనసాగించాడు శర్మ – “నిజానికి కలల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందులో కనబడేవన్నీ సంకేతాలు మాత్రమే. అంటే కోడ్స్ అన్న మాట. ఉదాహరణకు నీ కలలో మామిడి పండు కనబడింది. కానీ ఆ పండు ఒకానొక సంకేతం మాత్రమే. ఇంగ్లీషులో సింబల్ అంటారు చూడు అలాంటిదన్న మాట.”
“ఓహో! మరి కలల భాషలో మామిడిపండుకు అర్థమేంటి?” అంది సుమతి.
“ముందు కల గురించి సరిగ్గా తెల్సుకో. ఆ తర్వాత మామిడి పండు గురుంచి చెప్పుకుందాం.” అన్నాడు శర్మ.
“చెప్పండి…చాలా ఆసక్తిగా ఉంది.” అంది సుమతి.
ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ మాట్లాడసాగాడు శర్మ – “బ్రతికినన్నాళ్ళూ ప్రతివారూ ప్రతిరోజూ మూడు అవస్థలకు లోనౌతారు. అవి – జాగృత, స్వప్న, సుషుప్తి అనేవి. జాగృత అంటే మేలుకునివుండడం. ఈ జాగృతస్థితిలో మనిషి శరీరం మొత్తం మేలుకుని పనిచేస్తూవుంటుంది. స్వప్న అంటే నిద్రపోయినప్పుడు కలిగే స్థితి. ఇందులో శరీరం లోని భాగాలు పనిచెయ్యవు. ఒక్క మనసు మాత్రమే పనిచేస్తూవుంటుంది.”
“శరీరం పని చెయ్యకపోతే, ఊపిరి ఎలా ఆడుతుంది?” అని అడ్డు తగిలింది సుమతి.
“మంచి ప్రశ్న…చాలా మంచి ప్రశ్న..” అన్నాడు శర్మ. – “మనిషి శరీరంలోని అవయవాలు దాదాపుగా అతని నియంత్రణలో ఉంటాయి ఒక్క ఊపిరిని పీల్చడం తప్ప. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒకరికి చెయ్యి నొప్పి పుడుతోందంటే ఆ చెయ్యితో ఎక్కువ బరువు ఎత్తడమో చేసివుండాలి. అప్పుడు ఆ చెయ్యికి విశ్రాంతినివ్వడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చర్య మొత్తం మనిషి అధీనం. కానీ ఊపిరి తీసుకోవడానికి కష్టమౌతోందంటే ఊపిరి తీసుకోవడం మానెయ్ అని ఎవరూ అనరు. అవునా?”
“ముమ్మాటికీ నిజం. ఊపిరి తీసుకోవడం కష్టమౌతోందని ఎవరైనా అంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళి ఆక్సిజన్ ఇచ్చేస్తారు!” అంది సుమతి.
“అవును! కాబట్టి, ఊపిరి తీసుకోవడమన్నది సాధారణ శారీరిక చర్యలా కనబడినా అది మనిషి నియంత్రణలో లేని స్వతంత్ర్య వ్యవస్థ. అర్థమైందా?” అన్నాడు శర్మ. అయిందన్నట్టు తలూపింది సుమతి. శర్మ కొనసాగించాడు.
“నిద్రాస్థితిలో మనిషి దేహంలోని అవయవాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. ఒక్క మనసు తప్ప. మన మత సిద్ధాంతం ప్రకారం ఆత్మలోని భాగమైన ఈ మనసు అనాది నిత్యమైంది. అంటే ఎవ్వరూ తెలుసుకోలేని కాలం నుండీ ఈ సృష్టిలో ఉన్న వస్తువు. ఆత్మ ఒక దేహం నుండి మరో దేహానికి వెళ్తున్నప్పుడల్లా ఈ మనసు కూడా ఆయా దేహాల యొక్క సంస్కారాల్ని తనలో ఇముడ్చుకుంటూ వస్తుంది. ఈ ఇముడ్చుకోవడాన్నే ’వాసన’ అంటారు. ఉదాహరణకు మొన్నొకసారి మనం రాజశేఖరం పెళ్ళికెళ్ళినప్పుడు ఒకాయన నా దగ్గరికొచ్చి నన్ను గుర్తుపట్టారా అని మాటి మాటికీ అడిగాడు. గుర్తుందా?”
“గుర్తుంది. ఆయన ఎంత అడిగినా మీకప్పుడు గుర్తురాలేదు. కానీ మెట్లు దిగుతూ నేను జారిపడబోతుంటే మీరు నన్ను పట్టుకున్నారు. అప్పుడు మీకు గుర్తుకొచ్చింది. చాలా ఏండ్ల క్రితం ఆయన్ను మీరు ఇలానే రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడబోతుంటే పట్టుకుని కాపాడారని. ఆపై అతను మీకు దూరపు బంధువని తెలిసింది.’ అంది సుమతి.
“అవును. ఆయన అడిగినప్పుడు ఆ సంఘటన గుర్తురాలేదు. దాంతో ఆయనా గుర్తురాలేదు. కానీ అదేరకమైన సంఘటన వల్ల మళ్లీ గుర్తుకొచ్చింది. ఇది ’వాసనాశక్తి’ మేల్కోవడం వల్ల జరిగింది. ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే పాత జ్ఞాపకాల నుండి పొందే జ్ఞానాన్ని ’వాసన’ అంటారు. ఈ ’వాసనాశక్తి’ వల్లనే మనకు అప్పటిదాకా తెలియని వ్యక్తులు కలల్లో కనబడుతుంటారు. ఒక్క మనుష్యుఅలే కాదు ఏవేవో వస్తువులు, ప్రాంతాలు, లోకాలు, భాషలు పరిచయమౌతుంటాయి. అప్పటిదాకా మనకు తెలియనివి కనబడ్డాయి కనుక, ఆ కనబడ్డవి వెంటనే ఎదురుపడవు గనుక చాలామంది కలల్ని నమ్మరు. వాటిల్ని మిథ్యగా కొట్టిపారేస్తారు.” అన్నాడు శర్మ.
“అంటే ’వాసనాశక్తి’ పెరిగినప్పుడు వచ్చే కలల్లో కనబడేవేవీ అబద్ధాలు కావన్న మాట!” అని సాలోచనగా అంది సుమతి.
“అవును. ఎక్కడో ఉత్తరభారతదేశంలో పుట్టిన చిన్నపిల్లవాడు దక్షిణ భారతదేశంలో ఫలానా ఊర్లో ఫలానా ఇంట్లో పుట్టి పెరిగి చచ్చిపోయానని చెప్పినట్టు, అక్కడికెళ్ళి చూస్తే ఆ వూళ్ళో ఆ ఇల్లు ఉన్నట్టూ వగైరావగైరాలు ఇప్పటికీ వార్తాపత్రికల్లో మనం చదువుతుంటాం. ఇలాంటి కథల్లో దాదాపుగా అన్నీ వాస్తవాలే. ఆ కథలు నిజం కావడం వెనుక ఈ వాసనా శక్తి ఉంటుంది. వాసనాశక్తికి మరో నిర్వచనం – గడిచిపోయిన అనుభవాలను వర్తమాన కాలంలో తెలుకోవడం అని. చూసావా! మన శాస్త్రంలో ఎంత సైన్స్ వుందో?” అన్నాడు శర్మ.
“ఐతే ఆ పల్లెటూరు, ఆ కోవెల, మెట్ల పక్కనున్న ఆ ఇద్దరు భక్తులు, వాళ్ల తంబూరలు, నా కలలో కనబడే ఆ ఇద్దరు…ఇవన్నీ…” అని ఆగిపోయింది సుమతి.
గట్టిగా నిట్టూర్చాడు శర్మ. “నీ కలలో కనబడుతున్నవారు సామాన్యులు కారు. అలౌకిక లోకాల్లో ఉండేవారు. వారికీ, మనలాంటి అల్పులకూ సంబంధం ఉండదు. అలా ఉంటుందని అనుకోవడం భ్రమ. కాబట్టి, చాలా లోతుగా ఆలోచించాలి సుమతీ!” అన్నాడు శర్మ.
సుమతి మౌనంగా పడుకుంది.
ఎప్పుడూ వెల్లకిలా పడుకోని శర్మ అసంకల్పితంగా అలా పడుకున్నాడు. రెండు చేతుల్నీ తల క్రింద చేర్చి దీర్ఘమైన ఆలోచనల్లోకి జారుకున్నాడు.
అతని మేధస్సులో అమృతమథనంలాంటిది జరుగుతోంది.
“నా పక్కన ఇలా అమాయకంగా పడుకున్న ఈమె ఎవరు? పెళ్ళై పన్నెండు సంవత్సారాల్లో ఏనాడూ ఎదురుకాని సంఘటనలు ఈ కొన్ని నెలల్లో ఎందుకు ఎదురౌతున్నాయి? ప్రతి సందర్భంలోనూ శాస్త్రవిజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసిన నాకంటే సుమతి ఒక అడుగు ముందే ఉంటోంది. కారణమేమిటి? ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగివున్నా కించిత్తూ అహంకారం లేని ఈమె నిజంగా మామూలు మనిషేనా? ఆమె కలల్లో వస్తున్న ఆ ఇద్దరూ దేనికి ప్రతీకలు? వాళ్ళు చెప్పదల్చుకున్న రహస్యమేమిటి? – హే భగవాన్! దుస్వప్ననాశకుడివి నీవు. అలానే సుస్వప్నదాతవూ నీవే! ఈ ప్రహేళికను నువ్వే పరిష్కరించాలి. నన్నే సర్వస్వమని నమ్మి, చాలా తెలివిగలవాడినని గౌరవించే ఈ శుద్ధ సాత్విక జీవికి ఆ కలల గురించి వివరించే సామర్థ్యాన్ని నువ్వే ఇవ్వాలి. యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాని సంప్రదాస్యసి – నువ్వు ప్రసన్నుడవైతేనే మా బోటివాళ్ళకు సర్వార్థాలు సిద్ధించేది. కాబట్టి ఈ విషయంలో నాపై ప్రసన్నతను చూపించు స్వామీ!” అని మనసులోనే చేతులు జోడించాడు శర్మ.
– – – – – –
“యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాని సంప్రదాస్యసి – ఎంత చక్కటి భావం! నిజమైన భక్తికి ఇంతకంటే మంచి నిర్వచనం దొరకదు!” అంది హరిపాదసేవోద్యమి.
“అవునా! దేవీ!” అన్నాడు నిర్ఝరగణసేవ్యుడు.
“నిశ్చయంగా ప్రభూ! అంతటి భక్తి ఉంది కాబట్టే మీ రెండో పావు ’మాయాశక్తి’ గడిని దాటగలిగింది. ఇలా దాటడం సులభం కాదు. అశక్యమైన ఈ శక్తిని దాటిన మీ ఆటకాయ నడకలోని గూఢార్థాన్ని తెలియజేయండి.” అంది నిరుపమ.
“అలాగే దేవీ! నా తొమ్మిది శక్తుల్లో ఒకటైనది ఈ విష్ణుమాయ. జీవుల సాధనను పరీక్షించే వ్యాజం ఈ మాయ. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనబడ్డాన్ని భ్రమ అంటారు. దాని వ్యతిరేకంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడాన్ని ప్రమ అంటారు. జీవులు భ్రమ నుంచి ప్రమకు చేరుకునేటప్పుడు వారి ధీశక్తిని పరీక్షించేదే నా మాయాశక్తి. ’మాయామాత్రమిదం సర్వం’ అని వేదం చెబుతోంది. ’సర్వం విష్ణుమయం జగత్’ అని అదే వేదం చెబుతోంది. నిత్యచైతన్యయుక్తమైన ఈ చరాచర ప్రపంచం నిండుగా నేను, నా మాయా వ్యాపించువున్నాం. ఆ మాయాశక్తిని పొందిన నీ ప్రకృతి బలిష్టమై, సాధకుల చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, సమీక్షిస్తూ, సరిచేస్తూ సాగుతూవుంటుంది.
అశాశ్వతాలైన ప్రపంచ సుఖాలను వదిలిన వారికి ప్రకృతిలోని మాయాబంధనం తొలగిపోతుంది. కానీ దానికంటే బలిష్టమైన నా బంధకశక్తి వారి జ్ఞానస్థిరత్వాన్ని పరీక్షిస్తూనేవుంటుంది. స్థిరబుద్ధితో, స్థిరాసనంలో కూర్చుని, చిరంతన చింతనలో మునిగిన వారికి మాత్రమే విష్ణుమాయను దాటడం సులభమౌతుంది. ’భవ మమ శరణం’ అన్న సాధకులు నా మాయాశక్తిని దాటి ముందుకు సాగుతారు. ఇక వారిని బంధించగల శక్తి ఏదీ లేదు.” అన్నాడు ముక్తానాం పరమాగతి కారకుడైన సర్వేశ్వరేశ్వరుడు.
“దివ్యోపదేశం స్వామీ!” అంది ఘృతపూర్ణాన్నదాయిని.
“మరి నీ మొదటి ఆటకాయను నడుపు. భక్తిసుధను ఇప్పుడిప్పుడే చవిచూస్తున్న బిడ్డల్ని అలా ఆకలికి వదిలెయ్యరాదు!” అన్నాడు నర్మగర్భంగా కమలగర్బుడు.
“చిత్తం స్వామీ!” అంటూ అంబుజసదన పాచికల్ని వేస్తే అవి లవకుశుల తంబూర శృతుల్ని పలుకుతూ పడ్డాయి.
* * * * *
(సశేషం…)