వైకుంఠపాళీ – ఇరవై తొమ్మిదవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

గతభాగం

 

షాపింగ్ చేయడానికి వస్తానని స్నేహితురాలు చెప్పడంతో పికప్ చేసుకోవడానికి ఆ సిటీ బస్టాప్ కు దగ్గరలో కారును ఆపి వేచిచూస్తోంది రంజని. కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం కావడంతో అక్కడక్కడా ఇళ్ళు, షాపులు వున్నాయి. ఐదుగంటలౌతున్న ఆ సాయంత్రంవేళ బస్టాప్ చుట్టుపక్కలన్నీ నిర్మానుష్యంగాను నిశ్శబ్దంగానూ ఉన్నాయి. స్టీరియోలో నుండి ఎమ్మెస్ కీర్తన ఒకటి మంద్రస్థాయిలో వస్తూంటే స్టీరింగ్ పై తాళం వేస్తూ ఆ కీర్తనను మెల్లగా పాడుతోంది రంజని.

అంతలో ఓ కుర్రజంట బస్టాప్ దగ్గరకొచ్చింది. పంజాబీ డ్రస్‍లో వున్న అమ్మాయి, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయితో అతి చనువుగా ఉంటూ గలగలా మాట్లాడుతోంది. కాసేపటికి అబ్బాయి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసాడు. తన నడుం చుట్టూ ఉన్న చెయ్యిపై తనూ చెయ్యిని వేసిందా అమ్మాయి. ఆ చొరవను అమ్మాయి ఆపుతుందేమోనని అనుకుంది రంజని. కానీ అలా జరగలేదు. మరికొద్ది క్షణాల్లో అమ్మాయి బుగ్గ మీద మెరుపువేగంతో ముద్దుపెట్టాడా అబ్బాయి.

పకపకా నవ్వింది అమ్మాయి.

ఆ పబ్లిక్ సరసాన్ని విస్మయంతో చూస్తూ తలను విదిల్చింది రంజని. మొబైల్ తీసి మిత్రురాలికి ఫోన్ చేసింది. ఇంకో పదినిముషాల్లో వస్తున్నట్టు చెప్పింది. ఆలస్యానికి కారణాలన్నీ ఏకరువుపెట్టి “సారీనే” అని ముగింపు పలికిందామె. “ప్చ్!” అంటూ నిట్టూర్చింది రంజని. వద్దు వద్దనుకుంటూనే మళ్ళీ ఆ కుర్రజంట వైపుకు చూసింది రంజని.

ఇప్పుడూ ఇద్దరూ దూరదూరంగా ఉన్నారు. అమ్మాయి ఏదో అడుగుతోంది. అబ్బాయి చేతుల్ని ఊపుతూ ఏదో చెబుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ బెంచ్ మీద నుంచి చివాలున లేచిందామ్మాయి. చెయ్యి పట్టుకుని లాగాడు అబ్బాయి. విదిల్చికొట్టిన అమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ రోడ్డు మీదకు పరుగెట్టింది. నింపాదిగా లేచి నిలబడిన అబ్బాయి ఆగమని అరుస్తున్నాడే గానీ అడుగు ముందుకు వెయ్యలేదు. వినబడినా వినబడనట్టుగా విసురుగా ముందుకు కదిలిన అమ్మాయి, రంజని కారు వైపుకు వచ్చింది. అప్పుడు కనబడ్డాయా కన్నీళ్ళు! రంజని కార్ డోర్ ను తెరిచింది. తనను దాటుకుపోబోతున్న అమ్మాయి భుజాన్ని పట్టి ఆపింది.

“ఏమైంది?” – దర్పంగా అడిగింది రంజని. మౌనమే తప్ప సమాధానం రాలేదు. “నిన్నే! ఏమైంది?” రెట్టించి అడిగింది రంజని. ఏమీ లేదన్నట్టు తలనూపిందామ్మాయి.

“ఏం జరక్కపోతే ఈ ఏడ్పెందుకు? వాడెవడు?” అంది రంజని. ప్రతి పదంలోనూ అధికారం ధ్వనించేట్టుగా జాగ్రత్తపడింది.

“మీరెవరు?” అంది అమ్మాయి తికమకపడ్తూ.

“వాడెవడు? నీ సంగతేంటి?” ఆ అమ్మాయి భుజాన్ని బిగిసిపట్టుకుని అడిగింది.

అందం, ఆకర్షణతో బాటు హుందాగా కనబడుతున్న రంజనిని, ఆమె దిగిన ఖరీదైన కారును మార్చిమార్చి చూడసాగిందామ్మాయి. ఇప్పుడా కళ్ళలో నీళ్ళతో బాటు ఆశ్చర్యం కూడా చేరింది. ఎందుకో రంజనికి ఆ అమ్మాయి బేలతనం నచ్చింది.

“అతను….అతను…..” తత్తరపడ్తూ నోరు విప్పిందా అమ్మాయి.

“బాయ్ ఫ్రెండ్! అంతేనా?” నిర్లక్ష్యంగాను, విసురుగానూ అంది రంజని.

కాదన్నట్టు తలనూపి “నా భర్త!” అందామ్మాయి.

“వోయ్! ఏంటి? తమాషానా?” కనుబొమల్ని ఎగరేస్తూ అడిగింది రంజని. ఈసారి ఆమెకు నిజంగానే కోపమొచ్చింది.

“నిజమండీ! ఆయన నా హజ్బెండే! లాస్ట్ మంత్ పెళ్ళైంది.” బెరుకుగా అందా అమ్మాయి. ఆ అబ్బాయి వైపుకే చూస్తు. రంజని కూడా అతని వైపుకు చూసింది. గబగబా అటుకేసి వస్తున్నాడతను. ఈమారు అమ్మాయి కంఠం వైపు చూసింది రంజని. పసుపుతాడు కనబడుతోంది. అంటే అమ్మాయి నిజమే చెబుతోంది.

“అతను నీ మొగుడైతే ఆ ఏడుపెందుకు? ఇలా ఎందుకు పరుగెత్తుతున్నావ్?” విస్తుబోయినట్టుగా అడిగింది రంజని.

జవాబు చెప్పలేదా అమ్మాయి. ఈలోపు భర్తగా చెప్పబడుతున్న జీన్స్ ప్యాంట్ కుర్రవాడు అక్కడికొచ్చాడు.

“వాట్ మేడమ్?”

“ఈ అమ్మాయి ఎవరు?” నిజం రాబట్టాలన్న నిశ్చయంతో ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్ననే అబ్బాయినీ అడిగింది రంజని.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

“నా వైఫ్!” అన్నాడు. అతని గొంతులో చిరాకు స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది. దాన్ని పట్టించుకోనట్టుగా “ఐతే ఆమె ఎందుకలా ఏడుస్తోంది? ఈ ఈవ్ టీజింగ్ ఎందుకు? పబ్లిక్ ప్లేస్‍లోనే ఇలా ఏడిపిస్తున్నావంటే ఇంట్లో నాలుగ్గోడల మధ్య ఇంకెంత ఏడ్పిస్తున్నావో? అమ్మాయ్! నాతో రా! పక్క రోడ్డులోనే విమెన్స్ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ కంప్లైంట్ రాసిద్దువుగానీ!” – ఆపకుండా మాట్లాడేస్తోంది రంజని.

ఈసారి విస్తుబోవడం ఆ ఇద్దరి వంతైంది. రంజని దిగిన ఖరీదైన కారు వాళ్ళిద్దరినీ ఎదురు తిరగనివ్వకుండా చేస్తోందేమో! పైగా ఆమె దర్పంతో కూడిన వ్యవహార శైలి కూడా వాళ్ళని మాటకు మాట బదులు చెప్పనివ్వకుండా ఆపుతోందేమో!

“నీ పేరేమిటమ్మాయ్?” కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత టక్కున అడిగింది రంజని. “నా పేరా?” నివ్వెరబోతూ అందామ్మాయి. “నీ పేరే! ఏం మర్చిపోయావా?” ఎకసెక్కంగా అడిగింది రంజని. ఓమారు భర్త వైపు చూసి “అనామిక!” అంది. ఆ సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది రంజనికి – “తమాషా చేస్తున్నావా?” అని తీవ్రంగా అడిగింది. లేదన్నట్టు తలూపి “కావాలంటే మావార్ని అడగండి!” అంది ఆ అమ్మాయి. ఇప్పుడా అమ్మాయి గొంతులో మొదులున్న భయం లేదు. సరికదా కొద్దిగా నిర్లక్ష్యం ధ్వనిస్తున్నట్టు అనుమానించసాగింది రంజని.

“నిజంగా ఈమె పేరు అనామికనేనా?” – ’కాదు అన్నావంటే చంపేస్తా’నన్నంత కోపంతో ఆ అబ్బాయిని అడిగింది. “ఇట్స్ ట్రూ మేడమ్!” అని చిరునవ్వును జోడించి మరీ చెప్పాడు అబ్బాయి. “ఐతే నీ పేరు అపరిచితుడా!” తను కూడా వ్యంగ్యంగా అడిగింది రంజని. “నో మేడమ్!” అని అన్నాడేగానీ తన పేరు చెప్పలేదా అబ్బాయి.

ఉన్నట్టుండి నిస్సత్తువ ఆవరించింది రంజనికి. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. వెంటనే మాటల్ని కూడదీసుకొని “ఇలా పబ్లిగ్గా భార్యభర్తలు పోట్లాడుకోవడం సభ్యత కాదు.” అంది. రంజని మాటల కోసమే ఎదురుచూస్తున్నట్టుగా అందుకొన్నాడా అబ్బాయి – “ఐతే ముక్కూ మొహం తెలియనివాళ్ళకి ఇలా హ్యామర్ వేయడం మ్యానర్సా మేడమ్?” అన్నాడు. మళ్ళీ అతని పెదవులపై అదే చిరునవ్వు. ఆ నవ్వుకు తాటిచెట్టంత ఎత్తులో కోపం ఎగిసిపడింది రంజనిలో. కానీ తమాయించుకుంది. “మీకు భార్యాభర్త రిలేషన్ గురించి ఏమీ తెలిసినట్టులేదు. దట్స్ వై యూ బోత్ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్సెస్!” అని ఘాటుగా వ్యాఖ్యానించింది రంజని.

“అవునా? ఐతే మీకు తెలిసింది చెప్పండి మేడమ్. వింటాం! ఏం అనామికా?” అన్నాడా అబ్బాయి. “ఎస్ ఎస్” అని వంత పాడింది అనామిక. వాళ్ల వైపు వెర్రిగా చూసింది రంజని. “ఆర్ యూ సీరియస్?” అని నమ్మశక్యం కానట్టుగా అంది. “వి ఆర్ సీరియస్ మేడమ్!ఆ…నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. కార్లో కూర్చొని మాట్లాడుకొందామా? కమాన్ అన్నూ!” అంటూ రంజని ప్రతిస్పందనకై ఎదురుచూడకుండా కారులోకి దూరాడాబ్బాయి. అనామిక అతన్ని అనుసరించింది. చేసేది లేక డ్రైవర్ సీట్లో కూర్చుంది రంజని. కూర్చున్నాక కూడా రంజని పెదవి విప్పకపోవడంతో “వి ఆర్ వైటింగ్ మేడమ్! ప్లీజ్ త్రో యువర్ పెర్ల్స్ ఆఫ్ విజ్‍డమ్!” అన్నాడా అబ్బాయి. చివాలున తలనెత్తి రియర్ వ్యూ మిరర్‍లో అతని మొహాన్ని చూసింది. అదిగో! మళ్ళీ అదే చిర్రెత్తించే చిరునవ్వు. మరోమారు కోపాన్ని తమాయించుకుంది రంజని.

“ప్లీజ్ మేడమ్! మీరు చూస్తుంటే బాగా చదువుకొన్నవారిలా ఉన్నారు. మేమిద్దరం అంతగా చదువుకోలేదు. పల్లెటూర్లలో పుట్టిపెరిగాం. ప్లీజ్ చెప్పండి!” – డామేజ్ కంట్రోల్ చేస్తున్నట్టుగా ప్రాధేయపూర్వకంగా అడిగింది అనామిక.

“ఓకే! లెటజ్ స్టార్ట్– చెప్పిన పనిని భార్య చేయగానే ఆవిడని మర్చిపోవడం మగవాళ్ళకి సహజం! బట్, భార్య తన భర్తతో నిష్టూరంగా మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడాలి..ఆల్వేస్!”

“ఓహ్! దిస్ ఈజ్ వన్ సైడెడ్ స్టేట్మెంట్!” అని అబ్బాయి అంటే “వెల్ సెడ్ మేడం! కంటిన్యూ చేయండి” అని అనామిక అంది. రంజని చెప్పుకుపోసాగింది – “అలా పని చేసిన వెంటనే భార్యను మర్చిపోయినా భర్తే భార్యకు బెస్ట్ ఫ్రెండ్!”

“వెల్! ఇందులో కొంత సెన్స్ వుంది” అన్నాడా అబ్బాయి. “నాన్సెస్!” అంది అనామిక.

ఏమీ పట్టించుకోనట్టు కొనసాగించింది రంజని – “భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఏ ఒక్కరు అనరాని మాటలన్నా సంబంధం చెడిపోతుంది. భార్యాభర్తల మధ్య కొట్లాట ఎవ్వరికీ మంచిది కాదు. వాళ్ళిద్దరి  కాయకష్టంలో భర్తకు సుఖం దొరకాలి. అతణ్ణి చక్కగా చూసుకోవడంలో భార్యకు సుఖం దొరకాలి.”

“వన్ మినిట్ మేడమ్! అంటే భార్య స్లేవరీ చేయాలనా?” అడిగింది అనామిక.

“నో! ఎందుకలా అనుకొంటావ్? నువ్వు ఐ.బి.ఎంలో ఉద్యోగం చేస్తుంటే అదీ స్లేవరీనే అని అనుకొంటావా? లేక గొప్పగా చెప్పుకొంటావా?” ఎదురుప్రశ్న వేసింది రంజని.

“గాటిట్! ప్లీజ్ కంటిన్యూ!” అంది అనామిక.

“యూ నో, విడివిడిగా ఉన్న కట్టెలను మండిస్తే పొగ మాత్రమే వస్తుంది. కానీ వాటిల్ని గుంపుగా చేర్చినపుడు నిప్పు మండుతుంది. అలాగే భార్య-భర్త ఎడమొహం పెడమొహంగా ఉంటే అనుమానపు పొగలు పెరిగి ఒకరికొకరు అర్థం కాకుండా పోతారు. కలిసిమెలిసి ఉంటే అవే అనుమానాలు చకచకా కరిగిపోతాయి!”

“సూపర్….భలే చెప్పారు మేడమ్!” అని కోరస్‍‍గా అన్నారా కుర్రవాళ్ళు.

ఇక చెప్పడానికేమీ లేదన్నట్టుగా “దట్సిట్!” అని భుజాలు కుదిపింది రంజని. “ఇప్పుడు చెప్పండి! ఇలా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవడాలు, పోట్లాడుకోవడాలూ మ్యానర్స్ కిందకు వస్తాయా?”

“నో…సర్టన్లీ నాట్!” అంది అనామిక.

“మరి, మీరిద్దరెందుకలా చేసారు?” టక్కున అడిగింది రంజని.

“అదా…అదీ….” అని నసిగింది అనామిక.

“ఏమీ లేదు మేడమ్! క్యూటీవీ ఛానెల్ వాళ్ళు ’ బకరాను చూడర బాబూ!’ అనే ప్రోగ్రాం చేస్తోంది. అందులో భాగంగానే ఈ డ్రామా” అన్నాడా కుర్రవాడు.

“వ్వాట్!?” అని ఆశ్చర్యపోతూ అడిగింది రంజని.

“ఎస్ మేడమ్! అదిగో అక్కడున్న మారుతీవ్యాన్లో మా కెమరా క్రూ ఉంది…..హాయ్ గైస్….” అంటూ చేయినూపాడతను. రంజని చూస్తుండగా రోడ్డుకు అవతలి వైపు వున్న మారుతీ వ్యాన్ డోర్ తెరుచుకుంది. ముగ్గురు వ్యక్తులు చేతులూపారు.

“ఈ వారం బకరా కోసం డేవిడ్ అంటే నేను, రోష్నీ అంటే మీ ‘అనామిక’ భార్యాభర్తలుగా నటించాం. మిమ్మల్ని బోల్తా కొట్టించాలని అనుకొని మేమే క్లీన్ బౌల్డయ్యాం!” అన్నాడు ఆ యువకుడు.

“మీరు క్లీన్ బౌల్డయ్యారా?” ప్రశ్నించింది రంజని.

“అవును మేడమ్! ఏవో పిచ్చి చేష్టలు చేసి మిమ్మల్ని విసిగించి ఆడుకోవాలనిఅనుకున్నాం. కానీ మీ మాటల ద్వారా కొత్త జంటలకు మంచి సందేశాన్ని చేరవేసాం. థాంక్స్ ఎ లాట్ మేడమ్!” అన్నాడు డేవిడ్.

“మేడమ్, మీ పేరు చెప్పండి!” అంది రోష్నీ.

“రంజని!”

“వ్యూయర్స్! ఈనాటి బకరా చూడర బాబూ కార్యక్రమంలో అనుకోని ట్విస్ట్ ను చూసారు కదా! బకరాలు కాకూడదనుకొనే భార్యాభర్తలందరూ రంజనిగారు చెప్పిన సూత్రాల్ని పాటించాల్సింది. ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇన్ఫోటైన్మెంట్ గా మార్చివేసిన మేడమ్ రంజని గారికి మీ అందరి తరఫునా, క్యూటీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం!” అని నాటకీయంగా చెప్పి, రంజని షేక్ హ్యాండిచ్చింది రోష్నీ.

షూటింగ్ ముగిసాక రంజని ఫోన్ నెంబర్, చిరునామా తీసుకున్న రోష్నీ త్వరలోనే ఓ మంచి కార్యక్రమం కోసం ఆమెను కాంటాక్ట్ చేయనున్నట్టు చెప్పింది.

ఈలోపు అక్కడికి వచ్చిన రంజని స్నేహితురాలు టీవీలో కనబడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు గానూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, షాపింగ్ జరుగుతున్నపుడు, మళ్ళీ ఇంటికి మళ్ళుతున్నప్పుడు రంజని తల తింటూనే వుండిపోయింది. ప్రజల్లో కీర్తి కాంక్ష ఎంతగా పెరిగిపోయిందోనని ఆశ్చర్యపోతునే ఇంటికి మళ్ళింది రంజని.

_ _ _ _ _ _ _

“రంజూ! రంజూ!” గట్టిగా అరుస్తూ లోనికొచ్చాడు అనంత్. అతని అరుపులకు ఉలిక్కిపడి హాల్లోకి పరుగెట్టుకొచ్చింది రంజని.

“రత్నమ్మ…అదే యూట్యూబ్ లో నేను వీడియోపెట్టానే….ఆమె గంట క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది. వెంకటేసులు ఫోన్ చేసాడు.” అన్నాడు అనంత్.

షాక్ తో అలా నిలబడిపోయింది రంజని.

“ఎవడో లారీవాడు తాగేసి బండి నడుపుతూ వాళ్ళున్న గుడిసె మీదకు ఎక్కించేసాడు. రత్నమ్మ స్పాట్లోనే చనిపోయింది. మనం వెళ్దామా?” అన్నాడు. అతని నుదుటి మీది చెమట చుక్కలు రత్నమ్మ కూతురి కన్నీళ్ళలా కనిపించింది రంజనికి. మరో మాట లేకుండా బయల్దేరింది.

అక్కడి దృశ్యం రంజని ఊహించుకొన్నట్టుగా లేదు. ఎంతోమంది గుమిగూడివుంటారనుకొన్న ఆమెకు వెంకటేసులు, అతని కూతురు, నలుగురు పోలీసులు, ఇంకో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనబడ్డారు. రత్నమ్మ శవం కాబోలు గుడ్డల్లో కప్పబడివుంది. ఆ ఇద్దరు వ్యక్తులూ లారీవాళ్ళైవుంటారని అనుకుంది రంజని. సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేసులుకు, ఆ ఇద్దరికీ మధ్యన గిరికీలు కొడుతున్నాడు. కాసేపు అటు, కాసేపు ఇటూ మాట్లాడుతున్నాడు.

వెంకటేసులు వెనకాలే పెద్ద పెద్ద కళ్ళలో కారి, ఆరిపోయిన కన్నీటి ఛాయల్తో బిక్కుబిక్కుమని చూస్తున్న అతని కూతురుని పిలిచింది రంజని. అమ్మాయికిప్పుడు ఒకటిన్నర సంవత్సరం. అప్పుడప్పుడూ వస్తూవుండడం వల్ల రంజనితో పరిచయం ఏర్పడిందా అమ్మాయికి.

బుడిబుడి నడకలతో రంజని దగ్గరకొచ్చింది. హ్యాండ్ బ్యాగ్ లొ ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి అమ్మాయి చేతికిచ్చింది రంజని. పెద్ద ప్యాకెట్ ను చూడగానే అమ్మాయి మొహం వెలిగిపోయింది. మౌనంగా అందుకుని తండ్రి వెనకాల చేరిపోయింది.

ఎడతెగకుండా సాగుతున్న పోలీసువాళ్ళ మాటల్ని వినడానికి వెళ్ళాడు అనంత్. కాసేపటికి వెనక్కు వచ్చి, రంజని చెవిలో గుసగుసగా “భార్య శవానికి రేటు మాట్లాడుతున్నాడు, వెధవ!” అన్నాడు.

ఆ మాటలకు కఱలా బిగుసుకుపోయి చూసింది రంజని – “నిజంగా?”

“నిజంగానే! పద, వెళ్ళిపోదాం!” అన్నాడు అనంత్.

మౌనంగా అతన్ని అనుసరించింది రంజని.

“అమ్మగారూ!” అంటూ పరుగెట్టుకొచ్చాడు వెంకటేసులు. “వెళ్తాన్నారా అమ్మా?” అన్నాడు.

“అవును. నువ్వు చేస్తున్న శవ బేరాన్ని చూడలేక!” అని ఘాటుగా అంది రంజని.

“లేదమ్మగారూ! నేను వద్దంటున్నా పోలీసోళ్ళు వినడంలేదు.” అన్నాడు. అతని గొంతులో నిజాయితీ బరువుగా కదలాడింది. రంజని నుండి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆమె నమ్మడంలేదని అనుకొన్న వెంకటేసులు – “నా బిడ్డ తోడు!” అంటూ చంకలో ఉన్న కూతురు తలపై చెయ్యి వేసాడు.

అనంత్ ఆగాడు. రంజని మనసు చలించింది.

“నాకు డబ్బొద్దమ్మా! చచ్చిపోయిన నా భార్య శవాన్నిచ్చేస్తే చాలు. మీరైనా చెప్పండి సార్!” – వెంకటేసులుకు దుఃఖం తన్నుకువచ్చింది.

అనంత్ చకచకా ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళాదు. కాసింత ఇంగ్లీష్ లోనూ, కాసింత తెలుగులోనూ దబాయింపులు మొదలుపెట్టాడు. ఇన్స్పెక్టర్ లొంగకపోవడంతో తనకు తెలిసిన డీఎస్పీకి ఫోన్ చేసాడు. పెద్దాఫీసరు ఫోన్లోకి రాగానే నీరుగారిన ఇన్స్పెక్టర్ అనంత్ చెప్పినవిధంగా రత్నమ్మ శవాన్ని వెంకటేసులుకు అప్పగించి వెళ్ళిపోయాడు.

రంజని అనంత్ వైపుకు అభినందనపూర్వకంగా చూసింది. ఆ అభినందనను స్వీకరిస్తున్నట్టుగా తల పంకించాడు అనంత్. ఆపై కావల్సిన కార్యాలన్నింటినీ అనంత్ ముందుండి నడిపించాడు. బరువైన హృదయాలతో వెంకటేసుల్ని, అతని కూతుర్ని వదిలి బయల్దేరారు రంజని, అనంత్ లు.

_ _ _ _ _ _ _

ఇంటికి రాగానే తల తిరుగుతున్నట్టుగా అనిపించింది రంజనికి. మరో నాలుగు రోజులు గడచినా అలాగే ఉండడంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాడు అనంత్.

“కంగ్రాట్స్ అనంత్! షీ ఈజ్ ప్రెగ్నెంట్!” అంటూ అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని ఊపింది లేడీ డాక్టర్. ఒక్క నిముషం స్థాణువుగా నిలబడిపోయాడు అనంత్. “థాంక్స్ డాక్టర్!” అని మాత్రం అనగలిగాడు.

“నౌ, యూ గో హోమ్ అండ్ టెల్ హర్ ద స్వీట్ న్యూస్!” అని ముక్కు పై నుంచి జారుతున్న కంటద్దాల నుంచి అనంత్ ను చూస్తూ అతని భుజం తట్టింది డాక్టర్. “తప్పకుండా!” అన్నట్టుగా తలను ఊపాడు అనంత్.

_ _ _ _ _ _ _

ఇంటికి రాగానే హాల్లో ఉన్న కృష్ణుని చిత్రపటానికి ఎదురుగా, సోఫా మీద రంజనిని కూర్చోబెట్టాడు అనంత్. తను నేలపై కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టాడు.

“ఏయ్! ఏమిటిది చిన్నపిల్లాడిలా!” అని నీరసంగా నవ్వుతూ అంది రంజని.

“ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ…” అని పాడాడు అనంత్.

“అబ్బా! ఆ పాటవున్న రాగమేంటి నువ్వు పాడుతున్న రాగమేంటి?” అంది రంజని.

“చిన్ని పాపాయిలు ఇంకెలా పాడ్తారమ్మా!!” గోముగా అన్నాడు.

“చిన్న పిల్లలు పాడతారేంటి! ఉంగా ఉంగామని ఏడుస్తారు!” అంది రంజని.

“గుడ్! ఇంకో ఫైవ్, సిక్స్, సెవెన్ మంత్స్ లో ఓ పాపా లాలీ అంటూ నువ్వు, ఉంగా ఉంగా అంటూ పాపాయీ ఇల్లంతా గోల గోల చేస్తారు!” మెల్లగా, మెత్తగా పలికాడు అనంత్.

“ఆహా! కలగంటున్నావా?”

“ఆ సోడాబుడ్డి కళ్ళద్దాల డాక్టర్ పెద్ద ముత్తైదువ చెబితేనూ అప్పటినుంచి కొద్దికొద్దిగా కలగంటున్నా!” అన్నాడు కన్ను గీటుతూ.

అందమైన కళ్ళని పెద్దవి చేసింది రంజని.

“అబ్బా! ఇలాంటి కళ్ళే పాపకొస్తేనో! కొంచెం మామూలుగా చూద్దూ!” అన్నాడు అనంత్.

చప్పున అతన్ని ముద్దు పెట్టుకుంది రంజని. ఆమె మెత్తని కురుల్లోకి చేతుల్ని పోనిచ్చి తన వైపుకు లాక్కున్నాడు అనంత్.

* * * * * *

“మీరు దయతో ప్రసాదించిన ఈ అదనపు ఆటలో నా ఆటకాయల్లో మొదటిది పరమపదసోపాన పటపు పై వరుసను చేరగలిగింది. రెండోది అన్ని పాముల్ని దాటుకుంది.” అంది జగన్మాత.

“దేవీ! ఉప్పుకే గతి లేని వారికి చక్కటి అంబలి దొరికితే అది అదృష్టమేగా!” అన్నాడు జగన్నాటకసూత్రధారి.

“తప్పకుండా స్వామీ!”

“స్థితస్య పరిపాలనం క్షేమం అని అన్నట్టుగా ఉన్నదాన్ని కాపాడుకోవడాన్నే ‘క్షేమ’మని చెబుతారు. సంపూర్ణ లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలే వారు రోజులో ఒక్కమారైనా హృత్పూర్వకంగా నన్ను స్మరిస్తే ఆ నిముషం వరకూ చేసిన వారి పాపసంచయాన్ని హరిస్తాను. గంటకోమారు స్మరించిన వారికి గత జన్మల సంచితాన్ని సైతం హరిస్తాను. నన్ను స్మరించకపోయినా పరుల దుఃఖాన్ని పరిహరించే వారికి తత్కాల లాభాన్ని పొందింపజేస్తాను.” అన్నాడు సత్యసంధుడు.

“అందుకేగా మిమ్మల్ని కరుణాసముద్రుడని వేదాలు కీర్తిస్తున్నాయి. తమ నుదుటివ్రాతలో పరమపదానికి సమీపంఆ కూడా వచ్చే అర్హతలేని నా పావులకు ఆ భాగ్యాని కల్గించిన మీకు నా నమోవాకాలు” అని అరుణ కమల సదృశాలైన నారాయణుని పదపద్మాలను తాకి నమస్కరించింది మహాలక్ష్మి.

ఆ వినయశీలను సాదరంగా లేవనెత్తాడు భవదూరుడు.

“దేవీ! సంసారమనే పరమపదసోపానపటంలో జీవులు నిచ్చెనల నెక్కుతూ, పాముల బారిన పడుతూ జీవయాత్రను కొనసాగిస్తారు. రోజులో ఇరవైయొక్క వేలా ఆరువందల సార్లు శ్వాసోచ్ఛ్వాసాల్ని సాగిస్తారు. ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేందుకు పట్టే సమయమంతైనా నీ ‘మాయాశక్తి’ని, నా ‘వైష్ణవమాయ’ను గుర్తించి ఆలోచించి స్మరించగల్గితే నిచ్చెలన్నీ నెచ్చెలులౌతాయి. పాములన్నీ ప్రతిహతమౌతాయి. ఈ సూక్ష్మాన్ని గ్రహించేందుకే ఈ ఆటను సృజించాను. నీవు కోరిన ఏకాంతం నీకు సంతోషాన్నే కలిగించిందనుకుంటాను” అన్నాడు భూతభావనుడు.

“మీ సంకల్పానుసారం ఈ చరాచర జగత్తు నడుస్తోంది. సృష్టి, స్థితి, లయాత్మకమైన ఈ అనంత పరమపద సోపాన కేళిలో దేశతః, కాలతః మీతో కలిసివుండే నాకు మీ అనంత గుణాల సౌందర్యసారం లేశమైనా ఎరుక కాలేదు. నాలాంటి అల్పురాలికి మీరు కలిగించిన సంతోషం ఎన్నలేనిది” అంటూ హరిని కౌగిలించుకుంది ఆ వక్షస్థాంగన.

“నీకు ఇంత ఆనందాన్ని పంచిన ఈ నాలుగు పావుల్నీ ఏం చేద్దాం దేవీ?” అనునయంగా అడిగాడు అనసూయవరదుడు.

“మీరు సృజించిన పావులకు మీ ఇష్టానుసారమే గతిని ప్రసాదించండి!”

“ఊహూ! కోరుకోవడం జీవుల వంతు. కోరుకున్నది నడపడమే నా వంతు. ఈ పావుల తరఫున నువ్వు కోరు, నేరవేరుస్తాను!” అన్నాడు శేషపర్యంకశయనుడు.

“ఆలోచించాలి! కాస్త సమయాన్ని కనికరించండి!”

“అవశ్యం!”

వైకుంఠపురపు అంతఃపురంలోని చంద్రశాలలో చంద్రకిరణాలు నయనోత్సాహంగా మెరుస్తుంటే, తన ముంది పరచివున్న  పరమపదసోపాన పటం మీద తమ తమ నెలవుల్లో నిలబడివున్న పావుల వంక సాలోచనగా దృష్టి సారించింది మహామాయ.

ఆది దంపతుల హస్త స్పర్శను కొల్పోయిన పాచికలు మౌనం వహించిన ఆ క్షణంలో వారి కరుణారసప్లావిత దృక్కుల్లో తడుస్తున్న పావులు అమ్మ కోరబోయే కోరికను వినడానికై మనసుల్ని రిక్కించి నిలబడ్డాయి.

 * * * * * *

Your views are valuable to us!