వైకుంఠపాళీ – పదిహేడవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: కేశవ శర్మ తీసుకువచ్చిన చిత్రపటంలో వీణల్ని పట్టుకుని నిలబడివున్న నారద-తుంబురుల్ని చూసి దిగ్భ్రాంతికి గురౌతుంది సుమతి. వెంటనే తనకు వస్తున్న కలల గురించి భర్తతో చెప్పి కలలంటే ఏమిటని, వాటిల్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతుంది సుమతి. కలల గురించి వివరిస్తాడు శర్మ. సుమతికి కలల గురించి చక్కగా వివరించే సామర్థ్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి మనసులోనే ప్రార్థిస్తాడు శర్మ.

 

రెండో అంతస్తులో ఉన్న తమ అపార్ట్మెంట్ బాల్కానీలో నిలబడి జడ వేసుకుంటోంది రంజని.

అనంత్ లేనితనాన్ని విషాదంగా భావించడం మానేసి కొన్ని వారాలైపోతోంది. కొన్ని రోజుల క్రితం అనంత్ ఫోన్ చేసినా ఆమె తీయలేదు. అనంత్ మళ్ళీ ప్రయత్నం చేయకపోవడంతో అతనిలో మార్పు రాలేదని, రాబోదని నిశ్చయించేసింది రంజని.

ఆమెకు నిర్వేదంలోని గొప్పతనమేంటో ఈ కొద్దికాలంలోనే తెలిసింది. అనంత్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడన్న విషయం తెలుసుకున్న అరవింద్ చాలా బాధపడ్డాడు. రంజనిని ఓదార్చబోయాడు. అప్పుడామె అంది “అరవింద్! అనంత్ నాతో లేడన్న ఫీలింగ్ నాలో విషాదాన్ని నింపలేదు. ఐ థింక్ దేర్ ఈజ్ ఏ బ్లిస్ బీయింగ్ ఇన్ మెలాంకలీ! జీవితంలో అప్పుడప్పుడూ ఈ మెలాంకలీ లేకపోతే కంప్లీట్ నెస్ లేదనిపిస్తుంది. ఈ మాటల్ని డిప్రెషన్ తో చెప్పడం లేదు. జీవితం-నిర్వేదం ఈ రెండూ పిల్లనగ్రోవి, దానికుండే రంధ్రాల్లాంటివని అనిపిస్తోంది. ఒక్కో అనుభవం జీవితంలో గాలిలా వీస్తే, అవి నిర్వేదంగా మారితే, మనసులో కొత్త రాగాలు వినిపిస్తాయి. అప్పటిదాకా మనకే తెలియని కొత్త కోణాలు మనలో కనిపిస్తాయి.”

ఆమె మాటల్ని విన్న అరవింద్ డంగైపోయాడు. “ఓహ్! వాటీజ్ దిస్? ఫిలాసఫీ?” అని మాత్రం అనగలిగాడు.

అరవింద్ భూతద్దాల్లోంచి పెద్దగా కనబడుతున్న అతని కళ్ళని చూసి నవ్వుతూ “ఆర్టాఫ్ థింకింగ్” అంది రంజని.

_ _ _ _ _ _ _

ఆఫీసులో విశ్వజ్ఞతో మామూలుగా ఉంటోంది రంజని. పనికి సంబంధించినంత వరకే మాట్లాడుతోంది ఆ అమ్మాయి.

అన్నతో కలిసి అనంత్ ను కలిసిన విషయాన్ని రంజనికి చెప్పలేదు విశ్వజ్ఞ. చెబితే అపార్థం చేసుకుంటుందేమోనన్న సందేహం ఆ అమ్మాయిలో నాటుకుపోయింది. ఫోన్ చేసినా రంజని తీయలేదని అనంత్ చెప్పిన మాటలు విశ్వజ్ఞను కలవరపాటుకు గురిచేసాయి. ఐనా రంజనితో మాట్లాడకుండా మౌనం వహించింది.

స్వాతంత్ర్యదినోత్సవం కలుపుకుని వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో దగ్గర్లోనే ఉన్న ఓ పర్యాటక స్థలానికి వెళ్ళి ఓ రెండు రోజులుండాలని ప్రణాళిక వేసింది రంజని. పావని, స్టెల్లాలు సరేననేసారు. విశ్వజ్ఞ మాత్రం రాలేనని చెప్పింది. రంజని అంతగా పట్టించుకోలేదు. పావని, స్టెల్లాలు మాత్రం మరోసారి అడిగి చూడమని మరీ మరీ చెప్పడంతో ఆ అమ్మాయిని ముక్తసరిగా అడిగింది.

“ఎందుకు రావడం లేదు?” అంది రంజని.

“అదీ…మేడమ్…ఇంట్లో మా అన్నయ్య మూడు రోజులు ఒక్కడే ఉండాలంటే కష్టం.” అంది విశ్వజ్ఞ, వంచిన తల ఎత్తకుండా.

“దెన్….కాల్ హిమ్ టూ….” అంది అధికార స్వరంతో రంజని.

చప్పున తలెత్తి చూసింది విశ్వజ్ఞ. ఆమెను చూస్తూ కనుబొమలెగరేసి “ఈజ్ దట్ ద ఓన్లీ ప్రాబ్లమ్? దెన్ విశ్వేశ్వర్ కెన్ జాయిన్ అజ్.” అనేసి కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయింది రంజని.

అక్కడే ఆలోచనల్తో కూర్చుండిపోయింది విశ్వజ్ఞ.

– – – – – – –

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

పర్యాటక స్థలమంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినదేమీ కాదు. ఎడారిలాంటి ఆ పట్టణానికి అతి దగ్గరలో ప్రకృతి కట్టుకున్న ఓయాసిస్సు లాంటిది ఆ ప్రాంతం.

ఓ చిన్న చెరువు. పక్కనే ఓ చిట్టి కొండ. కొండ మీద దేవుడు లేని గుడి. కొండ, చెరువుల్ని చుట్టుముట్టిన పొలాలు. ఆ పొలాలకు దిష్టి తీస్తూ ఎండిన చెట్లతో నిండిన పెద్ద మైదానం. వాటన్నింటినీ కలుపుతూ, చీలుస్తూ, హద్దులు ఏర్పరుస్తూ సాగిపోయే కాలిబాటలు.

రైతులు, కూలీలు, కాపర్లు ఆ ప్రదేశానికి పాలితులు, పాలకులు!

ప్రశాంతంగా చూస్తే చిన్నిపాప గీసిన తడియారని తైలవర్ణ చిత్రానికీ, ఆ ప్రదేశానికీ పెద్ద తేడా తెలిసిరాదు. అంతేకాక, పసిపాప వేసిన చిత్రమంత ముగ్ధంగా ఉంటుంది ఆ ప్రాంతం. అందుకే రంజనికి అంత ఇష్టం. పైగా అదే ఊళ్ళో రంజని కంపెనీలో పనిచేసే అడ్మిన్ మేనేజర్ కు ఓ చిన్న ఫార్మ్ హౌస్ ఉంది.

రంజని వాళ్ళు ఆమె కారులో సాయంత్రానికి అక్కడికి చేరుకునే సరికి ఆ ఫార్మ్ హౌస్ బాగోగులు చూసుకునే కుటుంబం మొత్తం ఎదురొచ్చి అతిథుల్ని, వారి సామానుల్నీ ఫార్మ్ హౌస్ లోకి చేర్చారు. ఆఫీస్ ముగించుకుని నేరుగా ఇక్కడికే వచ్చేసారు వాళ్ళు.

పొందికైన ఇల్లది. అతిథులొస్తున్నారని కాబోలు చక్కజేసి పెట్టారు. రెడ్ ఆక్సైడ్ వేసిన పాతకాలపు ఫ్లోరింగ్ చక్కగా నీళ్ళేసి రుద్దడంతో చమక్కుమని మెరుస్తోంది. ఆ ఎర్రటి నేల మీద తెల్లటి ముగ్గు తన అంచుల్ని, వంపుల్ని మరీ మరీ చూసుకుంటోంది. కొత్తగా అలంకరించుకున్న సున్నపు పూతల్ని అదేపనిగా ప్రదర్శిస్తున్నాయి గోడలు. కిటికీలకు కట్టిన పరదాలు అటు బైట గాలితోనూ, ఇటు లోన పంకా తోనూ కబుర్లు చెబుతూ హడావిడి పడిపోతున్నాయి. పరదా కబుర్ల గొడవలో జోరెక్కువై పడిపోతుందేమోనని ఆ పంకాని గట్టిగా కౌగిలించుకుని వుందొక పైకప్పు దూలం.

“వోవ్!” అన్నారు పావని, స్టెల్లాలు ఒకేసారి. ఆ పొదరిల్లులాంటి ఇల్లూ, పెరటిలోని బావి, కూరగాయల తోట వాళ్ళని అరిపించేలా చేసేసాయి.

విజయగర్వంగా నవ్వింది రంజని.

అవేవీ చూడలేని విశ్వేశ్వర్ అలానే నిలబడివుంటే, చూస్తూ కూడా ముభావంగా ఉండిపోయింది విశ్వజ్ఞ.

కనుబొమలు చిట్లించి తనకు కేటాయించిన గదిలోకి నడిచింది రంజని. పావని, స్టెల్లాలు ఒక గదిలోకి వెళితే, విశ్వేశ్వర్ తన చెల్లితో బాటు మొదటి అంతస్తులో నున్న ఓ చిన్న గదిలోకి వచ్చాడు.

“వీళ్ళతో మనం రాకూడదయింది అన్నయ్యా! నువ్వెందుకు ఒప్పుకున్నావ్?” అని చిరాకుగా అంది విశ్వజ్ఞ.

నవ్వే సమాధానంగా ఇచ్చాడు విశ్వేశ్వర్. నుదురు కొట్టుకుని ఊరకే ఉండిపోయింది విశ్వజ్ఞ.

పావని పైకొచ్చి “భోజనం” అన్నట్టు సైగ చేసి పిల్చేదాకా అన్నా-చెల్లి మౌనంగా ఉండిపోయారు.

మళ్ళీ పైకొచ్చాక – “చూసావా! వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకున్నారు గానీ మనిద్దర్నీ కనీసం ఒక్క మాటైనా పలకరించలేదు. రంజని కావాలని అవమానించేందుకే నిన్ను నన్నూ పిల్చింది. ఆమెకు నాపై గొంతు దాకా కోపముంది.” అంది విశ్వజ్ఞ.

“అలాగేం లేదులేమ్మా! రేపటికి అంతా మామూలుగా ఉంటుందిలే. వెర్రిగా ఆలోచించక పడుకో!” అన్నాడు విశ్వేశ్వర్ గట్టిగా ఆవలిస్తూ.

– – – – – – –

మరుసటి రోజు ప్రొద్దున ఉపాహారం ముగించి, ఫార్మ్ హౌస్ నుండి చెరువు వరకూ నడవడం మొదలెట్టారు అందరూ.

రంజని, పావని, స్టెల్లాలు జట్టుగా ముందువెళ్తుంటే, విశ్వేశ్వర్ చేయి పట్టుకుని వెనకగా నడుస్తోంది విశ్వజ్ఞ.

“మనం వెనక వస్తున్నామా లేదా? నువ్వు వాళ్లంత ఫాస్ట్ గా నడవగలవా లేదా? అలా ముందు ముందుగా వాళ్ళెళ్ళిపోతే మనకు దారి తెలుస్తుందా లేదా? – ఇవేమీ పట్టనట్టుగా చూడు ఎట్లా వెళ్ళిపోతున్నారో!” అంది విశ్వజ్ఞ చాలా ఉక్రోషంగా.

ఆమె చెయ్యిని తట్టి – “ఇదిగో! మళ్ళీ వెర్రిగా ఆలోచిస్తున్నావు. కొంచెంసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకో!” అన్నాడు విశ్వేశ్వర్.

“అలా బుద్ధభగవానుడిలా శాంతం శాంతం అని చెప్పడానికి నీకు బోర్ కొట్టదా?”

“ఊహూ! మంచి విషయాన్ని పదేపదే చెప్పడంలో బోర్ ఉండదు. నువ్వూ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడు.” అన్నాడు విశ్వేశ్వర్.

“హుష్షో! ఎప్పుడూ నన్నే ఏడ్పిస్తావు!” అంది విశ్వజ్ఞ బేలగా.

“లేదమ్మడూ! కొంచెం ఓపిక పట్టు!”

“ఆ…నేను ఓపిక పడితే నువ్వు మిరాకిల్స్ చేస్తావా…” అంది విశ్వజ్ఞ.

“మనం అనుకోనిది అనుకోని సమయంలో జరగడమే మిరాకిల్. ఏమో….ఇప్పుడే అది జరగొచ్చునేమో!” అన్నాడు నవ్వుతూ.

“సరే! చూద్దాం! ఏమీ జరగలేదనుకో……” అంటూ విశ్వజ్ఞ తన అన్న నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేసింది.

ఓ మలుపు తిరగ్గానే స్వచ్ఛమైన నీటితో ఆహ్వానించింది ఆ చెరువు.

దాన్ని చూడగానే చప్పట్లు కొడుతూ పరుగెట్టారు పావని, స్టెల్లా. “స్లో….స్లో…” అని అరుస్తూ వాళ్ళ వెంటే పరుగెట్టింది రంజని.

ఒకే ఒక్క క్షణంలో పసిపిల్లలైపోయారు ఆ ముగ్గురు.

_ _ _ _ _ _ _

 

“వాళ్ళు నీళ్ళల్లోకి దిగారు.” అంది విశ్వజ్ఞ, గట్టుపైన కూర్చుని.

“వాళ్ళు గానీ, చెరువు గానీ నిన్ను దిగొద్దనలేదే!” అన్నాడు విశ్వేశ్వర్.

“హుష్షో…” అంది విశ్వజ్ఞ.

“కాసేపు నువ్వూ వాళ్ళతో పాటు చేరు. ఈ నీరసం, ఆ హుష్షోలూ తగ్గిపోతాయి.” అన్నాడు విశ్వేశ్వర్.

“ఊహూ! నేనిక్కడే కూర్చుంటా!” అంది విశ్వజ్ఞ మొండిగా.

మరో ఐదు నిముషాలు గడిచాయి.

ఎక్కడినుంచి వచ్చిందో ఓ చిన్న కుక్కపిల్ల. గునగునా వచ్చి విశ్వజ్ఞ పక్కనే ఆగింది.

“ఐయ్…పప్పీ!” అంటూ దాన్ని పట్టుకోబోయింది విశ్వజ్ఞ.

బెదిరిపోయిన ఆ కుక్కపిల్ల ముందుకు ఉరికింది. అంతే…గట్టు అంచునుండి పల్లం లోకి జారి, అక్కడి నుండి సరాసరి చెరువులోకి పడిపోయింది. విశ్వజ్ఞ గొల్లుమని అరిచింది. కంగారుగా లేచాడు విశ్వేశ్వర్. “ఏమైందమ్మా?” అని గట్టిగా అరిచాడు.

“పప్పీ…పప్పీ…చెరువులో పడిపోయింది అన్నయ్యా!” అని ఏడుపు గొంతుతో అంది విశ్వజ్ఞ.

“పప్పీనా?” అన్నాడు విశ్వేశ్వర్, పడిపోయింది ఎవరని అర్థం కాక.

“పప్పీ అన్నయ్యా! చిన్న కుక్కపిల్ల.” అంది విశ్వజ్ఞ.

వాళ్ళిద్దరి కేకల్ని విని తమ కేరింతల్ని ఆపేసారు రంజని, పావని, స్టెల్లాలు.

“ఏమైంది విశ్వేశ్వర్?” అని గట్టిగా అరిచింది రంజని.

“కుక్కపిల్ల చెరువులో పడిపొయిందని చెబుతోంది విశ్వజ్ఞ. త్వరగా చూడండి. పాపం చచ్చిపోతుందేమో!” అని గట్టిగా అరిచాడు విశ్వేశ్వర్.

“అయ్యొయ్యో! ఏయ్! విశ్వజ్ఞ, ఎక్కడ పడిందే. తొందరగా చెప్పు!” అని అరిచింది పావని.

“అక్కడ…అక్కడ…” అని గట్టు పై నుండే చూపించింది విశ్వజ్ఞ.

“ఏడ్చావ్. అక్కడి నుంచి చూపిస్తే ఎలా తెలుస్తుంది. కిందకు రా!” అని హుకుమ్ జారీ చేసింది స్టెల్లా.

గబగబా కిందకు దిగి వచ్చి, కుక్కపిల్ల దొర్లిన స్థలాన్ని చూపించింది.

రంజని త్వరత్వరగా అటుకేసి నడిచింది. మరో రెండడుగులు ముందుకేసిందో లేదో బుడుంగ్ మని నీళ్ళలోకి జారిపోయింది. ఆమె పూర్తిగా మునిగిపోవడాన్ని చూసి కెవ్వుమని ఒకరి తర్వాత ఒకరు అరిచారు పావని, స్టెల్లాలు.

“మేడమ్ నీళ్ళలోకి జారిపోయారు. అక్కడ లోతు ఎక్కువేమో! పాడు చెరువు. విశ్వేశ్వర్ గారూ! చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడండి. మేడమ్ నీళ్ళలోకి మునిగిపోయారు.” అని గెంతులేస్తూ అరవసాగింది పావని.

దభీమని నీళ్ళలోకి దూకింది విశ్వజ్ఞ.

ఈసారి కెవ్వుమని జంటగా కేకలు పెట్టారు పావని, స్టెల్లాలు.

“ఏమైందమ్మా?” అని కంగారుగా అరిచాడు విశ్వేశ్వర్.

“విశ్వజ్ఞ కూడా నీళ్ళలో పడిపోయిందండీ!” ఏడుస్తూ అంది పావని.

“పడిపొయిందా? తనే దూకిందా!” అన్నాడు విశ్వేశ్వర్.

“తనే దూకేసింది!” అంది పావని.

“ఐతే ఫర్వాలేదు. గాభరా పడకండి!” అని కూర్చున్నాడు విశ్వేశ్వర్.

అతని వైపుకు వెర్రిగా చూసారు ఆ ఇద్దరమ్మాయిలు. “చెల్లెలు నీట్లో పడిందిగా…ఈ గుడ్డాయనకి బుర్ర చెడిపోయినట్టుగా ఉందే. నువ్విక్కడే ఉండు. నేనే పైకెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసొస్తా.” అంటూ గట్టుపైకి పరుగెట్టింది స్టెల్లా.

మరో నిముషంలో నీళ్ళపైకి తేలింది విశ్వజ్ఞ. ఆమెతో బాటే పైకి తేలింది రంజని. ఆమెను పావని వైపుకు నెట్టి “తొందరగా లాక్కో!” అంది విశ్వజ్ఞ. రంజని భుజాన్ని పట్టుకుని తన వైపుకు లాక్కొంది పావని. వెంటనే బుడుంగ్ మని మళ్ళీ నీళ్ళలోకి మునిగింది విశ్వజ్ఞ.

రంజనిని బలంగా పట్టుకుని గట్టు అంచుకు లాక్కొచ్చింది పావని. మళ్ళీ నీళ్ళ శబ్దం కావడంతో తలెత్తి చూసింది. విశ్వజ్ఞ ఎడం చేతిలో చిన్ని కుక్కపిల్ల. గిలగిలా తన్నుకుంటోంది. వేగంగా గట్టుపైని కెక్కి “ఇదో కుక్కపిల్ల! నీళ్ళు కక్కించు!” అని అక్కడే నిలబడి దిక్కులు చూస్తున్న స్టెల్లా చేతిలో పెట్టి, అంతే వేగంగా వెనక్కు తిరిగి, గట్టు దిగి రంజని వైపుకు వచ్చింది.

రంజనిని వెల్లకిలా పడుకోబెట్టి, కడుపు పైన వొత్తి మింగిన నీళ్ళను కక్కించింది విశ్వజ్ఞ.

రంజని కొద్దిగా కళ్ళు తెరవడం చూసి ఏడ్చేసింది పావని. “మేడమ్! మేడమ్!!” అని రంజని బుగ్గల్ని తడుతూ అడిగింది విశ్వజ్ఞ. పూర్తిగా కళ్ళు తెరచి చూసింది రంజని. ఆమెను నెమ్మదిగా లేపింది విశ్వజ్ఞ.

“కాసేపిలా ఆనుకుని కూర్చోండి. యూ విల్ బీ ఫైన్!” అంటూ అక్కడున్న ఓ పెద్ద రాయికి ఆన్చి రంజనిని కూర్చోబెట్టింది విశ్వజ్ఞ. “వెళ్ళి కొద్దిగా కాఫీ తీసురా!” అని పావనికి చెప్పింది. క్రమశిక్షణ గల సైనికుడిలా పరుగెట్టింది పావని.

పావనితో బాటే కుక్కపిల్లని పొదివి పట్టుకుని వచ్చింది స్టెల్లా. పావని ఇచ్చిన కాఫీని కొద్దికొద్దిగా తాగింది రంజని. షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని ఆమె కళ్ళు చెబుతున్నాయి. లేచి నిలబడిన విశ్వజ్ఞ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి, వేగంగా గట్టు కిందకు పరుగెట్టి దభీమని చెరువులోకి దూకింది. ఆ ముగ్గురూ మళ్ళీ ఉలిక్కిపడ్డారు.

నీళ్ళలోకి దూకి పూర్తిగా మునకేసి, రెండు నిముషాల తర్వాత పైకి తేలింది విశ్వజ్ఞ. వెంటనే వెల్లకిలా పడుకుని ఈత కొడుతూ చెరువునంతా చుట్టేసి వచ్చింది. తడిచిపోయిన పంజాబీ డ్రెస్సును పిండుకుంటూ పైకి వస్తున్న విశ్వజ్ఞను నోరెళ్ళబెట్టి చూడసాగారు పావని, స్టెల్లా.

“ఎంతెంతో చదివినారు, అంతంత చదవేసినారు…ఇంత చదువు చదివి మీరు నేర్వలేద ఈతశాస్త్రమూ?” అంటూ గట్టిగా నవ్వసాగింది విశ్వజ్ఞ.

రంజని కూడా ఆ నవ్వుకు శ్రుతి కలిపింది. ఎందుకు నవ్వాలో అర్థంకాని పావని, స్టెల్లాలు క్రమశిక్షణ తప్పని సేవకుల్లా నవ్వసాగారు. గట్టుపైని విశ్వేశ్వర్ నవ్వాడు. కొండ మీది దేవుడులేని గుడి శిఖరం నవ్వింది. చెరువు అలల రెప్పల్ని ఆర్చి ఆర్చి మరీ నవ్వింది.

క్షణం క్రితం దాకా కేకలతో హోరెత్తిన ఆ ప్రాంతం నవ్వుల్తో మారుమోగింది.

– – – – – – –

“చెప్పండి విశ్వేశ్వర్! ఆరోజు అనుకోకుండా నేను మిమ్మల్ని అపార్ట్మెంట్ దగ్గర దింపాను. మీ చెల్లి లైఫ్ సేవ్ అయింది. ఈరోజు మీ చెల్లెలి వల్ల నా లైఫ్ సేవ్ అయింది. వాటీజ్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్?” కురుల్ని తడారబెట్టుకుంటూ అడిగింది రంజని.

ఆమె, విశ్వేశ్వర్ ఫార్మ్ హౌస్ వెనక భాగంలో ఉండే నూతి దగ్గర కూర్చునివున్నారు. ఇంటి లోపల మిగతా ముగ్గురమ్మాయిలూ వంటవార్పులో మునిగిపోయారు.

“ఐ డోంట్ నో వాట్టు సే!” అని భుజాలు కుదిపాడు విశ్వేశ్వర్.

“మీరు చెప్పగలరు. ప్లీజ్…” అంది రంజని.

“ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడాలన్నా పరిచయం కలిగించుకోవాలన్నా వాళ్ళిద్దరి మధ్య ఋణానుబంధం ఉండాలంటారు పెద్దలు.” ఉపోద్ఘాతంగా అన్నాడు విశ్వేశ్వర్.

“అర్థం కాలేదు!” అంది రంజని.

“అందుకే అన్నాను ఐ డోంట్ నో వాట్టు సే అని!” అని నవ్వాడు విశ్వేశ్వర్.

“ప్చ్! నా ఇగ్నోరెన్స్ వల్ల మంచి విషయాల్ని తెలుసుకోవడాన్ని మిస్సైపోతున్నానో! సింపుల్గా చెప్పలేరా?” అంది రంజని బాధగా.

దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడి విశ్వేశ్వర్. “ప్రతి పరిచయం వెనుక ఎవ్వరికీ తెలియని ఒక ఇన్విజిబుల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ రిలేషన్ అంత త్వరగా డెవెలప్ అవుతుంది.”

“వాటీజ్ దట్ ఇన్విజిబుల్ లింక్?” అంది రంజని.

“మీకు ఎలా సమాధానం చెప్పాలి? ఫిలసాఫికల్ ఆర్ సైంటిఫిక్?” అన్నాడు విశ్వేశ్వర్.

“ఆ రెండూ వేరు వేరా?” అంది రంజని.

“Knowing the truth about a phenomenon is the scope of science. Knowing the truth in its eternity is the scope of philosophy. ప్రతి ఘటనలోని సత్యత్వాన్ని తెలుసుకోవడం సైన్స్ అని, సత్యత్వంలోని అనంతత్వాన్ని తెలుసుకోవడం ఫిలాసఫీ అని ఒకచోట చదివాను. ఈ డెఫినిషన్ ప్రకారం చూస్తే ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యంతో కూడుకున్న ఫిలాసఫీని సైన్స్ అని, అందరికీ అన్వయించగలిగే సామాన్య ఉద్దేశ్యంతో కూడుకున్న సైన్స్ ను ఫిలాసఫీ అని అర్థం చేసుకోవచ్చు.” అన్నాడు విశ్వేశ్వర్.

“హుమ్….ఇది కూడా కష్టంగా ఉంది. పూర్తిగా అర్థం కాలేదు.” అంది రంజని.

ఇక చేసేదేమీ లేదన్నట్టుగా నవ్వాడు విశ్వేశ్వర్.

“మీరి కంటిన్యూ చెయ్యండి. మిమ్మల్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాను.” అంది రంజని.

“మీరు మా చెల్లెల్ని కాపాడ్డం, ఆమె మిమ్మల్ని కాపాడ్డం అన్నది ఒకే కాయిన్ కు ఉన్న రెండు పార్శ్వాల్లాంటివి. మీరు ఆమెకు చేసిన క్రెడిట్, ఆమె మీకు చేసిన ఉపకారంతో బాలెన్స్ అయింది. ఈ బాలెన్స్ అయ్యేదాకా మీకు ఆమె ఋణపడివుండింది. అకౌంటెంట్స్ వ్రాసే డే బుక్ లాంటిది మనిషి జీవితం. అక్కడ డెబిట్, క్రెడిట్లు ఉన్నట్టే మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. క్రెడిట్ గానీ, డెబిట్ గానీ ఓ పర్టిక్యులర్ వ్యక్తికిగానీ లేక గ్రూపాఫ్ పర్సన్స్ అంటే ఓ కంపెనీకి గానీ చేస్తారు. అలానే సుఖదుఃఖాలు కూడా ఒక్కో వ్యక్తి వల్ల లేక వ్యక్తుల గుంపుల వల్లా కలుగుతాయి. ఎన్ని క్రెడిట్, డెబిట్లు ఉన్నా చివరకు బాలెన్స్ ట్యాలీ కావాలి. ఎన్ని సుఖాలు, దుఃఖాలు కలిగినా మనిషి జీవితం చివరకు ఏదో ఒకచోట బాలెన్స్ కావాలి. డే బుక్ క్లోజింగన్నా, మనిషి చచ్చాడన్నా ఒకటే అర్థం. పుణ్యలాభంతో చచ్చాడా, పాపనష్టంతో చచ్చాడా అన్నదే ముఖ్యమైంది.”

“వావ్…” అంది రంజని.

“మీది లవ్ మ్యారేజా?” అన్నాడు విశ్వేశ్వర్.

“నో…అరేంజ్డ్! వై?” అని అంది రంజని.

“మీవారిని చేసుకునే ముందు పెళ్ళి చూపులు జరిగాయా?”

“ఆ….ముగ్గురు వచ్చి చూసుకెళ్ళారు! ఇదంతా ఎందుకు?”

“నాలుగోవారైన అనంత్ గారు మిమ్మల్నీ, మీరు వారినీ ఒప్పుకున్నారు. అనంత్ గారి ఊరేది?” అన్నాడు విశ్వేశ్వర్.

ఈ వివరాలన్నీ అడుగుతున్నదెందుకు అన్న తన ప్రశ్నను పట్టించుకోకుండా ప్రశ్న పైన ప్రశ్న వేసుకెళ్తున్న విశ్వేశ్వర్ ను వింతగా చూస్తూ – “హీ ఈజ్ ఫ్రం వైజాగ్ అండ్ ఐ యామ్ ఫ్రం ఢిల్లీ. మా నాన్నగారు చాలా సంవత్సరాలు అక్కడే రాష్ట్రపతి భవన్లో పనిచేసారు. ఢిల్లీ నుంచి మేమే వైజాగ్ కు వచ్చి పెళ్ళి చూపులకి అనంత్ ఇంటికెళ్ళాం. బట్! ఇవన్నీ ఎందుకు?”

“ఎక్కడి వైజాగ్ అనంత్? ఎక్కడి ఢిల్లీ రంజని? కానీ వాళ్ళిద్దరిప్పుడు ఈ ఊళ్ళో ఉంటున్నారు? వేరీజ్ దిస్ ప్లేస్ అండ్ వేర్ వర్ యువర్ ప్లేసెస్? మీకు ఆశ్చర్యంగా అనిపించడంలేదా!!” అన్నాడు విశ్వేశ్వర్.

ఇప్పుడు అర్థమైంది రంజనికి. మనుష్యుల మధ్య సంబంధాలు ఎలా ఏర్పడతాయో చెబుతున్నాడతను. “నిజమే కదా! ఎక్కడ తను? ఎక్కడి అనంత్? ఎక్కడివాళ్ళీ విశ్వేశ్వర్, విశ్వజ్ఞ, పావని, స్టెల్లా, అరవింద్ – ఎక్కడివాళ్ళు వీళ్ళందరూ? నావాళ్ళని ఇప్పుడనుకుంటున్నవాళ్ళెవ్వరూ పుట్టుకతోనే తెలిసినవాళ్ళు కారు!”

రంజనికి ఏదో తెరలు తొలగిపోతున్నట్టుగా అనిపిస్తోంది.

“ఎక్కడి మావి చిగురు! ఎక్కడి కోకిల! ఎక్కడిదా సంబంధం? అని ఓ కవి ప్రశ్నించినట్టు మీకు, మాకు మధ్యవున్న ఈ రిలేషన్ విచిత్రంగా లేదూ? ఇది జస్ట్ హాయ్-బై రిలేషన్ మాత్రమే కాదు. మీరు విశ్వజ్ఞ మర్యాదను కాపాడారు. ఆమె మీ ప్రాణాల్ని కాపాడింది. మానం-ప్రాణం, ఈ రెండూ మనిషికి ఎంతో ముఖ్యం. డబ్బుకన్నా, కీర్తికన్నా, ఆస్తులకన్నా ముఖ్యమైనవీ రెండు. అలాంటివాటిల్ని మీరిద్దరూ పరస్పరం పంచుకున్నారు. గౌరవంగా బ్రతకడానికి కావల్సిన వీటిల్ని మీరిద్దరే, ఒకరికొకరు కాపాడుకోవడంలో అర్థం కాని రహస్యమొకటి ఉన్నట్టు మీకు అనిపించడం లేదూ?” అని ఆగాడు విశ్వేశ్వర్.

ఔనన్నట్టుగా తలూపింది రంజని.

ఆమె ప్రతిస్పందనని తెలుసుకోలేని విశ్వేశ్వర్ మళ్ళీ కొనసాగించాడు.

“అనుకోకుండా పరిచయమైన విశ్వజ్ఞ మీ భార్యాభర్తలు విడిపోవడానికి కారణమైంది.”

“ఛా…ఛా…నో…” అని అడ్డుపడింది రంజని.

విననట్టుగా సాగిపోయాడు విశ్వేశ్వర్ – “మిమ్మల్ని విడగొట్టానన్న బాధతో కుమిలిపోతోంది నా చెల్లెలు. మానాన్ని కాపాడిన వ్యక్తికి తన అజ్ఞానంతో నా చెల్లెలు అన్యాయం చేసిందిగదా అని నేనూ బాధపడుతున్నాను. నిన్న, ఈరోజూ మీరు ఆ ఇద్దరమ్మాయిల్తోనే కలివిడిగా ఉంటుండం చూసి విశ్వజ్ఞకు కోపమొచ్చింది. మీకు, విశ్వజ్ఞకు రిలేషన్ ఏర్పడడానికి కారణం నేను. నేను మీకు పరిచయమవడం ఓ యాక్సిడెంట్ అండ్ దటాల్సో త్రూ యాన్ యాక్సిడెంట్. ఇన్ని ప్రమాదాల్ని ఒక్క క్షణంలో తుడిచివేసింది ఎవరో చెప్పండి?”

“దేవుడు.”

“కాదు….కుక్కపిల్ల…. హాహాహా!” అంటూ విరగబడి నవ్వాడు విశ్వేశ్వర్.

నవ్వింది రంజని. చాలారోజుల తర్వాత అంత విశాలంగా నవ్విందేమో ముఖంలోని కండరాలు సాగి, హాయిగా అనిపించింది ఆమెకు.

“రంజనిగారు! మనం నమ్మినవాళ్ళనూ, మనల్ని నమ్ముకున్నవాళ్ళనూ ఎక్కువగా పరీక్షించ కూడదు. వుయ్ షుడ్ నాట్ పుట్ దెమ్ అండర్ సివియర్ టెస్ట్స్. తప్పుగా అనుకోకపొతే నాదో రిక్వెస్ట్. ప్లీజ్ కాల్ అనంత్ గారు. హీ కాల్డ్ యూ. బట్, మీరు ఆ కాల్ తీసుకోలేదు. ఐ నో ఇట్. మెలాంకలీలో సుఖముందని మీరు అనుకోవచ్చు. కానీ అది స్లో పాయిజన్ లాంటిది. సంతాపమన్నది బలాన్నీ, రూపాన్నీ, జ్ఞానాన్నీ నాశనం చేస్తుందంటారు. సో, ప్లీజ్ డోంట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్! ఇది నా హంబుల్ రిక్వెస్ట్!” అని ముగించాడు విశ్వేశ్వర్.

కుర్చీలో వెనక్కు వాలి ఆలోచనల్లో మునిగింది రంజని.

స్టీల్ ప్లేట్ ను గరిటెతో మోగిస్తూ పావని రావడంతో రంజని ఆలోచనలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

ఆమెలో ఆలోచనలు ఆగినా అంతరంగం అలజడి చేస్తూనే ఉంది.

– – – – – – –

ఆదివారం మధ్యాహ్నానికి ట్రిప్ నుండి వెనక్కు వచ్చేసారు రంజనీ ప్రభృతులు.

అపార్ట్మెంట్ చేరిన రంజనిని, పేరుకుపోయిన ఏకాంతం పలుకరించింది.

కాళ్ళు, చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకుని బెజవాడ దుర్గమ్మ  ఫోటో ముందు దీపాలు వెలిగించింది రంజని. దండం పెట్టుకుంది.

హాల్లోకి వచ్చి, సోఫాలో కూర్చుని మొబైల్ చేతిలోకి తీసుకుని విశ్వేశ్వర్ కు డయల్ చేసింది. అవతల వైపు అతను తీసి “నమస్తే మేడమ్! మేము కూడా ఇంటికొచ్చేసాం!” అన్నాడు.

“గుడ్! ఐ జస్ట్ వాంట్ టు నో….మీకు ఇన్ని మంచి విషయాలు నేర్పించిందెవరు?” అంది రంజని. క్రిందటి రోజు సాయంత్రం ఫార్మ్ హౌస్ నూతి దగ్గర విశ్వేశ్వర్ చెప్పిన మాటలు ఆమె మనసులో గింగిర్లు కొడుతున్నాయి.

“ఇంతకు ముందు కూడా చెప్పాననుకుంటాను! శర్మగారని ఓ మంచి పండితుడున్నారు. ఆయనే నాకు గురువు. అప్పుడప్పుడూ ఆయన్ను కదిలిస్తుంటాను. ఇలాంటి విషయాల్ని రాబట్టుకుంటాను. అలా రాబట్టి రాబట్టి, మీలాంటి వాళ్ళ దగ్గర హోల్ సేల్గా క్రెడిట్ కొట్టేస్తుంటాను. హాహాహా” అని గట్టిగా నవ్వాడు విశ్వేశ్వర్.

“కెన్ ఐ మీట్ హిమ్?” అంది రంజని.

“ఓహ్! వై నాట్! తప్పకుండా కలవొచ్చు. వారితో మాట్లాడి ఎప్పుడు కలిసేది చెబుతాను.” అన్నాడు విశ్వేశ్వర్.

“అయ్యో! మీకెందుకు శ్రమ? ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ రెఫరెన్స్ చెప్పి నేనే అపాయంట్మెంట్ తీసుకుంటాను.” అంది రంజని.

“మీరనుకున్నట్టు హై ఫండా పండితుడు కాడాయన. మహాఛాందసులు! ఆయన దగ్గర మొబైల్ కాదు కదా లాండ్ లైన్ కూడా లేదు. నేనే వాళ్ళింటికెళ్ళాలి. ఆ శ్రమ మీకెందుకు? ఐ విల్ ఆర్గనైజ్ ఫర్ యూ మేడమ్.” అన్నాడు విశ్వేశ్వర్.

సరేనని ఫోన్ కట్ చేసింది రంజని. మొబైల్ ను టీపాయ్ మీద పెట్టి, టీవీ ఆన్ చేసి కళ్ళు మూసుకుంది.

“నేడు శ్రీమతికి మాతోనే వివాదం

తగువే భలే వినోదం ఎందుకో తగువే భలే వినోదం”

ఘంటసాల గాత్రం గారాలు పోతూ సాగుతోంది.

గట్టిగా నవ్వింది రంజని. “ఆహా! ఈ ఛానల్ వాడి టైమింగ్ బావుంది.” అని మనుసులో అనుకుంది. “ఈ పాటను అనంత్ పాడితే!!!” అని అనుకున్నదే తడవు, టక్కున కళ్ళు తెరచి మొబైల్ చేతిలోకి తీసుకుని ఓ సంఖ్యను డయల్ చేసింది.

ఒక్క రింగ్ లోనే అవతలి గొంతు పలికింది – “రంజూ!”

ఇటు గంగ పొంగితే అటు గౌతమి ఉబికింది కాబోలు, రెండు తీరాల మధ్య ఉద్వేగపు మౌననది మహోద్రేకంగా ప్రవహించింది.

 

* * * * *

“ఇదేమిటి స్వామీ! నా మొదటి ఆటకాయ తొంభైఐదవ గడిలోని ’గుడ్లగూబ’ను చేరింది? ఇది అపశకునం కాదా?” అని ప్రశ్నించింది రత్నాకర కుమారి.

“భయపడకు దేవీ! ఇక్కడికి చేరడం నీ పావు చేసుకున్న పాపం కాదు. మన ఆటలో భాగంగా ఆ గడిని చేరిన నీ పావు మహత్తరమైన సందేశాన్నిస్తోంది.” అన్నాడు ప్రధానపురుషేశ్వరుడు.

“ఆ ధర్మ మర్మాన్ని బోధించి ఉద్ధరించండి స్వామీ!” అని చేతులు జోడించి ఆనందాబ్జసదన.

“చూడు దేవీ! గుడ్లగూబ గడిలోకి దిగుతున్న పాము తల ఎక్కడుంది?”

“నూటాపందొమ్మిదవ గడిలో!”

“ఆ పాము పేరేమి?”

“శతకంఠ రావణుడు!”

“దశకంఠ రావణుడి గురించి విన్నావు గదా దేవీ?”

“మీరు రామావతారానికి పూనుకోవడం వాని సంహారార్థమే గదా స్వామీ!”

“లోకంలో ప్రసిద్ధుడైన రావణుడికి పది తలలు మాత్రమే ఉంది. మరి ఈ శతకంఠ రావణుడెవరు?”

“సమస్త అక్షరాలకు, సమస్త శబ్దాలకూ మూలం మీరే! పరమార్థమూ మీరే! విశదీకరించండి స్వామిన్!”

“సంస్కృతంలో దశ, శత అనే పదాలు కేవలం సంఖ్యల్ని మాత్రమే సూచించవు. అలౌకికార్థంలో “పూర్ణత్వం” అని వాటికి అర్థం”

“అవశ్యం! మీ పద్మగర్భసంజాతుడైన బ్రహ్మ, పూర్ణమైన ఆనందం కలిగినవాడవడం వల్లనే కదా మీరు అతణ్ణి శతానందా అని సంభోదించేది!”

“సరిగ్గా గ్రహించావు దేవీ! ఆవిధంగానే ఎవడి గుణం పరిపూర్ణమైన ఆర్భాటంతో నిండివుంటుందో వాడే శతకంఠ రావణుడు. చూపాల్సిన సామర్థ్యాన్ని చేతల్లో కాకుండా కేవలం మాటల్లో మాత్రమే చూపించే ఆర్భాటపరుల్ని లోకం నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఈ ఆర్భాటపరుల మనసుల్లో అజ్ఞానం, అపరిపక్వతలు నిండివుంటాయి. ఎదుటివారి శక్తియుక్తుల్ని అర్థం చేసుకోలేని వారి అసామర్థ్యమే అజ్ఞానం. అలానే తమలోని లోపాల్ని గుర్తించి సరిచేసుకోకలేకపోవడమే వారి అపరిపక్వత. అందుకనే వారు ఎక్కువగా అరుస్తూ తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. ఇలాంటి వారిని సమస్త లోకం ఉపేక్షించడంతో, వారు జీవితాంతం గుడ్లగూబలా నిర్లక్ష్యపు చీకట్లో మగ్గిపోవాల్సిందే. ఇదీ నా ఆటకాయ చెబుతున్న ముఖ్య విషయం!” అన్నాడు చతుర్భుజుడు.

“ధన్యోస్మి దేవా! అమోఘమైన ఉపదేశాన్ని ఇచ్చారు. ఈశ్వరత్వపు గడిలో మీ తత్త్వచింతనలో మునిగివున్న మీ మొదటి ఆటకాయ తదుపరి ప్రస్థానమేమిటో?” అని సాలోచనగా అడిగింది లోలలోచన.

“పావుల నడకలు పాచికల అధీనాలు. వాటిల్నే అడుగుదాం!” అంటూ వేసాడు.

సర్వసాక్షి పాచికల్ని వేస్తే అవి వామనమూర్తి కొనగోరు తాకి బ్రహ్మాండ కటాహం నెర్రలు విచ్చినప్పటి శబ్దాన్ని ధ్వనించాయి.

 

* * * * *

(సశేషం…)

Your views are valuable to us!