వైకుంఠపాళీ – ఆరవ భాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గత భాగం: దేవాలయంలో కలిసిన రంజని గురించి సుమతితో విచారిస్తాడు శర్మ. రంజని గర్భస్రావం, పిల్లలు ఎందుకు కలగరు అన్న విషయాలను వివరంగా చర్చించుకుంటారు శర్మ దంపతులు. చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లల్ని పిలిచి వారికి ఇష్టమైన తినుబండారాల్ని పంచమని చెబుతాడు శర్మ. ఆఫీసులో రంజనికి అనేక వింత అనుభవాలు ఎదురౌతాయి. ఆమెలో సుమతి పట్ల ఆలోచనలు సాగుతూనే ఉంటాయి.

 

పిల్లలతో కోలాహలంగా ఉంది శర్మ ఇల్లు.

వాళ్లను పిల్చుకువచ్చిన తల్లుల మాటల్తో మారుమ్రోగుతున్నాయి పరిసరాలు.

ఐదేళ్ళ లోపు పిల్లల్ని పిలిచి, చిరుతిళ్ళను ఇమ్మని శర్మ చెప్పి ఒక వారం కూడా కాలేదు. వెంటనే రంగంలోకి దిగింది సుమతి.

తీపి, కారం తినుబండారులున్న పొట్లాలను ఒక్కో బిడ్డ చేతికీ ఇస్తోంది సుమతి. ఆవిడ హడావుడిని నవ్వుతూ చూస్తున్నాడు శర్మ.

ఆ తినుబండారలన్నింటినీ సుమతినే స్వయంగా చేసింది. శర్మ సహాయం చేస్తానన్నా కూడా వద్దంది. రెండు రోజుల పాటు ఏకధాటిగా, అసిధారావ్రతంలా చేస్తూనే ఉండిపోయింది. శర్మ మొండికేయడంతో వాటిల్ని ప్లాస్టిక్ సంచుల్లోకి వేయడంలో అతని సహాయం తీసుకుంది.

చెప్పిన మాటల్లోని అర్థాన్ని సరిగ్గా గ్రహించడమే కాకుండా వెనువెంటనే ఆచరణలోకి తేవడంలో గల సుమతి చిత్తశుద్ధి శర్మను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.

సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది దాకా చిరుతిళ్ల పంపిణీ జరిగింది. అంతసేపూ గుక్కెడు నీళ్ళైనా తాగకుండా బొంగరంలా గిర్రుమని తిరుగుతూనే ఉండిపోయింది సుమతి.

శబ్దం మౌనం వహించిన ఆ రాత్రిసమయంలో, అలసిపోయిన సుమతి భర్త పక్కగా కూర్చుంది. సుమతి ముఖంలోని అలసటలో కూడా చిందులేస్తున్న ఆత్మతృప్తిని స్పష్టంగా చూసాడు శర్మ. “ఏదైతేనేం! చెయ్యాలనుకున్నది సాధించావ్!” అన్నాడు మెచ్చుకోలుగా. చిరునవ్వే సమాధానంగా చూసింది సుమతి.

“పద! భోజనం చేద్దాం!” అన్నాడు శర్మ.

“ఓ పదినిముషాలు ఆగి చేద్దామా?” ప్రాధేయపడ్తున్న స్వరంతో అడిగింది సుమతి.

శర్మకు ఆమెలో అమితంగా నచ్చే ఒకానొక గుణం ఈ స్వరం.

తనను ఏ సహాయమడిగినా ఆజ్ఞాపించినట్టుగా ఉండక “దాన్ని ఇలా అందిస్తారా?” “ఒకసారి దీన్ని చూస్తారా?” అనే అడుగుతుంది. పెళ్ళైన మొదట్లో ఈవిషయమై తను మెచ్చుకుంటే సుమతి అంది “ఈ మాటతీరు మీనుంచే నేర్చుకున్నానండీ. ’ఒసేవ్ అదిలా తే’, ’దీన్నక్కడ పెట్టూ’ అనే మాటల్ని మీరు ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. మీ తీరునే నేనూ అనుసరిస్తున్నా”. ఆ మాటలతో తనకే పెద్ద ఆశ్చర్యం – “నేను అలా అడుగుతానా?” అని.

“ఏమండీ! ఓ పదినిముషాలాగి చేద్దామా?” మళ్ళీ అడిగింది సుమతి.

“అలాగలాగే. అలసిపోయావుగా!” అన్నాడు శర్మ. ఔనన్నట్టు తలూపింది సుమతి.

“చూసావా! పిల్లలుంటే ఎంత పనో…ఎంత అలసటో!” అన్నాడు శర్మ. ఆ మాటల్లోని హాస్యాన్ని హాయిగా ఆస్వాదించింది సుమతి.

శర్మ భుజానికి ఆనుకుని “ఓ చక్కటి బుజ్జికృష్ణుడి కథ చెప్పరూ!” అంది.

“అలాగే! పెద్దకథకంటే గోపమ్మలు యశోదకు చేసే పితూరీల రూపంలో కృష్ణబాలలీలల్ని చెబుతాను.” అన్నాడు శర్మ.

“భలే భలే! చెప్పండి” అంది సుమతి.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

“గోపికలు యశోద దగ్గరికొచ్చి కృష్ణుని పై పితూరీలు చెప్పడం మొదలుపెట్టారు –

’చూడమ్మా! యశోదా! నీ కొడుకు మహాఅల్లరివాడమ్మా! నా బిడ్డ నిద్రపోతుంటే వాడి పిలకకూ, దూడ తోకకూ ముడిపెట్టేసాడు. ఆపై దూడను బెదిరించాడు. అది చెంగున ఎగిరింది. దాంతోబాటే నా కొడుకు కూడా అంతెత్తు ఎగిరి పడ్డాడు. నాబిడ్డ చచ్చిపోతే దానికెవరమ్మా బాధ్యులు?’

“అమ్మా యశోదా! నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా! నిన్న సాయంత్రం మా పశువుల కొట్టానికి వచ్చేసి, పాలు తాగే దూడను దూరంగా తరిమేసి, ఆవు పొదుగుకు నోరేసి మొత్తం పాలూ తాగేసాడు. ఆ దూడ అరచి మొత్తుకొంటోంది. మీవాడేమో చుక్క మిగల్చకుండా తాగేసాడు. చిత్రం చెప్పొద్దూ! మీవాడు పొదుగుపై నోరుపెట్టగానే ఆ నంగనాచి ఆవు కూడా ఎన్ని పాలనిచ్చిందనుకున్నావ్! నేను పితికితే అందులో సగం కూడా రాదే!’

’యశోదా! నే చెప్పేది విను. మొన్నొకరోజు నీ కొడుకు పిల్లిలా మా ఇంట్లో దూరాడు. దూరి ఉట్టిలోనున్న ముంతలకేసి చూసాడు. అంతే ఆ ముంతల్లోని వెన్నంతా మాయం. నేను లోనికి పరుగెట్టుకొచ్చి కృష్ణుణ్ణి పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావ్? ఉట్టిలోని వెన్నేమైంది? అని అడిగాను. అడిగితే వాడన్నాడు పిల్లి వచ్చి తాగేస్తుంటే దాన్ని తరిమేందుకు వచ్చానే అన్నాడు. వాడలా అంటున్నాడే లేడో, మా పిల్లలు గట్టిగా అరుస్తూ లోనికొచ్చారు. వచ్చినవాళ్ళని ఏమైందని అడిగాను. వాళ్ళేమన్నారో తెలుసా? “అమ్మోయ్! వీధిలో మన పిల్లి పిట్టలా ఎగురుతోందే” అని. వెంటనే వీధిలోకి వెళ్లాను. నిజమేస్మీ! మా పిల్లిముండ రెక్కల్లేని పిట్టలా గాల్లో గిరికీలు కొడ్తోంది. అప్పుడు మూర్చపోయిందాన్ని, ఇదిగో ఇప్పుడు లేచాను. ఏం మాయగాణ్ణి కన్నావమ్మా!’

’నువ్వు చెప్పింది నయంగా ఉంది. నా ఇంట్లో జరిగింది తల్చుకుంటే నాకిప్పటికీ మతిపోతుంది. నా కడగొట్టు పిల్లని ఉయ్యాల్లో వేసి ఊపుతుంటే, మీవాడొచ్చాడమ్మా! ఉయ్యాలని ఊపనా అన్నాడు. ఏదో పిల్లవాడు ముచ్చట పడ్తున్నాడు గదాని ఉయ్యాల తాడు చేతికిచ్చి, పనిచేసుకొందామని లోనికెళ్ళాను. అలా వెళ్లానో లేదో ఢాణ్…ఢాణ్..డఢాణ్ మని ఒక్కటే చప్పుడు. ఉయ్యాలున్న గదిలోకి వచ్చి చూద్దును గదా…నీ కృష్ణుడు పెద్ద కంచుపాత్ర తీసుకొని వాయిస్తున్నాడు. నిద్రనుంచి ఉలిక్కిపడి లేచిన నా చిన్నది ఒక్కటే ఏడ్పు. ఏరా ఎందుకిలా చేసావంటే, పాప నిద్రపోవాలని సంగీతం వాయిస్తున్నా అన్నాడు. కొట్టబోతే మాయమైపోయాడు. నువ్వు చెప్పు యశోదమ్మా! వీడు అమాయకుడా! ఔనని నువ్వన్నా నేను ఛస్తే నమ్మను తల్లీ’”

“హాహాహా” – జోరుగా నవ్వసాగింది సుమతి. “గోపెమ్మల్ని ఇంత హింసపెట్టాడా కృష్ణుడు!” అని ఆగి ఆగి అడిగింది.

నవ్వుతూనే కొనసాగించాడు శర్మ –

“ఇవన్నీ పెద్ద విషయాలే కావు. అమ్మా యశోదా! నాకు జరిగింది చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తోంది. ఐనా చెప్పకపోతే నీవాడి అసలు రంగు నీకు తెలిసిరాదు. విను. నాలుగురోజుల క్రితం అర్ధరాత్రి అటు తిరిగి పడుకున్న నాపై మావారు చెయ్యివేసారు. నాకూ ప్రేమ పుట్టింది. ఇటు తిరిగి చూస్తే ’ఏమే భామా! ఆరోగ్యంగా ఉన్నావా?’ అంటూ నీ కొడుకు పళ్ళికిలించాడు. చూద్దును గదా! మా ఆయన ఓమూలలో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వీడు నాపక్కన దూరాడు. ఛీఛీ! అది గుర్తుకొచ్చినప్పుడల్లా సిగ్గుతో చచ్చిపోతున్నాను. పగలేమైనా గొడవ చెయ్యనీ కనీసం అర్ధరాత్రైనా నీ కొడుకును ఇంట్లో కట్టేసుకోవమ్మా! ఈ విపరీత చోద్యాల్ని మేం భరించలేం తల్లీ”

“ఆగండాగండి….ఏమిటీ! గోపమ్మ పక్కన చేరిందే కాక ఆరోగ్యంగా ఉన్నావా అని అడిగాడా…బాబోయ్! ఇదేం తమాషానండీ!” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అంది సుమతి. “ఇవన్నీ ఎక్కడివండీ? భాగవతంలో ఉన్నాయా?” – తన్నుకొస్తున్న నవ్వును ఆపుకుంటూ అడిగింది సుమతి.

“కొన్ని భాగవతంలో ఉన్నాయి. కొన్నింటిని మహాభక్తులు కొందరు కావ్యాల రూపంలో వ్రాసారు. విచిత్రమైన ఈ లీలల వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాలున్నాయి!” అన్నాడు శర్మ.

“అవునా! ఐతే ఇవన్నీ నవ్వుకోడానికి రాసినవి కావా?” అంది సుమతి.

“సుమతీ! భగవంతుడు అన్ని రకాల ప్రజల్నీ ఉద్ధరించడానికి తన లీలల్ని ప్రదర్శిస్తాడు. కృష్ణలీలలూ అంతే. మానవుల్లోని పండితులకూ, పామరులకే కాక దేవతలకు కూడా జ్ఞానబోధను చేసే లీలలవి. మనసు పెట్టి అర్థం చేసుకోవాలంతే!” అన్నాడు శర్మ.

“ఓహో! ఐతే ఆ విశేషాలేవో చెప్పరూ!” అంది సుమతి.

“నేటికి ఇవి చాలు. భోజనానికి లే!” అన్నాడు శర్మ.

“నిజంగా యశోద ఎంత సుకృతం చేసుకుందో కదండీ!” అంది సుమతి లేస్తూ.

“అవును! గంగాజనకునికి చెంబుడు నీళ్ళతో స్నానం చేయించింది. సర్వాంగసుందరునికి అలంకారం చేసి మురిసింది. యోగులకు సైతం చిక్కని వాడిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. మృత్యువుకే మృత్యువైన మహావిష్ణువుకు బూచోడొస్తున్నాడని భయపెట్టింది…” అన్నాడు శర్మ.

“అబ్బా! ఎంత అదృష్టం! మన పిల్లల అల్లరికి మనమెంత మురిసిపోతామో! అలాంటిది సాక్షాత్తూ నారాయణుడే యశోదను మురిపించాడంటే ఆమె మురిపం ఎంత గొప్పదో?” అంది సుమతి.

“ఆ బాలకృష్ణుణ్ణి వదలకుండా అలా తలుస్తూనే ఉండు!” అన్నాడు శర్మ.

ఆ మాటల్లోని భావమేంటో అర్థమైన సుమతి నవ్వుతూ తలదించింది.


 

*****

“అహో! మీ మొదటి ఆటకాయ ’చిత్తశుద్ధ’మనే గడినుంచి ఎకాఎకిన ’మహాలోక’మనే నూటాఐదవ గడిని చేరింది స్వామీ!” అంది తాపసారాధికపాదకమలయైన కమలజ. “అమితమైన ఆధ్యాత్మిక సంపదను కలిగివున్న మీ రెండో కాయను అధిగమించి ఒక వరుస పైకి ఎగబ్రాకింది ఈ కాయ!” అంది నిత్యకళ్యాణి.

“ఆశ్చర్యమెందుకు దేవీ! భక్తికి, చిత్తశుద్ధికి లింగభేదం లేదుగా!” అన్నాడు నిత్యముక్తుడు.

“ముక్తిలో కూడా లేదుగా ప్రభూ!” అంది మూలప్రకృతీస్వరూపిణి.

“అదే సిద్ధాంతం కూడా! మరి ఆశ్చర్యమెందుకు?” అన్నాడు శ్రీకరుడు.

“ఆశ్చర్యవత్పశ్యతికశ్చిదేయమ్…” అంది శ్రీదేవి నవ్వుతూ.

“ఐతే నీ రెండోపావు కలిగించే ఆశ్చర్యమేమిటో చూపించు!” అన్నాడు భూధరుడు.

భూజాత పాచికలను విసిరితే కొత్తనీరు నిండిన సెలయేటిలోని గలగలల్లా అవి కిలకిలమన్నాయి.

 

*****


 

కొత్త కంపెనీలో అనుకోకుండా కొత్త సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు అనంత్.

విపరీతమైన వర్క్ లోడ్ తో బాటు ఎక్కువ బాధ్యతల్ని కూడా తీసుకోమని మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తోంది. అతనికి అనుభవంలేని మార్కెటింగ్ విభాగాన్ని కూడా చూసుకోవాలని సీ.ఈ.వో జారీ చేసిన ఈమైల్ హుకుంను చూసి కోపంతో ఊగిపోయాడు అనంత్.

విసురుగా సీ.ఈ.వో కేబిన్లోకి దూసుకొచ్చి – “ముకుల్! ఏమిటిదంతా! నాకు డెవలప్మెంట్ తో బాటు పోయిన నెలలో గ్లోబల్ ప్రోడక్ట్ డెలివరీని కూడా తగిలించావు. ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ తో బాటు పనిచేయాలంటున్నావు. డైరెక్ట్ గా ఈమైల్ పంపించేకంటే ముందు నాతో డిస్కస్ చేసివుండాల్సింది. ఐ డోంట్ లైక్ దీస్ యూనీలేటరల్ డెసిషన్స్. సారీ! ఐమామ్ నాట్ ఆక్సెప్టింగ్ దిస్!” అని గట్టిగా అరిచాడు.

ముకుల్ అని పిలవబడే ఆ సీ.ఈ.వో, అనంత్ కంటే వయసులో చిన్నవాడు. అతని తండ్రి పెట్టుబడిదారుడు కావడంతో కంపెనీకి అధిపతి ఐపోయాడు. అతను కూడా ఇంజనీరే అయినా అత్తెసరి మార్కులతో పాసై చదువు”కొన్న”వాడే గానీ అనంత్ లా తెలివితేటల్తో పైకి వచ్చినవాడు కాడు. ఐతేనేం, జిత్తులమారితనంతో బండి నడిపిస్తాడు. ఉద్యోగంలో చేరిన నెలలోనే కుర్ర సీ.ఈ.వో అర్హతల్ని, పోకడల్ని కనిపెట్టేసాడు అనంత్. ఇలాంటి “అండర్ క్వాలిఫైడ్ కిడ్” క్రింద పనిచేయాల్సి వచ్చినందుకు విపరీతంగా బాధపడేవాడు. కానీ కుటుంబ, ఆర్ధిక పరిస్థితులు అతన్ని అణిగివుండేట్టు చేస్తున్నాయి.

అందుకని తన ఈగోను బుజ్జగించుకోవడానికిగానూ సీ.ఈ.వోను పేరుతో పిలవడం మొదలెట్టాడు. ఈమైల్స్ రాసేటప్పుడు కూడా “సర్” అనో “డియర్ ముకుల్” అనో సంబోధించకుండా నేరుగా విషయాన్ని ప్రస్తావించేవాడు. మీటింగులకి కావాలనే ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చేవాడు. ముకుల్ నిశ్చయించే టార్గెట్ డేట్లను, ప్రొసీజర్లను, పాలసీలను కావాలనే మార్చేసేవాడు. తనుకు నచ్చిన విధంగా ప్రాజెక్ట్ ను నడిపేవాడు. ముకుల్ నుండి ఎలాంటి ఎదురుదాడీ ఎదురుకాకపోవడంతో తన క్వాలిఫికేషన్స్, ఎఫిషియన్సీలని చూసి ఆ కుర్రవాడు డంగైపోయుంటాడని అనుకొన్నాడు. అంతేకాదు, తను డెలివరీ చేసిన ఏ ప్రాజెక్టూ ఇప్పటిదాకా రిజెక్ట్ కాలేదు. క్లైంట్స్ ఫీడ్ బ్యాక్ కూడా బావుంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ కూడా ముకుల్ నోరును మూయించివుంటుందని భావించాడు అనంత్. ఆ మైమరపులో ముకుల్ జిత్తులమారితనం గురించి ఆలోచించలేదు. ముకుల్ మాత్రం అనంత్ ను అవమానించే సందర్భం కోసం వేచి చూస్తున్నాడు.

“సో!” అన్నాడు ముకుల్. అతని గొంతులో ఎలాంటి ఉద్వేగంగానీ, ఆవేశం గానీ లేదు.

“సో మీన్స్ వాట్?” తిరుగువేటు వేస్తున్నట్టు అడిగాడు అనంత్.

“నేనిచ్చిన ఇంస్ట్రక్షన్ను నువ్వు ఫాలో కావా?” అన్నాడు ముకుల్, హైబ్యాక్ చేర్లో జారిగిల పడుతూ.

“కమాన్ ముకుల్! థింక్ రేషనలీ. నేనొక్కణ్ణి ఎన్ని పనులని చెయ్యను? అందులోనూ మార్కెటింగ్ లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. యూ నో ఇట్.” అనంత్ లో ఆవేశం బుస్సుమని లేస్తోంది.

“నీ టాలెంట్ ను చూసే అడిషనల్ రెస్పాంన్సిబిలిటీని ఇస్తున్నాను అనంత్! యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీ థింగ్.” అన్నాడు ముకుల్. అది తనను కవ్వించడానికి చేసిన పొగడ్తేనని తెలుస్తూనేవుంది అనంత్ కు.

ముకుల్ మళ్ళీ కొనసాగించాడు- “నన్ను చూడు! నేనూ నీలాగే ఇంజనీర్ని. అకౌంటెంటునో, లాయర్నో కాను. బట్ ఒక సీయీవోగా కంపెనీకి సంబంధించిన అన్ని పన్లూ చూసుకోవాలి. బీ ఇట్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెలివరీ, మార్కెటింగ్, అకౌంట్స్, హెచ్.ఆర్, లీగల్ కంప్లయన్స్….యూ నేమ్ ఎనీ థింగ్…ఐ మస్ట్ లుక్ ఇంటూ ఎవ్రీ డామ్ థింగ్!” – చైయిర్ లో అటుయిటూ విలాసంగా ఊగుతూ చెప్పాడు ముకుల్.

దాంతో అనంత్ కు చిర్రెత్తుకొచ్చింది – “లుక్ ముకుల్! ఇది నీ స్వంత బిజినెస్. అందుకు నువ్వు ఈ పనులేంటి, ఇంకేవైనా చెయ్యాల్సి వచ్చినా…యూ హావ్ టు డూ ఎనీ థింగ్ అండ్ ఎవ్రి థింగ్. కానీ నేను ఓ ప్రొఫెషనల్ ఎంప్లాయీని. కొన్ని సర్వీసుల్ని ఇవ్వడానికి మాత్రమే నేను జీతం తీసుకొంటున్నాను. అంతేగానీ, కంపెనీ ఇచ్చిన ప్రతి పనినీ చెయ్యడానికి కాదు. ఈరోజు మార్కెటింగ్ అంటున్నావు, రేప్పొద్దున్న ఆఫీసు ఊడ్చమంటావ్. యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అని పొగుడుతావ్. కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ను కసువూడ్చమని ఏ సీయీవో ఐనా చెబుతాడా? అంతా నీ ఇష్టమేనా? నాటోన్లీ దిస్…ఆ మైల్ పంపేముందు నాతో ఒక్కసారన్నా మాట్లాడాలి కదా! ఈజ్ దట్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఎథిక్?” నిలపకుండా మాట్లాడాడు అనంత్.

అనంత్ ఎంత అరచినా ముకుల్ ముఖంలో ఎలాంటి కోపఛాయలూ లేవు.

“లాస్ట్ ధర్స్ డే నువ్వు సడెన్గా లీవ్ వేసావు. ఆరోజు అమెరికన్ క్లయింట్ తో కాన్ కాల్ ఉందని తెలిసీ ఆ పని చేసావ్. లీవ్ తీసుకొంటున్నానని ఇంటి నుండి ఒక ఈమైల్ పంపి ఆఫీసుకు డుమ్మా కొట్టావ్. నేను నాలుగుసార్లు ఫోన్ చేసినా తియ్యలేదు. లీవ్ అనేది కంపెనీ ఇచ్చే ప్రివిలెజ్. ఇట్స్ నాట్ యువర్ బర్త్ రైట్. కంపెనీలో ఎవరు లీవ్ తీసుకొన్నా వాళ్ల లైన్ మేనేజర్ అప్రూవల్ ఉండితీరాలని కదా రూల్. నీకు నేను లైన్ మేనేజర్ని. బట్ వాట్ హావ్ యూ డన్! నా అప్రూవల్ తీసుకొలేదు. అంతేకాదు కనీసం ఇంటినుండైనా ఒక పదినిముషాలు కాన్ కాల్ తీసుకోకుండా ఆ ఫారిన్ క్లయింట్ ముందు నా ఇజ్జత్ పోగొట్టావ్. ఇదేనా నీ ప్రొఫెనలిజం?” – నెమ్మదిగా అడిగాడు ముకుల్.

ఈ ఎదురుదాడిని ముందుగానే ఊహించాడు అనంత్. కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. అందువల్ల గట్టిగా నవ్వాడు.

“ఈ టాపిక్ నువ్వు తీసుకొస్తావని నాకు తెలుసు ముకుల్! లాస్ట్ వీక్ లో నేను తీసుకున్న లీవ్ ఈ కంపెనీ చేరిన తర్వాత తీసుకున్న నా వెరీ ఫస్ట్ లీవ్. అది కూడా నా కజిన్ చనిపోతే తీసుకున్నాను. ఆ విషయాన్నే నీకు మైల్లో రాసాను. ఆ మైల్ చివర్లో కైండ్లీ అప్రూవ్ అని కూడా అడిగాను. అసలు మైల్ చెయ్యడానికి ముందు నీకు ఫోన్ చేసాను. అది ఎంగేజ్ వస్తుండింది. వెంటనే ఎస్.ఎం.ఎస్ చేసాను. పదినిముషాలైనా నీ నుండి రిప్లై రాలేదు. అటువైపు నా కజిన్ వైఫ్, పిల్లలు నా హెల్ప్ కోసం మాటిమాటికీ ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు….అప్పుడు నీకు మైల్ పంపాను. నువ్వు కాన్ కాల్లో నన్ను కనెక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను స్మశానంలో ఉన్నాను. ఆర్ యూ ఎక్స్ పెక్టింగ్ మీ టు హావే కాన్ కాల్ ఇన్ఫ్రంట్ ఆఫ్ ది డెడ్ బాడీ ఆఫ్ మై కజిన్? ముకుల్! దిస్ ఈజ్ ఇల్లాజికల్ అండ్ బార్బేరియస్ బిహేవియర్.” అనంత్ చేతులు, కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్నట్టు అనిపించడంతో ముకుల్ ఎదురుగావున్న కుర్చీలోకి కూలబడ్డాడు.

అనంత్ ఇబ్బందిని చూసి కూడా ముకుల్ తగ్గలేదు “ఓకే అనంత్! నువ్వు ఈ ఉద్యోగంలో కంటిన్యూ కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. లేదంటే….వెల్…యూ కెన్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్!” అంటూ కుండబద్దలు కొట్టాడు.

ఒళ్ళు సహకరించకపోయినా అక్కడి నుండి లేచి తన కేబిన్లోకి వచ్చాడు అనంత్. గొంతును చుట్టుకునివున్న టై తీసి టేబుల్ మీదికి విసిరికొట్టాడు.  షర్ట్ గుండీలు రెండింటిని విప్పేసి, కళ్ళు మూసుకొని సీట్లోకి జారిగిలపడ్డాడు.

ఆఫీస్ బాయ్ గోవిందయ్య నెమ్మదిగా కేబిన్ తలుపు తోసుకుని లోనికొచ్చాడు. ట్రేలో వేడి కాఫీ. “సార్ కాఫీ!” అంటూ టేబుల్ పై పెట్టాడు. అనంత్ కు ఉన్నపళాన కాఫీ తాగాలనిపించింది. కప్పును చేతిలోకి తీసుకున్నాడు. “యూ ఆర్ డ్రింకింగ్ మై మనీ!” అని ముకుల్ అంటున్నట్టు అనిపించింది. “ఛీ!” అని కప్పును కిందపెట్టి “గోవింద్! హోటల్నుండి కాఫీ తీసుకురా. ఇది బాగా లేదు.” అని హుంకరించాడు. షర్ట్ జేబులోనుంచి పదిరూపాయల నోట్ తీసి టేబుల్ పై విసిరేసాడు. గోవింద్ ఆ నోటును పట్టుకుని కంగారుగా బైటకు పరిగెత్తాడు.

గోవిందయ్య తెచ్చిన కాఫీని ఒక్క గుక్కలో తాగేసి, లాప్ టాప్ తెరిచాడు అనంత్. వణుకుతున్న వేళ్ళతో రాజీనామా మైల్ ను టైప్ చేసాడు. ‘Send’ బటన్ నొక్కేముందు ఒక్క క్షణం ఆగి, ఆపై కళ్ళు మూసుకుని నొక్కాడు.

మైల్ వెళ్ళిన రెండు నిముషాల్లో ఇంటర్ కామ్ లో ముకుల్ గొంతు. “గుడ్ డెసిషన్ అనంత్! అకౌంట్స్ వాళ్లకి నీ డ్యూస్ లన్నింటినీ సెటిల్ చెయ్యమని చెప్పాను. ఇంకో గంటలో చెక్ నీ చేతిలో ఉంటుంది. ఈరోజు సాయంత్రం నుండీ నువ్వు ఫ్రీబర్డ్ వి. ఆల్ ద బెస్ట్.” అన్నాడు ముకుల్.

“హౌ కెన్ యూ రిలీవ్ మీ టుడే ఇట్సెల్ఫ్! నా అపాయంట్మెంట్ లెటర్లో వన్ మంత్ నోటీస్ పీరియడ్ క్లాజ్ ఉంది.” అన్నాడు అనంత్.

“ఆ క్లాజ్ తో బాటే సమ్మరీ డిస్మిసల్ అన్న మరో క్లాజ్ కూడా ఉంది. చూసుకోలేదా? “గ్రాస్ ఇన్ సబార్డినేషన్” కింద నీ సర్వీసుని టెర్మినేట్ చేస్తున్నాను. దిస్ టెర్మినేషన్ కమ్స్ అండర్ సమ్మరీ డిస్మిసల్ క్లాజ్. అన్నట్టు! నీకు నెలరోజుల జీతాన్ని సెటిల్ చేస్తున్నాను. సో డోంట్ వర్రీ అబౌట్ మనీ. నోటీస్ పీరియడ్ కోసమని నువ్వు నెలరోజులు ఆఫీసు రానక్కర్లేదు. దట్సాల్! మై పూర్ ఐఐటీ ప్రొడిగీ, దిస్ ఈజ్ మై ప్రొఫెషనలిజమ్!” అని పెట్టేసాడు ముకుల్.

అనంత్ లో అన్ని స్పందనలూ మాయమైపోయాయి…ఒక్క హృదయస్పందన తప్ప.

ఎలా చెక్కు తీసుకున్నాడో, ఎలా కంపెనీ అస్సెట్స్ అప్పగించాడో, ఎలా ఆఫీసు నుండి బైటపడి ఇల్లు చేరుకున్నాడో అతనికి తెలీదు. ఎలాగోలా ఇంటికొచ్చాడు అనంత్.

కృష్ణా నీ బేగానే బారో” అనే పాట రంజని ల్యాప్ టాప్ నుండి వస్తోంది.

‌‌‌* * * * *


 

నలభైఏడో గదిలో నోరు తెరుచుకునివున్న బకాసురుడు మింగడంతో లక్ష్మీదేవి ఆడుతున్న రెండో ఆటకాయ ఒక వరుస క్రిందకు జారింది. అక్కడున్న కోడి మీద కూర్చుంది.

“ఈ కుక్కుట విన్యాస మర్మమేంటి దేవీ?” అన్నాడు సామగానప్రియుడు.

“జీవితమంతా తినడానికే వెచ్చించేవారు, పరులకు ఆహారమౌతారని భావం ప్రభూ!” అంది మంగళదుర్గ.

“అంటే?” అన్నాడు అశ్వగ్రీవుడు.

“మళ్ళీ పరీక్షిస్తున్నట్టున్నారు!” అంది గోపాలకరసరోజాలంకృత వేణుగానస్వరూపిణి.

“పరీక్షకు అర్థం చక్కగా ప్రేరేపించేదనేగా!” అన్నాడు నిగమదీక్షాదక్షతత్పరుడు.

“సత్యమైన మాట! యథామతిగా వివరిస్తాను ప్రభూ! మాటిమాటికీ ’ఛస్తాను ఛస్తాను’ అని బెదిరించేవారు, మీ నామస్మరణ క్షణకాలమైనా చెయ్యక ఎల్లకాలమూ తమ కడుపును మాత్రమే నింపుకునేందుకు శ్రమించేవాళ్ళు కుక్కుట జన్మనెత్తుతారు. గ్రుడ్డును చీల్చుకుని బైటకి వచ్చిన క్షణం నుంచీ ఆ కోడి ఆహారాన్వేషణలోనే కాలం గడిపేస్తుంది. అది మేసి బలంగా తయారయ్యేలోగా మరొకరికి ఆహారంగా మారిపోతుంది. మళ్ళీ మరో గ్రుడ్డులోకి ప్రవేశిస్తుంది. పుడుతుంది. మేస్తుంది. మళ్ళీ ఆహారంగా మారిపోతుంది. పరమ ఘోరమైన పాపకర్మలను చేసినవారు గ్రుడ్డుగా ఉండగానే ఆహారమైపోతారు. మళ్ళీ ఇంకో గ్రుడ్డులోకి ప్రవేశిస్తారు. ఇదొక విషవలయం. ఈ వలయాన్ని భేదించాలంటే మీ దయ తప్ప మరో మార్గం లేదు స్వామీ!” అంది హస్తివరదరాణి.

“బాగా చెప్పావు దేవీ! మరి, నా రెండో కాయను కదపనా?” అన్నాడు కపిలనామక భగవానుడు.

“మీ చిత్తమే సత్యమైనది. నడిపించండి ప్రభూ!” అంది

దుష్టక్షత్రియమర్దనాసమర్థ ఖండపరశుధారి పాచికల్ని నడిపిస్తే అవి తుంబురుహస్తాలంకృత మాలతీనిక్వాణాల్లా ధ్వనించాయి.

*****

(సశేషం…)

Your views are valuable to us!