విజయనగర చరిత్ర అంటే మహామంత్రి తిమ్మరుసు, తిమ్మరసు అంటే విజయనగర చరిత్ర గుర్తుకు వస్తాయి. కానీ విజయనగర చరిత్ర లో మరో ఇద్దరు తిమ్మరుసులు ఉన్నారు. ఆ ముగ్గురు తిమ్మరుసుల తలరాత్రలతో విజయనగర సామ్రాజ్యం స్థితిగతులు ముడిపడివున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఆలస్యమెందుకు! వెంటనే చదవండి – చరిత్ర చెప్పే ముగ్గురు తిమ్మరుసుల విచిత్ర గాథ.
కర్మచక్ర భ్రమణంతో ఉక్కిరిబిక్కిరైన ఓ సామ్రాజ్య చరిత్ర
కర్మచక్రం – మొదటి భ్రమణం
సా.శ. 1490లో విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు మరణించాడు. ఇతడు కేవలం ఐదు సంవత్సరాలు అనగా సా.శ.1485 నుండి సా.శ.1490 వరకు చక్రవర్తిగా వ్యవహరించాడు.
తన ప్రభువైన ప్రౌఢదేవరాయలను పదవీచ్యుతునిగా చేసి, సింహాసనాన్ని చేజిక్కించుకుని, సాళువ వంశ పాలనను సుస్థిరం చేసినవాడు ఈ సాళువ నరసింహరాయలు. భుజబలంతో విజయనగర సింహాసనాన్ని చేజిక్కించుకున్నవాడైనా తన సుపరిపాలనతో సామ్రాజ్య ప్రముఖులను, అధికారులను మెప్పించాడు.
నిజానికి సాళువ నరసింహరాయలు అధికారదాహంతో కాక సామ్రాజ్య హితం కోరి చక్రవర్తి పదవిని చెపట్టాడని చరిత్రకారుల అభిప్రాయం. బహుశా ఆనాటి విజయనగర సామంతులు, అధికారులతో బాటు ప్రజలు కూడా అలానే భావించివుండాలి అని అనిపిస్తుంది.
చక్రవర్తిగా బాధ్యతను చేపట్టిన తర్వాత పాలనలోను, సైనిక వ్యవహారాలలోను తనకు సహాయకులుగా ఉండడం కోసం కొంతమంది విశ్వాసపాత్రుల్ని దగ్గర చేర్చుకున్నాడు. వారిలో తుళువ ఈశ్వరనాయకుడు, అతని కుమారుడైన నరసనాయకుడు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులు గొప్ప యుద్ధవీరులు మాత్రమే కాదు రాజ్యపాలనలో సమర్థులు కూడా.
సాళువ నరసింహరాయలు సంగమ వంశస్థుల సామంతుగా చంద్రగిరి మండలాన్ని పాలిస్తున్నప్పుడు తుళువ ఈశ్వర నాయకుడు అతని సైన్యాధిపతిగా పనిచేసాడు. అతని కుమారుడైన తుళువ నరస నాయకుడు రాజప్రతినిధిగాను, రాజకుమారుల సంరక్షుడిగాను ఎదిగాడు.
నరసింహరాయల మరణం తర్వాత అతని పెద్దకొడుకును చక్రవర్తిగా చేసాడు తుళువ నరస నాయకుడు. చక్రవర్తి ముక్కుపచ్చలారని పసివాడు గనుక అసలు పాలన అంతా నరస నాయకుడి చేతుల మీదుగా నడిచేది. ఈ ఎదుగుదలను సహించలేని కొంతమంది అధికారులు నరస నాయకుడిపై కుట్ర చేయసాగారు. ఈ కుట్రదారులకు తిమ్మరస అనేవాడు నాయకుడు. ఇతను సాళువ నరసింహరాయలకు బంధువు. రాజబంధువు.
తిరుమల, తిరుపతి ఆలయాల్లో దొరికిన అపూర్వమైన తిమ్మరసు శాసనాల గురించి తెలుసుకోండి!
ఎలాగైనా చేసి నరస నాయకుడిని పదవినుంచి దించాలని కంకణం కట్టుకున్న తిమ్మరసు పన్నాగం పన్ని బాలకుడైన చక్రవర్తిని చంపించేసాడు. ఆ హత్యానేరాన్ని నరస నాయకుడిపై మోపాడు. తన మద్దతుదారుల చేత అదేపనిగా ప్రచారం చేయించాడు. దానితో అటు రాజకుటుంబంలోను, ఇటు అధికారవర్గంలోను చీలికలు వచ్చాయి. కొందరు నరస నాయకుని పక్షం వహించారు. మిగిలినవారు అతనికి వ్యతిరేకులయ్యారు.
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టుగా తనపై వచ్చి పడిన హత్యానేరాన్ని తప్పని నిరూపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు నరస నాయకులు. తనకు రాజ్యకాంక్ష లేదని, సింహాసనం కోసం ప్రభువును హత్యచేయలేదని నిరూపించేందుకు గాను సాళువ నరసింహరాయల రెండవ కుమారుణ్ణి చక్రవర్తిగా ప్రకటించాడు నరస నాయకుడు.
ఇమ్మడి నరసింహరాయలు అన్న పేరుగల ఆ కుర్రవాడు చక్రవర్తిగా మారిన తర్వాత తన వ్యవహారశైలిని కూడా మార్చుకున్నాడు. తన అధికార ప్రతినిధి అయిన నరస నాయకుడిని దూరం పెట్టసాగాడు. తన అన్నను చంపించిన తిమ్మరసుతో స్నేహం పెంచుకున్నాడు.
అప్రబుద్ధుడైన ఇమ్మడి నరసింహుని ప్రవర్తన వల్ల నరస నాయకునికి ఇబ్బందులు పెరిగాయి. చక్రవర్తి దూరం పెట్టాడంటే ఈ నరస నాయకుడే నిజమైన హంతకుడైవుండాలన్న భావన అందరిలోను బలపడసాగింది. దాంతో, రాజధాని పట్టణంలో తనకు రక్షణ లేదని భావించాడు నరస. వెంటనే, ’వేట’ నెపంతో హంపీ నుండి బయల్దేరి దుర్భేధ్యమైన పెనుగొండ కోటను చేరుకున్నాడు.
అక్కడ తన హితుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, నమ్మినబంట్లను రహస్యంగా పిలిపించుకున్నాడు. వారితో మంతనాలు జరిపాడు. చివరకు కుర్ర చక్రవర్తిపై తిరుగుబాటు బావుటాను ఎగరవేయాలని నిశ్చయించుకున్నాడు. తగినంత బలగం సమకూర్చుకుని హుటాహుటిన హంపీకి ప్రయాణమయ్యాడు.
ఊహించనివిధంగా హంపీ పట్టణం బయట మోహరించివున్న నరసనాయకుని పెద్ద సైన్యాన్ని చూసిన ఇమ్మడి నరసింహరాయలకు తల తిరిగిపోయింది. మహాయోధుడు, యుద్ధవిద్యానిపుణుడు, వ్యూహకర్త అయిన తుళువ నరస నాయకుడితో తలపడ్డం అంటే తలను పోగొట్టుకోవడమే అన్నది ఆ కుర్రవానికి అర్థమయింది. దాంతో ఆలోచనలో పడ్డాడు.
తదుపరి చర్య ఏమిటన్నది నిర్ణయించుకోవడానికి ఇమ్మడి నరసింహరాయలు మూడు-నాలుగు రోజుల సమయం పట్టింది. ఈ కాలంలో నరస నాయకుడు హంపీ నగరాన్ని నాలుగువైపులా దిగ్బంధం చేసాడే గానీ దాడికి పూనుకోలేదు.
చివరకు, ఇమ్మడి నరసింహరాయలు పంపిన శాంతిదూత తుళువ నరస నాయకుణ్ణి కలుసుకున్నాడు. ముట్టడిని ఉపసంహరించమని విజ్ఞప్తి చేసాడు. తన ప్రభువుపై యుద్ధం చేయడం ఇష్టం లేదని, అలా అని తనపై చేసిన తప్పుడు ఆరోపణను ఒప్పుకునేది లేదని, నిజానికి ఇమ్మడి నరసింహుని అన్నను హత్య చేయిచింది అతని బంధువైన తిమ్మరసే అని, వాడి తలను తీయిస్తే గానీ ముట్టడిని మానుకోనని తెగేసి చెప్పాడు నరస నాయకుడు.
నరస నాయకుని అభిప్రాయాల్ని మోసుకొచ్చిన దూత మాటలతో తన ధోరణిని మార్చుకున్నాడు ఇమ్మడి నరసింహుడు. తన అన్న హంతకుడైన తిమ్మరుసుకు మరణశిక్ష విధించాడు. వాడి తలను తీయించాడు. ఆ వర్తమానాన్ని నరస నాయకునికి పంపించాడు. ఆ వార్త విన్న నరస నాయకుడు ముట్టిడిని ముగించాడు. నగరంలోకి ప్రవేశించి, ప్రభువును దర్శించుకుని, రాజప్రతినిధి పదవిని మళ్ళీ చేపట్టాడు.
అటుపై సా.శ. 1503లో విశ్వాసపాత్రుడయిన రాజప్రతినిధిగానే మరణించాడు.
*****
కర్మచక్రం – రెండవ భ్రమణం
సా.శ. 1526లో తుళువ నరస నాయకుని రెండవ కుమారుడైన శ్రీకృష్ణదేవరాయలు తన ఏకైక పుత్రుడు తిరుమలరాయలకు యువరాజ పట్టాభిషేకాన్ని జరిపించాడు. అయితే, దురదృష్టవశాత్తు పట్టాభిషేకం జరిగిన ఆరునెలల్లోనే యువరాజు మరణించాడు. తన కొడుకు అకాలమరణం పొందడానికి విషప్రయోగం కారణమని తెలుసుకున్నాడు కృష్ణరాయలు.
అంతఃపుర కుట్రలో భాగంగా జరిగిన యువరాజు హత్యలో మహాప్రధాని తిమ్మరసు కొడుకైన తిమ్మ దండనాయకుని పాత్ర ఉందని ఎవరో కృష్ణరాయల చెవిన వేసారు. కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలోను, తీవ్ర నిరాశలోను కొట్టుకుపోతున్న రాయలు పూర్వాపరాలు ఆలోచించకుండా ప్రధాని తిమ్మరుసును, అతని కొడుకు తన సైన్యాధికారి అయిన తిమ్మ దండనాయకుణ్ణి జైల్లో వేయించాడు.
నిజానికి రాజకుమారుని హత్యవంటి తీవ్రనేరం జరిగినప్పుడు అందుకు తగిన విచారణ జరగాలి. నేరస్థులెవరో నిర్ధారించాలి. ఆపై శిక్ష విధించాలి – ఇది విజయనగర న్యాయవ్యవస్థలోని అంచెలు. కానీ భావోద్వేగంతో ఊగిపోతున్న రాయలకు ఈ అంచెలంచెల పద్ధతిపై దృష్టి పోలేదు. తానే ఫిర్యాదుదారునిగాను, రక్షకభటునిగాను, న్యాయనిర్ణేతగానూ వ్యవహరించాడు. ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరో చెప్పిన మాటల ఆధారంగా తన పెంపుడు తండ్రిగా భావించి, పూజించిన అప్పాజీ తిమ్మరసును జైల్లో వేసాడు. ఎన్నో యుద్ధాలలో తన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన తిమ్మ దండనాయకుణ్ణి బంధించాడు.
వృద్ధుడైన ప్రధాని తిమ్మరసు ’విధివ్రాత’ అని మౌనం వహించాడు. కానీ మహాయోధుడు, యువకుడు అయిన తిమ్మ దండనాయకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉండలేకపోయాడు. మూడు సంవత్సరాల పాటు జైల్లో మగ్గిన తిమ్మ దండనాయకుడు అవకాశం చూసుకుని చెరశాల నుండి తప్పించుకున్నాడు. కొండవీడును చేరుకున్నాడు.
మండలాధీశులుగా ఉంటున్న తన బంధువులు – నాదెండ్ల గోపను, అప్పను కలిసాడు. తనకు, తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. చేయని హత్యకు తామిద్దరం బలి అవుతున్నట్టు తేల్చి చెప్పాడు.
మహామేధావి, మహాపండితుడు, విజయనగరసామ్రాజ్య వైభవ నిర్మాత, మహాప్రధాని తన మేనమామ అయిన సాళువ తిమ్మరసుకు వచ్చి పడ్డ కష్టాన్ని చూసి ఉడికిపోయాడు నాదెండ్ల గోప. కొండవీడు అనే వ్యూహాత్మక మండలానికి అధిపతిగా ఉంటున్న గోప వద్ద గొప్ప సైన్యం ఉంది. ఆ సైనికులకు చక్రవర్తి కంటే తమ యజమాని గోప మీదే నమ్మకం.
తిమ్మరసు మరో బంధువు, మండలాధీశుడు అయిన అప్ప కూడా పెద్ద సైన్యాన్ని తెచ్చాడు. తిమ్మ దండనాయకుడు తన నమ్మకస్తుల్ని కూడగట్టాడు.
అలా ప్రధాని తిమ్మరసు కుటుంబీకులైన తిమ్మ, గోప, అప్పలు భారీ సైన్యాన్ని సమీకరించి కృష్ణరాయలపై తిరుగుబాటు జెండాను ఎగురవేసారు. చక్రవర్తి అన్యాయంగా బంధీని చేసిన సాళువ తిమ్మరసును విడిపించాలని పట్టుబట్టారు.
ఈ తిరుబాటు వార్తను విన్న కృష్ణరాయలు నిప్పులు కక్కాడు. తన సైన్యాన్ని పంపి తిరుగుబాటుదారుల పీచం అణచమన్నాడు. కానీ అసహాయశూరులైన తిమ్మ, గోప, అప్పల స్వైరవిహారానికి కృష్ణరాయల సైన్యం చెల్లాచెదరైపోయింది.
తన సైన్యం విరిగి, పారిపోయిందన్న విషయం తెలియగానే కృష్ణరాయలు ఉగ్రుడయ్యాడు. తిమ్మరసు కుటుంబంపై అతని కోపం మరింత కరడుకట్టింది. ఈసారి ఎవరినో కాక తన నమ్మినబంటు, తనలానే యుద్ధనిపుణుడు అయిన రాయసం అయ్యప్ప అరసును పిలిపించాడు. తిరుగుబాటుదారుల తలలను కొట్టి తీసుకురమ్మన్నాడు. అపారమైన సైన్యాన్ని ఇచ్చిపంపాడు.
రాయసం అప్పయ్య ఆషామాషీ సైన్యాధికారి కాడు. సాహితీసమరాంగణసార్వభౌముడే స్వయంగా మెచ్చిన వీరుడు. యుద్ధవిద్యావిశారదుడు. కనుక తిమ్మ-గోప-అప్ప త్రయాన్ని దీటుగా ఎదుర్కోవడమే కాదు వారిని చిత్తుగా ఓడించాడు కూడా.
మనకు తెలియని కారణాలతో గోప, అప్పలను వదిలేసి తిరుగుబాటుకు మూలకారణమైన ప్రధాని తిమ్మరసు కుమారుడైన తిమ్మ దండనాయకుణ్ణి బంధించి హంపీకి తీసుకువచ్చాడు.
ఆవేశకావేషాలతో ఉడికిపోతున్న రాయలు మరొక్కమారు నిర్విచారణపూర్వకంగా తిమ్మ దండనాయకుణ్ణి శిక్షించాడు. రాజద్రోహానికి గాను కళ్ళు తీయించాడు. కొడుకు చేసిన రాజద్రోహంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తండ్రి అయిన తిమ్మరసు కళ్ళను కూడా తీయించాడు రాయలు.
కళ్ళు పోయి కబోదిగా కారాగృహంలో కఠినశిక్షకు గురైన మహావీరుడు తిమ్మ దండనాయకుడు మరణించాడు.
కళ్ళతో బాటు కొడుకును కూడా పోగొట్టుకున్న మహామేధావి తిమ్మరసు బ్రతుకుపై ఆశను వదిలి, నిరుత్తరుడై, నిర్వికారుడై మృత్యుదేవత కోసం ఎదురు చూడసాగాడు.
*****
కర్మచక్ర విభ్రమణ ప్రభావం
పై రెండు ఘటనలు విజయనగర సామ్రాజ్య చరిత్రలో జరిగిన యదార్థఘటనలు. ఈ రెండింటిలోను ముఖ్యపాత్రధారుల పేర్లు ’తిమ్మరసు’ కావడం కాకతాళీయమో, యాదృచ్ఛికమో గానీ సత్యస్యసత్యమైన అంశం.
అలానే మొదటి ఘటనలో చక్రవర్తి హత్యలో నిందితునిగా భావించబడినవాడు నరస నాయకుడు. ఇతను రెండవ ఘటనలో యువరాజైన కొడుకును పోగొట్టుకున్న కృష్ణరాయలకు తండ్రి.
చేయని హత్యను తలపై వేసుకోవడానికి సిద్ధపడలేదు నరస నాయకుడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తిరుగుబాటే సరైన మార్గం అని భావించాడు. అలానే చేసాడు. సఫలం సాధించాడు.
చేయని హత్యను చక్రవర్తి తమపై మోపితే అందుకు సిద్ధపడలేదు తిమ్మ దండనాయకుడు. తన మరియు తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వని చక్రవర్తిపై తిరుగుబాటు చేయడమే మార్గమని భావించాడు తిమ్మ దండనాయకుడు. అలానే చేసాడు. కానీ విఫలమయ్యాడు. చివరకు తన బ్రతుకును బలిపెట్టుకున్నాడు.
మొదటి తిరుగుబాటు వల్ల సామ్రాజ్యం కుదుటబడింది. తప్పు చేసిన చక్రవర్తికి నరస నాయకుడనే సమర్థుడు మళ్ళీ దక్కాడు.
రెండవ తిరుగుబాటు వల్ల సామ్రాజ్య నాశనానికి పునాదులు పడ్డాయి. చేసిన తప్పును తెలుసుకోలేకపోయిన చక్రవర్తి కోపానికి యోగ్యులైనవారు బలైపోయారు.
ఇదీ ముగ్గురు తిమ్మరుసుల తలరాత అనే కర్మచక్రం విజయనగర చరిత్ర పథాన్ని ఊహించని విధంగా తిప్పిన మలుపు.
విధి బలీయం.
*****