ఆత్మబంధువులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 వీధి గుమ్మానికి ఎదురుగా ఇంటిసరిహద్దు లోనే ఉన్న వేప చెట్టు దానిపక్కన ఉన్న మామిడి చెట్టూ  నా చిన్నప్పటినుంచి నేను చూస్తున్నవే ఒక్కో  ఋతువు లో ఒకో  వాటి రూపు మారుతుంది.  వసంత ఋతువు మాత్రం వాటికీ నాకు ఇష్టమైన కాలం.

ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు మొన్ననే రిటైర్ అయ్యాను – ఈ చెట్ల కు మాత్రం రిటైర్మెంట్ లేదు.  ప్రతి సం ఇవి కొత్తవే !!

వెన్నెల్లో, ఎండలో, వానలో, మంచులో ఉదయం సాయంత్రం, రాత్రీ వీటిని చూడకుండా ఉండని కాలం లేదు.  ఎందుకో వీటిని చూస్తె చాలు నాకు తెలియని, చెప్పలేని మాటలు మదిలో మెదులుతాయి.  చెట్లు కూడా ఆత్మ లే అని చెప్పటానికేనేమో దామోదర లీల చేసాడు ఆ నల్లనివాడు !!  అందుకేనేమో ఈ రెండు చెట్లతో నాకు చెప్పనలవి కాని  సంబంధం.  నేను వరండాలో వాలు కుర్చీ లో కూర్చొని గాలికి ఇవి పొందే ఆనందాన్ని భలే గా ఆస్వాదిస్తాను. వీటి కొమ్మలు గమ్మత్తుగా ఊగుతూ నా మనసుని కూడా ఊయలలూగిస్తాయి.  నా భార్యకు కూడా వీటిపై మక్కువ ఎక్కువే!!  ఎన్నో ఉదయాలు సాయంత్రాలు నేను నా భార్య వీటిని చూస్తూ చాల విషయాలు, పదార్థాలు, పానీయాలు  ఆస్వాదించాం.

నేను ఆనందం గా వీటి వంక చూస్తె ఇవి నా ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.  విచారం లో చూస్తె ఇవి ఊరటనిస్తాయి, ఆశను కలిగిస్తాయి. నా మనః స్థితి ఎలా ఉన్న వీటి నైజం మాత్రం నిత్య చైతన్యమే. ఆకు కూడా కదలని మండు వేసవిలో భయంకరమైన ఉక్కపోతలో సైతం యోగిలా నిశ్చలం గా నిర్మలం గా ఉంటాయి.

వీటి పక్కన మూడేళ్ళ క్రితం నాటిన కొబ్బరి చెట్టు వీటికి మరింత అందాన్ని తెచ్చింది. వెన్నెల్లో కొబ్బరి ఆకులు చూడడం ఒక అద్భుతమైన అనుభవం.  ఇదేమి చిత్రమో ఆకు లో ఇంత వ్యత్యాసం అది వెన్నెలను ప్రతిఫలించే విధానం లో ఇంత అందం!

ఈ చెట్లను చూస్తూ ఏళ్ళు గడిపేసాం నేను నాభార్య. పిల్లలు ఇద్దరూ చెరో దేశం లో నివాసం. వాళ్ళకూ ఈ చెట్లంటే ఇష్టమే.  నెట్ లో కలిసినప్పుడు వీటిగురించి తప్పకుండా అడుగుతారు.  మా ఇంటి కొబ్బరి భలే తీయగా ఉంటుంది అలాగే మామిడి కూడా.

ఈ చెట్ల సాక్షి గా ఎన్నో శుభాశుభాలు సంభవించాయి.  జననాలు-మరణాలు ప్రమాదాలు- ప్రమోదాలు భ్రమలు, భయాలు, బెంగ-బేరీజులు వంటి సమస్త మానసిక వ్యాపారాలకు ఇవి సాక్షులు.   ఇవి వీచే గాలులు ఎంతో సేదనిస్తాయి అందుకే ఇవి మాకు ఆత్మబంధువులు.

వీటిని సాంగత్యం వలన ఏమో నేను ఉద్యోగానికి రోజూ వెళ్ళే దారిలో ఉన్న అనేక రకాలైన చెట్లు కూడా నన్ను పలుకరిస్తున్నట్లే ఉంటాయి. ఆక్కడికి రాగానే వాటి వంక చూడ కుండా ఉండలేను.  ఒక అశోక చెట్టు సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే ఉంటుంది. దాన్ని చూస్తూ సంబరపడతా. ఒకోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా అక్కడే ఉంటె వెనుక ఉన్న వెహికల్ హార్న్ నన్ను అలెర్ట్ చేస్తుంది.

చెట్లు మనిషికి చుట్టాలు కాదు మనిషి చెట్లకు చుట్టం. 

Your views are valuable to us!