ఆచంద్రతారార్కం అమ్మ అమ్మే

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

(మా అమ్మ )
అవనిలో నాకై వెలసిన అలుపెరగని “అమ్మా”…..
నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగా
నీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగా
నీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా
నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగా
 

నీ అహోరాత్రులు నా ఆశల ఆలోచనలకేగదా
నీ అమృతతుల్యమైన గోరుముద్దలే నా ఆస్వాదనలో ఆదిపర్వంగా
నీ అంతరాళలోని ఆర్తి నాకు అపారముకాగా
నీ అసాధారణ బంధమే నీ బిడ్డల ఆశాబంధంకాగా
నీ అనిర్వచనీయమైన ఆలింగనం నా ఆవేదనను తీర్చగా
 

నీ అద్వితీయమైన అనురాగం నాకు ఆరాధ్యంకాగా
నీ అచంచలమైన విశ్వాసం నా ఆశయాలకు ఊపిరికాగా
నీ అక్కున చేర్చుకునే బాంధవ్యమే నా అస్వస్థతను దూరం చేయగా
నీ అపురూపమైన వాక్కులు నాకు ఆత్మీయతను నేర్పగా
నీ అనుభవాల అంతర్వాహిని ఆసాంతం నాతో వెంటరాగా
 

నీ అరమరికలులేని ఆప్యాయతలు ఆ దేవుని ప్రతిరూపం చూపగా
నీ అమితమైన కరుణాహృదయం నా ఆరాధనకు బీజమవ్వగా
నీ అనంతమైన జీవన లీలలు నా జీవిత ఆదర్శగ్రంధంకాదా
నీ అంబరమంత ప్రేమకు నా అంతరాత్మ సాక్షి కాగా
నీ అజేయమైన మాట నాకు ఆశీర్వచన బలము కాగా
 

“అమ్మా” అన్న పిలుపే అజరామరంకాదా ఆచంద్రతారార్కం
నా  ఆయువుకు నీ ఆయువును అడ్డం వేసే అమ్మవు కదా

“అమ్మా” ఏడేడు జన్మలకు నాకు
నీవే అమ్మవు కావాలి
నా అమ్మవు నీవే కావాలి …
వద్దమ్మా ! వద్దు , నా స్వార్ధం తెలుసుకున్నాను
నీ త్యాగం మరువకున్నాను

“అమ్మ”ఓ అనన్య సామాన్య సృష్టి
“అమ్మ”ఓ మధురమైన భావన
“అమ్మ”ఓ అంతులేని దేవుని దీవెన
“అమ్మ”ఓ అక్షయ అనుభూతి

అమ్మా ! నీ ఋణం తీర్చుకొనగ ఒక అవకాశం కొరకు
ముకుళిత హస్తములతో ఆ దేవుని నేను వేడెదనమ్మా
మరుజన్మకు నీకు అమ్మగా , భువిపై నేను వెలిసెదనమ్మా 
“అమ్మా” అన్న పిలుపుకు నే ఊపిరిపోసి
నీ సేవలో నేను తరియించెదనమ్మా    _/\_ 

*****

Your views are valuable to us!