దేనికోసం ప్రాకులాడతావ్?
గట్టిగా ఆకాశం ఉరిమితే
దూరంగా పెద్ద పిడుగు పడితే
పట్టుమని పది క్షణాలు మెరుపు మెరిస్తే
ఒక్క ఉదుటన గాలివీచి
చెట్టు కొమ్మల్ని పూనకం వచ్చి నట్లు ఊపితే
ఎడతెరిపి లేకుండా కుంభ వృష్టి కురిస్తే
సముద్రపుటలలు కొంచం ఎత్తు ఎగిస్తే
స్వల్పంగా భూమి కంపిస్తే
తెలియలేదా నీ చేతకాని తనం
తెలియలేదా “వాడి” సత్తా!
నువ్వెంత నీ బతుకెంత
నీ విజ్ఞానమెంత?
నీ గ్రాహక శక్తి ఎంత?
నీ ధారణ ఎంత?
నీ సృజన ఎంత?
ఇంతోటి విషయానికి ఎంత అహంకారం?
అందుకే ఈ అంధకారం
దీనికి తోడు మిధ్యావాదం
వాడిని తెలుసుకొంటే వాడైపోతానని ప్రతిపాదించడం
ఏది “వాడై” పోయిన ఒక్కరుజువు చూపు?
“వాడు” నువ్వూ సనాతనులే
కాని వాడు పరమాత్మ నువ్వు కేవల ఆత్మ
వాడు ఒక్కడే అని
వాడే నీకు ముక్తి ని ఇవ్వగలడు అని తెలుసుకోవడం
వాడినే భక్తితో వేడుకొని సద్గతిని పొందడం
వాడే అంతర్యామి
తుఫాను కు భూకంపానికి
ప్రళయానికి పునః సృష్టికి.
ఇప్పుడూ భయమేస్తుందా?
వాడే భయకృద్ భయనాశనః!!
నాకు భక్తి లేదు అంటే నీకు భయముందనే అర్ధం
నాకు భక్తి ఉంది కాని
వాడు కాదు అంటే
నాకు ముక్తి వద్దు అని వ్రాసివ్వడం
మళ్ళీ మొదలు నువ్వు పుట్టడం గిట్టడం
అసూయ తో అలమటించడం!!