చూస్తున్నా నే చేష్టలుడిగి…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

సమైక్యాంధ్ర మన నినాదమని ,

సమైక్యతే మన విధానమని ,

 

రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి ,

కాలేజీలు మూసివేసి ,

విద్యార్ధులను రెచ్చగొట్టి ,

ఉద్యమమని ఊదరేసి ,

 

పోలీసుల లాఠీలకు

విద్యార్ధులు బలైపోతే ,

కటకటాల వెనుక వారు

చీకటిలో మగ్గుతుంటే ,

 

భవిష్యత్తు మీదంటూ

బల్లగుద్ది చెప్పినోడు ,

అధిష్టానం కుట్రలంటు….

వారి సంగతి విడచి పెట్టి ,

 

అధిష్టానం దిష్టిబొమ్మలు ,

ఆర్డరిచ్చి తెప్పించి ,

కాళ్ళతో తొక్కించి ,

చెప్పులతో కొట్టించి ,

 

తుదకు కొరివి పెట్టించి ,

వాడికి గుండు కూడా గీయించి ,

అల్లకల్లోలాలు సృష్టించి ,

అతిశయాలు వల్లించి ,

 

నడివీధిలోన అరాచకాలను

దునుమాడే యోధుడిలా ,

మైకు చేత పట్టుకుని ,

పూనకంతో ఊగిపోయి ,

 

నలుగురిలో మారుమ్రోగి ,

నాలుగు డబ్బులు విసిరివేసి ,

నిరుపేదల జీవితాలను ,

నిస్సిగ్గుగ వాడుకుని ,

 

వారి కంటి దీపాలను…

కర్కశంగా ఊదివేసి ,

అమరవీరులు మీ బిడ్డలంటూ ,

అతిగ నీవు వాగుతుంటే ,

 

అమాయకులు తమ బిడ్డలకు

తామే జోహారులర్పిస్తూ ,

నీకు జేజేలు కొడుతుంటే ,

వికృతంగ మనసులోన నీవు….

 

వికటాట్టహాసం చేసుకుంటూ ,

ఏ . సి చాంబరులో దూరి ,

రాజకీయ మంతనాలు జరిపి నీవు ,

మున్ముందున్న రోజులన్నీ మనవేనంటూ ,

 

మరో మారు మైకు పట్టి పూనకంతో ,

ఊగిపోతూ గీపెట్టి చెప్పినావు…

M.L.A / M.P టిక్కెట్టు దక్కినదంటూ ,

ప్లేటు ఫిరాయించి వేసి ,

 

నీవు దుమ్మెత్తి పోసిన అధిష్టానం  ,

ఏం చేసినా లోకకల్యాణార్ధమే అంటూ ,

వినమ్రంగ చేతులెత్తి ,

అధిష్టానానికి వంగి  మ్రొక్కి ,

 

ఆ పార్టీ తరుపున నీవు బరిలోకి దిగుతుంటే ,

అమాయకులైన ప్రజలు తిరిగి ,

అన్నా ! నీకే మా ఓటన్నా అంటూ ,

నీ చుట్టూ భజన చేస్తుంటే ,

 

అయ్యో ! వీరి మత్తు వదలదా….? అనుకుంటూ….

అసహాయంగా వారినే చూస్తున్నా నే చేష్టలుడిగి…..

 *******

(మా ప్రక్క నియోజకవర్గంలో ఓ రాజకీయ నాయకుని కొడుకుకు ఇలానే టిక్కెట్ వచ్చింది )

Your views are valuable to us!