గమ్యం వైపుకు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నాను
విసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?
ధూళి
కలుషితమైన గాలి
పొగ
అంతులేని రొద
బజారుల్లో లుకలుకలాడుతున్న జనం
కాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనం
చిరాకు
పరాకు
కరుకు మొహాల మొహర్లు
పరుగెత్తడమే పరమావధి
పరుగు…పరుగు…పరుగు
విలువలనుండి, వలువలనుండి
తత్వం నుండి, సున్నితత్వంనుండి
మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీ
పరుగో…పరుగు
మనదికాని, మనసునుండి రాని
స్ప్రేలు, డీయొడరెంట్లు
హాయ్ హల్లోలు
వంచన…అంతా వంచన
విజాతి నాగరికత పడగ పంచన
ఆదమరచిన జాతి చేసుకొంటోన్న
ఆత్మవంచన
తన చుట్టూ తాను తిరక్క
డబ్బు చుట్టూ తిరుగుతోన్న
లోకంపై విసుగొచ్చేసింది.

మెటీరియలిస్టిక్ ముళ్ళతోటల్లో
ప్లాస్టిక్ పూల వాసన చూసే పాదుషాల్లారా వినండి
నిజానికి ఈ ప్రపంచం కంపు కొట్టే పెద్ద చెత్తబుట్ట!
ప్రపంచం చెత్తబుట్టైతే నువ్వెవ్వడవనా మీ వెటకారం
నేను చిత్తుకాగితాన్నేలేవో!
నడచి నడచి శరీరం అలసింది
వగచి వగచి మనసు సొలసింది
యేదో తెలీని కసి నన్ను అమాంతం ఆక్రమించుకొంటోంది
ఆవేశం వశం తప్పుతోంది
ఒక్క క్షణం గడచివుంటే యేమయ్యేదో మరి!
చల్లని, మెత్తని చెయ్యి నన్ను తాకింది
ఎదురుగా ఒక చిన్నారి…బేలకళ్ళ పొన్నారి!
కడిగిన ముత్యం కాదుగానీ
అప్పుడే నేలను చీల్చుకొచ్చిన అంకురంలా
మట్టిగొట్టుకునుంది
స్వచ్చంగా వుంది…సున్నితంగా వుంది
మండువేసవిలో నిండు పున్నమలా వుంది
నాకోసం రూపుకట్టుకొన్న నా బాల్యంలా వుంది
కళ్ళు తడిగా, ఆర్తిగా
దిగులు తెచ్చిన నీలినీడలతో నిస్సత్తువగా వున్నాయ్
గుండెలోని భయానికి భాష్యంలా
కన్నీటి చారలు జారుతున్నాయ్
“అన్నా! నా గమ్యం ఇది. దానికి దారి యేది?”
దుఃఖం, నిరాశ, నీరసం కలగలిసిన మెత్తటి స్వరం వణుకుతోంది
నాకు నవ్వొచ్చింది…రాదు మరి!
దారి కనుక్కోండి పజిల్ లాంటి లోకంలో
బ్రతుకు దారి తప్పిన నన్ను
దారి అడిగితే!!!

నా పిచ్చినవ్వుకు ఆ కళ్ళు మరింత బేలవయ్యాయి
నాకు హఠాత్తుగా జాలేసింది
తోడు రమ్మంటే తప్పుకెళ్ళే లోకంలో
తోడు వెదకడం శిక్షే
మోకాళ్ళపై కూర్చొని చిన్నారి చుబుకాన్ని పట్టుకు అడిగా
“ఎక్కడికెళ్ళాలి చిట్టీ”
ఆ మాత్రం ఆప్యాయత కూడా చూడనిదానిలా
నా చేతిని గట్టిగా పెనేసుకొన్నాయ్ లేత వేళ్ళు
మసకబారుస్తున్న కనీళ్ళ తెరల్ని తుడుస్తూ
పడమరకేసి చూపింది
పొద్దున వచ్చిన దారిని ఈ సంజె చీకటిలో మరిచానని
సంజాయిషీ ఇచ్చుకొంది
“దేశాలు, సమాజాలు, జాతులు, వాటి నేతలే దారితప్పుతుంటే
నీవెంతలేరా కన్నా!”
భుజం తట్టి, చిన్నదాని చేయి పట్టి “పద వెళ్దాం” అన్నా
అమ్మాయి కళ్ళలోని నీడల నీలి జాడలు జారుకోడం చూసాను
కలిసి నడుస్తున్న ఇద్దరం
ఎదురుగా పడమరం
చిట్టితల్లి అడిగిన గమ్యానికి నాకూ దారి తెలీదు
ఐనా యేదో నమ్మకం
మేము వెళుతోంది పడమరే కావచ్చు
అది మా దారిలో చీకట్లనే పరచొచ్చు
రేపు మళ్ళీ తెల్లవారకపోదు
ఇప్పుడస్తమిస్తున్న సూరీడు
రేపు మీ వెనకనే వస్తాడు
వెన్నంటే వుంటాడు….


Your views are valuable to us!