గూగులమ్మ పదాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పసివాళ్ళ నుంచి పండు ముదుసలి వరకూ ఏది అడిగినా క్షణాల్లో ఇస్తుంది గూగుల్.  ఇలా ఇవ్వడం లో దాగిన మంచి-చెడుల ఆలోచనే ఈ గూగులమ్మ పదాలు. 

గూగులమ్మ పదాలు

  1. టైపు చేసిన పదము – టక్కునిచ్చును ఫలము – టెక్కునాలజి సుమ్ము – ఓ గూగులమ్మా
  2. అడుగవలయును జగతి – అలుపులెరుగని రీతి – వార్తలిచ్చును త్వరితి – ఓ గూగులమ్మా
  3. తీపి కబురుల తోడ – హత్య, వరదల నీడ – “వింత చింతల జాడ”- ఓ గూగులమ్మా
  4. కళ్ళలోనే బళ్ళు [బడులు] – దాచలేదులె కుళ్ళు – చెరిగిపోని చేవ్రాళ్ళు – ఓ గూగులమ్మా
  5. అడిగితే చెప్పేను – లోకమే తిప్పేను – ఎప్పుడూ నప్పేను – ఓ గూగులమ్మా
  6. నిందలెరుగని రీతి – నైజ వార్తల ఫణితి – నిలుపు మా జగతి – ఓ గూగులమ్మా       
  7. నీవు ఇచ్చెడి వార్త – నిత్య సత్యపు మూర్త – అహోరాత్రపు జాత్ర – ఓ గూగులమ్మా       
  8. సమాచారము జతకు – సదాచారము అతుకు – మార్చుమా ఈ బతుకు – ఓ గూగులమ్మా       
  9. గోప్య మెరుగనిదండి  – గుట్టునుంచదు సుండి  – మితిగా అడగండి – ఓ గూగులమ్మా       
  10. నీలొ వెతికే వారు – తప్పొప్పుల వారు – ఇరువురూ ఉన్నారు – ఓ గూగులమ్మా       
  11. బూతులెతికే వారు – భక్తి కోరువారు – ఎందరెందరొ కలరు – ఓ గూగులమ్మా 
  12. ఋతుశోభలను తెలియ – నీ ఇమేజులె గతిగ – బ్రతుకు మారెను అయ్యయా – ఓ గూగులమ్మా        
  13. పాతరేసిన నిజాలు – వెదికి పట్టెడి మజాలు – బూజు రాలుతు ఇజాలు –  ఓ గూగులమ్మా       
  14. తెలివిగలవానికి – తెలియలేని వానికి – భేదమెంచవు నిజానికి – ఓ గూగులమ్మా       
  15. మర్రి ఊడలా జ్ఞానం – వేరుపురుగై అజ్ఞానం – ఏది నిజమగు విజ్ఞానం – ఓ గూగులమ్మా       
  16. కూరుచున్న చోట – పుట్టు వార్తల ఊట – చిందదోయీ చెమట – ఓ గూగులమ్మా       
  17. నింగిలో గుసగుసలు – నేలలో బుసబుసలు – మనసులో మిసమిసలు – ఓ గూగులమ్మా       
  18. మతము మత్తుమందా! – మూర్ఖమే కొత్త మందా? – జనహితమసలుందా! – ఓ గూగులమ్మా
  19. విషము చిమ్మును కొన్ని – విషము విరచును కొన్ని – నీలోనే ఉన్నవన్నీ – ఓ గూగులమ్మా 
  20. అస్తి, నాస్తి కతలు – అంతులెరుగని వెతలు – నీవు చెప్పెడి కథలు – ఓ గూగులమ్మా       
  21. పిండి వంటలు కొసరి – వడ్డించేవు సరిసరి – సాటిలేని గడుసరి – ఓ గూగులమ్మ       
  22. ఆన్‍లైన్ బకాయి – తీర్చితేనే హాయి – లేద మెడపై రాయి – ఓ గూగులమ్మా
  23. నీవు పలికెడి నిజము – నివ్వటిల్లును జగము – మారునా మా నైజము –  ఓ గూగులమ్మా       
  24. నీవు విప్పెడి చిట్టా – బెట్టా కనికట్టా – లేక చిత్ర గుప్తు చిట్టా! – ఓ గూగులమ్మా

 

గూగులమ్మ పేరుతో ఓ గ్రామ దేవత ఉందన్న విషయం ఈ క్రింది లింకు వల్ల తెలుస్తోంది.

http://hindupad.com/tag/gugulamma-temples/

Your views are valuable to us!