జయ జయ భారత ధాత్రీ మాతకు…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

జయ జయ భారత ధాత్రీ మాతకు

జయ జయ భారత సంస్కృతికి

జయ జయ లక్షణ సంపద్భరితకు

జయ జయ జ్ఞానపు వార్నిధికి

 

విదేశీ వనిత స్వదేశ జనతకు – పదాధికారిగ నిలబడగా

అధీరమవదా అఖండ భారత – స్వతంత్ర్య మానస ధీశక్తి

 

ఆంధ్రభోజుడు, ఛత్రపతులను – పుత్రుల బడసిన ధాత్రి ఇది

మందభాగ్యులై అంధకారమున నిందలు వేయుట తగదింక

 

వేదములందున శోధన జరిగెను – మానవ సాధన మార్గముల

రోదనలేలనో, వాదనలేలనో – ఒప్పరే సోదరి సోదరులు!

 

బీదలు నిండిన దేశము కాదిది – వీధిని రత్నపు రాశులను

మోదము మీరగ, మతులే పోవగ – రాశిగ అమ్మిన దేశమిది

 

ఘన పాషాణంబులనే దొలచి – సుందర కుడ్యమ్ముల మలచి

సడలని జడముల అడుగున దాగిన లాలిత్యపు జాడల తెలిపి

 

బీటలు వారిన కోటల గోడలు – చాటి చెప్పవే ఆ కథనాల్

చోటును ఇచ్చిన వచ్చిన చేటును – మరచిపోవుటే తగదింక!

 

హ్యారీపాటర్, గోరీ హంటర్ – వంటి వేలం వెర్రులకు

జంతుజాలమే నీతిని చెప్పిన – పంచతంత్రమే అగుపడదే!

 

మనలో ఇంకా మసలుతువున్నాయ్ – బానిస మానస భావనలు

కనులే తెరచి కనగా నేర్చిన – మనగలమింకను మానవులై

 

ఉత్తిష్టోత్తిష్టంబని పలికిన  – అంతర్వాణికి స్పందించి

శిష్ట భావనల స్పష్టపరచ్చు – దృష్టంబయ్యెను ఈ పాట

 

తిరోగమనమో తిర్యక్ భావమో – కాదు కాదులే ఈ పాట

పురాకృతంబగు పుణ్యవిశేషపు – రాగోద్ధతియే నా మాట

 

||జై హింద్||

Your views are valuable to us!