నాకు జన్మనిచ్చిన నా తల్లి
కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి
కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగి
అచేతనావస్థకు చేరుకుని , తిరిగి
తప్పక చేతనావస్థతో తేరుకుని…చేతులు చాచి
నను తన గుండెకు హత్తుకున్నది మొదలుకొని..
తన ప్రతి కన్నీటి బిందువును
అకుంఠితదీక్షతో ఆశయసాధన వైపుకు
మరలించి నను పెంచినది కదా నా తల్లి……
నా అవిటితనమును గూర్చి నేనేనాడు
గుర్తించని దిశగా నా భవిష్యత్తు గూర్చి
ఆలోచించినది కదా నా కన్నతల్లి……
తన ఆత్మ విశ్వాసమును పాలుగా ఇచ్చి
నా అణువణువున శక్తిని నింపి ఈనాడు
నన్నునిలబెట్టగలిగినది కదా , ప్రపంచ దేశాల
ముందు ఓ పోటీదారునిగా నా కన్నతల్లి…
కాళ్ళు లేవని నాకు , నా కన్నతల్లి
కలత చెందుతూ కూర్చుని ఉంటే
కలనైన కలుగునా నాకీ భాగ్యం …..
అవయవ లోపమును చూచి
అవహేళన చేయు ఈ సమాజము నుండి ,
జాలి చూపులతో పరామర్శించే ప్రజలను చూసి
పరిపక్వత పొందిన నా తల్లి….
పరిపూర్ణునిగా తీర్చిదిద్దినది కదా
నన్నీవిధముగా ఈనాడు……
ఆమె కన్నీటి బిందువులనన్నింటినీ
ఆనందాశృవులుగా మార్చి నేను
తీర్చుకోనా కొంతైనా
నా కన్నతల్లి ఋణము……
*****