నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
నడచి వెళ్ళొచ్చు కదా, కొంచెం ఒళ్ళయినా తగ్గుతుంది……
నేను సైకిల్ పై వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
పనీపాటా లేని వాడల్లా బైక్ విన్యాసాలు
చేయడమే ఏం బాగుపడతారో, ఏమిటో….
నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఒక్కడు ఓడంత కారులో లింగులింగుమంటూ వెళుతూ
ట్రాఫిక్ , కాలుష్యం పెంచడం ఎంత బాధ్యతా రాహిత్యం….
నేను కారులో వెళ్ళేటప్పుడు
విమానంలో వెళ్ళే వాళ్ళను చూసి ,
అమ్మబాబులు సంపాదించి పడేస్తే
విమానమెక్కి ఒక్కొక్కడూ తైతక్కలాడుతున్నాడు…..
నేను విమానంలో వెళ్ళేటప్పుడు
కారులో వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళింకేం ఎదుగుతారు…….
నేను కారులో వెళ్ళేటప్పుడు
బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
ఏమిటో వీళ్ళసలు ఎదుగుతారా…….
నేను బైక్ పై వెళ్ళేటప్పుడు
సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,
వీళ్ళెప్పుడు ఎదుగుతారో , ఏమిటో……
నేను నడిచి వెళ్ళేటప్పుడు
నా వంక చూసిన వారితో అన్నాను ,
“నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది” అని .
***