నయా మ్యూజింగ్స్ – భోలా శంకరా! యిదేమి శంక రా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

బాబాయ్ మహ బోల్డు హడావిడైపోతున్నాడు. నుదుట్న తెల్ల పట్టీల్ని అడ్డంగా గీసేసు కొనేసి యిటుఅటుగా, అటుదిటుగా తిరిగేసేస్తున్నాడు. అడుగడుక్కీ “శంభో శంకరా” అనేసేసేస్తున్నాడు. పోయినేడు కూడా సరిగ్గా ఈ టయమ్ లోనే ఇట్లానే చేసేసాడు. అప్పుడు నేనింకా చాలా బోల్డు చిన్నపిల్లోణ్ణీ. యిప్పుడంటే కొద్ది బోల్డు పెద్దోణ్ణై పోయానని నాకనుమానం. అందుకని బాబాయ్‍ను ఆపేసాను. “బాబాయ్! అందరి దేవుళ్ళకీ ముక్కులు, మూతులు వుంటాయ్ కదా! శంభో శంకరం దేవుడి కవెందుకు లేవు?” అని అడిగేసేసాను. బాబాయ్ కళ్ళింతింత పెద్దపెద్దవైపోయాయి. “ఛీ భడవా!” అన్నాడు. “అంటే?” అని నేను అడిగి చూసాను.

నా రెండు కళ్ళల్లో శివుడు మూడో కన్ను కనబడి పోయిందో యేమో బాబాయ్ చటక్కున “అలా అడగడం తప్పు పాపం ఘోరం” అన్నాడు. “అంటే?” అని మళ్ళీ చూసాను. ఈసారి బాబాయ్ కు చిర్రెత్తుకొచ్చింది కామోసు నా నెత్తిన ఒక్కటే ఒక్కటి జెల్ల కొట్టి పోయాడు.

నేను పోయి నాన్నారిని అడిగేసేసాను. “నాన్నారు! శివుడికి ముక్కు, మూతి ఎందుకు లేవు?”. దానికి నాన్నారు శాంతంగా “అబ్బీ! ఫుటోలో ఉంటాయిరా!” అన్నారు. “ఐతే ఇక్కడెందుకు లెవ్వు?” అన్నా నాన్నారు పూజ్జేస్తున్న లింగం వైపుకు వేలెట్టి. చెప్పొద్దూ…నాన్నారికి బాబాయ్ కంటే డబల్ చిర్రెత్తేసింది. “దొంగ భడవా!” అన్నారు. “అంటే?” అన్నాన్నేను. “అంటే…గింటే…ఏమేవ్….ఏదీ ఆ బెల్టు తీసుకో!” అన్నారు. అప్పుడు నాకు నాన్నారి కన్నుల్లో శివుడి మూడో కన్ను కనబడింది. బెల్టు చేతిలోకొస్తే జరగబోయదేమిటో తల్చుకొని నా కళ్ళల్లో గంగమ్మ దుమికేసింది.

అక్కడ్నుంచొచ్చి బామ్మ దగ్గరికి పోయాను. “బామ్మా! దొంగ భడవా!” అనేసాను. “హారీ పిడుగా! నన్నే అలాగంటావా?” అని నెత్తి మీదొక్కటిచ్చింది. “స్..అబ్బా! అది కాదు బామ్మా! నేనో ప్రశ్నడిగితే నాన్నారు, బాబాయి లిద్దరూ అలా తిట్టేసారు. నువ్వూ తిట్టేస్తావేమోని నన్నే తిట్టేసు కొనేసాను.” అనేసాన్నేను. “హారీనీ! యేమిటా ప్రశ్నా?” అని దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకొంది బామ్మ. “మరేమో! ఫోటోలోని శివుడికి ముక్కు, మూతి వున్నాయ్. కానీ నాన్నారు పూజ్జేసే లింగానికి లేవెందుకు?” అన్నాన్నేను.

“హారినీ! యిదా నీ ప్రశ్న! పూర్వం భృగుమహర్షి శాపమిచ్చాడని ఓ కథవుందిలే. అలాగే, నేను గొప్ప నేను గొప్పా అనేసుకొంటున్న నారాయణుడికి, బ్రహ్మగారికి ఈ శివుడు గారు యిలా లింగరూపంలో కనబడ్డాడని ఇంకో కథ వుందిలే. వచ్చే యేడుకి ఇంకా పెద్దౌతావుగా. అప్పుడింకా బాగా అర్థమౌతుందిలే” అంది బామ్మ.

నేను కాసేపు ఊర్కొన్నా. అంటే ఆలోచించానన్నమాట. అప్పుడడిగా “బామ్మా! మరి మొన్న మా క్లాసులో వ్యాకరణ పంతులు ఇది పుంలింగము, ఇది స్త్రీలింగము, ఇది నంపుసకలింగము అని చెప్పారే! నేను సరిగ్గా చెప్పలేకపోయానని కూడా చితక్కొట్టేసారే! యీ లింగాలన్నీ యెవరివి? యే రుషి శాపమిచ్చాడు? యే దేవుళ్ళు పోట్లాడుకొంటుంటే యివొచ్చాయి?”

బామ్మ నెత్తిన చేతులెట్టేసేసుకొని “శంకరా! యిదెక్కడి శంక రా?” అనేసింది. అలాగంటే యేమిటో నాకర్థం కాలేదు. నిజ్జంగానే అర్థంకాలేదండీ! ప్చ్! నేను ఛాలా భోల్డు ఫాఫం కదూ?

 

Your views are valuable to us!