నయా మ్యూజింగ్స్ – తెగ బోల్డు యుద్ధాల మొదలు…

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

“ఈ మద్దెన చాలా బోల్డు ఫైటింగులు, ఫైరింగులు జరిగిపోతున్నాయ్ రా. ముక్కూ మొహం తెలీకపోయ్నా కసకసా ఏసేసుకునేస్తుంటార్ట!” పనిపాటాల్లేని రికామి బాబాయి యిల్లా చెప్పేస్తున్నాడో అమాయక జీవికి.

గుండు మీదా, గుండె మీదా న్యూస్ఫోరిక్ యాసిడ్నో, గాసిప్ హైక్లోరిక్ యాసిడ్నో పోసేస్కునే రికామి బాబాయ్కి దొరికినోడే బ్రతికిన్నీ పోయినోడని బాబాయ్కి అన్నాయ్ ఐన నా నాన్నారు ఆందరికీ పనిగట్టుక చాటింపేసేస్తుంటారు. అయినా పట్టించుకోని బాబాయ్ ఊళ్ళో వెదికి వెదికి మరీ అమాయకప్ప్రజల్ని తోలు కొచ్చేస్తుంటాడు.

“హేవిటోగానీ ఈ మద్దిన తెగ బోల్డు యుద్ధాలు జరిగిపోతున్నాయ్!” అని పెసరట్టూర్చాడు నాన్న. అంటే పెసరట్టును లాగిస్తూ నిట్టూర్చాడు. “ఫాపమ్! మరే!” అంటూ తనూ పెసరట్టూర్చాడు ఎదురింటి వీరాసామి. “యుధ్దాలంటే మినపట్టో, మైసూరు పాకో గాదు…” అన్నాడు నాన్న సగం మాటల్ని పెసరట్టుతో బాటు మింగేస్తూ. “హేవిటీ? మైసూరుపాక్కూడా వుందా? చెప్పారు గాదే….అమ్మా! ఆ పాకునేదో ఇల్లా మొగాన పారేయండీ. యుద్ధాల్ని విని పెట్టాలి.” అన్నాడు వీరసామి ఆపుకోలేక. రసపట్టు చర్చల్లో పెసరట్టు భాగం ముగియకుండానే మైసూరు పిడకలవేట మొదలయ్యేసరికి నాన్నారికి చిర్రెత్తుకొచ్చింది. “అయినా పరాంకుశం, యీ యుద్ధాలు గట్రా యెలా మొదలౌతాయో?” అన్నాడు వీరాసామి మొహామాటానికి పెసరట్టును ఆహుతిస్తూ.

“వీరాసామీ, నువ్వో మహా ఘోర తిండిపోతాసామివి” అన్నాడు నాన్న. “హేవిటీ! అమ్మా….కొంచెం అల్లం చట్నీ….అద్సరే…ఐతే యుద్ధాలు ఘోరంగానే జరిగేస్తున్నాయంటావూ! మన వూరికేదైనా ఇదయ్యేదుందంటావురా?” అన్నాడు వీరాసామి ప్లేటుకంటుకున్న చివరి చెట్నీచుక్కని కూడా శుద్ధిపెట్టేస్తూ. ఇహ మాట్లాడలేకపోయిన నాన్నారు “వీరాసామీ, నేడు పోయి రేపు రమ్ము” అన్నాడు. “ఆహా! రాత్రికి రమ్ము అంటున్నావా. ఈ చలిలో భేషుగ్గా వుంటుంది. వచ్చేస్తాలే!” అని లేచి అమ్మ తెచ్చిన మరో పెసరట్టుని, ఓ గరిటెడు అల్లం చట్నీని ప్లేటులో వేయించుకుని చక్కా పోయాడు.

వాడి పైని కోపాన్ని ఆపుకోలేక దూరంలో వో అమాయక జీవిపై అమానుషమైన దాడిలో మునిగిపోయిన తమ్ముణ్ణి కేకేసాడు “వొరేయ్! ముదనష్టపోడా! ఆ వీరాసామి వెంటవెళ్ళి వాడెత్తుకెళ్ళిన మన ప్లేటును తీసుకురా…ఫో….” అని బెదిరించాడు. తమ్ముణ్ణి తిట్టిపోసే అన్నని చూసిన నా బామ్మ బోసినోరు ఫిరంగిలో శాపనార్థాల గుళ్ళెట్టి ఎడపెడా ఫైరింగు చేసేసింది. విని బ్రతికేస్తున్నవాడిపై హాయిగా నోరు చేసేసుకోనీకుండా అడ్డుపడిన అన్నని చురచురా చూసి బిరబిరా వీరాసామి వెంటపడ్డాడు నా బాబాయ్.

“వీరాసామి గారు, ఆ ప్లేటు మాదండి.” అన్నాడు బాబాయ్.

“బట్ ఐతే వాట్ ఏమి?” అన్నాడు వీరాసామి.

“లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఓ భక్ష్యము లక్ష్యమా?” అన్నాడు బాబాయ్.

“సో కావున వై ఎందుకు?” అన్నాడు వీరాసామి.

“I saw a saw which I saw I never saw such a saw” అన్నాడు బాబాయ్ మహాకసిగా.

“అంటే జెండాపై కపిరాజుకు సిద్ధమౌతున్నావా?” అన్నాడు వీరాసామి ప్లేటును అడ్డంగా నాకుతూ.

“నినదభీషణ శంఖము దేవదత్తమే….ఢామ్ ఢామ్ ఢామ్…” అంటూ బాబాయ్ కలయబడి పోయాడు.

బాబాయ్ విసురుతున్న పిడిగుద్దులకి ప్లేటునడ్డుపెట్టి కాచు కొని పోతున్నాడు వీరాసామి.

అరుగు మీద నిలబడి చూస్తున్న నేను, అక్కడేవున్న నాన్నారితో “హేవిటో, యుద్ధాలు తెగ బోల్డు వొచ్చేస్తున్నాయ్, ఫాపమ్” అనేసాను.

Your views are valuable to us!