Like-o-Meter
[Total: 0 Average: 0]
స్నానం కోసం దేహం దాహంతో వేగిపోతోంది
చినుకు చెమట పై పడింది
ఆ పై భూమిపై
భూమి దాహం తీరక అలమటించింది
సెగలు కక్కింది, వేడిమి పెరిగింది
మబ్బులు మాయమయ్యాయి
ఆకులు స్థాణువుల్లా ఉన్నాయి
భరించలేని వేసవి
నీటి చుక్క దొరకదు
రాత్రి నిద్ర పట్టదు; పగలు సెగలు
దూరంగా భవంతిలో
మొక్కలకు పుష్కలంగా నీళ్ళు
వాకిలి బయటకు వచ్చి ప్రవహిస్తుంటే
కాకులు, పిచుకలు ఆ నీటిలో స్నానం
మనిషిగా ఎందుకు పుట్టానో !!
బోర్లు ఎండి పోయాయి
చెరువులు మురుగు మడుగులయ్యాయి
నీళ్ళ వ్యాపారం పెరిగింది
కుళాయి పురాతనమైపోయింది
సాయంత్రమయింది
మళ్ళీ ఆ భవంతి నుంచి ఒకమ్మాయి
కడిగిన ముత్యంలా స్నానంచేసి వచ్చింది
భగవాన్!
మేము నీళ్ళకు కూడా నోచుకోలేదా !!
’నగదు జమ’ కాదు
నాణ్యమైన నీరు కావాలి
’బంగారు తల్లుల’కు
రచ్చబండ కాదు
నీళ్ళతో నిండిన కుండలు కావాలి
అరవై ఐదేళ్ళ స్వతంత్రం
భూగర్భ జలాలను ఇంకించింది
నదులని, కాసారాలను కలుషితం చేసింది
పచ్చని భూమిని బీడునేలగా మార్చింది
మాకొద్దు ఈ స్వతంత్రం !!
అని ఘోషి స్తున్నారు గొంతెండిన భరత వాసులు !!