నిన్నేలు భాగ్యమీయరాదే!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన  ఓ ఇంతీ…..

ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే  ఓ ముదితా….
లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే  ఓ లతాంగీ….

వలపుతలపులను అలల్లా తట్టి లేపే  ఓ వనితా….
రంగుల కలలను రంగరించి రూపం గీసే  ఓ రమణీ….
వేకువ కిరణం వెలుగులా నులివెచ్చని భావన  ఓ వెలదీ….

కొత్త ఆశలు చివురులు వేసి పూమొగ్గలా విరిసిన  ఓ కొమ్మా….
పరవశించే ప్రణయ రాగమాలికా  ఓ పడతీ….
చెంత చేరి చల్లగ తాకే మలయమారుతమా  ఓ చెలీ….

నెలవంక నగవులతో నెయ్యము పంచే  ఓ నారీ….
తరతరాలుగా తరగని సుగుణాలరాశివి  ఓ తరుణీ….
కాలచక్రంలో కరిగిన రాజులు నీ పాదాక్రాంతులు  ఓ కాంతా….

మునిమాపువేళలో ముకుళిత కలువల సోయగమా  ఓ ముగ్ధా….
కోమల పుష్పజాతుల రాణివా  ఓ కోమలీ….
లలిత లాలన లాలిత్య లాహిరివా  ఓ లలనా….

మంచు వేళల విరిసిన మల్లెల సొగసువా  ఓ మగువా….
మానసవీణ మృదు మంజుల నాదమా  ఓ మనోహరీ….
మానవతకు మహిమాన్విత రూపమా  ఓ మహిళా….

కవనమును కనక కవ్వముతో చిలకగా వచ్చిన  ఓ కలికి….
అల్లిబిల్లి అల్లరి అలకల అల్లికవా  ఓ అతివా….
మనసు పాడే మధుర మోహనరాగమా  ఓ మానినీ….

కనులతో మనసును కలవరపెట్టే  ఓ కన్యా….
స్నిగ్ధ మనోహర సామరస్యమా  ఓ సఖీ….
తరువుల గురువుగ తనువును చీల్చే  ఓ తలోదరీ….

యుగయుగాలుగా యువకుల మదిలో అక్షయ కావ్య నాయికవే  ఓ యువతీ….

నడిరేయిలో సడిచేసే హృదయ మధురోహ స్పందనవా  ఓ నెలతా….
ప్రేమకు ప్రేరణ పల్లవి పాడే  ఓ ప్రేయసీ….
 

జీవితభాగస్వామిగ నిన్నేలు భాగ్యమీయరాదే  ఓ భామా….

*******

 

 

Your views are valuable to us!