పండని పండుగలు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

వెర్రి తలలు వేసిన వినోదం 
వెయ్యి టపాసులు గుదిగుచ్చి పేల్చింది 
 
వికటించిన వినోదం
పక్కింటికి నిప్పెట్టింది
 
ఉన్మాదపు ఉత్సాహం 
వేయి ఉరుముల్ని ఒకేసారి ఊరికి తెచ్చింది 
 
శాంతి ఎరుగని సంబరం 
అంబరాన్నంటేలా చప్పుడు చేసింది 
 
ఎదురుగా ఉన్న చెట్టు పై పెట్టిన గూటిలో 
అప్పుడే పుట్టిన పిట్ట పిల్ల 
గుండె ఆగి నేల జారింది 
 
లోపల తలుపులు మూసి 
ఏసీ వేసి ఉంచిన ఒక ఖరీదైన  గదిలో 
ఒక పసికందు అమ్మ పాలు తాగింది 
 
ఈ ధ్వనులకు తాళలేక దిక్కుతెలియక 
బిక్కుబిక్కు మంటూ చెట్టు కొమ్మల్ని 
పట్టుకొని నిద్రపోలేక జాగరణ చేసాయి 
అమాయక అందమైన ఆకాశ గమన ప్రాణులు 
 
వారం క్రితం పుట్టిన కుక్కపిల్లలు 
తమ తల్లే తల్లడిల్లి పోతుంటే 
వేగంగా పాలు తాగుతూ 
ఇంకా ఇబ్బందిని పెట్టాయి 
 
ఒక చిచ్చు బుడ్డి
ఆ చిరుప్రాయంలో తన 
చూపును మాపుతుందని 
తెలియక వెలిగించి 
కంటి వెలుగు కోల్పోయింది 
ఒక పేదరాలి గారాల పట్టి 
 
పండగ హంగు పెరిగింది
సహజత్వానికి రంగులు రోగాలు పులిమింది 
పర్యావరణానికి  దండగమారిగా మారింది 
పర్వదినాన పాపాల మూట కట్టింది
 
పండలేదండీ
మనం పండుగ చేసుకొనే తీరు 
గండమేనండీ
గతంతో కొత్తతరం చేసే పోరు 

Your views are valuable to us!