సంక్రాంతి వెత

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

పచ్చని
పరిసరాలు, కొలనులో కలువలు
విశాలమైన దేవాలయ ప్రాంగణాలు
రోడ్లకు ఇరువైపులా కాపుకాసే చెట్లు

ప్రశాంత మైన లోగిళ్ళు
అరుగులపై అనుభవాల పంపకాలు
వాకిళ్ళలో రంగవల్లులు గొబ్బెమ్మలు

ప్రాతః కాలంలో ప్రత్యూష వేళలో
హరి నామం చెప్పే హరిదాసు కీర్తనలు
ఇవి పల్లెలకే పరిమితమని ఎవడ్రా చెప్పింది?

పరిమితం చేసారు ఈనాటి కుహనా పట్టణవాసులు

ఆనాడు అయోధ్య పట్టణమని
సాంప్రదాయాలకు దూరంకాలేదే
హస్తిన ఆచారాలను కాలరాయలేదే


బతుకులు దుర్భరంగా మారింది
కేవలం దుర్బుద్ధి, దురాశ తో
పట్టణం-పల్లె అనే వ్యత్యాసం
మనం కల్పించుకున్నవి


కోట్లు కుమ్మరిస్తే మరి ఇప్పుడూ
గేటెడ్ కమ్యునిటీ పేర విలాసవంతమైన
విల్లాలు, కొలనులూ కోవెలలూ కూడా
కోకొల్లలు గా నగరాలలో పుట్టుకొస్తున్నాయే!

ఇది కేవలం స్వయంకృత అపరాధం

నగరాలు ఇలాగే ఉండాలి అని ఎవడ్రా చెప్పింది?
నగర ప్రణాలికలు వేయలేని నాగరిక సమాజం
మన నగరాలను భూతల నరకాలుగా మార్చింది


ఈ సంక్రాంతి ఇరుకు సందుల్లో
కంపుకొట్టే పరిసరాల్లో, మురికి వాడల్లో
పగలే దీపం పెట్టుకొనే చీకటి ఫ్లాట్లలో
ప్రాణవాయువు సంచరించని ఇళ్ళలో
జరుపుకుంటున్న వాళ్ళ ఉసురు
మన అసమర్థ ప్రజానీకానికి
అవినీతి నాయకత్వానికి తగులుతుంది


నేను బతకడమే ముఖ్యం అనుకుని
మనుగడ సాగినంతకాలం
జీవితంలో సంక్రాంతి లేనట్లే
ఇది ముమ్మాటికి సత్యం.

Your views are valuable to us!